Wednesday, 25 April 2012

బార్లీతో బలం


  • -డా. జి.వి. పూర్ణచందు 9440172642
  • 22/04/2012

బార్లీ గింజలను జ్వరం వచ్చినపుడు జావ కాచుకొని తాగేందుకే మనం వాడుతున్నాం. గోధుమ, వరి, జొన్నల తర్వాత బార్లీనే ఆహార ధాన్యంగా ప్రపంచంలో ఎక్కువమంది వాడుతున్నారు. పశువుల మేతలోనూ, బీరు తయారీ పరిశ్రమల్లో కూడా దీని వినియోగం ఎక్కువ. బార్లీ పంట ఈనాటిది కాదు. క్రీ.పూ.10,000 నాటికే బార్లీ పండించటం ప్రారంభించారు. రుగ్వేదంలో పేర్కొన్న యవధాన్యం బార్లీయేనని చెప్తారు. ordeum vulgare అనేధి దీని శాస్ర్తియ నామం. ఇండో యూరోపియన్ పూర్వ రూపాలలో ‘బ్యారే’ అనే పదం బార్లీ పేరుకి మూలంగా భాషావేత్తలు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్, జోర్డాన్ ప్రాంతాల్లో దీని ఉత్పత్తి ప్రారంభమైందట. బహుశా భూ ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గించటానికి బార్లీ ఉత్పత్తి ఆనాడు అనివార్యమై ఉంటుంది. ఉష్ణమండల దేశాలవారికి బార్లీ అత్యవసర ఆహార పదార్థం. ఆఫ్రికాలో బార్లీ సాగు మొదట ప్రారంభమైందనే వాదన ఉంది. క్రీ.శ.1500 దాకా బార్లీని రొట్టెల తయారీ కోసమే ఎక్కువగా ఉపయోగించారు.pot barley అంటే పట్టు తక్కువ లేదా దంపుడు బార్లీ గింజలని అర్థం. పాలిష్ చేసిన బార్లీ గింజల్ని ‘పెరల్ బార్లీ’ అంటారు.pearling అంటే తెల్లగా ఫాలిష్ పట్టటం. ముత్యాల్లా ఉంటాయి కాబట్టి ఈ పేరు సార్థకం అయ్యింది.
10-25 శాతం బార్లీ పిండిలో గోధుమ పిండి కలిపి బేకింగ్ ప్రక్రియలో రొట్టెల తయారీకి వాడుతున్నారు. బార్లీ గింజల మాల్ట్ వాడకం ఇప్పుడు ఎక్కువగా ఉంది. నాన్ రొట్టెలు (బ్రెడ్స్), చంటిపిల్లలకు పెట్టే ఫారెక్స్, సెరెలాక్ లాంటి పోషక పదార్థాల తయారీలో ఈ ‘బార్లీమాల్ట్’ ఉపయోగపడుతోంది. బార్లీ మాల్ట్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. బార్లీగింజల్ని నల్లగా మాడ్చి కాఫీ గింజలకు బదులుగా వాడుతున్నారు. అది చేదు రుచినే కలిగింటుంది. ఇలా నల్లగా మాడ్చిన గింజలతో ‘వినెగార్’ తయారుచేస్తున్నారు.
ఓట్స్ అనేవి గొప్ప ధాన్యం అనే ప్రచార ప్రభావంతో తెలుగు నేలమీద చాలామంది ఓట్స్ అటుకులను తిని, ఇంకా తమకు తగినంత బలం రాలేదని అంటుంటారు. ఓట్స్‌కన్నా బార్లీలో మూడురెట్లు అధికంగా పోషక విలువలున్నాయని ఆహార శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. బార్లీ అనగానే ఫైబర్ నిండిన ఒక గొప్ప ధాన్యం అని మనకు గుర్తుకు రావాలి. పళ్ల రసాలు, కూరగాయలకన్నా బార్లీద్వారా లాభించే ఫైబర్ పేగులకు ఎక్కువ మేలు చేస్తుంది. భాస్వరం, రాగి, మాంగనీసు ఖనిజాలు నిండుగా ఉన్న ధాన్యం ఇది. గుండె, రక్తనాళాలకు ఎక్కువగా బలాన్ని కలిగిస్తుంది. రక్తపోటుని నివారించటంలో బార్లీ శక్తిమంతంగా పనిచేయటానికి ఈ ఖనిజాలే కారణం. గుండె జబ్బులు, పేగుపూత, జీర్ణకోశవ్యాధులు, అమీబియాసిస్, ‘ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్’ వ్యాధుల్లో ఇది ఔషధమే! రోజుకు 21 గ్రాముల బార్లీని తీసుకొంటే గుండెజబ్బులను నివారించవచ్చునని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. ఫైబర్ కారణంగా పేగులు శుద్ధి అయి, పేగులలో బంధించబడిన మలం మెత్తబడి సాఫీగా విసర్జించబడుతుంది. మొలలు, లూఠీ వ్యాధులతో బాధపడేవారు బార్లీని ఔషధంగా వాడుకోవాలి. మూత్రంలో మంట తగ్గుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. పేగుల్లో కేన్సర్ రోగాలకు బార్లీతో ఉపశమనం కనిపిస్తుంది.
బార్లీని జావగా మాత్రమే తాగనక్కర్లేదు. దీని పిండితో గోధుమ, జొన్న, రాగి, బియ్యం పిండిగానీ కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. రుబ్బిన మినప్పిండిలో బార్లీ పిండిని కలిపి గారెలు, దోశెలు వేసుకోవచ్చు. పూరీ, ఉప్మాలాంటివికూడా వండుకోవచ్చు. యూరోపియన్లు పుట్టగొడుగులతో బార్లీని కలిపి వండుకుంటారు. బార్లీజావలో పెరుగు కలిపి మిక్సీపట్టండి లేదా చల్ల కవ్వంతో చిలకండి. ఈ మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా బార్లీలోని ఫైబర్‌ను త్వరగా పులిసేలా చేసి ఇఖఆకూజష ఘషజజూ అనే కొవ్వు ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బుటిరిక్ ఆమ్లం పెద్ద పేగుల్లో కణాల్ని బలసంపన్నం చేస్తుంది. పేగుల్లో కేన్సర్, అల్సర్లవంటివి రాకుండా చేస్తుంది. పేగులు బలసంపన్నమైతే, సమస్త వ్యాధులనూ నివారించినట్టే కదా..! కామెర్లు, తదితర లివర్ వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు బార్లీమజ్జిగ గొప్ప ఔషధం. కొలెస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను అదుపు చేసి కొవ్వు పెరగకుండా చేయగల పానీయం ఇది. స్థూలకాయులు, షుగర్‌వ్యాధి ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. నియాసిస్ అనే బి- విటమిన్ బార్లీలో ఎక్కువగా ఉంటుంది.
బార్లీ మజ్జిగ షుగర్ వ్యాధిలో వచ్చే అరికాళ్ల మంటలు, తిమ్మిర్లను తగ్గించటానికి పనికొస్తుంది. మెనోపాజ్‌కు చేరిన స్ర్తిలు బార్లీ మజ్జిగ తాగితే మెనోపాజల్ సిండ్రోమ్ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. పొద్దునే్న లీటర్లకొద్దీ నీళ్లు తాగే అలవాటున్నవారు బార్లీ మజ్జిగ తాగటం అలవాటు చేసుకొంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాలింతలు బార్లీ గింజలతో కాచిన పాయసం తాగుతూ ఉంటే తల్లిపాలు పెరుగుతాయి. ఆమెపాలు తాగిన బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతాడు. బార్లీపట్ల మనకున్న అపోహలను తొలగించుకొని, అది మన ప్రాచీన ధాన్యాలలో ఒకటిగా గ్రహించి సద్వినియోగపరచుకోవటం అవసరం.

No comments:

Post a Comment