Wednesday, 28 March 2012

గోవుమాలక్ష్మికి కోటి దండాలు


నిన్నటి తరం చదువులు చదివిన వారెవరైనా, ‘ఆవు వ్యాసం’ రాకుండా స్కూలు దాటి హైస్కూలు గడప తొక్కివుండరు. ‘నాలుగు కాళ్లు, రెండు కొమ్ములు వుండును..పాలు ఇచ్చును..’ఇలా. ఆవుకు హిందూ సంస్కృతిలోనే కాదు, భారతీయ జన జీవనంలో అద్భుతమైన ప్రాముఖ్యత వుంది. అందుకే చిన్నతనంలోనే ఆవుగురించిన నాలుగు మంచి మాటలు నేర్పాయి నిన్నటి చదువులు. నేటి ‘కేజీ’ల బరువు విద్యకు మాత్రం ‘సి-్ఫర్ కౌ’ అని కూడా మిగల్లేదు..‘సీ- ఫర్ క్యాట్’ అనే తెలుసు.
సరే ఆవు వ్యాసం మర్చిపోవడం అలా వుంచితే, ఆవును, ఆవు పాల గుణగణాల్ని, ఆవు మానవాళికి అందించే మేలును కూడా మర్చిపోవడం మరో బాధామయ సంగతి. ఇంతకు మించి, ఆవును కేవలం పాలిచ్చే జంతువుగా చూసి, దాన్ని పరిశోధనలతో హింసించి, ఆఖరికి, రోజుకు వీలైనన్ని ఎక్కువ లీటర్ల పాలిచ్చే హైబ్రీడ్, జెర్సీ రకాల ఉత్పాదన దిశగా మానవాళి తెలివి తేటలు పయనించాయే తప్ప, మరో విధంగా కాదు. అయితే మన ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల్లో పేర్కొన్న ఆవు పాలు, ఇతర పదార్ధాల ఔషధ గుణాలన్నీ ఈ హైబ్రీడ్ ఆవుల ద్వారా సాధ్యం కాదన్న సంగతిని కూడా ఈ సందర్భంలో విస్మరించారు.
ఎరువుల తిండిపై మొగం మొత్తి, అందులో అరుచి, ఆనారోగ్యం తప్ప మరేమీ లేదని, ఆర్గానిక్ పదార్ధాల వైపు జనం ఎలా మళ్లుతున్నారో, అలాగే హైబ్రీడ్ ఆవుపాల (ఎ-1రకం) వెంట కాకుండా, దేశీ ఆవు పాల వైపు(ఎ-2రకం), వాటి మంచి చెడ్డల వైపు జనం దృష్టిని మళ్లించే ఉద్ధేశంతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో మూడు రోజుల ప్రదర్శన ఒకటి బుధవారం ప్రారంభమైంది. చరక డెయరీ, డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల తదితర సంస్థల సారథ్యంలో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
మన దేశంలో ఆవుల జాతులు చాలా రకాలే వుండేవి. కానీ రాను రాను ఆ సంఖ్య చిక్కిపోతోంది. ఇప్పుడు అది కేవలం మూడు పదుల లోపు సంఖ్యకు చేరుకుంది. వీటిలో వీలయినన్నింటిని ఈ ప్రదర్శనలో వుంచారు. ముఖ్యంగా ఏడు రకాల ఆవుల చుట్టూ ఒకేసారి ప్రదక్షిణ చేస్తే, మంచిదన్న హిందూ విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకుని, ఇక్కడ ఓ చిన్న శాలలో ఏడు ఆవులను వుంచారు. అలాగే ఆవు, ఆవు పంచకం, ఆవు పాలు తదితర విశేషాలతో కూడిన వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. ఆవుకు సంబంధించిన విశేషాలతో కూడిన సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. వివిధ రుగ్మతలకు ఆవు పదార్ధాలు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది ఇక్కడ వివరిస్తున్నారు. ఇన్ని విశేషాలతో కూడిన ఈ ప్రదర్శన కేవలం మూడు రోజులు అంటే 30వ తేదీ వరకు మాత్రమే వుంటుంది.
- హిమజశ్రీనివాస్

No comments:

Post a Comment