Wednesday, 13 June 2012

పిరిమిడ్ల నిర్మాణానికి రాళ్లను ఎక్కడ నుంచి తెచ్చారు?


   

      ఈజిప్టులో పిరమిడ్లు నిర్మించారు కదా! ఆ చుట్టుపక్కల కొండలు, రాళ్లు లేవు. మరి అంత పెద్ద    
      రాళ్లను ఎక్కడ నుంచి ఎలా తెచ్చారు?
      - రాంబాబు, రాజమండ్రి
ఈజిప్టులోని పిరమిడ్లు సుమారు 4600 సంవత్సరాల క్రితం పురాతన మానవ నిర్మితాలు. క్రీ.పూ. 2630 మొదలుకొని క్రీ.పూ. 660 సంవత్సరాల వరకు వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్మించబడిన సౌష్టవ నిర్మాణాలివి. పిరమిడు అంటే గణిత శాస్త్రంలో ఓ ప్రత్యేక అర్థం ఉంది. ఒక సమబాహు బహుభుజి (Equilateral Polygon) మూలల (corners) నుంచి సమానదూరంలో ఓ కూచ్యాగ్రాన్ని (apex) చేరేలా నిర్మించబడిన ఘనరూపమే పిరమిడు. సాధారణంగా బహుభుజిని నేలపై పూర్తిగా ఆనేలా రూపొందించి ప్రతి మూల నుంచి భుజాలంత దూరంలో కూచ్యాగ్రం ఉండేలా ఈ పిరమిడ్లను రూపొందిస్తారు. ప్రతి మూల నుంచి ఓ అంచు కూచ్యాగ్రానికి వెళ్తుండడం వల్ల పిరమిడు పార్శతలాలు (lateral faces) ఎపుడూ త్రికోణాకారంలోనే ఉంటాయి. సాధారణంగా భూమి మీదున్న బహుభుజి భుజమంతే దూరంలో ఉండేలా పిరమిడును నిర్మిస్తే పార్శ్వ తలాలు విధిగా సమబాహు త్రిభుజాకారం (Equilateral Triangle) రూపంలోనే ఉంటాయి. నేలమీదున్న బహుభుజాన్ని ఆధార భూమి (base) అంటారు.

పిరమిడు నిర్మించాలంటే కనీసం మూడు భుజాలున్న బహుభుజ భూమి కావాలి. ఇలాంటి పిరమిడును చతుర్ముఖి (tetrahedron)అంటారు. బహుభుజిలో ఎన్ని భుజాలుంటాయో అన్నే పార్శ్వ ముఖాలుంటాయి. ఈజిప్టులోని పిరమిడ్లు చాలామటుకు చతురస్రాకార (square) భూమి ఉండేలా సమబాహు త్రిభుజాకృతులు పార్శ్వతలా లుగా నిర్మించబడినవి. ఇలాంటి పిరమిడ్లను చతుర్భుజ (tetragonal) పిరమిడ్లు అంటారు. సుమారు 138 పిరమిడ్లు ఈజిప్టు, ఆ చుట్టుపక్కల ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో చాలామటుకు శిథిలం కాగా, కేవలం పదిలోపే ఇంకా పిరమిడు రూపంలో ఉన్నాయి. మిగిలినవి కాలక్రమేణా ఎండలకు, గాలులకులోనయి నేలమట్టం అయ్యాయి. మరికొన్ని విరూపం (deshaped) అయ్యాయి.

ఈజిప్టు, సుడాన్‌లలో వందలాదిగా నేటికీ నిలిచి ఉన్న పిరమిడ్లలో కైరో నగరం సమీపాన గిజి ప్రాంతంలో ఉన్న కుఫ్టు పిరమిడ్‌ (Pyramid of Khufu) ప్రస్తుతం వరకు ఉన్న పిరమిడ్లలోనే అత్యంత ఎత్తయ్యింది. ఇది ప్రాచీన ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా నేటికీ భాసిల్లుతోంది. ఈజిప్టు రాజుల్లో నాల్గవతరానికి చెందిన ఫారోకుఫు వంశపు పాలకుల సమాధిగా దీన్ని క్రీ.పూ. 2580లో ప్రారంభించి క్రీ.పూ. 2560 వరకు పూర్తిచేశారని ప్రసిద్ధి. ఈ పిరమిడు చతుర్భజి భూమి భుజం పొడవు సుమారు 230 మీటర్లు. ఎత్తు (భూమి మధ్య నుంచి) సుమారు 150 మీటర్లు. దీనర్థం ఏమిటంటే ఈ పిరమిడును ఒకసారి చుట్టి రావడానికి సుమారు కిలో మీటరు దూరం (4X230=920 మీ) ఉంటుందన్న మాట.

క్రీ.శ 1311లో ఇంగ్లాండులో లింకన్‌ క్యాథడ్రెల్‌ (Lincoln Cathedral) నిర్మిం చేంత వరకు అంటే దాదాపు 3800 సంవత్స రాలపాటు మానవ నిర్మిత నిర్మాణాల్లో అత్యంత ఎత్తయిన, విశాలమైన కట్టడంగా ఈ పిరమిడు కీర్తించబడుతోంది. మీరన్నట్లు ఈ పిరమిడు, మిగిలిన పిరమిడ్లు చాలామటుకు దీర్ఘ ఘనాకారం (parallelepiped) లోకి తొలచ (chistled) బడిన బండరాళ్లతోను, గట్టి ఇటుకలతోను, సముద్రశంఖాలతో చేసిన దీర్ఘఘనాకార దిమ్మలతోను నిర్మించారు. ఒక్కో నిర్మాణానికి సగటున 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో శతాబ్దాలపాటు నిర్మించిన ఈ పిరమిడ్ల నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీల సంఖ్య లక్షవరకు ఉండవచ్చని అంచనా! మానవ నిర్మితం అంటూ చరిత్రలో ఘనత చెందిన పిరమిడులోని ప్రతి రాయి వెనుకా ఆనాటి శ్రామిక బానిసల చెమట, రక్తం లేదా ప్రాణాలు ఉన్నాయి. వేదనలు, కొరడా దెబ్బలు ఉన్నాయి.

శిక్షలూ, మరణదండనలూ ఉన్నాయి. ఈజిప్టులో పిరమిడ్ల దరిదాపుల్లో కొండలూ, బండరాళ్లు లేకపోయినా, వాహనాలు, పెద్ద పెద్ద యంత్రాలూ లేకపోయినా వేలాది సంవత్సరాలుగా సాగిన పిరమిడ్ల నిర్మాణంలో గొప్పదనమెవరిది? పిరమిడ్లు అంటూ వచ్చాక వాటి చుట్టూ ఎన్నో అభూతకల్పనలూ, మహత్తులూ, వాటిని నిర్మించిన రోమను చక్రవర్తుల, ఈజిప్టు రాజుల ఘనచరిత్రనే మనం వింటుంటాము. కానీ వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నైలునది నుంచో, ఎర్ర సముద్రం నుంచో వేలాది శ్రామిక బానిసలు కాలినడకనే లక్షలాది బండరాళ్లను, గవ్వల్ని మోసుకొచ్చారు.

మహా అయితే అడపాదడపా ఒంటెల బళ్లను వాడి ఉండవచ్చును. లక్షలాది గవ్వల్ని భట్టీల్లో వేసి సున్నపుదిమ్మల్ని చేశారు. ఆ వేడిలో అసువులు బాసిన బానిస బతుకులెన్నో! లక్షలాది బండల్ని ముక్కలు చేస్తూ వాటికి దీర్ఘఘనాకృతిని చెక్కిన బక్క బతుకుల హీనాకృతులెన్నెన్నో! మోయడం, మోదడం తప్ప ప్రమోదాలెరుగని శ్రామిక వీపుల మీద కొరడా మోతలెన్నో! రాచరిక నిరంకుశాన్ని తలెత్తి ప్రశ్నించిన తలతీతలెన్నో! 'ప్రభువెక్కిన పల్లకి కాదోరు, దాన్ని మోసిన బోయీలెవ్వరు? తాజ్‌మహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవ్వరు' అన్న శ్రీశ్రీ మాటల్నే ఇక్కడా అన్వయించుకోవాలి. పర్యావరణాన్ని కొందరే కాలుష్యం చేస్తుంటే మానవులందరికీ ఆ పాపాన్ని అంటగట్టే దోపిడీవ్యవస్థే బహుళ శ్రామికశక్తి నిర్మితమైన చారిత్రక కట్టడాల కీర్తికిరీటాల్ని మాత్రం రాజుల గొప్పలుగా చెప్పుకుంటారు. చరిత్ర రథసారథులైన శ్రమజీవుల్ని చరిత్రహీను లుగా కనుమరుగుచేస్తారు.

No comments:

Post a Comment