Wednesday, 5 December 2012

పెరుమాళ్ళయ్య పుస్తకావిష్కరణ

 
 
ప్రఖ్యాత వాస్తు పండితుడు పెరుమాళ్ళయ్య (పేరు మార్చబడింది) వాస్తుపై రచించిన పుస్తకావిష్కరణ సభ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి హాలులో జరగబోతోంది. ఐదు గంటలకే పెరుమాళ్ళయ్య అనుచరులు హాలు ఆవరణలో బ్యానర్లు కట్టి, లోపల వేదికపై ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఐదు ముప్పావుకు పెరుమాళ్ళయ్య ఆ రోజు ముఖ్యఅతిథి రాజశేఖర్‌తో కలిసి కారులో వచ్చారు. హాలులో అప్పటికి 10, 15 మందికి మించిలేరు. పెరుమాళ్ళయ్య కొద్ది గా నిరాశపడ్డారు. మరో పది నిమిషాల్లో పుస్తకావిష్కర్త, మరో వక్త, ఆర్కిటెక్చరల్‌ ఇంజనీర్‌ అచ్చిరెడ్డి వచ్చారు.

సమయం ఆరైంది.. ఆరుంబావైంది.. ఆరున్నర దాటింది. హాలులోని సీట్లలో పది శాతానికి మించిలేరు. ఆరుముప్పావుకు ఇక తప్పదని సభ మొదలుపెట్టారు. ముఖ్యఅతిథి ఉపన్యాసం తర్వాత పుస్తకావిష్కరణ జరిగింది. తర్వాత గ్రంథకర్త పెరుమాళ్ళయ్య ఉపన్యాసం మొదలుపెట్టారు.
''సభాసదులారా! నా పుస్తకావిష్కరణ సభకు వందమంది కూడా హాజరుకాలేదు. అంటే, ఈ సభ విఫలమైంది. కారణం ఏమిటో తెలుసా? సభను ఏర్పాటు చేసిన రవీంద్రభారతి హాలుకు వాస్తుదోషం వుంది. భవనం బయట వాకిలి దక్షిణంగానూ, భవన ముఖద్వారం ఆగేయంవైపుకూ ఉన్నాయి. ఈశాన్యం ఎత్తుగా వుంది. ఇన్ని వాస్తుదోషాలున్నాయి. కాబట్టే సభ విఫలమైంది. అనేక పట్టణాలలో ఇలాంటి వాస్తుదోషాలున్న సభాభవనాలను నేను పరిశీలించి, ఆ దోషాలను నివారిస్తూ, నిర్మాణాలను సరిచేసిన తర్వాత ఆ భవనాలలో సభలన్నీ దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ భవనానికి కూడా వెంటనే వాస్తుదోష నివారణ కోసం పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నేను భవన నిర్వాహకులను కోరుతున్నాను.''

సభికులందరికీ ఆయన ఉపన్యాసం కొంత ఆశ్చర్యాన్నీ, మరికొంత నవ్వునూ తెప్పించింది. వారిలో వారు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా అధ్యక్షులవారు తర్వాత వక్త ఆర్కిటెక్ట్‌ అచ్చిరెడ్డిని ప్రసంగించాల్సిందిగా కోరారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది.. ''ఆవిష్కరణ సభకు నన్ను ఆహ్వానించిపుడే నేను వాస్తు వ్యతిరేకిననీ, ఇలాంటి సభలకు రాలేననీ పెరుమాళ్ళయ్యకు చెప్పాను. అయినా, వాస్తు విమర్శను వేదికమీదనే తిప్పకొట్టగలననీ, అందువలన తప్పకరావాలనీ పెరుమాళ్ళయ్య నన్ను బలవంతం చేశారు. దీంతో నేను ఈ సభకు రాక తప్పలేదు.పెరుమాళ్ళయ్యగారు తన పుస్తకావిష్కరణ సభ విఫలం కావడానికి కారణాల్ని రవీంద్ర భారతికి ఆపాదించారు. దానికి వాస్తుదోషం వుందన్నారు. నేను గత 20 ఏళ్లుగా ఈ హాలులో అనేక సభలకు, కళా ప్రదర్శనలకు హాజరయ్యాను. అన్నిసార్లూ హాలు నిండిపోవడం, అనేకమంది సీట్లు దొరకక వెనుక్కు తిరిగివెళ్ళడం కళ్ళారా చూశాను. ఇది నా అనుభవమే కాదు. నా మిత్రులు అనేకమంది అనుభవం కూడా! రవీంద్ర భారతికి వాస్తుదోషం వుంటే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల సభలు ఎలా దిగ్విజయంగా కొనసాగుతాయి? ఆ విషయం పక్కనపెడదాం. రవీంద్ర భారతి హాలును పెరుమాళ్ళయ్య ముందే చూచారు గదా? వారికి వాస్తుదోషాలు అప్పుడే తెలిసి వుంటాయి గదా? మరివారు దోషాలున్న వేదికను ఎందుకని ఏరికోరి ఈ కార్యక్రమానికి ఎన్నుకొన్నారు? తన సభ విఫలం కావాలనా? వారు అలా అనుకోరు కాబట్టి ఈ భవనానికి వాస్తుదోషాలున్నాయనేది వాదనకు నిలిచే అంశం కాదు. ఈ విషయాన్ని సభికులందరూ అర్థంచేసుకోవాలని కోరుతున్నాను'' అని ముగించారు.

ఆర్కిటెక్ట్‌ అచ్చిరెడ్డి విమర్శలకూ, వాదనలకూ పెరుమాళ్ళయ్య మౌనమే సమాధానమైంది. దీనితో సభికులు 'వాస్తు అంతా డొల్లా!. పెరుమాళ్ళయ్య మాటలన్నీ అబద్ధాలే..!.' అని నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు.
కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment