
1910 అక్టోబర్ 19న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించిన కొట్నీస్ బాల్యం నుండే తెలివిగలవాడిగా పేరు తెచ్చుకున్నాడు. బొంబాయిలోని జిఎస్ వైద్య కళాశాలలో చదువుతున్నప్పుడు కోర్కెల సాధన కోసం జరిగిన సమ్మె సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఖానోల్కర్‌ను బహిరంగంగా విమర్శించటం ద్వారా కొట్నీస్ తన ధీరత్వాన్ని ప్రదర్శించాడు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ప్రాక్టీసు పెట్టి జీవితంలో స్థిరపడాలంటూ తల్లిదండ్రులు కోరినప్పటికీ శస్త్ర చికిత్సల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే తన ప్రగాఢమైన కోరిక ప్రకారమే ఆయన నడుచుకున్నాడు. 1937వ సంవత్సరంలో ప్రపంచంలో యుద్ధోన్మాద ఘంటికలు మోగటం కొట్నీస్ జీవిత గమనాన్నే మార్చివేసింది. రాజ్య విస్తరణ కోసం ఫాసిస్టు దేశాలు రెండో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్విన నేపథ్యంలో ఆయన లక్ష్యం, గమ్యం అకస్మాత్తుగా మారిపోయాయి. ఈ సమయంలో అంతర్యుద్ధాలతో మునిగి తేలుతున్న చైనాపై జపాను సైన్యాలు మూకుమ్మడి దాడి చేశాయి. ఈ తరుణంలో చైనా ఎనిమిదో రూట్‌సేన కమాండర్ జనరల్ ఛూటే కేంద్ర కార్యాలయం నుండి భారత నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూకు ఒక లేఖ అందటం, చైనా ప్రజలు జరుపుతున్న పోరాటానికి, భారత ప్రజల సౌభ్రాతృత్వానికి చిహ్నంగా తగిన మందులు, శస్త్ర చికిత్సా పరికరాలతో ఒక వైద్యబృందాన్ని పంపుతున్నట్లు నెహ్రూ ప్రకటించటం చకచకా జరిగిపోయాయి. చైనాకు వెళ్లే వైద్య బృందంలో తానుకూడా ఉండాలని డాక్టర్ కొట్నీస్ భావిస్తున్నట్లు తెలియగానే ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. డాక్టర్ జీవరాజ్ మెహతాలాంటి వారుకూడా కొట్నీస్ శక్తి సామర్థ్యాలపై అపనమ్మకాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ అడ్డంకులన్నీ తొలగిపోవటంతో కొట్నీస్ ప్రయాణానికి మార్గం సుగమమైంది.
సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలు మెండుగా ఉన్న డాక్టర్ కొట్నీస్ చైనాకు చేరుకున్న తర్వాత మావో, చౌ ఎన్‌లై, చూటే వంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులను స్వయంగా కలుసుకోవటం ద్వారా అతనిలో వీరోచిత భావాలు మరింత బలపడ్డాయి. చైనా విముక్తి కోసం వారు నిర్వహిస్తున్న పోరాటాన్ని స్వయంగా వీక్షించటంతో తన గమ్యం ఏమిటనేది అతడికి అర్థమయ్యింది. ఫలితంగా మార్క్సిస్టు గ్రంథాల అధ్యయనంపై ఆయన దృష్టి నిలిపాడు. చైనా ప్రజలతో, సంస్కృతితో కొట్నీస్ అవినాభావ సంబంధాన్ని పెంచుకోవటాన్ని స్వయంగా చూసి కుచింగ్‌లాల్ (ఎనిమిదో మార్గం సేనలో నర్సు) ముగ్ధురాలైంది. వీరిద్దరి మధ్యనున్న అనురాగం ప్రేమగా మొగ్గతొడగటంతో జాతి, కుల, మత ఆంతర్యాలను పక్కనబెట్టి కొట్నీస్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఈ విధంగా చైనా ప్రజల మనసుల్లో తనదైన ముద్రవేసుకున్న డాక్టర్ కొట్నీస్ డాక్టర్ నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి ఆస్పత్రి మొట్టమొదటి డైరెక్టర్‌గా నియమించబడి ఎనలేని గౌరవం దక్కించుకున్నాడు. అక్కడి వైద్య వ్యవస్థను సంపూర్ణంగా పునర్నిర్మించి చిరస్థాయిగా నిలిచిపోయే సేవలనందించాడు.
వైద్యరంగం మొత్తం వ్యాపారమయమైపోయి సామాన్యుడికి వైద్యం అందని పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వర్ధమాన డాక్టర్లు, సిబ్బంది డాక్టర్ కొట్నీస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తద్వారా దేశంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి. అప్పుడే డాక్టర్ కొట్నీస్‌కు నిజమైన నివాళిని అందించిన వారమవుతాం. అంతటి మహనీయుడి చరిత్రను 'జీవన జ్వాల' పేరిట తెలుగు పాఠకులకు అందించిన రచయితకు, ప్రచురించిన ప్రజాశక్తి బుకహేౌస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
No comments:
Post a Comment