Friday, 4 April 2014

హుషార్‌

-  పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
-   ఇది రెండో నావిగేషన్‌ ఉపగ్రహం
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి
          భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాను ఎంతగానో నమ్మే పిఎస్‌ఎల్‌ వి(పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) సి-24 విజయవంతమైంది. శుక్రవారం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 అనుకున్న లక్ష్యాన్ని చేదించి విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. 4-4-2014న పిఎస్‌ఎల్‌వి సి-24 సక్సెస్‌తో షార్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. కొత్త తెలుగు సంవత్సరాది అయిన జయనామ సంవత్సరంలో తొలిసారి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 విజయవంతమైంది. పిఎస్‌ఎల్‌వి వరుస విజయ పరంపరలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం 5.14 నిమిషాలు. సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో అంతా ఉత్కంఠ వాతావరణం. ఎంతో నమ్మకమైన పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 58 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తి చేసుకుంది. మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. +8, +7, +6, +5, +4, +3. +2, +1, -1, 2, 3, 4, 5, 6 అనగానే షార్లోని మొదటి లాంచ్‌ ప్యాడ్‌ నుండి పిఎస్‌ఎల్‌వి సి-24 నిప్పులు చిమ్ముతూ బూడిద వర్ణంలో నింగికెగిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, మీడియా హర్షధ్వానాల మధ్య నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో ప్రయోగం జరిగింది. మొత్తం 19 నిమిషాల 28 సెకన్లలో రాకెట్‌ నుండి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం విడిపోయింది. ఇది తొలుత 283 కిలోమీటర్ల పెరిజి, 20,630 కిలోమీటర్ల అపోజి దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీ వాలులో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవంగా 284 కిలోమీటర్ల పెరిజి, 20,652 అపోజిలో శాటిలైట్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఒక కిలోమీటర్‌ తక్కువ పెరిజి, 20 కిలోమీటర్ల తక్కువ అపోజిలో దీన్ని ప్రవేశపెట్టింది. 20 నిమిషాల 25 సెకన్లకు భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా 19 నిమిషాల 28 సెకన్లలో కక్ష్యలోకి చేరింది. నాలుగు దశల్లో ప్రయోగం సాగింది. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ఘన ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనం ఉపయోగించారు.
  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం బరువు 1,432 కిలోగ్రాములు, ఇందులో 818 కిలోగ్రాముల ద్రవ ఇంధనాన్ని నింపారు. దీన్ని ఐదుసార్లు మండించిన తరువాత ఈనెల 19వ తేదీ నాటికి 36 వేల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం భారతదేశం, దానిచుట్టూ 1,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో దిక్సూచిలా పనిచేస్తుంది. 1,660 వాల్టుల విద్యుత్‌ను తన రెండు సోలార్‌ రెక్కల నుండి ఉత్పత్తి చేసుకొని పనిచేస్తుంది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత మాస్టర్‌ కంట్రోల్‌ స్పెసిలిటి హసన్‌ కేంద్రం నుండి ఐదుసార్లు కక్ష్య పొడిగించిన తరువాత ద్రవ ఇంధనం మండించడం ద్వారా దీర్ఘవృత్తాకార కక్ష్య 55 డిగ్రీల తూర్పుగా, భూమధ్యరేఖ స్థలానికి 31 డిగ్రీల వాలుతో వృత్తాకార కక్ష్యలోకి మార్చబడుతుంది. ఎన్‌ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ ప్రయోగం అనంతరం ఏడు నెలల కాలంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని తయారు చేసి నేడు నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇది భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహం. అన్ని పరీక్షలూ పూర్తి చేసుకున్న తరువాత రెండు నెలల అనంతరం వినియోగదారులకు సేవలందిస్తుంది. ఇందులో ఎల్‌5బ్యాండ్‌, ఎస్‌ బ్యాండ్‌ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇందులో అత్యంత కచ్చితంగా పనిచేసే రుబీడియం అను గడియారం కీలకమైంది. మొదట ఉపగ్రహం తరువాత ఈ ప్రయోగంలో ఆరు 6ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఇలా స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించిన ప్రయోగాల్లో ఇది ఆరోది. గతంలో పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి సి-22 ప్రయోగాల్లో ఈ రకమైన మోటార్లను ఉపయోగించారు.
ఈ ప్రయోగ ఉపయోగం
పిఎస్‌ఎల్‌వి ద్వారా ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్‌(ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌) ఉపగ్రహం భారత్‌ అవసరాల నిమిత్తం తయారు చేసింది. ఇప్పటికే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ నావిగేషన్‌ ఉపగ్రహం వినియోగదారులకు సేవలు అందిస్తుండగా, భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహమిది. భారత దేశంతో పాటు, చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకూ స్థితి, గతిని నిర్దేశించి తెలుపుతుంది. అన్నిరకాల పరిస్థితులకూ తట్టుకొని 24 గంటలూ సేవలందిస్తుంది. అంతేగాకుండా దీర్ఘచతురస్రాకారంలో 35 డిగ్రీల దక్షిణం నుండి 50 డిగ్రీల ఉత్తరం వరకూ, 30 డిగ్రీల తూర్పు నుండి సేవలందిస్తుంది. ఇందులో మూడు రకాల విభాగాలున్నాయి. అంతరిక్ష ఉపగ్రహాలు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. భూమి మీద వినియోగదారులకు అవసరమైన సేవలందిస్తుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలుంటాయి. పిఎస్‌ఎల్‌వి సి-22 ద్వారా గత ఏడాది జులై ఒకటో తేదీన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ తొలి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. నావిగేషన్‌ సిస్టమ్‌లో ఇది రెండోది. దేశంలోని అన్ని విభాగాలకూ సంపూర్ణంగా నావిగేషన్‌ సేవలందాలంటే ఏడు ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ రెండు నిర్వహించారు. మరో ఐదు ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, ముఖ్యమైన అధికారులకు పరిమితమైన సేవలందిస్తుంది. కర్ణాటకలోని బైలాలులో దీనికి సంబంధించిన భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. నావిగేషన్‌ ఉపగ్రహాలకు ఆ కేంద్రం మెదడులాంటిది. అక్కడి నుంచే నావిగేషన్‌ ఉప్రగహాల పనితీరును ఆపరేట్‌ చేస్తారు. వినియోగదారుల సేవల కోసం, వ్యవస్థ సక్రమంగా నడిపేందుకు దేశంలోని బైలాలు, హసన్‌, బోపాల్‌తో పాటు పలు రాష్టాల్లో నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భూమిపై ప్రయాణించే వాహనాలు, సముద్రంలో ప్రయాణించే ఓడలు, విమానాలకు మార్గాలను, స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. ఆపద సమయంలో సూచనలు చేస్తుంది. రవాణా ఓడల ఉనికిని తెలియజేస్తుంది. భూ గోళానికి సంబంధించిన విషయాలను కనుగొని నిర్ధిష్ట సమయంలో తెలియజేస్తుంది. వాహనదారులకు దృశ్యం, శ్రావణ విధానంతో దిశా నిర్దేశం చేస్తుంది. కచ్చిత సమయాన్ని కనుగొంటుంది. ప్రస్తుతమున్న అవసరాల రీత్యా ఈ ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సంబరాల్లో మునిగిపోయింది. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శేఖర్‌ దత్తూ హాజరయ్యారు. ప్రయోగ విజయవంతం అనంతరం ఇస్రో ఛైర్మన్‌కు, ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, మిషన్‌ డైరెక్టర్‌ ఉన్ని క్రిష్ణన్‌, మాజీ షార్‌ డైరెక్టర్‌ చంద్రదత్తన్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగేశ్వరరావు, రామకృష్ణన్‌, కిరణ్‌ కుమార్‌, శివకుమార్‌ పర్యవేక్షించారు.
ప్రయోగానికి రూ. 260 కోట్లు ఖర్చు
   ఈ ప్రయోగానికి మొత్తం 260 కోట్ల రూపాయలు ఇస్రో ఖర్చు చేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహానికి 150 కోట్ల రూపాయలు, పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌కు 110 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.
Courtesy  with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment