Thursday, 15 November 2012

ప్రజారోగ్యం.. దశ.. దిశ..

Wed, 14 Nov 2012, IST  


                'ప్రజారోగ్యం' వైద్యుల సంఖ్య మీద, అందుబాటులో వుండే నిపుణులు, సిబ్బంది, మందుల మీద మాత్రమే ఆధారపడి వుండదు. తినే పౌష్టికాహారం, మంచినీటి లభ్యత, వ్యక్తిగత, సామూహిక పరిశుభ్రతల మీద, పర్యావరణ నాణ్యత, అందే విద్య మీద ఆధారపడి వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 'సామాజిక నిర్ణాయకాల (సోషల్‌ డిటర్మినెంట్స్‌)' మీద ప్రజారోగ్యం ఆధారపడి వుంటుంది. ఇవన్నీ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద ఆధారపడి వున్నాయి. ఆరోగ్యానికి పేదరికం అడ్డొస్తుంది. ఇటువంటి ఆరోగ్యం అందరికీ అందాలంటే ప్రభుత్వ ఆర్థిక జోక్యం తప్పనిసరి. 'ప్రజారోగ్య స్థితిగతుల'పై చర్చ నిమిత్తం రెండవ వార్షిక నివేదికను డిసెంబర్‌, 2011లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 'అందరికీ ఆరోగ్యం' కలిగించేందుకు ప్రభుత్వం ఏంచేయాలో తెలుపుతూ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో వీటి ప్రధానాంశాలను, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను సంక్షిప్తంగా వివరిస్తూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
సంస్కరణలు ప్రారంభమై నప్పటి నుండీ అంతంతమాత్రం గానే వుంటున్న ప్రజారోగ్యవ్యవస్థ మరింత రోగగ్రస్థంగా మారి పోయింది. వైద్య ప్రయివేటీకరణ విధానాలే దీనికి కారణం. అతి తక్కువ స్థాయిలో ప్రభుత్వ ఖర్చు, నాసిరకం వైద్య సేవలు ప్రజారో గ్యాన్ని దిగజార్చాయి. రోగ నిరోధ కానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రయివేటు వైద్యం మీద ఆధార పడాల్సిన దుస్థితి పెరిగిపోయింది. వైద్యానికి జేబులోంచి ఖర్చు పెట్టా ల్సినది అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్య రంగం ప్రజలకు దూరమైంది. ఈ నేపథ్యంలో 2000లో ఏర్పడిన 'జనస్వాస్థ్య అభియాన్‌' (ప్రజారోగ్య ఉద్యమం) చొరవతో అంద రికీ ఆరోగ్యం కేంద్ర బిందువుగా చేసుకుని ఆరోగ్యశాఖ పని చేయాల్సి వచ్చింది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 'జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్‌' 2005 ఏప్రిల్‌ నుండి పనిచేయడం ప్రారంభించింది. మాటల్లో 'అందరికీ ఆరోగ్యం', 'ప్రజారోగ్యం' అంశాలను పాలకులు ఒప్పుకుంటు న్నప్పటికీ ఆచరణలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్యతరగతులకు వైద్య సౌకర్యాలను దూరం చేస్తున్నారు. మందుల ఖరీదు ఈ కాలంలో బాగా పెరిగిపోయింది. వీటన్నింటి ఫలితంగా అతిసార, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులు, ఇన్‌ఫ్లుయింజా, మలేరియా, కలరాలాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. క్షయ (టిబి) వంటి వ్యాధులు పునరావృ తమవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ప్రమేయంతో పోలియో, ధనుర్వాతం (టెట్‌నెస్‌), పొంగు (మీజిల్స్‌) వంటివి నిర్మూ లింపబడ్డాయి. మారుతున్న జీవనశైలి వల్ల మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బులు, రక్తపోటు వంటి రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇదీ నేటి ఆరోగ్య చిత్రం.
ప్రయివేటు భారాలు..
ఆరోగ్యానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో కనీసం ఐదు శాతం ఖర్చు చేయాలని అంతర్జాతీయంగా గుర్తించారు. ప్రణాళికా సంఘం ప్రకారం మనదేశంలో ఈ మేర ఖర్చవుతున్నప్పటికీ దీనిలో 78 శాతం ప్రయివేటుశక్తుల నుండే అందుతుంది. ముఖ్యంగా రోగగ్రస్థులు తమ సొంత జేబు నుండి 71 శాతం ఖర్చుపెడుతున్నారు. కేవలం 20 శాతం కేంద్ర ప్రభుత్వం, రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు నిర్వీర్యమైపోయాయి. ప్రాణభీతితో ఆస్తుల్ని తెగనమ్మి లేక అప్పు చేసైనా పేదలు ప్రయివేటు వైద్యంమీద ఆధారపడాల్సి వస్తుంది. పట్టణ పేదల్లో, మధ్య తరగతుల్లో ఇదే స్థితి. ఒకసారి ఏ సభ్యుడైనా జబ్బుపడినప్పుడు ఆ కుటుంబాలు అప్పుల్లోపడి, పేదరికపు స్థాయికి దిగజారిపోతున్నాయి. ఇలా నష్టపోతున్న కుటుంబాలెన్నో.
అనారోగ్యం.. కొరతలతో..
ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన 11వ ప్రణాళిక ఆరోగ్యరంగం కొరతలతో, అనారోగ్యాలతో కునారిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యస్థాయి మరింత దిగజారింది. ఈ రాష్ట్రంలో సంస్కరణలను వేగవంతంగా అమలుచేయడమే దీనికి కారణం. రాష్ట్రంలో మానవుని జీవితకాలం 2002-06 మధ్య 64.4 సంవత్సరాలు కాగా, జాతీయ సగటు 63.5 సంవత్సరాలు. మన పక్కనే వున్న తమిళనాడులో ఇది 66.2 సంవత్సరాలు. వెయ్యి పుట్టుకలకు 2010లో 46 మంది శిశువులు రాష్ట్రంలో చనిపోగా, జాతీయ సగటు 47. తమిళనాడులో 24. వెయ్యి కాన్పులకు 2007-09 కాలంలో మాతృ మరణాలు 134. జాతీయ సగటు 212. తమిళనాడులో 97. మొత్తం జనాభా వార్షిక పెరుగుదల రాష్ట్రంలో 1.8 శాతం కాగా, జాతీయంగా ఇది 2.5 శాతం. తమిళనాడులో 1.7 శాతం. తలసరి ఆరోగ్య ఖర్చు 2008-09లో రాష్ట్రంలో రూ.1061 కాగా, జాతీయ స్థాయిలో ఇది రూ. 1,201. తమిళనాడులో ఇది రూ.1256. అయితే, రాష్ట్రంలో తలసరి ఆదాయం ఈ కాలంలో రూ. 27,362 కాగా, జాతీయంగా ఇది రూ.25,494. ఈ గణాంకాలన్నీ మన రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం తగ్గించిన ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. తమిళనాడు కన్నా ఆరోగ్యానికి కేరళ గరిష్టంగా ప్రాధాన్యత ఇస్తుంది. దీని ఆరోగ్య సూచికలు ఐరోపా సూచికలతో పోటీపడుతున్నాయి.
11వ ప్రణాళికలో...
ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల వుత్పత్తిలో 2-3 శాతం కేటాయించాలని ప్రణాళికా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వ్యయం చేసింది 1.1 శాతం మాత్రమే. కేటాయించిన నిధుల్లో ఖర్చు చేసింది 37 శాతం మాత్రమే. 'అందరికీ ఆరోగ్యం' కల్పించాలనే రాజకీయ సంకల్పం పాలకుల్లో కొరవడడమే దీనికి కారణం. ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరత కూడా తీవ్రంగా వుంది. 2010 ఆరోగ్య సర్వే ప్రకారం అవసరమైన వాటికన్నా 19,590 ఉపకేంద్రాలు, 4.252 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2,115 కేంద్ర ఆరోగ్య ఆసుపత్రులు తక్కువగా వున్నాయి. ఇదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 2,432 వైద్యుల పోస్టులు (11.3 శాతం), 11,361 నిపుణుల పోస్టులు (62.6 శాతం), 13,661 నర్సు పోస్టులు (24.7 శాతం), 7,655 ఫార్మాసిస్టులు (27 శాతం), 14,225 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు (50.4 శాతం) భర్తీ చేయకుండా ఖాళీగా వుంచారు. ఫలితంగా, ప్రజారోగ్య వ్యవస్థ కొరతలతో నిర్వీర్యమవుతుంది. దీరితో వైద్యానికి ప్రజలే ఖర్చు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ప్రయివేటు, కార్పొరేట్ల వైద్యంపై ఆధారపడాల్సిన దుస్థితి నేటికీ కొనసాగుతోంది.
12వ ప్రణాళికలో...
అందరూ భరించగల, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో, విశ్వసనీయమైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రారంభమైన 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌' నిర్దేశించిన లక్ష్యాలను 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా నెరవేరదని ప్రణాళిక ప్రతిపాదనల్ని చూస్తే అర్థమవుతోంది.
నిధుల కేటాయింపు..
ఇది నిర్లక్ష్యం చేయబడుతోంది. వాస్తవిక దృష్టితో జాతీయ స్థూల ఉత్పత్తిలో 2017 (12వ పంచవర్ష ప్రణాళిక) నాటికి 2.5 శాతానికి, 13వ ప్రణాళిక నాటికి 3 శాతానికి పెంచుతూ, క్రమంగా ప్రభుత్వ ఆరోగ్య ఖర్చును 5 శాతం వరకూ పెంచాలని శ్రీనాథరెడ్డి నిపుణుల కమిటీ సూచించినప్పటికీ ఈ లక్ష్యాల్ని చేరే విధంగా ప్రభుత్వ ఆలోచన లు లేవు. పైగా, ప్రభుత్వం కేటాయించిన ఖర్చులో ప్రయివేటు, కార్పొ రేట్‌ వైద్యరంగాలు లాభం పొందేలా పథకాలు రూపొందించబడుతు న్నాయి. ముఖ్యంగా కేటాయించిన నిధులను ప్రభుత్వ వైద్యశాలల ద్వారానే ఖర్చు చేయాల్సిన అవసరం లేదనీ, ఈ నిధులతో ప్రయివేటు వైద్య సేవలను కొని, అందరికీ అందించవచ్చని12వ పంచవర్ష ప్రణా ళిక దిశా నిర్దేశ పత్రం స్పష్టంగా తెలుపుతుంది. ఫలితంగా, నిర్వీర స్థితిలో వున్న ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. రాష్ట్రంలో 'ఆరోగ్యశ్రీ' వైద్య అనుభవాల్నే చూస్తే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లాభాల్ని పెంచే అనవసరపు శస్త్రచికిత్సలకు ప్రాధాన్యత లభిస్తుందనీ, దైనందిక జీవితంలో ప్రజల రోగాలకు అవసరమైన చికిత్స అందదనీ అర్థమవుతుంది. రాష్ట్రీయ బీమా ఆరోగ్య పథకం కింద ఎంపిక చేసిన రోగాలకే చికిత్సని అందించడంతో అసలు అవసరమైన ఆరోగ్యరక్షణకు, ముఖ్యంగా అంటురోగాలను నివారించే చికిత్స ప్రజలకు అందదు. ఇవే నిధులతో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిస్తే జవాబుదారీతనంతో కూడిన వైద్యం అవసరానికి అనుగుణంగా ప్రజలకు అందుతుంది.
నిర్వహణా చికిత్సా (మేనేజ్డ్‌ కేర్‌) విధానం..
దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనికింద ఎంపిక చేసిన ఖరీదైన చికిత్సలకే నిధులు అందుతాయి. అధిక లాభాల్ని ఇచ్చే చికిత్సకే ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాధి నివారణ, సాధారణ చికిత్సలు అలక్ష్యం చేయబడతాయి. చికిత్స ఖర్చు బీమా పరిమితిని దాటినపుడు రోగులే ఆ ఖర్చును భరించాలి. ఇది పేదలపై భారం మోపుతుంది.
ఈ పథకం కింద మొదటనే వైద్య సేవలను అందించగల ఆసు పత్రుల నెట్‌వర్క్‌ ప్రభుత్వం వద్ద నమోదై వుంటాయి. వీటిలో తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఇలా ఎంచుకున్న తర్వాత ఏ వ్యక్తయినా ఒక సంవత్సరంపాటు ప్రాథమికచికిత్సతో సహా అన్ని రోగాలకు ఈ నెట్‌వర్క్‌ నుండే వైద్యాన్ని పొందుతాడు. ప్రభుత్వ వైద్య శాలలను కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వాసుపత్రుల్ని పటిష్టపరచకుండా ఇప్పటి స్థితిలో వీటిని ఎవరూ ఎంచుకోరు. అంటే, ఒక్క దెబ్బతో ఈ పథకం ద్వారా ప్రభుత్వా సుపత్రులు నిర్వీర్యం చేయబడుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ వైద్యశాలలు వీటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేసేందుకు ఇదొక కుట్రపూరిత విధానం. ఈ విషయంలో బ్రిటన్‌ లాంటి దేశాల అనుభవాల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతో ఖరీదుతో కూడిన అమెరికన్‌ నమూనా వైద్యాన్నే ఆచరిస్తుంది. ఇదంతా పేరాశ కలిగిన కార్పొరేట్‌లకు, ప్రైవేటు వైద్యశాలలకు లాభాల్ని కట్టబెట్టడానికే.
ఈ నెట్‌వర్క్‌ ద్వారా పొందగల సహాయానికి చికిత్స ఖర్చు అధికమైనపుడు పొందేందుకు 'టాప్‌-అప్‌ ప్రీమియం' (అధిక ప్రీమియం) చెల్లించాలి. ఇది తిరిగి ప్రజలపై అధిక భారాలను మోపుతుంది.

మందుల ఖర్చు..
ఆధునిక వైద్యంలో మందుల ఖర్చు చాలా ఎక్కువ. పేటెంట్లు, ఇతర కారణాల వల్ల చికిత్సలో మందుల ఖర్చు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఖర్చును తగ్గించడానికి కంపెనీల బ్రాండ్‌ పేర్లతో కాక, మందు అసలు పేరుతో పేటెంట్‌ గడువు తీరినవి 'జనరిక్స్‌' పేరుతో చౌకగా దొరుకుతున్నాయి. ఇప్పటికే ఇవి కొన్ని పెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో దొరుకుతున్నాయి. కోరుకుంటున్న వారందరికీ ఇవి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎలాంటి వత్తిళ్లకూ ప్రభుత్వం లొంగకూడదు. జనరిక్‌ మందుల వాడకాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్‌ పేర్లతో కాక, జనరిక్‌ మందుల పేరుతోనే తయారీ లైసెన్సును ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. కానీ, దీనిని ప్రయివేటు మందుల కంపెనీలు, కొందరు రిప్రజెంటేటివ్స్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రజలకు అత్యవసరమైన జనరిక్‌ మందులను ప్రభుత్వమే తయారుచేయించాలి.

డాక్టర్‌ ఎస్‌.సురేష్‌
హెల్త్‌ సబ్‌కమిటీ కన్వీనర్‌,
జనవిజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment