Wednesday, 14 March 2012


నేటి రేబిస్‌...

మనుషులు, పశువులపై రేబిస్‌ దుష్ప్రభావాల గురించి చైతన్యం కలిగించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28వ తేదీన 'ప్రపంచ రేబిస్‌ దినం (వరల్డ్‌ రేబిస్‌ డే)' గా జరపాలని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' తదితర అంతర్జాతీయ సంస్థలు నిర్ణయించాయి. ఈ రోగాన్ని నియంత్రించగల వ్యాక్సిన్‌ను మొట్టమొదటిసారిగా రూపొందించిన 'లూయీ పాశ్చర్‌' మరణించిన రోజును 'ప్రపంచ రేబిస్‌ దినం'గా పాటిస్తున్నారు. రేబిస్‌ వల్ల నేడు ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 55 వేల మంది చనిపోతున్నారని ఒక అంచనా. ఇలా చనిపోతున్నవారిలో 30%-36% భారతీయులే. దీనికి ప్రధానకారణం మనదేశంలో వీధికుక్కల సంఖ్య అధికంగా ఉండటమే. చనిపోతున్న వారిలో పేదలే అత్యధికం. ఇదెంతో ఆందోళన కలిగించే అంశం. అందువల్ల, రేబిస్‌ నివారణకు మనదేశంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుచేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్‌ అందుబాటులో లేక ఈ ఏడాది మన రాష్ట్రంలో వరుసగా రేబిస్‌తో కొనసాగుతున్న బాలల మరణాలు దీని ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేబిస్‌కు సంబంధించిన విజ్ఞానాన్ని, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సంక్షిప్తంగా తెలుపుతూ.. మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
రేబిస్‌ అనేది ఒకరకం వైరస్‌ వల్ల వచ్చే రోగం. 'రాబ్డో విరిడే' కుటుంబానికి చెందిన 'లిస్సా వైరస్‌' వల్ల ఈ రోగం సాధారణంగా వస్తుంది. లాటిన్‌ భాషలో 'రేబిస్‌' అంటే 'మాడ్నెస్‌ (పిచ్చి)'. సంస్కృతంలో 'రాబాస్‌' అంటే హింసను ప్రేరేపించడం. గ్రీకులో దీనిని 'లిస్సా' అంటారు. ఇది 'లుడ్‌' అనే పదం నుండి వచ్చింది. అంటే 'హింస'. ఇది తీవ్ర మెదడువాపు జబ్బు. రక్తం వేడిగా ఉండే జీవుల్లో (మనుషులతో సహా) ఈ వైరస్‌ వల్ల మెదడు వాసి, జ్వరం వస్తుంది. ఈ వ్యాధి జంతువుల వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో కుక్కకాటు వల్ల ఇది వ్యాపిస్తుంది. మనుషుల ద్వారా ఇది వ్యాపించదు.
ఈ జబ్బు లక్షణాలు ఒక్కసారి కనిపించిన తర్వాత చావు అనివార్యమవుతుంది. చికిత్స లేదు. అందువల్ల దీని లక్షణాలు కనపడకముందే నివారణ చర్యలు (వ్యాక్సిన్‌ ఇవ్వడం) ప్రారంభించాలి. వైవిధ్యభరితమైన పరిసరాల్లో రేబిస్‌ వైరస్‌ జీవించగలుగుతుంది. అన్ని జంతువుల్లో ఈ వైరస్‌ ఉండవచ్చు.

ఈ వైరస్‌ మెదడు కణాల్లో ప్రవేశించిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి ఇది మెదడుకు చేరిన తర్వాత ఈ రోగ లక్షణాలు బయటపడతాయి. అంతిమంగా ఇవి చావుకు దారితీస్తాయి.
కుక్కకాటు వల్ల లేదా దాని నోటి నుండి ఊరే లాలాజలం ద్వారా రోగకారక వైరస్‌లు పైపైన ఉండే నరాల్లోని కణాల ద్వారా మెదడుకు చేరతాయి. ఇలా చేరడానికి రెండు వారాల నుండి రెండేళ్ల వరకూ పట్టవచ్చు. అందువల్ల కుక్క కరిచిన తర్వాత రేబిస్‌ ఈ కాలంలో ఎప్పుడైనా రావచ్చు. ఒక్కసారి ఈ వైరస్‌లు మెదడును చేరి, రోగ లక్షణాలు చూపడం ప్రారంభ మైన తర్వాత రోగం నయం కాదు. చికిత్స లేదు.. కొద్దిరోజుల్లో చనిపోతారు.
రోగ లక్షణాలు...
ప్రారంభదశలో ఈ వ్యాధి సోకినవారు ఇతరులను ద్వేషిస్తారు లేదా హాని కలగాలని కోరుతుంటారు. దీంతోపాటు వీరికి తలనొప్పి, జ్వరం (ఫ్లూలా) వస్తుంది. ఆ తర్వాత తీవ్ర నొప్పి, ఆవేశంతో కూడిన కదలికలు, నియంత్రించలేని ఉద్రేకం, మానసికంగా కుంచించుకుపోయే స్థితి ఉంటుంది. అలాగే నీటిని చూసి భయపడటం (హైడ్రో ఫోబిక్‌), నీటిని మింగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతిమంగా, రోగ బాధితులు ఏదో పూనినట్లు, చురుకుదనం కోల్పోతూ, స్పృహ కోల్పోతారు. చివరకు వీరు శ్వాస అందక చనిపోతారు.
వ్యాధి విస్తృతి...
ప్రపంచంలో 97% మందికి రేబిస్‌ వ్యాధి కుక్కకాటు ద్వారా సోకుతుంది. అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ వ్యాధి టీకాల ద్వారా పూర్తిగా నియంత్రించబడింది. ఆస్ట్రేలియా, జపాన్‌, బ్రిటన్‌లాంటి దేశాల్లో భూమి మీద నివసించే జంతువుల ద్వారా జరిగే రోగ వ్యాప్తి పూర్తిగా నియంత్రించబడింది. కానీ, ఈ దేశాల్లో గాలి, గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి కొనసాగుతుంది. కొన్ని దేశాల్లో ఈ వ్యాధితో ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఆర్థికనష్టాల్నీ కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జరిగే మరణాల్లో 95% కుక్కకాటు వల్లే సంభవిస్తున్నాయి. ఇలా కుక్కలు కరిచేవారిలో 30%-65% మంది 15 ఏళ్లలోపు బాలలే. బాలల తర్వాత పశువుల వద్ద పనిచేసే సిబ్బంది, పశు కాపరులు, అడవి జంతువులను నియంత్రించేవారు ఈ రోగ బారిన పడుతున్నారు.
బాల బాధితులే ఎక్కువెందుకు?
* చిన్నగా ఉండటం, కుక్కకు తేలికగా కనపడటం.
* సహజంగా జంతువుల పట్ల వీరికుండే ఆకర్షణ. ఆడుకోవాలనుకునే కోరిక.
* జంతువుల వల్ల చిన్న చిన్న గాట్లు వచ్చినా, చిన్నగా గీరుకున్నా పట్టించుకోకపోవడం. తల్లిదండ్రులకు చెప్పకపోవడం. 
____________________________________________

వ్యాధి సోకిన కుక్కల్ని గుర్తించడం ఎలా?

* ఈ వ్యాధి సోకినప్పుడు మామూలు కన్నా ఉధృతంగా తిరగబడే స్వభావం, కొట్లాడే స్వభావం కలిగి ఉంటాయి.
* వాటి జోలికి పోకున్నా మీదపడే స్వభావం కలిగి ఉంటాయి.
* అసాధారణ ప్రవర్తనను కలిగి ఉంటాయి.
తక్షణం తీసుకోవాల్సిన చర్యలు..
కొద్దిగా గీరుకున్నా లేదా గాయమైనా వెంటనే చికిత్స ప్రారంభించాలి. మొదట సబ్బు నీటితో శుభ్రంగా గీరుకున్న / గాయమైన ప్రాంతాన్ని కడగాలి. ఆ తర్వాత యాంటిసెప్టిక్‌ క్రీమ్‌ను రాయాలి. రేబిస్‌ నిరోధక వ్యాక్సిన్‌ను ఇంజక్షన్‌ ద్వారా ఐదురోజుల కోర్సుగా ఇవ్వాలి. మొదటిరోజు, 3, 7, 14, 28వ రోజున ఇంజెక్షన్‌ ఇవ్వాలి. ఇంజక్షన్‌ ప్రారంభించిన రోజును మొదటిరోజుగా లెక్కించాలిగానీ, గాయమైన రోజును మొదటి రోజుగా గుర్తించకూడదు.
గతంలో మాదిరి ఇపుడు బొడ్డు చుట్టూ బాధాకరంగా 11 ఇంజెక్షన్లు తీసుకోనవసరం లేదు. కేవలం ఐదు ఇంజెక్షన్లు తీసుకుంటే చాలు. అదీ మామూలు ఇంజెక్షన్‌ మాదిరి చేతి కండారాలకు తీసుకోవచ్చు.
వ్యాక్సిన్‌ ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యమైనా రోగ లక్షణాలు కనపడకముందే ఇవ్వాలి.
మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బులకు మందులు తీసుకుంటున్నవారు వాటిని ఆపకుండానే ఈ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.
కరిచిన కుక్కను గుర్తించినా / గుర్తించకపోయినా ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందే.
ఎర ఆహారం ద్వారా అడవి జంతువుల్లో వ్యాక్సిన్‌తో రోగ నియంత్రణ చౌక. 
________________________________________

వ్యాక్సిన్‌ దొరికేదెక్కడ..?

* హైదరాబాద్‌లో నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో 24 గంటలూ అవసరమైన వారికి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారు.
* అన్ని ప్రధాన టీచింగ్‌ హాస్పటల్స్‌లో దొరుకుతుంది.
* అన్ని టీచింగ్‌, జిల్లా, రెవెన్యూ స్థాయి ఆసుపత్రులలోనూ లభిస్తుంది.

* కొన్ని ప్రయివేటు మందులషాపుల్లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే, కొనేటప్పుడు గడువుతేదీ సరిచూసుకొని, నిల్వ స్థితిని తెలుసుకోవాలి.
* మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువగా రేబిస్‌కు బలవుతున్నారు. దీని నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్‌ ప్రాథమిక చికిత్సా కేంద్రాల స్థాయిలో లభ్యం కావాలి. కానీ ఇది దొరకక ఎంతోమంది పేదలు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, వెంటనే ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలో ప్రాథమిక చికిత్సా కేంద్రాల స్థాయి వరకూ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జాగ్రత్తలు..
*తెలియని జంతువుల దగ్గరకు వెళ్లకూడదు.
* రేబిస్‌ రాగల ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
* ఇంట్లో పెంపుడు జంతువులకు నాలుగు నెలల వయస్సులోనే వ్యాక్సిన్‌ను ఇప్పించాలి. తర్వాత ఒక సంవత్సరానికి బూస్టర్‌డోస్‌ ఇప్పించాలి. ఆ తర్వాత 1-3 సంవత్సరాల్లోపు మరో బూస్టర్‌ డోస్‌ను ఇప్పించాలి.
* ఇంట్లో పెంచుకునే కుక్కలకు పునరుత్పత్తి కాకుండా చికిత్స చేయించాలి.
* వీధి కుక్కల్ని, జంతువుల్ని కట్టడి చేయాలి. అలాగే వీటికి కూడా పునరుత్పత్తి లేకుండా చేయాలి.
* ఉదయం వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు చేతిలో ఒక చిన్నకర్ర ఉంటే మంచిది. 
__________________________________________

లూయీపాశ్చర్‌...

వ్యాక్సిన్‌ మందు ఆవిష్కకర్త లూయీపాశ్చర్‌. ఈయన డిసెంబర్‌ 27, 1822న జన్మించి, 28 సెప్టెంబర్‌, 1895న మరణించాడు. ఈయన ఫ్రెంచి దేశస్థుడు. వ్యాధులకు మూల కారణం సూక్ష్మజీవులని సిద్ధాంతీకరించి, రోగనిర్ధారణకు, నివారణకు బాటలు వేశాడు. మొదటిసారిగా రేబిస్‌ వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్‌ను తయారుచేశాడు. దీనితోపాటు పశువుల్లో ఆంథ్రాక్స్‌, మనుషుల్లో పొంగు వంటి వాటికి కూడా వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. పాల నిల్వను పెంచడానికి పాశ్చరైజేషన్‌ పద్ధతిని కూడా కనిపెట్టాడు. కోళ్ళకు వచ్చే కలరా వ్యాప్తిని నిరోధించే మందును కూడా కనుగొన్నాడు. ఈ రోజున మానవాళి ఈయన ఆవిష్కరణ ఫలితాలను ఎన్నో రూపాల్లో అనుభవిస్తోంది. ఆయన జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
మీకు తెలుసా?
* రేబిస్‌ను నియంత్రించలేమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
* జంతుకాటు ద్వారా మాత్రమే ఈ వ్యాధి వ్యాపిస్తుందని మరో అపోహ ఉంది. వాస్తవమేమంటే జంతువులు నాకినా లేదా ఆడుకునే సమయంలో చిన్నగా గీరుకున్నా, మానవ శరీరం మీద అంతకుముందే ఏర్పడిన గాట్లు లేదా గాయాలపై వ్యాధి సోకిన కుక్క లేదా పిల్లి లాలాజలం పడినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
* దాదాపు 72 శాతం మందికి జంతువుల ద్వారా రేబిస్‌ వ్యాపిస్తుందని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికి కూడా తెలియదని ఒక సర్వే సూచించింది.
* రేబిస్‌ సోకి చనిపోయిన పశువుల మాంసాన్ని కుక్కలు తిన్నప్పుడు వాటికి రేబిస్‌ సోకుతుంది.
* ఫ్రిజ్‌లో గడ్డకట్టుకుపోయి, కరిగిన వ్యాక్సిన్‌ మందు పనిచేయదు. వాడకూడదు.
* ఇంట్లో తిరిగే లేదా పెంచే కుక్కలు, పిల్లులకు రేబిస్‌ నివారణ వ్యాక్సిన్‌ను ఇప్పించాలి. అప్పుడు అవి కరిచినా రేబిస్‌ రాదు.
* పశువులకు, మనుషులకు ఇచ్చే రేబిస్‌ నివారణ వ్యాక్సిన్లు వేర్వేరుగా ఉంటాయి.
* రీకాంబినెంట్‌ వ్యాక్సిన్లను వాడి బెల్జియం, ఫ్రాన్సు, జర్మనీ, అమెరికాల్లోని అడవి జంతువుల్లో రేబిస్‌ను విజయవంతంగా నివారించారు.
* కోడిగుడ్డులోని పిల్ల జీవకణాల నుండి చేసే రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. దీన్ని రీకాంబినెంట్‌ (వి-ఆర్‌జి) రేబిస్‌ వ్యాక్సిన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను నోటి ద్వారా కూడా ఇవ్వవచ్చు.
* ఎర (బెయిట్‌) ఆహారం రూపంలో అడవి జంతువులకు (వి-ఆర్‌జి వ్యాక్సిన్‌) ఇస్తున్నారు.

No comments:

Post a Comment