తొలి మహిళా శాస్త్రవేత్త ఎవరు?
- ఎం.వి. గౌతం, కాకినాడ

తొలి
మహిళా శాస్త్రవేత్త ఎవరనడం కన్నా తొలి శాస్త్రవేత్త మహిళేనా అన్న ప్రశ్నకు
మాత్రం జవాబు 'అవుననే!'. మానవులందరూ శాస్త్రవేత్తలే! మనం మామూలుగా భావించే
ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తల తరహాలో
ఎవరు తొలి శాస్త్రవేత్త అంటే దానికి ఇదిమిద్ధంగా జవాబు చెప్పలేము. కానీ
విశ్వవిద్యాలయా లు, ప్రయోగశాలలు రాకముందే శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్ర
విజ్ఞాన చర్చలు, అన్వేషణ తదితర ప్రకృతి పరిజ్ఞాన కార్యకలాపాలు మానవ సమాజంలో
అంతర్భా గంగానే ఉండేవి. అందరూ ఆమోదించే విషయం ఒకటుంది. స్త్రీలే తొలి
శాస్త్రవేత్తలని! స్త్రీలే తొలి వ్యవసాయదారులని! కాలక్రమేణా ఆస్తి పంపకాలు,
వంశపారంపర్యత, గర్భధారణా నంతరం ప్రసవం తర్వాత బిడ్డల సంరక్షణ వంటి
కౌటుంబిక వ్యవహారాలు సామాజిక గమనంలో అంతర్భాగమయ్యాక స్త్రీలు ఇళ్లకే
పరిమితమయ్యారు. రకరకాల అన్యాయపు పదాలు ఆమెకు అంటగట్టారు. 'అబల' అని,
'అమ్మాయిలు చదివి ఉద్ధరిస్తారా?', 'మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి
చెడిందని', 'ఆడ పెత్తనం.. దొరతనం' అని, 'ఆడవాళ్లకు అణుకువే అలంకారం' అని,
'తీగకు పందిరిలాగే ఆడవారికి చిన్నపుడు తండ్రి, వయస్సులో భర్త, వృద్ధాప్యంలో
తనయుడి అండదండ ఉండాలని', 'మహా పతివ్రత (సాధారణ పతివ్రతకు, మహా పతివ్రతకు
తేడా ఏమిటో ఎవరయినా ఉద్ఘాటిస్తే బాగుణ్ణు)' అనీ.. ఇలాంటి ప్రత్యేక పదాల్ని,
పాటల్ని స్త్రీలకు అతికించారు.
హైపేషియా అనే గణిత శాస్త్రజ్ఞులు
నాల్గవ శతాబ్దకాలంలోనే 'సౌర కేంద్ర సిద్ధాంతాన్ని' ప్రతిపాదించినందుకు
మతపెద్దలు ఆమెను అమానుష పద్ధతుల్లో హింసించి, చంపారు. విజ్ఞానశాస్త్ర
పరిశోధనల్లో 1901 నుంచి నేటివరకూ వచ్చిన నోబెల్ బహుమతులు సుమారు 600 కాగా,
అందులో 20 మంది కూడా మహిళా శాస్త్రవేత్తలు లేరు. అప్రమత్త వర్తమాన ప్రపంచ
మానవాభివృద్ధి పరిక్రమా (conscious daytoday human endeavours) ల్లో నేటికీ
మమేకమైన మానవశ్రమలో మహిళలదే 70 శాతం పైచిలుకు అని సామాజిక శాస్త్రవేత్తలు,
విజ్ఞానకోవిదులు ఘోషిస్తున్నారు. వర్తమానంలోనే కాదు, గతంలోనూ అతివలదే
అపరిమిత సామాజిక హిత శ్రామిక వెత. అసలు సిసలైన తొలి శాస్త్రవేత్తలు మహిళలే.
నేటికీ తెలివి, గంభీరం, చాతుర్యత, మానవత వారివే!
No comments:
Post a Comment