Tuesday 17 April 2012

నిరంతర ‘వీక్షణం’.. జీవనం దుర్భరం



  • 18/04/2012

...............
‘కేబుల్ కనెక్షన్ తీసివేసిన తర్వాత - నేను
ఆరోగ్యవంతుడినైనట్లు గుర్తించా.. నాలో సృజనాత్మకత
కన్పిస్తోంది.. ఇతరులతో సంబంధాలు మెరుగుపడ్డాయి.. వీటన్నింటినీ చూశాక నాలో ఆత్మబలం పెరిగింది..’- ఇదీ.. టీవీ చూడడం మానేశాక ఓ మధ్య వయస్కుడి మనోగతం. ‘మీ గదిలో టీవీని తొలగించండి.. ఆ తర్వాత మార్పేమిటో మీరే చూస్తారు..’- అని కొందరు తమ అనుభవాలను
ఏకరువు పెడుతున్నారు.
.............................
వినోదానికి, విజ్ఞానానికి కాసేపు టీవీ చూడడం తప్పేమీ కాదు. అయితే, గంటల తరబడి టీవీకి అతుక్కుపోతే ఆరోగ్యంతో పాటు జీవితంలో ఎన్నింటినో కోల్పోతారని వైద్యులు, మానసిక శాస్తవ్రేత్తలు పదే పదే ఘోషిస్తున్నారు. ‘ఇడియట్ బాక్సు’కు బానిసలుగా మారితే బ్రతుకు దుర్భరం కాక తప్పదని అమెరికాతోపాటు పలు దేశాల్లో జరిపిన తాజా సర్వేల్లో వెల్లడైంది. గంటల తరబడి టీవీ ముందు కూర్చోవడం అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజలకు అలవాటుగా మారిందని సర్వేలో తేల్చారు. విలువైన కాలం వృథా కావడంతో వ్యాయామం, పుస్తక పఠనం, స్వచ్ఛంద సేవ, మంచి నిద్ర, వేళకు భోజనం వంటివి దూరం అవుతున్నాయని గుర్తించారు. రోజూ నాలుగు గంటలు... అంతకు మించి టీవీ చూడడం వల్ల చాలామందిలో బద్ధకం పెరుగుతోందట. టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం సమస్య తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే పనిగా చానల్స్ మారుస్తూ టీవీకే అంకితం కావడం వల్ల సన్నిహితులతో మంచి సంభాషణలకు చాలామంది దూరం అవుతున్నారు. టీవీలో సీరియళ్లు, రియాల్టీ షోలు, సినిమాలు, క్రీడలను చూడడానికే ప్రాధాన్యమిస్తున్నందున ఇంట్లో పెద్దలు, పిల్లలతో మాట్లాడడం తగ్గించేస్తున్నారు. దీంతో కుటుంబ సంబంధాలు లోపిస్తున్నాయి. గతంలో కుటుంబ సభ్యులు సరదాగా పిక్నిక్‌లకు వెళ్లడం, ఆటపాటలతో సందడి చేయడం, కలిసి మెలిసి కబుర్లు చెప్పుకోవడం వంటివి కనిపించేవి. టీవీ పుణ్యమాని ఇవన్నీ గతకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. చదువుకున్న వారు సైతం తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తూ, టీవీ సీరియల్స్‌లో అత్తాకోడళ్ల తగాదాల్లో ఆ కుటుంబాలు ఏమవుతాయోనని బెంగ పడిపోతున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేయడానికి సమయం ఉండదని చెబుతూ, టీవీ తెరకు గంటలకొద్దీ అతుక్కుపోతుంటారు. నిద్ర పోయే ముందు టీవీ చూడడం మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఆలుమగల మధ్య సైతం ‘ఇడియట్ బాక్స్’ చిచ్చు పెడుతోంది. ఓ పద్ధతి లేకుండా అదే పనిగా టీవీ కార్యక్రమాలను వీక్షించడంతో జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. టీవీ ముందు కూర్చుని భావోద్వేగాలకు లోనవుతూ భోజనం చేయడం, మద్యం తాగడం వంటివి చేయడంతో మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందట. కాసేపైనా బయట తిరిగితే.. జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. టీవీ చూసే మొత్తం సమయంలో కొన్ని గంటలనైనా వ్యాయామం, ఆటలకు కేటాయిస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది.
రెండేళ్ల లోపు బాలలను టీవీ చూసేందుకు అనుమతించరాదని అమెరికాకు చెందిన పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు టీవీకి బానిసలైతే వారిలో సృజనాత్మకత లోపిస్తుంది. వారిలో విజ్ఞానం, విచక్షణ వంటివి పెరగాలంటే బాహ్య ప్రపంచం తెలియాలని, పుస్తక పఠనం, పెద్దల మధ్య తిరగడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. టీవీకి పరిమితమయ్యే పెద్దలు బద్ధకం కారణంగా రోజు వారీ పనులను సైతం వాయిదా వేస్తుంటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో విభేదాలు ఏర్పడుతున్నాయి. వాయిదా వేసే పనులను ఒకేసారి చేయాలన్న ఆతృతలో మానసిక వత్తిడికి చాలామంది లోనవుతున్నారు. కొన్ని విషయాల్లో నష్టపోయాక.. విలువైన డబ్బును, కాలాన్ని పోగొట్టుకున్నట్లు తెలుసుకుని కొంద రు బాధ పడుతుంటారు.
గంటల తరబడి టీవీ కార్యక్రమాలను చూడడంతో చాలామంది సృజనాత్మకను కోల్పోతున్నారు. కల్పనలతో కూడాన విషయాలపై మెదడు కేంద్రీకృతం కావడంతో వాస్తవ జీవితాన్ని కోల్పోతున్నారు. ఊహల్లో తేలిపోయేవారు నిజ జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నారు. టీవీ ప్రభావంతో విలాసవంతమైన వస్తువులనుకొంటూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వినోదం, విజ్ఞానం అందించే టీవీ కార్యక్రమాల్ని పరిమితంగా చూస్తే తప్పేం లేదు. అయితే, అందుకోసం మనం విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, మంచి అలవాట్లను, మానవ సంబంధాలను త్యాగం చేయనక్కర్లేదు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను, మంచి విలువలను దూరం చేసుకోనక్కర్లేదు.

No comments:

Post a Comment