Wednesday, 6 June 2012

సమాచార సేకరణకు ఎన్నో వ్యయప్రయాసలు

 
 
 
                    భూమి మీది మబ్బులు 80 కి.మీ కన్నా ఎత్తున ఉండవు కాని కుజుడి మీద ఒత్తిడి తక్కువ కనక 100కి.మీ. ఎత్తున కూడా మేఘాలుంటాయట. ఇవి కార్బన్ డయాక్సయిడ్‌తో నిండి మసకగా కనిపిస్తాయట.
30 ఏళ్ళ క్రితం చంద్రుడిమీద కాలుమోపాక మనుషులు ఏ ఇతర గ్రహాలకూ ప్రయాణించలేదు. వెళితే గిళితే మన పొరుగు గ్రహాలైన శుక్ర, కుజులే మనకు దగ్గర. శుక్రుడి మీది పరిస్థితులు మహా భయంకరమైనవి కనక మిగిలినది సుమారు 23కోట్ల కి.మీ దూరాన ఉన్న కుజుడే. కుజుడి మీద మనుషులు వెళ్ళి పరిశోధనలు చేస్తే ఎంతో విలువైన సమాచారం లభిస్తుందనడంలో సందేహం లేదు. అయితే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనక ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. అసలు వెళ్ళిరావడానికే రెండేళ్ళు పడుతుందని అంచనా. పరిశోధనలకై వెచ్చించే సమయం దీనికితోడవుతుంది. భూమితో సంపర్కం లేకుండా నెలల తరబడి రోదసీ నావికుల బృందం కాలం గడపాలి. వారు మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదికాక రోదసీ యాత్రికుల ఆరోగ్యం పాడయే ప్రమాదం ఉందని మీర్ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువకాలం గడిపి వచ్చినవారి మీద జరిపిన పరీక్షలు తెలియజేస్తున్నాయి.
కుజుడి గురుత్వాకర్షణ భూమిలో 38% మటుకే ఉంటుంది కనక భూమి మీద 70కిలోలు తూగే వ్యక్తి బరువు కుజుడిమీద 26.6 కిలోలు మాత్రమే ఉంటుంది. ఎక్కువ కాలం భార రహిత స్థితిలో ఉండడం, బైటినుంచి హానికరమైన వికిరణాల తాకిడి మొదలైనవి ప్రమాదకరంగా అనిపిస్తాయి. ఎముకలూ, కండరాలూ బలహీనమవుతాయి.
            ప్రయాణానికి అతిశక్తివంతమైన రాకెట్లు అవసరవౌతాయి. కుజుడి మీదికి ఇంధనంతోబాటు చాలా సామగ్రి కావలసి వస్తుంది. చంద్రుడి మీదికి వెళ్ళినప్పుడు వాడేసిన పదార్థాలను జారవిడిచినట్టుగా కుజుడిపై ప్రయాణంలో వీలవదు. కావలసిన పరికరాలను అంచెలంచెలుగా అంతరిక్షంలోకి పంపి, అక్కడ వాటన్నిటినీ తగిన పద్ధతిలో కూర్చి అమర్చడం అనేది మీర్ విషయంలో జరిగినంత సులువుగా జరగదు. మనుషులను పంపేముందుగా చంద్రుడి విషయంలోలాగా కుజుడి గురించిన విస్తృతమైన సమాచారం రాబట్టాలి. కుజుడి మీదికి రోదసీ నౌకలను పంపి అక్కడి పదార్థాలను వెనక్కి తెప్పించే ఏర్పాట్లకే ఇంకా పదేళ్ళు పట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో మానవులు గ్రహాంతర యానాలు చేసి కొత్త ప్రదేశాలకు వెళ్ళేందుకు సిద్ధవౌతారు. అందుకు తొలి ప్రయత్నాలు మన జీవిత కాలంలో మొదలవబోతున్నాయి. మరొక పాతిక, ముప్పై సంవత్సరాల్లో కుజగ్రహానికి మనుషులు ప్రయాణించబోతారు.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్
rohiniprasadk@gmail.com

No comments:

Post a Comment