Monday, 2 April 2012

బంగారం... సింగారం... వ్యాపారం

   Sat, 3 Mar 2012,  

ఇది లోహాల్లో రారాజు. దాని మెరుపుకి మోకరిల్లే వాళ్లు, దాని రంగుకి వొంగి సలాం చేసేవాళ్లూ కోకొల్లలు. మానవుడు కనుగొన్న మొట్టమొదటి లోహం అదే. క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్లక్రితం, ఆ తర్వాత పద్దెనిమిది వందల ఏళ్లకు రాగి కనుగొన్నారు. మధ్య యుగాల్లో ఇతర సామాన్య లోహాలనూ బంగారం లాగా మార్చే 'ఆల్కెమిస్టులు' పుట్టుకొచ్చారు. వారి మాటతో ప్రజల్లో ఆశలు పుట్టాయి కానీ బంగారం పుట్టలేదు. బంగారం మీద కాంక్ష...భూగోళం మీద యుద్ధాలూ, సాహస యాత్రలూ, వలసలూ (పంతొమ్మిదో శతాబ్దపు గోల్డ్‌రష్‌), బానిసల పుట్టుకకు, వారి బాసుల పెరుగుదలకూ... ఇలా ఎన్నో సంఘటనలకు మూలమయ్యింది.
బంగారమంటే భారతీయులకి ఎనలేని ప్రేమ, ఇష్టం, కోరిక. బంగారాన్ని ఆభరణాలుగా మలచి వేసుకోవడంపైనే మనవారికి అపారమైన మక్కువ. స్థోమతతో సంబంధం లేకుండా కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. అసలు మన సంస్కృతీ సాంప్రదాయంలో బంగారం ఒక భాగమైపోయింది. పెళ్లిళ్లకీ, పేరంటాలకీ, పెద్ద పండగలకీ, చిన్న పార్టీలకీ, కట్నాలకీ, కానుకలకీ, అప్పుకీ, మెప్పుకీ, దాచుకోడానికీ, చూపుకోడానికీ, ముడుపుకీ, మదుపుకీ, దోపిడీలకూ, దొంగతనాలకూ...ఇలా సందర్భం, అవసరం వంటి అంశాల ప్రసక్తి లేకున్నా కూడా బంగారం ఎన్నో విధాలుగా ఇల్లు, ఒళ్లు చేరుతుంది. ఇంతటి ప్రజాదరణ పొందిన మూలకం బహుశా మరొకటి ఈ సృష్టిలోనే లేదేమో!
అసలు విషయానికి వద్దాం. బంగారం అనగానే ఎప్పుడోకప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి. స్వచ్ఛమైన బంగారం అంటే ఏంటి? నగల తయారీకి ఏమైనా లోహాలు కలుపుతారా? కెడిఎం అంటే ఏంటి? క్యారెట్‌ అంటే ఏంటి? బిఐఎస్‌ అంటే ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవాళ తెలుసుకుందాం.
అసలు ఆ బంగారపు వన్నెలోనే ఏదో మాయ ఉన్నట్టుంది. లేకపోతే అంతకంటే మెరుగైన, మెరుగున్న పదార్థాలు, అంతకంటే రంగున్న లోహాలూ ఎన్నో ఉండగా బంగారానికే ఈ స్థాయి దక్కాలా? మానవుల కోరికలకు కారణాలూ, కారకాలూ వుండవు. ఏటా మనదేశంలో సుమారు అయిదు వందల టన్నులకు పైగా బంగారం వినియోగం అవుతుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. అందులో దాదాపు ఎనభై శాతం ఏకంగా నగల తయారీకి, ఓ పది, పదిహేనుశాతం మదుపుకీ, ఇక మిగిలినదే పారిశ్రామిక ఉపయోగాలకూ వెళ్తోంది. ఇప్పుడున్న మొత్తం బంగారంలో డెబ్బై అయిదు శాతం 1910 తర్వాత వెలికి తీసిందే. ఒకానొక అంచనా ప్రకారం ఇప్పుడున్న బంగారం మొత్తాన్ని (శుద్ధి చేసినది) ఒకే దగ్గర చేరిస్తే... అది సుమారు 287496 ఘనపుటడుగుల ముద్దలాగా మారుతుంది.
సాధారణంగా బంగారు నగలమీద ఉన్న విశేష మోజే కొన్ని దురవగాహనలకూ, అవగాహనా లేమికి, మోసాలకూ కారణమౌతోంది.
బంగారం భూగర్భంలో, నదులూ, సముద్రాల కిందా ఉంటుంది. అయితే దాన్ని కనిపెట్టి వెలికితీయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అత్యాధునిక సాంకేతిక, పరికరాలతోనే ఒక ఔన్స్‌ (సుమారు ఇరవై ఎనిమిది గ్రాములు)బంగారాన్ని శుద్ధి చేసి తీయాలంటే గని నుండి దాదాపు మూడు టన్నుల (ఒక టన్ను వెయ్యి కిలోలు) ముడి బంగారం బయటికి తీయాలి. అందుకే బంగారానికి అంత విలువ. అరుదుగా లభించడం, శుద్ధి చేయడంలో కష్టం, రసాయనాలతో సాధారణంగా చర్య జరపక పోవడం, మెరుగు దీర్ఘకాలం నిలిచి ఉండడం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు బంగారానికి ప్రత్యేకత, స్థాయి, విలువా తెచ్చాయి.
మామూలుగా బంగారం మెత్తని లోహం. స్వచ్ఛమైన సుతి మెత్తని బంగారాన్ని సుత్తితో కొట్టి అత్యంత పల్చటి రేకుల్లా, తీగల్లా సాగతీయవచ్చు. మరి అంత మృదువైన లోహంతో లాభం లేదుకదా.. అందుకని బంగారాన్ని కావాలని కల్తీ చేస్తారు. కల్తీ స్వార్థం కోసం కాదు.... కాఠిన్యం కోసం.
'కల్తీ'తో రంగు
బంగారంలో కాస్త కాఠిన్యం కోసం ఇతర గట్టి లోహాలను కలుపుతారని అనుకున్నాం కదూ. అలాంటి లోహాలు గట్టిదనమే కాకుండా రంగులను కూడా ఇస్తాయి. ఎక్కువగా బంగారంలో రాగిని కలుపుతారు.
వెండి, రాగి కలిపితే పసుపు రంగు వస్తుంది. ఇటువంటి బంగారానికి ఎక్కువ గిరాకీ.
రాగి మాత్రమే కలిపితే గులాబి రంగూ, నికెల్‌, పల్లాడియం, ప్లాటినం, జింకు కలిపితే తెలుపు రంగూ, వెండి, క్యాడ్మియం/జింక్‌ కలిపితే పసుపుపచ్చ రంగూ వస్తుంది. అరుదుగానే అయినా, కొంతమంది ఇనుము కలిపి నీలం రంగుని, అల్యూమినియం కలిపి వంగ పండు రంగునీ రప్పిస్తారు. ఇటువంటి కలయికలు కొత్త రంగులను ఇచ్చినా, అసలు వస్తువు లక్షణం మారిపోయి, పెళుసుగా తయారౌతాయి.
క్యారెట్ల కథ
బంగారపు ఆభరణాల స్వచ్ఛత ప్రస్తావించినప్పుడు క్యారెట్‌ అనే పదం వాడతారు. క్యారెట్‌ అంటే ఒక ఆభరణంలో ఉండే స్వచ్ఛమైన బంగారపు మోతాదునీ, శాతాన్నీ సూచించే ప్రామాణికం. ప్రాచీన కాలంలో కారాబ్‌ అనే చిక్కుడు వంటి గింజలతో విలువైన లోహాల (బంగారం కాకపోవచ్చు) బరువును తూచేవారు. కారాబ్‌ నుండి క్యారెట్‌ వచ్చింది. ఈ కారాబ్‌ గింజలన్నీ దాదాపు ఒకే ఆకారం, ఒకే బరువుతో ఉంటాయి. ఆధునిక పరికరాలు, వాటి మధ్య వెయ్యిలో మూడవ వంతు వ్యత్యాసాన్ని కూడా పసిగట్టలేకపోయాయి.
అస్సలు ఏమీ కలపని బంగారం 24 క్యారెట్లు అంటారు. అంటే ఇరవై నాలుగు భాగాలలో ఇరవైనాలుగు భాగాలూ బంగారమే. ఇతర లోహం కలవదు. అంటే అది నూరుశాతం స్వచ్ఛమైనది (నిజానికి 99.0శాతం - 99.9శాతం మధ్యలో ఉంటుంది) కానీ 24 క్యారెట్ల బంగారు ఆభరణాలకి గిరాకీ చాలా తక్కువ. మరీ మృదువుగా వుంటాయి కాబట్టి. అధిక క్యారెట్లు అంటే ధర ఎక్కువ, మన్నిక తక్కువ (ఇతర క్యారెట్ల కంటే).
మనదేశంలో 22 క్యారెట్ల ఆభరణాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఇందులో 24 భాగాల్లో 22 భాగాలు బంగారం, మిగతా రెండు భాగాలూ ఇతర లోహాలూ ఉంటాయి. ఇది 91.6 శాతం స్వచ్ఛత కలిగింది.
అదే 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో ఆరు భాగాలు ఇతర లోహాలుంటాయి. 75శాతం స్వచ్ఛత ఉంటుంది.
అలాగే 14 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో పది భాగాలు ఇతర లోహాలుంటాయి. 58.3శాతం స్వచ్ఛత ఉంటుంది.
12 క్యారెట్‌ బంగారు ఆభరణాల్లో సగం అంటే 12 భాగాలు ఇతర లోహాలుంటాయి. సగం (50శాతం) స్వచ్ఛత ఉంటుంది.
అమెరికాలో 10 క్యారెట్ల బంగారం మాత్రమే బంగారంలా పరిగణిస్తారు. ఇతర దేశాల్లో 9 క్యారెట్‌ కూడా వాడతారు.
చాలా దేశాలు క్యారెట్‌ లెక్క వాడుతుంటే, యూరప్‌లో మూడంకెల పద్ధతి అమలులో ఉంది. ఉదాహరణకి మన 22 కారెట్ల (91.6శాతం) బంగారం అక్కడ 916గా ఉంటుంది.
క్యారెట్‌ బంగారపు నాణ్యతకి సూచన అయితే, వజ్రాలకి బరువుకి సూచిక. ఒక క్యారెట్‌ 200 గ్రాములకు సమానం. ఆంగ్లంలో బంగారానికి సaతీa్‌ అనీ, వజ్రానికి షaతీa్‌ అనీ వాడతారు.
కె.డి.ఎం అంటే?
బంగారు ఆభరణాల తయారీలో కాడ్మియం అనే లోహాన్ని వాడితే ఆ ఆభరణం కె.డి.ఎంగా పిలవబడుతుంది. ప్రత్యేక రంగు రావడానికి సాధారణంగా కాడ్మియంని వాడతారు. 916 కె.డి.ఎం అంటే 22 క్యారెట్ల బంగారంలో రెండు శాతం కాడ్మియం ఉంటుంది. అంటే 22 కారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. కాబట్టి కాడ్మియం కలిసింది కాబట్టి దాన్ని 916 కె.డి.ఎం అంటారు.
అయితే కాడ్మియంలో విషతుల్య ఆవిరులు ఉత్పత్తి అవుతాయి. అవి దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ కారణంగా చాలా దేశాలు బంగారు ఆభరణాలలో కాడ్మియం వాడకాన్ని నిషేధించాయి. అయితే హాని కేవలం తయారీ సమయంలోనే. ఆ క్రియలో పాల్గొనే వారికే గానీ అటువంటి ఆభరణాలు ధరించిన వారికి కాదు.
హాల్‌మార్క్‌ బంగారం?
స్వర్ణాభరణాల స్వచ్ఛతకు తాకీదు ఇవ్వడానికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బి.ఐ.ఎస్‌) పూనుకుంది. ఆ సంస్థతో రిజిస్టర్‌ అయిన స్వర్ణకారులు తమ ఉత్పత్తుల స్వచ్ఛతను సూచిస్తూ హాల్‌మార్క్‌ ముద్ర వేసుకోవచ్చు. ఆ ముద్ర ఉన్న వస్తువు నాణ్యత విశ్వసనీయమైందని అర్థం. మన దేశంలో స్వర్ణాభరణాల నాణ్యతకు సర్టిఫికెట్‌ ఇచ్చే సంస్థ బి.ఐ.ఎస్‌ ఒకటి.

No comments:

Post a Comment