Thursday 13 December 2012

పదేళ్లలో మారిన వాస్తు..?!

  • వాస్తు.. వాస్తవాలు.. 2
ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు, శిష్యగణమున్న వ్యక్తి. ఆయన పేరు నరసింహశాస్త్రి (పేరు మార్చబడింది). అయితే అందరూ ఆయనను 'గురువుగారూ! అయ్యవారూ!' అనే పిలుస్తారుగానీ పేరుతో పిలవరు. ప్రతిరోజూ అనేకమంది శిష్యులు ఆయన ఇంటికి వచ్చి, ఆయనకు పాదాభివందనం చేసి, ఆయన ఆశీర్వాదాలు తీసుకొనిపోతారు. గురువుగారు తన ఇంట్లో కాలుమోపితేనే తమకు ఐశ్వర్యం కలుగుతుందని ఆయన శిష్యులు నమ్ముతారు. అందుకని వాళ్ళు ఆయనను కారులో తమ ఇళ్ళకు తీసుకువెళ్ళి, ఘనంగా ఆతిథ్యమిచ్చి పంపుతారు. తమ గృహం పావనమైందని సంతోషిస్తారు.
ఒకరోజు చిలకలూరి పేటలోని వ్యాపారి అయిన ఒక శిష్యుడు ఆయనను కారులో తనింటికి తీసుకువెళ్ళాడు. సోఫాలో కూర్చోబెట్టి, ఆయన పాదాలు వెండి పళ్ళెంలో పెట్టి, కడిగి, ఆ నీళ్ళను నెత్తిన చల్లుకున్నాడు. తర్వాత ఆయన కాళ్ళ దగ్గర నేలపై కూర్చొని, ఇలా అడిగాడు. ''అయ్యగారూ! నాకేమీ కలిసి రావడం లేదు. ఎందుకని?''
అప్పుడు గురువుగారు ఇల్లంతా పరిశీలించి చూసి 'నీ ఇంటికి వాస్తుదోషం ఉంది నాయనా!'' అన్నాడు.
దానికి వ్యాపారి 'అదేమిటో సెలవీయండి అయ్యగారూ! సరిచేయించుకుంటాను' అన్నాడు.
'ఈ వాకిలి దక్షిణంవైపు వుండకూడదు నాయనా! ఉత్తరంవైపు ఉండాలి. ఈ పూజామందిరం తూర్పువైపు వుండకూడదు నాయనా! ఈశాన్యం ఉండాలి. ఈ బీరువా తూర్పువాకిలి వైపు తిరిగి వుండకూడదు. పడమరవైపు వాకిలి వుండాలి. ఈ మార్పులన్నీ చేయించు నాయనా!' అన్నాడు అయ్యగారు.
తర్వాత గురువుగారు వెళ్ళబోయేముందు వ్యాపారి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను సాగనంపాడు.
పదేళ్ళు గడిచాయి. వ్యాపారి ఒక మాదిరిగా సంపాదించాడు. అయినా గురువుగారిని కోరినట్లు జిల్లాలోనే తాను పెద్ద ధనికుణ్ణి కాలేకపోయానని దిగులుపడసాగాడు. ఆ విషయం గురువుగారినే అడిగి తెలుసుకుందామని, ఆయనను ఆహ్వానించి, కారులో తన ఇంటికి తీసుకువచ్చాడు. కిందటి సారిలాగే, సోఫాలో కూర్చోబెట్టి, కాళ్ళు కడిగి, నెత్తిన చల్లుకొని, ఇలా అడిగాడు.
'అయ్యగారూ! నాకు పెద్దగా కలిసిరావడం లేదు. ఎందుకంటారు?' అయ్యగారు పదేళ్ళ నాడు చెప్పినదంతా మర్చి పోయాడు. గత పదేళ్ళుగా శిష్యులంద రికీ రొటీన్‌గా చెబుతు న్నట్లుగానే చెప్పడం మొదలెట్టాడు. 'నాయ నా! నీ ఇంటికి వాస్తు దోషం ఉందయ్యా!' అన్నాడు. శిష్యుడు కొంచెం ఆశ్చర్యపోయినా, తమాయించు కొని 'ఏమిటో చెప్పండి గురువుగారూ!' అన్నాడు.
గురువుగారు చెప్పసాగాడు. 'ఈ వాకిలి ఉత్తరంవైపు ఉండకూడదు నాయనా! దక్షిణంవైపు ఉండాలి' అన్నాడు. శిష్యుడు కొంచెం నోరెళ్ళబెట్టాడు.
'ఈ పూజామందిరం ఈశాన్యంవైపు వుండకూడదు నాయనా! తూర్పువైపు వాకిలి వుండాలి' గురువుగారి ఆదేశం.
శిష్యుడు నోరు పూర్తిగా వెళ్ళబెట్టాడుగానీ గురువుగారిని ఏమీ అనలేదు.
అక్కడితో ఆగక గురువుగారు ఇలా అడిగారు 'ఎవరు నాయనా? ఇంత వాస్తు విరుద్ధంగా నిర్మింపజేసింది?'
శిష్యుడిక ఆగలేకపోయాడు. 'మీరే స్వామీ! పదేళ్ళ కిందట ఈ వాస్తుమార్పులన్నీ సూచించినది' అని సమాధానమిచ్చాడు.
'ఇప్పుడు నోరువెళ్ళబెట్టడం గురువుగారి వంతైంది. అయినా, తమాయించుకొని 'ఇప్పుడు నేను చెప్పినవన్నీ గత పదేళ్ళ పరిశోధనా ఫలితాలు నాయనా!' అన్నాడు. శిష్యుడు ఒక జీవం లేని నవ్వునవ్వాడు.
గురువుగారు బయలుదేరారు. ఈసారి శిష్యుడు సాష్టాంగ నమస్కారం చెయ్యలేదు. చేతులు జోడించి, గురువుగారిని సాగనంపాడు.

కె.ఎల్‌.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment