Thursday, 27 September 2012

వ్యవసాయం... జీవవైవిధ్యం..!


మన ప్రాథమికావసరాలైన ఆహారం, దుస్తుల్ని, వ్యవసాయ పరిశ్రమల ముడిపదార్థాల్ని అందిస్తూ మూడింట రెండొంతుల మందికి జీవనాధారంగా వ్యవసాయం కొనసాగుతోంది. వ్యవసాయమంటే కేవలం పంటల్ని పండించడమే కాదు. పశుపోషణ, చేపలపెంపకం, ఇతర జీవాల పెంపకం కూడా దీనిలో ఇమిడి వున్నాయి. ఇట్టి వ్యవ సాయం జీవవైవిధ్యంతో ముడిపడి వున్నది. వ్యవసాయ వైవిధ్యం మొత్తం జీవవైవిధ్యంలో ఒక భాగం. సేద్యం చేసే పంటలు, వాటి మూల (వైల్డ్‌) రకాలు, నీటిలో పెరిగే వృక్ష, జంతుజాలాలన్నీ వ్యవసాయ జీవ వైవిధ్యం పరిధిలోకి వస్తున్నాయి. ఇటీవల వ్యవసాయోత్పత్తిలో వస్తున్న ఆటుపోట్లు, ముఖ్యంగా, మారు తున్న వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న ఉత్పత్తి ఒడుదుడుకులు తరిగిపోతున్న జీవవైవిధ్య ఫలితమే. ఇలా తరిగిపోతున్న వైవిధ్యం సుస్థిర వ్యవసాయోత్పత్తిని, ఆహార భద్రతను దెబ్బతీస్తుంది. సేద్యంలో రిస్క్‌ను పెంచుతుంది. ప్రపంచ జీవవైవిధ్య సదస్సు హైదరాబాద్‌లో అక్టోబర్‌ 1 నుండి 19 తేదీల మధ్య జరుగు తుంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవ సాయోత్పత్తికి వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతను ప్రొ|| అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
వ్యవసాయానికి మూలాధారం దాదాపు 27 వేల ఉన్నత వృక్షజాతుల్లో వున్న వైవిధ్యమే. వీటిలో 7 వేల జాతులు సేద్యంలో ఉండేవి. ఇప్పుడు కేవలం 30రకాల పంటలు సేద్యమవుతున్నాయి. వీటిలో కూడా కేవలం గోధుమలు, వరి, మొక్కజొన్న - ఈ మూడు పంటలు సగంపైగా ప్రపంచ ఆహార అవసరాల్ని తీరుస్తున్నాయని 'ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ)' అంచనా వేసింది. తరిగిపోతున్న ఈ జాతులు వ్యవసాయంలో క్షీణిస్తున్న వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. పర్యావరణ వ్యవస్థలో ఇలా తరిగిపోతున్న జాతు లకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు. ఈ నేపథ్యంలో, వ్యవసాయ వైవిధ్య పరిరక్షణ కీలకంగా మారుతుంది. మారుతున్న భూ వాతా వరణం నేపథ్యంలో వైవిధ్యం వున్నచోటే (ఇన్‌సిటు) పరిరక్షించడం కీలకం. ఇది వాతావరణమార్పుల్ని తట్టుకోడానికి తోడ్పడుతుంది. ప్రత్యామ్నాయంగా వైవిధ్య గుణగణాలు గల రకాల్ని సేకరించి, క్షేత్రాలలో వేరేచోట బహిరంగంగా పరిరక్షించవచ్చు. పూర్తిగా నియంత్రించగల వాతావరణంలో జన్యు పరిరక్షణ జరుగుతున్న ప్పటికీ వాతావరణ ఒడుదుడుకుల్ని తట్టుకోగల రకాల్ని గుర్తించడానికి 'బహిరంగ' పునరుత్పత్తి తోడ్పడుతుంది.
నేలల వైవిధ్యం..
వ్యవసాయంలో ప్రాథమిక అవసరం భూమి (నేల). భూగో ళంలో అన్ని జీవులకు ఇది అతిపెద్ద వైవిధ్యం గల నివాస స్థలం. దీనిలో ఎన్నో బ్యాక్టీరియాలు, బూజులు (ఫంజీ), ఇతర కీటకాలు, సూక్ష్మజీవులు, వానపాములు, చీమలు, సాలీడుల్లాంటి జీవాలూ వున్నాయి. వీటి పరిరక్షణ సుస్థిర ఉత్పత్తికి అవసరం.
వ్యవసాయ వైవిధ్య వ్యవస్థను నేలలో వుండే సూక్ష్మజీవులు, పరపరాగ సంపర్కంలో తోడ్పడే కీటకాలు, వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, పంటలు, అడవులు, గడ్డి, జలచరాలు ఇవన్నీ కలిసి ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ వ్యవసాయ వైవిధ్యంలో ముఖ్య భాగాలే. స్థానిక జలవనరులు, ముఖ్యంగా నీటికుంటలు, చెరువులు, నదులు, సముద్ర తీరప్రాంతాలు కూడా ఈ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వృత్తిదారులు, మత్స్యకారులు, చిన్నకమతాల రైతులు వైవిధ్య పరిరక్షణకు, వీటి సుస్థిర వినియోగంలో ఎంతో పాత్రను కలిగి వున్నారు. ఉత్పత్తవుతున్న చేపలు, రొయ్యలు, పీతలు తదితర జలచరాలు మన ఆహారంలో ముఖ్యభాగంగా కొనసాగుతున్నాయి. వీటి వినియోగంలో మత్స్యకారుల, ఇతర వృత్తిదారుల, చిన్నకమతాల రైతుల ఆదాయం, జీవనం వీటిమీదే ఆధారపడి వున్నాయి. దీనితో వీరందరూ మన వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ ఆహార సరఫరాలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నారు.
సేద్య వాతావరణం, సేద్య పద్ధతులు, సేద్యంలో వినియోగించే ఇతర ఉపకరణాలు భూమి లోపల వుండే జీవుల వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘకాలం రసాయన ఎరువులతో సేద్యం చేసినప్పుడు భూమిలో వీటి వైవిధ్యం క్షీణిస్తుంది. కానీ, సేంద్రియ ఎరువులతో, సేంద్రియ పద్ధతులతో సేద్యం చేసినప్పుడు భూమిలోని జీవ వైవిధ్యం పరిరక్షింపబడుతుంది. పెరుగుతుంది కూడా.
సేద్యమవుతున్న రకాలు..
సేద్యమవుతున్న రకాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: ఆధునిక, సాంప్రదాయ రకాలు. వ్యవస్థీ కరించిన ప్రజననం ద్వారా రూపొందించినవి ఆధునిక రకాలు. ఈ రకాలు అధిక దిగుబడినివ్వగలవిగా గుర్తింపు పొందాయి. కానీ, సాంప్రదాయ రకాలను రైతులే స్వయంగా తరతరాలుగా ఎంపిక చేస్తూ, రూపొందించారు. రైతుల రకాలుగా లేదా స్థానిక రకాలుగా కూడా ఇవి పేరొందాయి. సాంప్రదాయ లేదా రైతు రకాలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, వాతావరణ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగలవిగా గుర్తింపు పొందాయి. జన్యు వైవిధ్య పరిరక్షణలో సాంప్రదాయ రకాలు ప్రతీకలుగా కొనసాగుతున్నాయి. అందువల్ల, జన్యు వైవిధ్య పరిరక్షణకు ఈ రకాలపైనే కేంద్రీకరిస్తున్నారు.

'హైబ్రిడ్‌ వరి' ఎవరికోసం..?
మనదేశ వరిలో ఎంతో వైవిధ్యం వుంది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని ముఖ్యంగా బెట్టను, వరదల్ని, చీడపీడల్ని తట్టుకొనే రకాలున్నాయి. ఒరిస్సాలోని కటక్‌ దగ్గరగల 'జాతీయ వరి పరిశోధనా సంస్థ'లో దాదాపు 42వేల రకాలు సేకరించి, పరిరక్షించబడుతున్నాయి. సేద్యమవుతున్న అధికదిగుబడి వంగడాలు వరి వైవిధ్యాన్ని నష్టపరిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎంతో వైవిధ్యం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఫలితంగా రైతులు కంపెనీల మీద ఆధారపడకుండా తమ విత్తనాల్ని తామే సేకరించుకుని, వినియోగించుకోగలుగుతున్నారు. ప్రజలు కూడా తమకు నచ్చిన రకాలను తినగలుగుతున్నారు. ఇటువంటి రకాలకు బదులు హైబ్రిడ్‌ వరిని ప్రోత్సహించ డానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రయివేటు కంపెనీలు ప్రపంచ మార్కెట్‌శక్తుల ప్రమేయంతో తీవ్ర కృషి చేస్తున్నాయి. మొదటి హైబ్రిడ్‌ వరి రకం ఆంధ్రప్రదేశ్‌లోనే రూపొందించినప్పటికీ, వీటిని రైతులు, వినియోగదారులు ఆదరించ లేదు. దేశంలో వినియోగమయ్యే మొత్తం హైబ్రిడ్‌ వరి విత్తనాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉత్పత్తవుతున్నప్పటికీ, ఈ రాష్ట్రంలో 'హైబ్రిడ్‌ వరి' సేద్యం కొన్ని వేల ఎకరాలకే పరిమితమైంది. అయినా, రాష్ట్రంలో హైబ్రిడ్‌ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఇలా వచ్చే హైబ్రిడ్‌ రకాలు ఇప్పటికే సేద్యంలో వున్న అధికదిగుబడి వంగడాలకన్నా ఏ కోణంలోనూ మేలైనవి కాదు. దిగుబడిలో కూడా పోటీకి రాలేకపోతున్నాయి. హైబ్రిడ్‌ రకం వరి జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుందని తెలిసినా, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్న ప్రభుత్వం హైబ్రిడ్‌ వరి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఎందుకిస్తున్నట్లు? కేవలం హైబ్రిడ్‌ విత్తనం ద్వారా వరి సేద్యాన్ని కంపెనీలకి అప్పగించేందుకే. తద్వారా దేశ ఆహారోత్పత్తిపై బహుళజాతి కంపెనీల నియంత్రణకు అవకాశం కల్పించేందుకే..!
గిరిజనుల సేద్యం..
గిరిజనులు ప్రధానంగా వుండే అటవీ ప్రాంతాలలో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో పంటల్ని పండిస్తున్నారు. వీరి సేద్యంలో ఎంతో వైవిధ్యం వుంది. పంటలతో బాటు పశువుల్ని, కోళ్లను, ఇతర జీవాలను పెంచుతున్నారు. రసాయన ఎరువుల్ని దాదాపు వాడరు. సేంద్రీయపు పద్ధతుల్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా వీరి సేద్యంలో వైవిధ్యం నేటికీ కొనసాగుతుంది. వీరి ఆచారాలు, కట్టుబాట్లు, సాంస్కృ తిక అలవాట్లు ఇక్కడి జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ప్రాంతాల్ని గుర్తించి, అక్కడున్న సాంప్రదాయ పంటల్ని, విజ్ఞానాన్ని పరిరక్షించాలి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగాలి. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ దగ్గర 'దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ' ఆధ్వర్యంలో వ్యవసాయ వైవిధ్య కేంద్రం గుర్తింపుకు కృషి కొనసాగుతుంది.

కొత్తజాతుల ప్రవేశం..
కొత్తజాతులు బయటి నుండి ప్రవేశించినప్పుడు పోటీని తట్టుకోలేని స్థానిక జాతులు నష్టపోతాయి. ఉద్దేశ్యపూర్వకంగా కొత్త రకాల్ని లేదా జాతుల్ని ప్రవేశపెడతారు. ఇప్పటికే పండిస్తున్న ఎన్నో పంటలు ఇలా ప్రవేశపెట్టబడినవే. వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ఈ కోవ కిందకే వస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వు, సోయాచిక్కుడు ఇటీవల కాలంలో వంటనూనెకు ప్రవేశపెట్టబడ్డాయి. వీటివల్ల స్థానిక వైవిధ్యం కోల్పోవాల్సి వస్తుంది. వేగంగా విస్తరించిన సోయాచిక్కుడు మధ్యప్రదేశ్‌లో దాదాపు సగంపైగా సేద్య విస్తీర్ణాన్ని ఆక్రమించింది. అంతకుముందు సేద్యంలో వున్న పంటలన్నీ అంతరించిపోయాయి. మరికొన్ని సందర్భాలలో అనుకోకుండా ఇవి రావచ్చు. ఇవి దిగుమతులతో కలిసిరావచ్చు. వేగంగా విస్తరిస్తున్న 'పార్థీనియం' కలుపు విత్తనాలు దిగుమతైన గోధుమల ద్వారా వచ్చిందే. దీనిని 'వయ్యారిభామ' లేక 'కాంగ్రెస్‌ కలుపు'గా కూడా పిలుస్తున్నారు. ఒకో చెట్టులో మిలియన్ల గింజలుంటాయి. ఒకసారి ఈ చెట్టు వచ్చిన తర్వాత దానంతటదే వ్యాప్తి చెందుతూ స్థానిక రకాల్ని పెరగనివ్వదు. అణచి వేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. వీటి నియంత్రణ ఇపుడు మన వ్యవసాయంలో పెద్ద సమస్యగా కొనసాగుతుంది. 'లాంటెనా' అనే మరో కలుపు జాతి మొక్క కూడా ఇలానే వచ్చింది. కానీ, పార్థీనియం అంత ఉధృతంగా విస్తరించడం లేదు.

వృక్షజాతుల్లో...
మనదేశం అతి విశాలమైనది. వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో వైవిధ్యం వుంది. దీనితో సేద్య విలువ కలిగిన వృక్షజాతుల్లో ఎంతో వైవిధ్యం ఏర్పడింది. జాతీయ వృక్షజాతు ల జన్యు వనరుల సంస్థ (నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జనటిక్‌ రీసోర్సెస్‌) సమాచారం ప్రకారం ఆహారధాన్యాల్లో 1,12,278 రకాలు మనదేశంలో వున్నాయి. వీటిలో చిరు ధాన్యాలు, గడ్డి జాతుల్లో 30,488 రకాలున్నాయి. గింజలను ఇవ్వగల లెగ్యూమ్‌ (పప్పు) జాతి 40,604 రకాలున్నాయి. నూనెగింజల్లో 30,170 రకాలు, నూలు ఇవ్వగల రకాలు 8,387, కూరగాయలు 15,671 రకాలున్నాయి. పండ్లు 172 రకాలుంటే, ఔషధ, సుగంధ మొక్కలు 15,051 రకాలు మన దేశంలో సేద్యానికి పనికొస్తున్నాయి.
జంతువుల్లో..
సాధుజంతు జాతుల వైవిధ్యంలో మనదేశం ప్రపంచంలో 7వ స్థానంలో వుంది. మన దేశంలో 255 జంతుజాతులు పెంపకంలో వున్నాయి. వీటిలో 64 రకాల పశువులు. 23 రకాల బర్రెలు, 63 రకాల గొర్రెలు, 34 రకాల మేకలు, ఇతర జంతువులు 72 రకాలున్నాయి. ప్రపంచబర్రెల్లో 26.5 శాతం రకాలు మనదేశంలోనే వున్నాయి. మేకల్లో 8.6 శాతం, పశువుల్లో 7.75 శాతం వైవిధ్యం మనదేశంలోనే వుంది.


క్షీణిస్తున్న వ్యవసాయ, పశువుల వైవిధ్యం..
సేద్యం చేస్తున్న రకాల్ని మార్చడం. దున్నడం. అతిగా పంటల్ని పండించడం, పెరుగుతున్న జనాభా వత్తిడి, పర్యావరణ క్షీణత, పచ్చిక బయళ్లలో అతిగా మేపడం, ప్రభుత్వ విధానాల మార్పులు, వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న వ్యవస్థాగత మార్పులు (చిన్న కమతాల సేద్యానికి బదులు కార్పొరేట్‌ సేద్యం) తదితరాలు కొనసాగుతున్న జీవ వైవిధ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అయితే, స్థానిక రకాలను అధిక దిగుబడినిచ్చే రకాలతో మార్చడం వల్ల లేదా బయటి నుంచి కొత్తరకాల్ని తెచ్చి, పెంచడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా, సాంప్రదాయ సేద్యంలో జన్యుమార్పిడి పంటల్ని ఇటీవల ప్రవేశపెట్టడం వల్ల వ్యవసాయ వైవిధ్యం బాగా క్షీణించింది. ఆధునిక సేద్యం పెరుగుతున్న కొద్దీ ఎంపిక చేసిన పంటల జన్యువులు, పర్యావరణ పరిస్థితుల్లో జీవ వైవిధ్యం హరించిపోతుంది. మిశ్రమ సేద్య పద్ధతులకు బదులు ఏకపంట సేద్యపద్ధతుల్ని పవేశపెట్టడంతో జీవ వైవిధ్యం బాగా తగ్గుతుంది. సుస్థిర ఉత్పత్తి దెబ్బతింటుంది. రిస్క్‌ పెరుగుతుంది. రైతు కమతాల సేద్యానికి బదులు పెద్దకమతాల్లో భారీ యంత్రాలతో చేపట్టే వ్యవసాయరంగ కార్పొరేటీకరణ జీవవైవిధ్యాన్ని బాగా కుదిస్తుంది. ఇదేవిధంగా, విస్తరిస్తున్న ఆహార పరిశ్రమ, యాంత్రికీ కరణ, ఒకే విధమైన సేద్య పద్ధతుల్ని అనుసరింపజేస్తూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం రసాయనాల అధిక వినియోగంపై ఆధారపడుతూ జీవ వైవిధ్యాన్ని హరింపజేస్తాయి.

పారిశ్రామిక, సేంద్రియ సేద్యపద్ధతులు..
ఆధునిక, పారిశ్రామిక సేద్యపద్ధతులు వ్యవసాయంలో వైవిధ్యాన్ని హరించి వేస్తుండగా సేంద్రియ పద్ధతులు జాతుల వైవిధ్యాన్ని పెంచుతున్నాయి. సేంద్రియ సేద్యంలో కనీసం 30 శాతం అధికంగా వైవిధ్యం వున్నట్లు అంచనా వేయబడుతుంది. ముఖ్యంగా రసాయనిక ఎరువులను, సస్యరక్షణ మందులను అతిగా పెంచే సేద్యంలో మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. అదే రసాయనాల్ని నియంత్రిస్తూ, సహజ పద్ధతుల్లో సేద్యం చేసినప్పుడు మిత్ర పురుగులు, పరపరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు ఉధృతంగా జీవిస్తూ దిగుబడులను పెంచగలుగుతున్నాయి. మొత్తం మీద, సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తోడ్పడుతోంది. ఇది జన్యు, జాతుల స్థాయిల్లో, పర్యావరణ వ్యవస్థ స్థాయిలో కొనసాగుతుంది.
(జన్యుమార్పిడి పంటల ప్రభావం వచ్చే సంచికలో తెలుసుకుందాం..!)

గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment