Tuesday 27 March 2012

మానవ జాతి మిగులుతుందా?


నీళ్లుండవనీ, తిండి దొరకదనీ, కాలుష్యమనీ ఏదో ఒక కారణం చెప్పి అందరూ మనుషులు మిగలరని మాత్రమే చెపుతుంటారు. 2008లో ఆక్స్‌ఫర్డ్‌లో జరిగిన ఒకసమావేశంలో, మానవ జాతికి ఉన్న ముప్పులను గురించి సర్వే చేశారు. 2100 సంవత్సరం నాటికి మనుషులు మిగిలే అవకాశం 19 శాతం మాత్రమే అని లెక్క తేల్చారు. కానీ, ఇంత నిరాశ పనికిరాదనీ, కనీసం మరో లక్ష సంవత్సరాల వరకు మనిషి జాతి కొనసాగుతుందనీ మరికొందరు చెపుతున్నారు.
మనిషి జాతి పుట్టి రెండు లక్షల సంవత్సరాలైంది. రకరకాలుగా మారు తూ జాతి కొనసాగింది. ఈ లెక్కన చూస్తే కనీసం 5100 సంవత్సరాల నుంచి 78 లక్షల సంవత్సరాలదాకా మనిషి కొనసాగే వీలు ఉందంటారు ప్రిన్స్‌టన్ పరిశోధకుడు రిచర్డ్ గాట్. పాలిచ్చే జంతువులలో పుట్టిన ప్రతి జాతి సుమారు పదిలక్షల సంవత్సరాలు కొనసాగింది. అన్నింటిలోకీ తెలివిగలదిగా గుర్తింపు పొందిన మానవజాతి అంత సులభంగా అంతం కాదంటారు పరిశీలకులు.
వింతగా.. మనిషి తెలివి మనిషికే శత్రువయింది. నాగరికత ముందుకు సాగిన కొద్దీ సాంకేతిక శాస్త్రం మనిషి మీదకు తిరగబడే వీలుంది. అది కనీసం అదుపు తప్పుతుంది. బయోటెక్నాలజీలో పుట్టే కొత్త జాతులు, అణ్వాయుధాలు, నానో టెక్నాలజీల కారణంగా ఎప్పుడేం జరిగేదీ చెప్పడం కష్టం. నాగరికత, సాంకేతిక శాస్త్రం ప్రగతి సాధించిన కొద్దీ, ప్రపంచమంతా ఒకే కుటుంబమవుతుంది. సమాజాలు ఒంటరిగా బతకవలసిన అవసరం, ప్రమాదం ఉండవు. సమస్య ఎక్కడ వచ్చినా, అది అందరి మధ్యకు వస్తుంది. అందరూ కలిసి సమధానాలు వెతుకుతారు.
సూక్ష్మజీవులు, వ్యాధులతో మనుషులందరూ మట్టుబెట్టుకుపోయే ప్రమాదం ఉంది. 1918లో ఫ్లూ వ్యాధి వచ్చి ప్రపంచ జనాభాలో ఆరు శాతం మందిని మింగింది. గడచిన వంద సంవత్సరాలలో ఈ రకం సంఘటనలు నాలుగుదాకా జరిగాయి. వ్యాధి కారణంగా ఒక జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోవడమేంటే, ఆ జాతి ఒక చిన్న దీవిలాంటి చోట పరిమితమయి ఉంటేనేగానీ, వీలు పడదు. లక్షలు, కోట్లమంది ఒక వ్యాధికి గురయినా మొత్తం మానవజాతి సమసిపోవటం ప్రస్తుత పరిస్థితులలో అసంభవం!
మరో ప్రమాదం, భయంకరమయిన ప్రకృతి బీభత్సాల నుంచి రావచ్చు. భూగోళం చరిత్రలో సగటున 50 వేల సంవత్సరాలకు ఒకసారి పెద్ద అగ్నిపర్వతం పేలి వెయ్యి ఘనపు కిలోమీటర్ల బూడిదను ఆకాశంలోకి వెదజల్లినట్లు సాక్ష్యాలున్నాయి. వాటిలో మనుషుల సంఖ్య బాగా తగ్గిందని కూడా తెలుసు. సుమత్రాలోని టోబా పేలి 74 వేల సంవత్సరాలయింది. అప్పటి బూడిద కారణంగా మనిషి జాతి ఇంచుమించు తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ప్రస్తుతం జనాభా విస్తరణ అప్పటిలా లేదు. అప్పట్లో ఉన్న కొద్ది జనాభా కొంత ప్రాంతంలోనే ఉండేది. ప్రస్తుతం ఏడువందల కోట్లమంది, ఎన్నో ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఇంత మందిని మింగేయగల ఉత్పాతం ఆలోచనలకు అందడంలేదు.
మరో అగ్నిపర్వతం పేలి, బూడిద కారణంగా చీకట్లు సంవత్సరాలపాటు అలుముకుంటే పంటలు పండవు. కొన్ని బిలియన్ల జనం ఉనికికి ప్రమాదం రావచ్చు. అంతటి సంఘటనలు వరుసగా రెండుసార్లు జరిగితే తప్ప మానవ జాతి మట్టుబెట్టుకుపోదంటారు నిపుణులు.
మానవ జాతికి అన్నింటికన్నా పెద్ద ఆపద అంతరిక్షంనుంచి వచ్చే వీలుంది. సూర్యునిలో మంటలు, అంగారక శిలలువచ్చి గుద్దుకోవడం, సూపర్ నానోలు పేలి గామా కిరణాలు కుప్పలుగా రావడం వంటివి జరిగే వీలుంది. ముప్ఫయి కోట్ల సంవత్సరాలకొకసారి ఇలాంటి ఉత్పాతాలు జరుగుతాయట. హాని కలిగించే కిరణాలు పుట్టి, క్యాన్సర్లు కలిగి కొన్ని సంవత్సరాలు, అలా కొనసాగే రకంగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగేదీ చెప్పడం ఇంచుమించు అసాధ్యం!
ఎన్ని లెక్కలు వేసినా, రానున్న లక్ష సంవత్సరాలలో మనిషి జాతి మాయమవడం మాత్రం జరిగేలా లేదని లెక్కలు చెపుతున్నాయి. సూర్యుని మంటల గురించి కూడా చెప్పలేము. అయినా అంతగా మంటలు రావేమోనంటారు, ఆ రంగంలో వారు! ఇక అంగారక శిల వచ్చి ఢీకొట్టడం మిగిలింది. అంతరిక్షం నిండా రకరకాల రాళ్లున్నాయి. రాక్షసి బల్లులు అంతమయేందుకారణం 15 కిలోమీటర్ల వెడల్పున్న రాతి తాకిడేనని నమ్మకం. ఎప్పుడో 400 మీటర్ల రాయి వచ్చి తాకే అవకాశం మాత్రం ఉదంటున్నారు. దాని బలం పదివేల మెగాటన్నుల టిఎన్‌టీ (బాంబులోని పేలుడు పదార్థం)కి సమానంగా ఉంటుంది. అది ఏదో ఒక దేశాన్ని తుడిచిపెడుతుందేమోగానీ, మొత్తం ప్రపంచాన్ని కుదపజాలదు.
మానవజాతి మిగిలే అవకాశాలు 19 శాతమని కొందరంటే, కాదు... లక్ష సంవత్సరాలలో తుడిచిపెట్టుకుపోయే అవకాశం 20 శాతమని మరింత మంది అంటున్నారు. ఉంటామనే అనుకుందాం మరి!

No comments:

Post a Comment