Thursday 1 March 2012

శాస్త్రీయ ఆలోచన పెంచాలంటే..?


  • విశ్వాసాలు.. వాస్తవాలు...109
రాజ్యాంగంలోని 51ఎ (హెచ్‌) అధికరణం ప్రకారం ప్రజలందరిలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం ప్రభుత్వంతో సహా అందరి బాధ్యత. కానీ, ఆ బాధ్యత నుండి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. శాస్త్ర జ్ఞానాన్ని మూలమలుపు తిప్పి, సృష్టినీ, జీవుల పుట్టుకనూ, పరిణామక్రమాన్నీ రుజువులతో సహా వివరించిన డార్విన్‌ పరిణామవాదాన్ని హైస్కూల్‌ స్థాయి పాఠ్యాంశాల నుండి తీసివేయడం, వానల కోసం వందలాది దేవాలయాల్లో వరుణయాగాలు చేయించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. అందువలన సైన్సువాదులు నిరాశపడకుండా శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రజలలో పెంపొందించడానికి కృషి చేయాలి. అందుకోసం ఈ కింది కార్యక్రమాలు ఉపయోగపడతాయి.
(1) 'ప్రతి ఒక్కరూ మరొకరికి చెప్పాలి (ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌)' అనే కార్యాచరణ పద్ధతిలో వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమాన్ని చేపట్టాలి. సమాజంలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలనూ, వాటిలోని అశాస్త్రీయ అవగాహనలనూ ఒకరు మరొకరికి వివరించి, శాస్త్రీయ అవగాహనను పెంపొందించే కర్తవ్యాన్ని ప్రతిఒక్కరూ చేపట్టేలా కృషి చేయాలి. తన కుటుంబ సభ్యులతోనే మొదట ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలి.
(2) అన్ని పాఠశాలల్లో 'డార్విన్‌ ఫాన్స్‌ క్లబ్బు' స్థాపించి, సైన్సు ఉపాధ్యాయులూ తమ విద్యార్థులందరికీ సృష్టిక్రమాన్నీ, జీవ పరిణామాన్నీ వివరించడం కర్తవ్యంగా స్వీకరించేలా కృషి చేయాలి.
(3) శాస్త్రీయ అవగాహ నను పెంచే పుస్తకాలను వీల యినన్ని అమ్మడానికి సామా జిక కార్యకర్తలందరూ తమ బాధ్యతగా స్వీకరించాలి. ఈ కార్యక్రమాన్ని 'కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌ (కెఎస్‌. ఎస్‌.పి)' కేరళలో అత్యంత విజయవంతంగా గత 50 ఏళ్ళుగా నిర్వహిస్తోంది. అక్కడ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి సామాన్య కార్యకర్త వరకూ అందరూ ఎంతో ఉత్సాహంగా, దీక్షగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనివలన శాస్త్రీయ భావజాల ప్రచారమే కాక, కెేరళ శాస్త్ర పరిషత్‌కు ఆర్థిక వనరుగా కూడా ఉపయోగపడుతుంది.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment