Thursday, 1 March 2012

ప్రజా విజ్ఞానం.. విస్తరణ .. కార్యాచరణ..


మారిన, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రచారం.. ఆచరణీయ కార్యక్రమాలతో 'ప్రజా విజ్ఞాన' ఉద్యమాన్ని వేగంగా విస్తరింపజేయాలని '12వ జనవిజ్ఞాన వేదిక (జెవివి) మహాసభ' నిర్ణయించింది. ఒకవైపు విజ్ఞానాభివృద్ధి ఫలాలను ద్రవ్యపెట్టుబడి, దాని ఏజెంట్లు, కార్పొరేట్‌ సంస్థలు దేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయాంశాలపై పట్టును మరింత బిగించి, నిరంతర అధిక లాభార్జనకు మూడోతరం సంస్కరణల పేరుతో ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజాబాహుళ్యాన్ని చైతన్యపరుస్తూ, ఈ ఫలాలు వారికందేలా పటిష్టవంతమైన కార్యక్రమాల్ని చేపట్టాలని మహాసభ నిర్ణయించింది. దీనికోసం రూపొందించిన కార్యక్రమాన్ని తెలుపుతూ మూడో భాగంతో మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
ప్రపంచీకరణ విధానాల వల్ల వస్తున్న పరిణామాలపై విభిన్న వర్గాలు, విభిన్నంగా స్పందిస్తున్నాయి. వ్యక్తులుగా, సంస్థలుగా పర్యావరణం, విద్య, వైద్యం, ఇతర అంశాలపై వివిధ పేర్లతో స్పందిస్తూ ప్రజల్ని కూడగడ్తున్నాయి. ఈ భిన్న సంస్థలు కూడా ప్రజా విజ్ఞాన ఉద్యమంలాగానే ఆలోచిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అంగీకరి స్తున్నాయి. మరికొన్నింటిల్లో విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలిసొచ్చే వారితో కలిసొచ్చినమేర 'ఐక్య ప్రజా విజ్ఞాన ఉద్యమా' న్ని కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది. ఈ విభిన్న ఉద్యమాలకు 'విషయమే' ప్రధానం. అంటే, ఏ విషయం మీద వీరు ఉద్యమిస్తున్నారన్నదే ముఖ్యం. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలు మనకూ ముఖ్యమే. కానీ వీటికి ఒక సంస్థ గానీ, ఒక నాయకత్వంగానీ కనపడదు. కానీ ఉద్యమ పిలుపులు మాత్రం వినిపిస్తుంటాయి. ఇవి వినూత్నంగా, భిన్నంగా కూడా ఉంటున్నాయి. ఈ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని, జనవిజ్ఞాన వేదిక నిర్మాణ ప్రత్యేకతను పరి రక్షించుకుంటూ జనబాహుళ్యాన్ని ఆందోళనపరుస్తున్న అంశాలపై వేదికలను నిర్మించి, ప్రచారం, ఆచరణీయమైన కార్యక్రమాల ద్వారా 'ప్రజా విజ్ఞాన' ఉద్యమాల్ని విస్తరింపజేయాలని మహాసభ నిర్ణయించింది. ఈ కింది అంశాలపై వేదికల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మహాసభ గుర్తించింది.
* పర్యావరణ పరిరక్షణ వేదిక
* సైన్స్‌ టీచర్ల వేదిక
* సైన్స్‌ రచయితల వేదిక
* ప్రజా శాస్త్రవేత్తల వేదిక (స్థానిక నూతనాంశాల్ని ఆవిష్కరించే సామాన్య రైతులతో ఇతరులను కలిపేందుకు)
* మహిళా శాస్త్రవేత్తల వేదిక
* మూఢనమ్మకాలకు వ్యతిరేక వేదిక
* ప్రజావైద్యుల వేదిక
* థర్మల్‌ ప్రాజెక్టు బాధితుల వేదిక
* శీతలపానీయాల వ్యతిరేక వేదిక
* రక్షిత తాగునీరు, పారిశుధ్యానికి పౌరుల వేదిక
కాలానుగుణంగా ఇలాంటి వేదికల్ని అవసరాన్ని బట్టి ఎన్నింటినైనా ఏర్పాటు చేయవచ్చు. ఇవన్నీ అంతిమంగా 'ప్రజా విజ్ఞాన' ఉద్యమ పటిష్టతకు దోహదపడతాయి.
ఐక్య కార్యాచరణ...
జన విజ్ఞాన వేదిక పనిచేస్తున్న ఎన్నో అంశాలపై ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఉదా: విద్యారంగంలో ఎం.వి.ఎఫ్‌. ఫౌండేషన్‌, వికాస విద్యావనం, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, ఇతర ప్రభుత్వేతర సంస్థలు. ఇదే విధంగా ఆరోగ్య రంగంలో ఛారు, రామకృష్ణ మఠం, ఎన్‌జివోలు, వైద్యుల సంఘాలు పనిచేస్తున్నాయి. నెల్లూరులో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణ వ్యతిరేక, బాధితుల సంఘాలు, శ్రీకాకుళంలో అణు విద్యుత్‌ వ్యతిరేక, బాధిత సంఘాలు, వివిధ శాస్త్రవేత్తల సంఘాలు, వేదికలు పనిచేస్తున్నాయి. ఇదే విధంగా మహిళల సమస్యలపై, మూడనమ్మకాలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నాయి. వీటితో కలిసి పనిచేయడం ద్వారా 'ప్రజా విజ్ఞాన ఉద్యమం' మరిన్ని ఫలితాలను సాధించాలని మహాసభ ఆకాంక్షించింది.
ప్రముఖుల గౌరవం..
వివిధ రంగాల్లో నిష్ణాతులైౖన ముగ్గురు ప్రముఖుల్ని గౌరవాధ్య క్షులుగా రజతోత్సవ మహాసభ ఎన్నుకుంది. ఈ విశిష్ట నిర్ణయంతో 'రజతోత్సవ మహాసభలు' 'జెవివి ప్రజా సైన్స్‌ ఉద్యమ ప్రస్థానం'లో చరిత్రను సృష్టించాయి. వీరిలో సిసిఎంబి డైరెక్టరు, ప్రముఖ శాస్త్రవేత్త అయిన సిహెచ్‌ మోహనరావు గతం నుండే కొనసాగుతున్నారు. ప్రముఖ మహిళా శాస్త్రవేత్త మెహాతాబ్‌ ఎస్‌ బామ్జీ, సీనియర్‌ విశ్రాంతి ఐఎఎస్‌ అధికారి కె.ఆర్‌ వేణుగోపాల్‌ కొత్తగా ఎంపికయ్యారు. వీరు ముగ్గురి కలయికతో 'ప్రజా సైన్స్‌ ఉద్యమ ప్రస్థానం' మరింత ముందుకు పోవాలని 'విజ్ఞానవీచిక' ఆకాంక్షిస్తోంది.
జెవివి అవార్డు..
గతంలో జాతీయ అవార్డుతో వచ్చిన మొత్తానికి కొంత కలిపి ఐదు లక్షల రూపాయల్ని జెవివి డిపాజిట్‌ చేసింది. దీనికి మరో రూ.10-15 లక్షలను జోడించి డిపాజిట్‌ చేయాలని మహాసభ ప్రతిపాదించింది. దీనిపై వచ్చే వడ్డీతో ఓ ప్రతిష్ఠాత్మక సైన్స్‌ అవార్డును ప్రతి ఏడాది ఇవ్వాలని మహాసభ ఆకాంక్షిస్తోంది. దీనిపై విధివిధానా లను రూపొందించుకున్నాక అవార్డును ప్రకటిస్తుంది.
దిశను తెలుపుతున్న అంశాలు..
మహాసభలో ఆమోదించిన తీర్మానాలు, కార్యక్రమాలు 'ప్రజా విజ్ఞాన' ఉద్యమ దిశను సూచిస్తున్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు..
నష్టదాయక 'అభివృద్ధి నమూనా' తిరస్కరణ..
ఇప్పటి అభివృద్ధి నమూనాను మహాసభ తిరస్క రించింది. సామాజికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడకుండా ప్రజల మధ్య అంతరాల్ని పెంచుతూ వనరుల విలువల్ని దిగజారుస్తున్న 'అభివృద్ధి నమూనా'ను వ్యతిరేకిస్తూ తీర్మానించింది. వేగంగా పతనమవుతున్న పర్యావరణం ఆహారభద్రతకు ప్రమాదకరంగా మారు తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 'సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ' కీలకంగా గల 'ఆర్థిక నమూనా' కావాలని కోరింది.
రైతు వ్యవసాయ పరిరక్షణ..
రైతు ఆత్మహత్యలు, పంట విరామం, వలసలు వంటివి ఇప్పటి వ్యవసాయరంగ పరిస్థితికి ఉపరితల ప్రతీకలు మాత్రమేనని మహాసభ భావించింది. దీనికి కారణమైన వ్యవసాయ విధానాల్ని ప్రభుత్వం మార్చాలని, రైతులు తమ పంటల సాగుపద్ధతుల్ని మార్చుకోవాలని మహాసభ కోరింది. పర్యావరణపరంగా విధ్వంసాన్ని సృష్టిస్తూ రైతు సేద్య ఖర్చుల్ని పెంచేవైపుకు మరల్చడం వల్ల నష్టపరు స్తుందని, దీన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మహాసభ కోరింది. సుస్థిర వ్యవసాయోత్పత్తికి దోహదపడేలా మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రైతు రక్షణ పథకాన్ని 'వర్షాధార ప్రాంత వ్యవసాయ అథారిటీ' ద్వారా అమలుపర్చాలని మహాసభ కోరింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 17 వేల రూపాయల్ని కేటాయించాలని తీర్మానించింది.
ఉత్పత్తిదారుల సహకార సంఘాల పునరుద్ధరణ
వృత్తిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే ముఖ్య లక్ష్యంతో సహకార సంఘాల్ని ప్రోత్సహించాలని, ప్రతి 1000-2000 వృత్తిదారులకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని మహాసభ తీర్మానించింది. వీటి ద్వారా రుణాల్ని, రక్షణ పథకాల్ని అమలు చేయాలని కోరింది. చిన్న, సన్న కారు వృత్తిదారులకు యంత్రాలను, సాంకేతిక నైపుణ్యాన్ని సమకూర్చాలని కోరింది. ఉత్పత్తుల నిల్వ గోదాములను, శీతల గిడ్డంగులను ఈ సంఘాల పరిధిలోనే నిర్మించాలని కోరింది. చేనేత వంటి ఇతర ఉత్పత్తి సంఘాల్నీ సహకార సంఘంలో ఇమిడ్చేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి చేయాలని మహాసభ తీర్మానించింది.
ఆరోగ్యం..
'అందరికీ ఆరోగ్యం' సాధించడానికి ప్రాథమిక ఆరోగ్య రక్షణ వ్యవస్థ అత్యుత్తమమని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' పిలుపునిచ్చినా.. మన ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేస్తూ, కొద్దిమందికీ, అదీ కొన్ని జబ్బులకు మాత్రమే సహాయాన్ని అందిస్తూ (ఆరోగ్యశ్రీ) దాన్నే ప్రజారోగ్య పరిరక్షణగా ప్రచారం చేయడాన్ని మహాసభ నిరసించింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాల పేరుతో ప్రభుత్వ నిధులను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో 'ప్రాథమిక ఆరోగ్య రక్షణ వ్యవస్థ'ను బలోపేతం చేయాలని మహాసభ తీర్మానించింది.
బాలికల నిష్పత్తి తగ్గిపోవడంపై...
దేశంలో బాలికల నిష్పత్తి తగ్గిపోవడం పట్ల మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భ్రూణహత్యల నివారణకు ఉద్దేశించిన 'పిఎన్‌డిటి' చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుచేయాలని మహాసభ కోరింది. లైంగిక లోపాల్ని సవరించే విజ్ఞానాన్ని బాలికల్ని బాలురగా మార్చడానికి వినియోగించడాన్ని నియంత్రించాలని కోరింది. పుట్టిన తర్వాత అనేక రూపాల్లో జరుగుతున్న బాలికల మరణాల్ని అరికట్టాలని మహాసభ తీర్మానించింది.
విద్య..
నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా బలమైన ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థను ప్రతి మండలంలో అన్ని వసతులు గల 15-20 పాఠశాలల్ని ప్రభుత్వం నెలకొల్పా లని మహాసభ తీర్మానించింది. బడి మానేస్తున్న పిల్లల కోసం ప్రతి మండలంలో 3,4 ఆవాస పాఠశాలలను నెలకొల్పాలని కూడా మహాసభ కోరింది. విశ్వవిద్యాలయాల్ని బలోపేతం చేసి, ఉన్నత విలువలుగల కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దాలని మహాసభ కోరింది.
మద్యంపై..
మద్యాన్ని ఆదాయపు వనరుగా చూడటాన్ని ప్రభుత్వం మానుకోవాలని, క్రమంగా మద్యాన్ని నియంత్రించి, కనిష్ట స్థాయికి తేవాలని, మహాసభ కోరింది. అంతిమంగా స్వచ్ఛంద మద్య నిషేధానికి దారితీసేలా ప్రభుత్వ విధానం ఉండాలని తీర్మానించింది.

No comments:

Post a Comment