Wednesday 18 April 2012

విశ్వమార్పులు..


గతవారం 'హరాత్మక చలన' విశ్వ నమూనా (Model of Oscillating Universe) యే ఎక్కువ శాస్త్రీయతకు అనుగుణంగా ఉందని అను కొన్నాం. ఈ హరాత్మక చలన విశ్వనమూనానే 'పల్సేటింగ్‌ యూనివర్స్‌ (Pulsating Universe)' అని కూడా అంటున్నారు. దీనిని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కూడా సమర్థించాడు. దీని ప్రకారం విశ్వానికి అంతం, ఆది లేవు. విశ్వం శాశ్వతం. అయితే అందులో మార్పులూ శాశ్వతమే! మారనిది అంటూ విశ్వంలో ఏదీ లేదు. పదార్థం అంతా ఒకే బిందువు రూపంలోకి వెళ్లినపుడు అందులో పాదార్థిక వైవిధ్యం ఉండదు. పాదార్థిక వైవిధ్యంలేని వ్యవస్థలో కాలం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి మన ఊపిరితిత్తులు వెడల్పు అవుతూ, మళ్లీ కుంచించుకుంటున్నట్టుగా ఈ విశ్వం అత్యంత విశాలమైన స్థల రూపంలోకి, అత్యంత కనిష్టమైన స్థల రూపంలోకి పదే పదే వలయ చక్రీయ (Expanding Spiral) గమనంలో ఉన్నట్టు ఈ సిద్ధాంతపు సారాంశం. ప్రస్తుతం మన (సమకాలీన) విశ్వస్థితి పల్స్‌ (ఘటనావ్యవస్థ) లో ఓ దశగా భావించాలి. ఇందులోకి 'మహా విస్ఫోటన' సిద్ధాంతాన్ని అంతర్లీనంగా జొన్పించవచ్చును. సుమారు 1500 కోట్ల సంవత్సరాల కిందట ఈ విశ్వం ఓ రాగి గింజ కన్నా ఇంకా తక్కువ స్థలంలో ఉండేది. అది ఆంతరంగిక ఘర్షణ వల్ల పేలింది. అప్పుడే వైవిధ్యం గల పదార్థం ఆవిర్భవించింది.

విసిరివేయబడ్డట్టు పాదార్థిక భాగాలు చెల్లాచెదురైన క్రమంలో పాదార్థిక రూపాలు గోళాకారాన్ని సంతరించు కొంటాయి. అందులో ఓ గోళాకార పదార్థ సంచయం (lump of matter) పాలపుంత. మొదట సంపూర్ణ గోళాకారంగానే ఉన్నా ఏదో ఒక అంతర్గత అక్షం (axis) చుట్టూనే దాని పదార్థం తిరగడం వల్ల అక్షం దగ్గర ఉబ్బుగానూ అంచుల్లో పలుచగానూ అయ్యే స్థితి ఏర్పడుతుంది. ఇది నిత్యజీవితంలో మనకెదురయ్యే అపకేంద్రబలం (centrifugal force) వల్ల సిద్ధిస్తుంది. అక్షం నుంచి దూరం వెళ్లే కొలదీ వేగం పెరగడం వల్ల అపకేంద్ర బలం కూడా పెరుగుతుంది. అందువల్ల చివర ఉన్న భాగాలు మళ్లీ చిందర వందర గోళాకార ముక్కలుగా విడిపడతాయి. అందులో ఓ అంచులో ఉన్న పాదార్థిక భాగం సౌరమండలం (Solar System) గా రూపొందింది. ఇది కూడా ఉబ్బిన పూరీలాగానూ లేదా ఇడ్లీలాగాను మధ్యలో ఉబ్బుగా, అంచుల్లో పలుచగా ఉండేది. ఇది ఏర్పడి దాదాపు 700 కోట్ల సంవత్సరాలైంది.

ఇందులో మళ్లీ గతితార్కిక పద్ధతిలో అంతర్గత వైరుధ్యాలు, ఘర్షణల వల్ల పరిమాణాత్మకమార్పు, గుణాత్మకమార్పు చెందే విశ్వ నియమానుసారం మధ్యలో అలాగే పదార్థం పోగై సూర్యగోళం రూపొందగా.. అంచుల్లో ఉన్నవి ఆయా సందర్భాల్లో తలెత్తిన యాధృచ్ఛిక (stochastic chance) పునరమరికలో భాగంగా వివిధ గ్రహాలుగా ఏర్పడ్డాయి. విశ్వ గమనంలో యాధృచ్ఛికతకు చాలా పాత్ర ఉంది. ఓ వంద నాణేలను నిరుపేక్ష (impartial) గా పైకి గిరాటేస్తే ఏ నాణెం బొమ్మ పడుతుందో, ఏ నాణెం బొరుసు పడుతుందో చెప్పలేం. కానీ ప్రతినాణెం బొమ్మైనా పడాలి లేదా బొరుసైనా పడాలి. ఏది పడుతుందన్నదే యాధృచ్ఛికం. అన్ని నాణేల్లోనూ యాధృచ్ఛికత ఉన్నా తప్పకుండా అందులో సుమారు 50 నాణేలు బొమ్మల్ని, సుమారు 50 నాణేలు బొరుసుల్ని చూపిస్తాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా 100 నాణేల్ని బొమ్మలుగానో లేదా బొరుసులుగానో వేయలేం. లేదా 25 బొమ్మలుగానూ 75 బొరుసులుగానూ కూడా చూళ్లేము. ఇలా 50 అటూ, 50 యిటూ పడ్డానికే చాలాసార్లు అవకాశం ఉంది. ఇది క్రమత్వం. ఇందులో యాధృచ్ఛికత లేదు. ఇలా విడివిడి భాగాల్లో అంతరంగికంగా యాధృచ్ఛికత ఉన్న సమిష్టి వ్యవస్థలో క్రమత్వం సిద్ధిస్తుందని ఆధునిక క్వాంటం సిద్ధాంతం ఘోషిస్తోంది.

మధ్యలో పదార్థం సూర్యుడిగానూ అంచుల్లోని విగ్రహాలుగానూ మారాయని తెలుసుకున్నాం కదా! వాటి వాటి ప్రమాణాల్ని నిర్దేశించింది కేవలం యాధృచ్ఛికతే! సూర్యుడి నుంచి 3వ గ్రహమే భూమి. సూర్యమండల సంయుక్త పదార్థం (Solar Planetory Disc) నుంచి భూమి స్వతంత్ర పదార్థంగా విడిపడి రూపొందడాన్నే భూమి ఆవిర్భావం అనుకొంటే ఆ సంఘటన జరిగి నేటికి సుమారు 600 కోట్ల సంవత్సరాలైంది. ఆ దశలో మొదట్లో భూమి కూడా పూర్తిగా ఉదజని వాయువు (Hydrogen gas) తో నిండి ఉండేది. అంటే సూర్యుడిలాగే భూమి కూడా పుట్టిన తర్వాత 50 కోట్ల సంవత్సరాల క్రితం వరకు (అంటే నేటికి 550 కోట్ల సంవత్సరాల పూర్వం) స్వయం ప్రకాశకం.

అంటే భూమి కూడా ఒక దశలో నాలుగు హైడ్రోజన్‌ కేంద్రాకాలను కేంద్రక సంలీన ప్రక్రియ (nuclear fusion) ద్వారా హీలియంగా మార్చుతూ కాంతి శక్తిని, ఉష్ణశక్తి తదితర శక్తి రూపాల్ని విడుదల చేసే చిరు నక్షత్రమేనన్న మాట. కాబట్టి భూమిని సూర్యుడి సోదరిగానే భావించాలి తప్ప సంతతిగా కాదన్నది ముఖ్యమైన అంశం. కేంద్రక సంలీన చర్యల్లో ప్రధానాంశం చిన్న చిన్న కేంద్రకాలు పెద్ద కేంద్రకాలుగా గుంపు కావడం. అంటే మొదట్లో పూర్తిగా తేలికైన హైడ్రోజన్‌, హీలియంగా ఉండిన భూ పదార్థం క్రమక్రమంగా అధిక బరువు గల పెద్ద పెద్ద పరమాణు కేంద్రకాలుగా మారిందన్నమాట. సహజంగానే హైడ్రోజన్‌ వాయువు ఖర్చు కావడం వల్ల కేంద్రక సంలీన చర్యకు సరిపడా అది లేకపోవడం వల్లన భూమి నక్షత్రస్థాయి నుంచి తప్పుకుంది. ఆ తదుపరి రసాయనాలు ఏర్పడి, నీటిఆవిరి తయారుకావడం, వాతావరణం రావడం, నీటి నిల్వలు సిద్ధించడం వీలైంది. జీవానికి అనువైనస్థితులు ఏర్పడ్డాయి. ఆ వివరాలు పైవారం తెలుసుకుందాం..!

No comments:

Post a Comment