Thursday 29 March 2012

మనదైన గుర్తింపు కోసం...


మన గురించి మనం ఆలోచించుకుని, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని తపన పడకపోతే అందరిలో ఒకరిగానే మిగిలిపోతాం.
ప్రముఖులుగా మనం చెప్పుకునే ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఫలానా వ్యక్తి బిజినెస్‌మెన్‌, ఫలానా వ్యక్తి డాక్టర్‌, ఫలానా వ్యక్తి సంఘసేవకుడు- ఇలా మనం ప్రతి వ్యక్తిని అతడి వృత్తి, ప్రవృత్తుల ఆధారంగానే గుర్తుంచుకుంటాం. కుటుంబంలోని వ్యక్తులు తప్ప మిగిలిన సమాజమంతా వ్యక్తులను వృత్తి, ప్రవృత్తుల ఆధారంగానే గుర్తిస్తుంది. అందరికీ ఏదో ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. దానిని ఎక్కువ మంది గుర్తించటమే మనకు ప్రత్యేకతను కలిగేలా చేస్తుంది. ఎంత ఎక్కువ మంది ఓ వ్యక్తిని గుర్తించగలిగితే, అతడు అంత ప్రముఖుడిగా గుర్తింపును పొందుతాడు.
మరి మీరు అందరిలో ఒకరిగా మిగిలిపోవాలనుకుంటున్నారా? లేక మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఎక్కువ మంది నుంచి పొందాలని కోరుకుంటున్నారా?
ఒకవేళ మీరిలా అందరిలో ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే, ఇలాగే జీవితం కొనసాగించండి. అలా కాక, ప్రత్యేకమైన గుర్తింపు, ప్రముఖుడిగా పేరు కోరుకుంటే మిమ్మల్ని మీరు ఆకోణంలో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటినుండే ప్రారంభించండి. అందుకు మీరు చేయవలసినవి.
కోరికలను గుర్తించండి : కోరికలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. కోరికలే మనిషిని సృష్టిస్తాయి. కోరికలు లేని మనిషి ఉండడు. ఐతే కొంతమంది మాత్రమే తమలోని కోరికలను గుర్తిస్తారు. మరి కొంతమంది కోరికలను గుర్తించినా, గుర్తించనట్టే ప్రవర్తిస్తారు. కోరికలను గుర్తించడమంటే మీరేం కోరుకుంటున్నారో ఓ లిస్ట్‌ తయారుచేయడం కాదు. ఒక కోరిక తీరగానే మరో కోరికను ఆ లిస్ట్‌లో చేర్చి కొత్తగా లిస్ట్‌ చేయడం అసలే కాదు. మనలో ఎన్నో కోరికలుంటాయి. మంచి బట్టలు కొనుక్కోవాలి. మంచి సినిమా చూడాలి, వేసవి సెలవులను బాగా ఎంజారు చేయాలి - ఇవీన్న కోరికలే! కానీ ఇవేవి మనకు ప్రత్యేక గుర్తింపునివ్వవు. ప్రముఖుడిగా మార్చవు. కాబట్టి మీ కోరికలలో ఉత్తమమైనవి గుర్తించండి. 'నేను డాక్టర్‌ కావాలనుకుంటున్నాను- సంఘసేవ చేయాలనుకుంటున్నాను' - ఇలాంటి ఉత్తమమైన కోరికలను గుర్తించండి.
సంకల్పం చేసుకోండి: ఉత్తమమైన కోరికలు గుర్తించడంలోనే మనం కోరుకున్నది జరిగిపోదు. ఏదైనా కార్యం సాధించాలంటే 'సంకల్పం' అవసరం. మీలోని ఉత్తమమైన కోరికలు గుర్తించాక, సంకల్పం చేసుకోండి. 'నాకున్న ఉత్తమమైన కోరికలలో ఈ కోరిక తీర్చుకోవడానికి ఈ క్షణం నుండి నేను సంకల్పం చేసుకుంటున్నాను' అయితే సంకల్పం చేసుకునే ముందు కోరికలను విశ్లేషించుకోండి. ఏ కోరిక మీకు ఉత్తమమైనదిగా అనిపిస్తుంది. దాని వలన మీకు లభించే ప్రత్యేకమైన గుర్తింపు ఎలాంటిది... తదితర విషయాలను అవగాహన చేసుకోండి.
విజువలైజ్‌ చేసుకోండి :కోరికలంటే ప్రత్యేక
గుర్తింపుకు మార్గాలు. మంచి బట్టలు తోడుక్కోవాలనే కోరిక కూడా ఒక ప్రత్యేక గుర్తింపుకు సంబంధించినదే. అయితే మీరిప్పుడు కోరుకోవలసింది బట్టలు వలన వచ్చే తాత్కాలికమైన ప్రత్యేక గుర్తింపు కాదు. విజయం సాధించటం ద్వారా పొందే శాశ్వత, ప్రత్యేక గుర్తింపు మీరు కోరుకున్న ఆ శాశ్వత ప్రత్యేక గుర్తింపు, మీకు లభించినప్పుడు మీ జీవనశైలి ఎలా మారిపోతుంది. ఆ సమయంలో మీరు పొందే ఆనందం- తదితర విషయాలను ఒక్కసారి విజువలైజ్‌ చేసుకోండి. ఆ విజువలైజేషన్‌ను అప్పుడప్పుడు రిపీట్‌ చేసుకోండి. ఆ విజువలైజేషన్‌ మీకు 'శక్తి'ని సృష్టించి ఇస్తుంది.
కష్టపడండి : శాశ్వత ప్రత్యేక గుర్తింపు సాధించటం, అంత సులభమేం కాదు. ప్రత్యేక గుర్తింపు సాధించటం అంత సులభమే అయినట్టయితే అందరూ ప్రముఖులే అయి ఉండేవారు. కోరికలను గుర్తించి, సంకల్పం చేసుకుని కష్టపడేవారు పరిమితం. కష్టపడితేనే ఫలితముంటుంది. కష్టపడినవారికే శాశ్వత ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మీరూ కష్టపడాలి.
ప్రత్యేకతను చాటుకోండి : అందరూ అనుసరించే మార్గమే కావచ్చు. ఆ మార్గంలో మీదంటూ ఓ బాణీ, ఓ వాణి ఉండాలి. మీ కంటూ ప్రత్యేకత సృష్టించకపోతే, మీరు జనానికి తెలిసినా మీ గురించి ప్రత్యేకించి చర్చించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే మీరు ఎనుకున్న మార్గంలో మీదైనా శైలిలో ముందుకు సాగుతూ గమ్యం చేరుకోండి.
మన మైండ్‌సెట్‌ ఎప్పుడూ పరిమిత లక్ష్యాలనే నిర్దేశించుకుని సాధించుకోవడం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకుంటే అవి అందుకోగలమో లేదోనన్న భయం మనలో ఉంటుంది. అసాధారణ లక్ష్యాలను అవలీలగా సాధించిన వ్యక్తులు మన చుట్టూనే ఉన్నారు. మరి మనం అసాధారణ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఎందుకింతగా భయపడుతున్నాం?
మనం ఆ తరహా భయాన్ని ముందు వదలాలి. మన కోరికలలో ఉత్తమమైనది. ఉదాత్తమైనది ఎన్నుకోవాలి. ఆ కోరికలను కలలుగా భావించకుండా, వాస్తవరూపంలోకి మలచుకోవడానికి కృషి చేయాలి. కోట్లాది జనంలో, మనమూ ఒకరంగా మిగలకూడదనుకుంటే మీరు చేయవలసిన పనుల గురించి ముందు చెప్పుకున్నాం. అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటికి చేరుకున్న వ్యక్తుల లిస్ట్‌ తయారుచేసుకోండి. అందరినీ ఆ లిస్ట్‌లో చేర్చనక్కర్లేదు. మీలో మీరు గుర్తించిన కోరికకు దగ్గరగా ఉండే విజయవంతమైన వారి పేర్లు పది పదిహేను లిస్ట్‌లో చేర్చండి. వారి సక్సెస్‌కి కారణం తెలుసుకోండి. ఆ వ్యక్తులే మీకు స్ఫూర్తిగా భావించండి
ఆ లక్ష్యం సాధించగలిగేదిగా ఉండాలంటారు. కానీ సాధారణ లక్ష్యాలనే టార్గెట్‌ చేయడం వలన మనలో ఉన్న అపరిమిత శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. లక్ష్యం ఎప్పుడైతే చిన్నదిగా ఉంటుందో మనం మన శక్తిని అతికొద్దిగానే వాడుకోగలుగుతున్నాం. అసాధారణ లక్ష్యాలను అవలీలగా సాధించిన వ్యక్తులు ఉండగా, మీరు ఆపనినే ఎందుకు చేయలేకపోతారు? కాబట్టి నాలో ఉన్న శక్తిని కొంతవరకైనా ఉపయోగించుకోవాలంటే లక్ష్యం అసాధారణమైనదిగా ఉండాలని అనుకోండి.
ఆ భయాన్ని వీడండి 'ఇంతపెద్ద లక్ష్యం నేను సాధించగలనా?' అనుకోకండి. మనసులో భయం ఏర్పడితే సహజసిద్ధమైన శక్తి సద్వినియోగం చేసుకోలేకపోతాము. భయం లేనప్పుడే మనం ఒత్తిడి లేకుండా లక్ష్యం చేరుకోగలుగుతాం. అసలు మీ మైండ్‌సెట్‌నే మార్చుకోవడానికి ప్రయత్నించండి. 'లక్ష్యం పెద్దదే. అసాధారణ లక్ష్యమేమీ కాదు. నేను ఈ లక్ష్యం సాధించగలను'అని మనసును ట్యూన్‌ చేసుకోండి.
మీ లక్ష్యసాధనలో మీరు ఎంతవరకూ సఫలీకృతులవుతున్నారో అప్పుడప్పుడు విశ్లేషించుకోండి. ఆప్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోండి అసాధారణ లక్ష్యాలు నిర్ణయించుకోవడం వల్ల మనం కోల్పోయేది ఏమీ ఉండదు.
మనం ఆలోచనా సరళి, ప్రవర్తనారీతులు, వ్యక్తిత్వ ప్రదర్శన ఉన్నతంగా ఉంటాయి. ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమైనా, మనం ఒక ఉన్నతస్థాయిలోనే నిలబడతాం. అది మనం కోరుకున్న సాధారణస్థాయికి మించే ఉంటుంది.
కాబట్టి అసాధారణ లక్ష్యాలు నిర్ణయించుకోండి. మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలీదు. కష్టపడడం ప్రారంభించాకే మనం ఎంతగా కష్టపడగలమన్నది మనకి తెలుస్తుంది. అలాంటప్పుడు మన శక్తిని మనం తక్కువగా అంచనా వేసుకోవడం అవసరమా?!

No comments:

Post a Comment