Wednesday, 27 June 2012

వాతావరణం మార్పులు .. సర్దుబాట్లు .. సాధ్యాసాధ్యాలు ..

భూగోళ వాతావరణం.. ఋతుపవనాల కాలచక్రం తరచుగా, మారుతున్నాయి. ఈ కొద్ది మార్పులే ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి ప్రభావం అన్ని దేశాలపై ఒకే విధంగా లేదు. ఇవి ఇలాగే కొనసాగితే ఈ ఆందోళనకు ఏమవుతుంది? ఇవీ నేడు మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయిలో ఉండటమే కారణం. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా వచ్చిన నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలో దోబూచులాడుతున్నాయి. విస్తార ప్రాంతాల్లో సాధారణ స్థాయి కన్నా తక్కువ వర్షపాతం కురిసింది. ఈ సమయం లోనే-ఆగస్టు, సెప్టెంబర్‌ ప్రాంతంలో ఎల్‌నీనో ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వస్తున్న వాతావరణ మార్పుల్ని అర్థంచేసుకుని, మన ఉత్పత్తి విధానం, జీవనశైలిలో అవసరమైన సర్దుబాట్లు చేసుకొనే వీలుందా? వీలుంటే, భౌతికంగా ఏమేర సిద్ధంగా ఉన్నాం? అనే అంశాలను..ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనల ద్వారా భూగోళ వాతావరణం వేడెక్కు తుండడాన్ని నిర్వివాదంగా గుర్తిస్తున్నాం. ఏ హద్దూ, అదుపూ లేకుండా మానవ కార్యక్రమాలు, జీవనశైలితో విడుదలవుతున్న ఉద్గారాలు (హరిత గృహ వాయువులు) దీనికి కారణాలుగా గుర్తించాం. ఋతుపవనాల కదలికలో ఏర్పడిన అనిశ్చిత స్థితికి భూగోళ వాతావరణమార్పులు ప్రధాన కారణాలని గుర్తిస్తున్నాం. దీనివల్ల వస్తున్న దుష్పరిణామాలను ఎలా ఎదుర్కోగలం? నివారించగలం? అనేది మనకో సవాల్‌. భూగోళ వాతావరణం వేడెక్కడానికి మూలకారకులైన అమెరికాలాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాల నియంత్రణకు ఒప్పుకోవడం లేదు. ఏ బాధ్యతనూ తీసుకోవడం లేదు. వీటి దుష్ప్రభావాలను మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు, అన్ని దేశాల్లోని పేదలు ఎక్కువగా భరించాల్సి వస్తోంది. ఈ ధనిక దేశాలు, ధనికులు తమ జీవనశైలిని మార్చుకోకుండా భూగోళం వేడెక్కడాన్ని నిలవరించలేం. వస్తున్న వాతావరణమార్పుల్ని, ఋతుపవనాల అనిశ్చితిని కట్టడి చేయలేం.

ఈ లక్ష్యంతో, 20 ఏళ్ల క్రితం బ్రెజిల్‌లోని రియోడిజినాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో 21 అంశాలతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవి ఏమేర అమలైనాయని అంచనా వేసి, సుస్థిరాభివృద్ధికి తోడ్పడే భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి 'రియో+20' పేరుతో అదేచోట ఈ నెలలో మరో శిఖరాగ్ర సమావేశం జరిగింది. అమెరికాలాంటి దేశాల పాక్షిక దృక్పథం వల్ల ఈ సమావేశాల్లో నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందలేదు. ఈ నేపథ్యంలోనే, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఋతుపవనాల కదలికల్లో పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులను, వాటి దుష్పరిణామా లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది నైరుతీ ఋతుపవనాలు కొద్దిగా ఆలస్యంగానైనా వచ్చాయి. కానీ, దోబూచులాడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ దుష్పరిణామాలను ఏమేర ఎదుర్కోగలం అనేది మన ముందున్న ప్రశ్న.

భూగోళ స్థాయిలో ఈ మార్పులను నిలువరించడానికి ఇప్పట్లో అవకాశాలు లేవు. కానీ, వీటిని ఎదుర్కోడానికి అవసరమైన సాంకేతికాలు మనదేశంలో ఉన్నాయి. ఇవి దాదాపు మన సాంప్రదాయ సేద్య సాంకేతికాలతో పోలి వున్నాయి. చిన్న కమతాలలో అనుసరించే 'మనుగడ సేద్య పద్ధతులు' దీనికి దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ స్థానిక వనరుల్ని వినియోగిస్తూ, రిస్క్‌ను తగ్గిస్తూ సుస్థిర ఉత్పత్తికి తోడ్పడతాయి. కానీ, నేటి ప్రపంచీకరణలో చిన్నకమతాల సేద్యానికి బదులు భారీ యాంత్రీకరణ, కృత్రిమ వ్యవసాయ రసాయనాలపై ఆధారపడే 'కార్పొరేట్‌ సేద్యం' ఉద్గారాల్ని పెంచుతోంది. భూగోళ వాతావరణాన్ని మరింతగా వేడిక్కిస్తోంది. ఇది వాతావరణ అనిశ్చితిని, రిస్క్‌ను పెంచుతుంది. వ్యవసాయోత్పత్తి విధానాన్ని పునరాలోచించాలి. 'చిన్న కమతాల ఆధారిత' సుస్థిర సాంకేతికాలతో సేద్యాన్ని కొనసాగించకపోతే వాతావరణ మార్పుల్ని తట్టుకోవడానికి ఇప్పుడున్న అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తుంది.
దుష్పరిణామాలు..
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ శాస్త్రజ్ఞుల తాజా సమాచారం (2011 రామ్‌జాగ్‌ తదితరులు) ప్రకారం మెట్ట ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పంటకాలాన్ని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే మంచి యాజమాన్యంతో కూడా జొన్న దిగుబడి 27 శాతం తగ్గుతోంది. కానీ, వర్షం 11 శాతం పైగా పెరిగినా దిగుబడి నష్టపోదు. అనంతపురంలో వేరుశనగ దిగుబడి 38 శాతం ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల తగ్గుతోంది. కానీ, అదే సమయంలో పెరిగే వర్షం పంట దిగుబడిని పెంచడానికి తోడ్పడుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత, కార్బన్‌ డై ఆక్సైడ్‌ సాంద్రత ఒకేసారి పెరగడం వల్ల, ఖరీఫ్‌లో జొన్న దిగుబడి 22-50 శాతం, సజ్జ దిగుబడి 33-51 శాతం, వేరుశనగ 23-29 శాతం, కంది 8-11 శాతం, మంచిశనగ ఏడు శాతం తగ్గుతాయని అంచనా వేయబడింది. అంటే ఇతర పంటల కన్నా కంది, మంచి శనగ అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కానీ, ఇప్పటికే చలి ఎక్కువగా వుండే మధ్యప్రదేశ్‌లో మాత్రం పెరిగిన ఉష్ణోగ్రత మంచిశనగ దిగుబడిని తొమ్మిది శాతం పెంచుతుంది. మొత్తంగా చూస్తే, యాజమాన్య స్థాయి తక్కువగా ఉన్నప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం అంతగా ఉండదు.
బావుల కింద..
బావుల కింద ఆరుతడి పైర్లను వేయాలి. మాగాణి వరిని వేయకూడదు. దీనికి బదులుగా 'శ్రీవరి'ని సాగు చేయవచ్చు. కుంటలు, చెరువుల కింద ఆరుతడి పంటలను లేదా కూరగాయలను పండించాలి. చెరువులు నిండితే తప్ప మాగాణి వరి చేయకూడదు.
మన దేశంలో..
వాతావరణమార్పులపై అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కమి షన్‌ భారతదేశంలో రాగల ఉష్ణోగ్రత, వర్ష పాత మార్పులను అంచనా వేసింది. దీని ప్రకారం:
ఉష్ణోగ్రత..
ఈ శతాబ్ధం అంతానికి సగటు ఉష్ణోగ్రత 0.87 నుండి 6.31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మధ్య పెరగవచ్చని అంచనా. 2020 దశకం ఖరీఫ్‌లో ఇది 0.87 నుండి 1.12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయికి, రబీలో 1.08 నుండి 1.54 డిగ్రీల స్థాయికి పెరగవచ్చు. 2050 దశకం ఖరీఫ్‌లో 1.81 నుండి 2.37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ. రబీలో 2.54 నుండి 3.18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ పెరగవచ్చు. 2080 దశకం ఖరీఫ్‌లో 2.91 నుండి 4.62 డిగ్రీలు; రబీలో 4.14 నుండి 6.31 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఇది పెరగవచ్చట!
వర్షపాతం..
2080 దశకం రబీలో సగటు వర్షపాతం గరిష్టంగా 24.8 శాతం తగ్గవచ్చు లేదా 15.18 శాతం వరకూ పెరగవచ్చు.
ఈ వివరాలన్నీ సగటు గణాంకాలు మాత్రమే. అసలు పంటల్ని, జీవనశైలిని ప్రభావితం చేసేది స్థానిక ఉష్ణోగ్రతలు, వర్షపాత మార్పులు. నేలల స్వభావం, సేద్య పద్ధతులు కూడా ప్రాధాన్యత వహిస్తాయి. అందువల్ల స్థానిక వనరుల వినియోగం ఆధారంగా ఉత్పత్తి చేయాలి.
సర్దుబాట్లు.. సాధ్యాసాధ్యాలు..
ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడొస్తున్న చిన్న చిన్న వాతావరణ మార్పుల్ని ఎదుర్కోగలం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేసిన పరిశోధనలు, ఉత్పత్తిలో వినియోగిస్తున్న సాంకేతికాలు దీనికి ఉపయోగపడేవే. అయితే, ఒకేసారి పెద్దమార్పులు వస్తే ఎదుర్కోడానికి ఈ సాంకేతికాలు సరిపోవు. వ్యక్తిగత స్థాయిలో పటిష్టమైన బీమా పథకం తోడ్పడుతుంది.
వ్యవసాయోత్పత్తికి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికాల ఉష్ణోగ్రత, వర్షపాతం హెచ్చుతగ్గుల్ని తట్టుకోడానికి ఉద్దేశించినవే. ఇప్పుడు మెట్ట సేద్యంలో సూచిస్తున్న సాంకేతికాల్లో ఈ రెంటి యాజమాన్యం ఇమిడి వున్నాయి. స్వల్పకాలిక రకాల అభివృద్ధి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల రకాల గుర్తింపు, తీవ్ర బెట్ట పరిస్థితుల్లో కూడా మనగలిగే రకాల అభివృద్ధి వీటికి ఉద్దేశించినవే.
మిశ్రమ వ్యవసాయం కూడా వాతావరణ మార్పుల్ని పటిష్టంగా ఎదుర్కోడానికి తోడ్పడుతుంది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి రైతులు వేసే పంటరకాల్ని మార్చుతూ ఇప్పటికే పలు చర్యల్ని తీసుకుంటున్నారు. వీటిలో మిశ్రమ పంటల సేద్యం ముఖ్యమైనది. అయితే, కార్పొరేటీకరణ, పెట్టుబడి ఉత్పత్తి విధానంలో ఏదో ఒక పంటనే వేస్తుండడంతో వాతావరణమార్పులు రిస్క్‌ను పెంచుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాల గుర్తింపు, ఎంపిక వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి ఎంతో తోడ్పడతాయి. ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే అనుసరిస్తున్న 'సమగ్ర పరీవాహక ఆధారిత ఉత్పత్తి' ఋతుపవనాల అనిశ్చితిని ఎదుర్కోడానికి తోడ్పడతాయి.
సేంద్రీయ ఎరువుల వాడకం నేలల నీటి నిల్వ శక్తిని పెంచి, బెట్టను తట్టుకోడానికి తోడ్పడుతుంది. 'సంరక్షణ (కన్జర్వేషన్‌) సేద్యం'లో కనీసస్థాయిలో లేదా అసలు దున్నకుండా పైరుని వేయాలి. నేలను పంటల శేషపదార్థాలతో కప్పి వుంచుతూ, నేలలో తేమను పరిరక్షించడంలో ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి మరో అనువైన ప్రక్రియ. ఉన్న నీటివనరులను సమర్థవంతంగా, వున్న పంటల్ని సంరక్షించేలా సాగునీటిని వాడాలి. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే బిందు, తుంపర్ల సేద్యాన్ని చేపట్టాలి. మాగాణికి బదులు 'శ్రీవరి పద్ధతి'లో వరిని సాగుచేయాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment