Friday, 4 April 2014

కొబ్బరి నీళ్ళకు సవాలు నై...  
     
 ఎండాకాలం వచ్చేసింది. నెత్తిమీద భానుడి ప్రతాపం తాండవం చేస్తోంది. పది నిమిషాలు బయటికి వెళ్లి వస్తే చాలు, శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. చల్లని నీళ్లు తాగాలని ప్రయత్నిస్తే కూల్‌డ్రింక్‌లు కనిపిస్తాయి. కాని అవి ఆరోగ్యానికి మంచివి కావని మన ఆరోగ్యవేత్తలు నిరూపించారు. మరి దీనికి పరిష్కారం లేదంటారా? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఒకటి, కొబ్బరి నీళ్ళు.
       తక్కువ కేలరీలు, కొలస్ట్రాల్‌ లేని కొబ్బరినీళ్ళలో సుమారు 94శాతం వరకూ మాములు నీళ్లే ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లలో కేవలం 2.8శాతం మేరకు చక్కెర, 0.5శాతం వరకూ లవణాలు ఉంటాయి. బి విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి బొండాం ధరకే కూల్‌డ్రింకులు లభించినా, అనారోగ్యాన్ని కల్గించే కారకాలు ఎన్నో ఈ కూల్‌డ్రింక్‌లలో ఉన్నాయి. కాబట్టి ఆమ్లగాఢత ఉన్న కూల్‌డ్రింకులను మానేసి కొబ్బరినీళ్లు తాగమని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు.
గుండె ఆరోగ్యానికి
       దాహాన్ని తీర్చడానికే కాక, అంతకు మించి ఎక్కువ ఔషధగుణాలు ఈ కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ కొబ్బరి నీళ్ళు రక్తపోటును తగ్గించి, శరీరంలో నీటిని కోల్పోకుండా కాపాడతాయి.
మూత్రపిండాల్లో రాళ్ళను తగ్గించడానికి
       కొబ్బరి నీళ్ళు తరుచు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు చేరవు. కొబ్బరినీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం మూత్రకారక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండిపోతే వాటిని మూత్రవిసర్జనలో బయటికి పంపించి వేస్తాయి.
విరేచనాలకు విరుగుడు
       కొబ్బరి నీళ్ళు విరేచనాలను కూడా అరికడతాయి. కొబ్బరినీళ్ళు విరేచనాల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని అందించి లవణాలను అందిస్తాయి. శరీరంలోని విష పదార్ధాలను బయటికి పంపేస్తాయి. కొబ్బరినీళ్ళలో సహజసిద్ధమైన సమగాఢత ఉంది. కొబ్బరినీళ్ళలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలతో సమానం.
ఎండలో హైడ్రేట్‌
       ఎండాకాలంలో శరీరంలో నీటిని కోల్పోయి డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటారు.దీనికి మంచి విరుగుడు కొబ్బరినీళ్ళే. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్‌లు, చాలా తక్కువ స్ధాయిలో చక్కెర, పుష్కలంగా ఎలక్ట్రోలైట్‌లు ఉండడమే దీనికి కారణం. కొబ్బరినీళ్ళను నేరుగా కాని, నిమ్మరసంతో కాని తీసుకుంటే ఎంతో ఉపయోగం.
వ్యాయామం ముందు, తర్వాత
       వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం, ఉక్కపోతగా ఉండటం సహజం. దీనికి పరిష్కారం, ఎలాంటి రసాయన పదార్ధాలు కాని, కృత్రిమ చక్కెర పదార్ధాలు కాని లేని సహజమైన క్రీడా పానీయం కొబ్బరి నీళ్ళు. వ్యాయామం చేసే సమయంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందడానికి అతితక్కువ కేలరీలు ఉన్న కొబ్బరి నీళ్లు ఎంతో ఉత్తమం. పొటాషియం ఎక్కువగా ఉన్న కొబ్బరినీళ్ళను తీసుకోవడం వలన వ్యాయామం తర్వాత డీహ్రైడ్రేషన్‌ సమస్య రాదు.
చర్మానికి కొత్త అందం
       చర్మం మృదువుగా మారాలనుకుంటే క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగండి. ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడమే కాక, మృత కణాలను కూడా తొలగిస్తాయి. కొబ్బరినీళ్ళను రెండు రోజులకొకసారి చేతులకు, ముఖానికి రాసుకుంటే వృద్ధాప్యఛాయలు కనిపించవు. కొబ్బరినీళ్లలో ఉండే సైటోకైనిన్‌ అందుకు కారణం.
సాధారణ గర్భ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ
       కొబ్బరినీళ్ళు సహజసిద్ధంగా లభించే స్వచ్ఛమైన నీరు. కాబట్టే గర్భిణీలకు ఎంతో మంచిది. గర్భిణీలకు సాధారణంగా వచ్చే మలబద్ధకం, గుండెలో మంట, గ్యాస్‌ట్రబుల్‌ లాంటి సమస్యలకు దివ్యౌషధం కొబ్బరినీళ్ళు.
దంత సమస్యలకు విరుగుడు
       కొబ్బరినీళ్లు స్వచ్ఛమైన, సహజమైన పానీయం. పన్ను ఊడిపోయినప్పుడు దంతవైద్యుని చూసే లోపల ఆ పంటిని జాగ్రత్త చేయగలిగింది కొబ్బరినీళ్ళే.
- కోలస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే కొవ్వు సమస్య ఉండదు.
- తరచూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో షుగర్‌ స్ధాయిలు అదుపులో ఉంటాయి.
- ముఖం పై మొటిమలు, నల్లటి మచ్చలు పోవాలంటే లేత కొబ్బరి గుజ్జును రాసుకుంటే ఫలితం ఉంటుంది.
- కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది గనుక వాటిని తాగితే అతిసారం, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
- స్నానం చేసే ముంతు శరీరానికి కొబ్బరి నూనెతో బాగా మర్ధనా చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఎంతో ఉపవమనం కలుగుతుంది.
- ప్రోటీన్ల లోపం ఉన్నవారికి కొబ్బరి పాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
- కొబ్బరి నీళ్లలో కాస్త పసుపు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖం కాంతులీనుతుంది.
- కొబ్బరి నూనెతో తలకు మసాజ్‌ చేసుకుంటే శిరోజాలకే కాదు, కళ్లకు మేలు చేకూరుతుంది.
- పిల్లలకు కూల్‌డ్రింక్‌లు బదులు కొబ్బరి నీళ్లు తరచూ ఇస్తే బలం చేకూరుతుంది.

Courtesy  With: PRAJA SEKTHY DAILY

No comments:

Post a Comment