Wednesday, 7 November 2012

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (5)


  • అశాస్త్రీయ ఆచారాలు 22
మధ్యలో మెరకగా ఉండి అన్ని దిక్కుల అంచుల్లో పల్లంగా ఉన్న భూమిని 'కూర్మపృష్ట భూమి'' అని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే వచ్చే ఫలితాన్ని రెండు గ్రంథాలు రెండు రకాలుగా పేర్కొంటున్నాయి.
శ్లో|| కూర్మపృష్టే భవేద్వాసో నిత్సోత్సాహ సుఖప్రదః
ధనధాన్యం భవేత్తస్య నిశ్చితం విపులం ధనం || అని జ్యోతిర్నిబంధనం'' పేర్కొంటోంది. అంటే ''కూర్మపృష్ట భూమిలో నివాసము ఉత్సాహాన్నీ, సుఖాన్నీ, ధనధాన్య సంపదనూ కలిగిస్తుంది'' అని అర్థం.
అయితే కూర్మపృష్ట నివాసాన్ని గూర్చి ''మయమతం'' ఇలా పేర్కొంటోంది.
శ్లో|| మధ్యోచ్చం వర్జయేద్వాసః పీడాచవధ బంధనే ||
అంటే, మధ్యభాగమున మెరకగా ఉండే భూమిలో అంటే కూర్మపృష్ట భూమిలో నివాసము విడువదగినది. అటువంటిచోట నివాసము పీడను, మరణాన్ని, బంధనాన్ని కలిగిస్తుంది'' అని అర్థం.
అలాగే స్థలంలో ఏ దిశలో మెరక లేక పల్లం ఉంటే ఏ ఫలితం వస్తుంది? దీనిని గూర్చి రెండు ప్రాచీన గ్రంథాలు రెండురకాలుగా పేర్కొంటున్నాయి.
''వాస్తు విద్య'' ప్రకారం తూర్పు మెరక, పడమర పల్లం ఉంటే శుభప్రదమట. కానీ ''శిల్పరత్నం''లో అలాంటి స్థలంలో నివసిస్తే పుత్రులు చనిపోతారని చెప్పబడింది. అలాగే, పశ్చిమం మెరక, ఆగేయం పల్లం ఉంటే విరోధాలు వస్తాయని ''వాస్తు విద్య'' చెబుతుంటే, ''శిల్పరత్నం'' పుత్ర లాభం కలుగుతుందని పేర్కొంటోంది.
మరొక్క విషయం - వర్షపు నీరు, ఇంటిలోని వాడుక నీరు గృహావరణపు వాయువ్య దిశ నుండి బైటికి వస్తే సుఖములు కల్గుతాయని ''వాస్తుసార సంగ్రహం'' పేర్కొంటుంటే, ఇంటి కన్యలకు హానియని ''కాలామృతం'' తెలియజేస్తుంది.
ఇక నవీన వాస్తువాదులలో మేల్పాడి రాఘవా చారి తన ''వాస్తు రాఘవీయం''లో ఇలా పేర్కొంటు న్నారు. ''తండ్రి కుమారునకు ఇవ్వలేని సంపదను, భార్యభర్తకు ఇవ్వలేని సుఖాన్ని, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేని రక్షణను, మిత్రుడు మిత్రునకు చేయలేని సాయాన్ని వాస్తుశాస్త్రము ఒక గృహస్తునికి చేస్తుంది.''
అయితే ''వాస్తుశాస్త్ర వివేకము'' అనే గ్రంథంలో మధురా కృష్ణమూర్తి శాస్త్రి మరోవిధంగా చెబుతు న్నారు. ''ఇంట్లో ఏదో మార్పు చేసినంత మాత్రాన ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, మిత్ర, కళత్రాదులందరూ సుఖముగా ఉంటారనే ప్రచారం నూటికి నూరుపాళ్ళు అపప్రచారం''.
ఇక ఒకే గ్రంథంలో పేర్కొనబడిన పరస్పర విరుద్ధ విషయాన్ని వివరిస్తాను విను.
''వాస్తు రాజవల్లభం''లో ఒకచోట
''శస్తే చంపక పాటలేచకదళీ జాతీతధాకేతకీ''
అని ఉంది. అంటే ''సంపెంగ, కలిగొట్టు, అరటి, జాజి, మొగలి వృక్షములున్న యెడల శ్రేయము'' అని అర్థం. అదే గ్రంథంలో మరోచోట
''దుష్టోభూత సమాశ్రితా పివిటపే
నోచ్చిత్యతే శక్తితః
తద్వద్బిల్వ శమీత్వశోక వకుళౌ పున్నాగసశ్చంపకౌ...''
అని ఉంది. అంటే ''మారేడు, జమ్మి, అశోక, పొగడ, సురపొన్న, సంపెంగ మొదలైన చెట్లు స్థలములో ఉన్న యెడల వాటిని పూర్తిగా వేళ్ళతో కూడ తీసివేయవలెను'' అని అర్థం.
ఇలా వాస్తువాదులు అనేకులు అనేకరకాలుగా చెప్పే అంశాలను, ఒకే వాస్తువాది రెండురకాలుగా చెప్పే అంశాలను కలిగిన విషయాన్ని 'శాస్త్రం' అని అంటామా? చెప్పు చంద్రమౌళీ?'' అని ప్రశ్నించాను.
''శాస్త్రం అనలేము కాంతారావు!'' అన్నాడు చంద్రమౌళి.
వాస్తు, శాస్త్రం కాదనేందుకు మరో ముఖ్యమైన రుజువు ఇస్తాను. విను.
''శ్లో|| పక్షేణ మాసేన ఋతుత్రయేణ సంవత్సరేణాపి ఫలం
విధత్తే ||''
అని విశ్వకర్మ ప్రకాశిక పేర్కొంటోంది. అంటే.. ''వాస్తు ఫలితము పదిహేనురోజులలోగాని, ఒక నెలలోగాని, ఆరునెలల్లోగాని, సంవత్సరంలోగాని సంభవిస్తుంది'' అని అర్థం. అలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని చెప్పడాన్ని శాస్త్రం అంటామా? ఉదాహరణకు ''నీరు వంద డిగ్రీల దగ్గర పూర్తిగా ఆవిరిగా మారుతుంది'' అని సైన్సు వివరిస్తోంది. అంతేకాని పది డిగ్రీల దగ్గరో, 20 డిగ్రీల దగ్గరో, 90 డిగ్రీల దగ్గరో నీరు ఆవిరవుతుందని ఎవరైనా అంటే శాస్త్ర ప్రపంచం దాన్ని సైన్సుగా అంగీకరిస్తుందా?''
''అంగీకరించదు.''
''మరి ఎప్పుడో ఒకప్పుడు ఫలితం లభిస్తుందని వాస్తువాదులు చెబితే, దాన్ని శాస్త్రం అని అంగీకరిద్దామా?''
''అంగీకరించం కాంతారావ్‌! అయితే నీవు చెప్పి నవన్నీ విన్న తర్వాత నాకొక విషయం తోస్తోంది'' అన్నాడు చంద్రమౌళి.
(ఆ వివరాలు
వచ్చేవారం)
''ఏమిటది?'' అడిగాను నేను.
''అసంబద్ధమైన అంశాలున్నాయనో, పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయనో, రుజువుకు అందని అంశాలున్నాయనో వివరించి వాస్తును శాస్త్రం కాదని మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రజలలో వాస్తు పిచ్చిని వదిలించవచ్చు. కానీ వాళ్లల్లో వాస్తుపై నమ్మకం ఎందుకు కల్గింది? ఇంటి స్థలానికి ఈశాన్య మూల కొంచెం పెరగటానికీ, ఇంటి యజమాని సుఖాలకీ సంబంధం ఉంటుందంటే ఎందుకు నమ్ముతున్నారు? సుఖాలకీ, కష్టాలకీ కారణం తమ చుట్టూ ఉండే ప్రజల ఆలోచనలూ, తమను పాలించే ప్రభువుల విధానాలూ అని ఎందుకు విశ్వసించడం లేదు? ఎందుకంటే వారిలో కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రీయ ఆలోచనా విధానం నశించింది. జ్ఞానవంతులనబడే వాళ్ళు అలాంటి ఆలోచనా విధానాన్ని నశింపజేశారు. ఈ పరిస్థితినే నూరేళ్ళ నాటి సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఇలా వివరించారు. ఇదిగో ప్రస్తుతం ఆయన ఉపన్యాసాల గ్రంథాన్నే చదువుతున్నాను'' అంటూ తను తెచ్చుకున్న పుస్తకాన్ని తీసి చదవసాగాడు చంద్రమౌళి....
''స్వప్రయోజనపరులైన కొందరు సర్వజనులను మూఢత్వమున ముంచినారు. సత్య విద్యలన్నియు మూలబడినవి. అందుచేత పర్వతములకు, నదులకు బిడ్డలు పుట్టుట వారికి గొప్ప సత్యం. కల్లు సముద్రములు, నేతి సముద్రములు వారి భూగోళశాస్త్రం. సూర్యచంద్రులను 'పెద్దపాము' మింగుట వారి ఖగోళశాస్త్రం. స్వకాయ కష్టము విడిచి, ఇట్టి 'సత్యము'లను బోధించి, జీవించుట వారి కులవృత్తి. ఇట్టి జ్ఞానవంతులు తామే సర్వజ్ఞులమనుకొని, ఉన్న నాలుగు శాస్త్రములను తామే అభ్యసించి, ఇతరులను చదువనీయకపోవుట చేత, వారికి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుటకుగానీ, వృద్ధి పొందించుటకుగానీ, జనులలో వ్యాపింపజేయుటకుగానీ అవకాశము లేకపోయినది'' (1894లో రాజమండ్రిలో చేసిన ఉపన్యాసము నుండి). ఇది చదివి చంద్రమౌళి చెప్పడం కొనసాగించాడు. ''కాబట్టి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేయవలసినది, ప్రజలకు ఒక్కో అంశంలోని అశాస్త్రీయతను వివరిస్తూనే, వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం. అదీ ముఖ్యంగా చిన్నపిల్లల మనస్సులలో. ఎందుకంటే వారు మొక్కలలాంటివారు, భావిభారత పౌరులు. ''మొక్కైవంగుతుందిగాని మానై వంగుతుందా?'' అనే సామెత నీకు తెలుసుగదా?'' అన్నాడు చంద్రమౌళి.
''నిజమే చంద్రమౌళీ! ఒక్కో మూఢనమ్మకం వెనుక ఉన్న అశాస్త్రీయతను వివరిస్తూనే, ''రుజువుపర్చలేని విషయాలను నమ్మకూడదు; ప్రతి సమస్య వెనుక ఉన్న వాస్తవిక కారణాల్ని గ్రహించాలి'' అనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. అదే బాధ్యతగల ప్రతి పౌరుడి ముఖ్యకర్తవ్యం. ఈ విషయంలో నీవు చెప్పిన దానిని అంగీకరిస్తూనే ఒక చిన్న సవరణ చేస్తున్నాను'' అన్నాను.
''ఏమిటా సవరణ?'' ఆసక్తిగా అడిగాడు చంద్రమౌళి.
''నీవు మీ జన విజ్ఞానవేదిక వాళ్లు చేయవలసినది ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం'' అన్నావు. 'మీ' కి బదులు 'మనం' అను. అర్థమైందా? 'నీవు', 'మేము' కలిసి 'మనం' ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిద్దాం. సరేనా?'' అన్నాను నవ్వుతూ.
''చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను'' అన్నాడు చంద్రమౌళి నవ్వుతూ.
''చాలా చాలా సంతోషం'' అన్నాను నేను కూడా నవ్వుతూ.
- కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment