Tuesday 10 April 2012

బడుల్లో దాష్టీకం... వ్యవస్థకే కళంకం


  • -జి.వెంకట్ ధీరజ
రోడ్డు ప్రమాదాల వార్తలు లేకుండా ఉదయాన్నే పేపరు చదవటం సాధ్యం కాదు. ఒకప్పుడు వాటిని చదవాలంటేనో, ఆ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను తెల్లారే చూడాలంటేనో భయంగానూ ఉండేది. కడుపులో తిప్పినట్లు అయ్యేది. కానీ క్రమంగా మనం ఇపుడు వాటికి అలవాటుపడిపోయాం. నేడు ఆ కోవలోకే మరోరకం వార్తలు వచ్చేస్తున్నాయి. అవే... ఉపాధ్యాయులు విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించడం, తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు మూకుమ్మడిగా ఉపాధ్యాయులపై దాడి చేయడానికి సంబంధించిన వార్తలు! దాడులు, ప్రతిదాడులతో సున్నితమైన గురు,శిష్య సంబంధాలమధ్య తీవ్రమైన అగాధం ఏర్పడుతోంది.
రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట.. ఎవరో ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి చేతిలో తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. విద్యార్థి గాయపడిన సందర్భంలో ఉపాధ్యాయులపై దాడి జరగటం, వారిని చెప్పులతో కొట్టడం ఎలక్ట్రానిక్ మీడియాకు మంచి వార్తగా నిలుస్తున్నది. తమిళనాడులో ఈమధ్య ఒక విద్యార్థి తనకు పాఠం చెప్పే ఉపాధ్యాయురాలిని నరికి చంపేశాడు. తెలుగులో మాట్లాడిన నేరానికి ఒక విద్యార్థిని ఉపాధ్యాయుల చేతిలో తీవ్రంగా దెబ్బలు తింటే, మరోచోట పద్యం సరిగా చదవనందుకు వందలకొద్దీ గుంజిళ్లు తీయిస్తే విద్యార్థిని ఆసుపత్రి పాలైంది. మరో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొడితే అతడి కంటికి గాయమైంది. ఆ విషయం బయటివారికి చెప్పాడంటూ మరో ఉపాధ్యాయుడు మళ్లీ ఆ విద్యార్థిని కొడితే ఈసారి ఏకంగా ఎముకలే విరిగాయట. ఇదేమని అడిగితే విద్యార్థి తల్లిని కూడా తన్నాడట ఆ గురువు! పరీక్ష రాస్తున్న విద్యార్థిని స్లిప్‌లు తెచ్చిందన్న నెపంతో పక్క గదిలోకి పిలిచి వళ్లంతా తడిమాడట మరో ఉపాధ్యాయుడు! అడపాదడపా లైంగిక వేధింపుల కేసులూ బడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటనలు ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెడుతున్నాయి. దేవుడితో సమానంగా భావించవలసిన గురువును రోడ్డుపైకి ఈడ్చే పరిస్థితులు దాపురించాయి. నేడు నెలకొన్న ఈ అవాంఛనీయ పరిస్థితులను అటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమీక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
తరిచి చూస్తే చాలా చిన్న కారణాలు పెద్ద వివాదాలను సృష్టిస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది?
పిల్లలకు నీతి బోధ చేసి, జ్ఞాన సముపార్జనకు సహాయం అందించి, జీవితంలో ఉత్తములుగా రూపుదిద్దుకొనేందుకు దారి చూపి మార్గదర్శకులుగా ఉండవలసిన ఉపాధ్యాయుల్లో ఎందుకింత అసహనం పెరుగుతోంది? గోటితో పోయేదానిని గొడ్డలిదాకా ఎందుకు తెస్తున్నారు?
ఉపాధ్యాయ వృత్తి వాస్తవానికి కేవలం ‘ఉపాధి చూపే’ వృత్తి మాత్రమే కాదు, అది ఒక ఆదర్శ జీవన విధానం. చిన్న వయస్సులో తల్లిదండ్రులకన్నా కూడా ఉపాధ్యాయులనే తమ రోల్‌మోడల్‌గా పిల్లలు భావించటం సాధారణంగా జరుగుతుంది. గతంలో ఈ వృత్తిపట్ల ప్రేమతో, నిబద్ధతతో బోధనా రంగంలోకి అడుగుపెట్టిన వారు ఎక్కువగా ఉండేవారు. ఉపాధ్యాయ వృత్తివలన ఆస్తులను కూడబెట్టుకోవడం సంగతి అటుంచి కుటుంబాన్ని హాయిగా గడిపేంత డబ్బు కూడా వచ్చేది కాదు. కేవలం ఆ వృత్తిపట్ల ప్రేమతోనే ఎక్కువమంది ఉపాధ్యాయులుగా చేరి, ఆ వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులున్నా కొనసాగుతూ ఉండేవారు. అందుకే ‘బతకలేక బడిపంతులు’ అని ప్రచారంలో ఉండేది. కానీ కాలగతిలో ఆ పరిస్థితులు మారిపోయాయి.
ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఒక ఉద్యోగంగా భావించే వారి సంఖ్య పెరిగిపోతోంది. విద్య ఒక ‘మంచి’ వ్యాపారం అయిపోయింది. విద్య కార్పొరేట్ రంగు పూసుకొంది. వ్యాపార విలువలు పెరిగిపోయాయి. అందుకే ఇన్ని రకాల వివాదాలకు పాఠశాలలు కేంద్రబిందువుగా మారుతున్నాయని ఎందరో అభిప్రాయపడుతున్నారు.
మార్గదర్శకాలు
పాఠశాలల్లో విద్యార్థులను శిక్షించటానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను ఇటీవల జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ వెలువరించింది. భారతీయ పాఠశాలల్లో విద్యార్థులను శారీరకంగా కొట్టే ఆచారం పెద్ద ఎత్తునే అమలులో ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. మూడు- అయిదు సంవత్సరాల వయస్సు విద్యార్థులను కూడా ఉపేక్షించటం లేదని కమిషన్ కనుగొంది. బెత్తం, డస్టర్‌ల వంటి వాటితో కొట్టటంతోపాటు చాక్‌పీస్‌లు, పుస్తకాలను విసరటం, పెన్నులు, పెన్సిళ్ళతో గాయపరచటం వంటివి సాధారణంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులలో అవగాహన పెంచేందుకు ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 2009-10 సంవత్సరాలలో ఏడు రాష్ట్రాలకు చెందిన 6,632 మంది విద్యార్థులను సర్వే చేసిన అనంతరం ఎన్‌సిపిసిఆర్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి పాఠశాలలో ‘కార్పొరల్ పనిష్‌మెంట్ మానిటరింగ్ సెల్స్’ను ఏర్పాటుచేయాలని ఈ మార్గదర్శకాలలో ప్రధానంగా పేర్కొనటం జరిగింది. ఈ మానిటరింగ్ సెల్స్ విద్యార్థులు శిక్షకు గురయినప్పుడు సంబంధిత వివరాలను పరిశీలించి, 48 గంటలలోగా జిల్లా స్థాయి అధికారులకు తెలియజేయాలి. విద్యార్థులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు జరిగిన సందర్భాలలో కూడా ఈ మానిటరింగ్ సెల్స్ విచారణ చేస్తాయి.
పిల్లలను బడికి పంపుతున్నాం గనుక ఏ సమస్య వచ్చినా పాఠశాల యాజమాన్యమే చూసుకొంటుందనే భావనను తల్లిదండ్రులు వదిలిపెట్టి, తమ బిడ్డ ప్రవర్తన తీరు ఏ విధంగా వుంటున్నదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారిలో అసాధారణమైన మార్పులను గమనిస్తే, ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్ళి, పాఠశాలలో తమ బిడ్డ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి.
వీటికితోడు ప్రతి పాఠశాలలో క్రియాశీలకమైన పాత్ర పోషించే విధంగా పేరెంట్, టీచర్ కమిటీలను ఏర్పాటుచేయాలి. నెలకు కనీసం ఒకసారైనా ఈ కమిటీ సమావేశమై సమస్యలపై చర్చించాలి. ప్రతి పాఠశాల తప్పనిసరిగా పేరెంట్స్ మీట్‌లను ఏర్పాటుచేయాలి. ఈ సమావేశాలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. కేవలం మొక్కుబడిగా ఈ సమావేశాలను ఏర్పాటుచేయడం కాకుండా సమస్యల నివారణ వేదికలుగా వీటిని ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం పేరెంట్స్ మీట్‌లను కేవలం ప్రోగ్రెస్ షీట్‌లను ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
అలా కాక విద్యార్థి ప్రవర్తన, చదువు తీరు గురించి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో కూలంకషంగా చర్చించాలి. విద్యార్థి ప్రవర్తన అసాధారణంగా ఉంటే ఆ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ఎటువంటి చర్యలు అవసరమో సూచించగలగాలి. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒక బృందంగా ఇటువంటి విషయాలను బహిరంగంగా చర్చించటం వలన పాఠశాలలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
పాఠశాలల్లో విద్యార్థులను భౌతికంగా శిక్షించరాదని నియమాలు స్పష్టంగా ఉన్నాయి. వీటిని పాటించే విషయంలోనే సహనం కొరవడుతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు మూలాల నుంచే మార్పు కోసం ప్రయత్నించాలి. ఉపాధ్యాయ శిక్షణలోనే పెను మార్పులను తీసుకురావలసిన అవసరం ఉంది.

No comments:

Post a Comment