Monday 12 March 2012

గాలి, నీరు మిగులుతాయా?

గాలి, నీరు మిగులుతాయా?


  • 12/03/2012
వాతావరణం అంటే మనలను ఆవరించి ఉండే గాలి అని అర్థం. గాలితోబాటు వాతావరణంలో మరెన్నో అంశాలు ఉంటాయి. ఈ వాతావరణం రాను రాను మారుతున్నది. అందుకు ముఖ్యమయినకారణం మానవులు చేస్తున్న పనులే! మానవుల కారణంగా కాకుంటే వాతావరణం మారకుండా ఇలాగే ఉండిపోతుందా?.. ఇది అసలు ప్రశ్న. మరో కొన్ని మిలియనుల సంవత్సరాలదాకా భూమి మీద గాలి, వాతావరణం ఇంచుమించు ఇలాగే ఉంటాయి. కనీసం జీవం కొనసాగడానికి అనువుగా ఉంటాయి. అయితే ఫరవాలేదని హాయిగా నిద్రపోతారా ఇవాళ?
ఇలాంటి విషయం గురించే ఒక యూనివర్సిటీ క్యాంటీన్‌లో ఇద్దరు సైంటిస్టులు మాటలాడుకుంటున్నారు. ‘ఒక బిలియన్ సంవత్సరంలో భూమి చాలా మారుతుంది!’ లాంటి సంగతేదో వారు చర్చించుకుంటున్నారు. పక్క టేబుల్ దగ్గరి మనిషి ఆత్రంగా వచ్చి ‘ఏమిటేమిట’ని అడిగాడు. వారు సంగతి చెప్పారు. ‘ఓ..! బిలియన్ అన్నారా? నేనింకా మిలియన్ అనుకుని హడలి వచ్చాను!’ అంటూ అతను వెళ్లిపోయాడు (జోకు అర్థంగానివారికి క్షమాపణలు!)
సూర్యగోళం వెలుగు రాను రాను పెరుగుతున్నది. మరో బిలియన్ సంవత్సరాలలో ఆ వెలుగు ఇప్పటి కంటే పది రెట్లు ఎక్కువవుతుంది. అంటే, అప్పటికి భూగోళం వేడిమి జీవం భరించలేనంతగా ఎక్కువవుతుంది. (్భయం అవసరం లేదు! బిలియన్ అంటే వంద కోట్లు!) సముద్రాలలోని నీరంతా ఆవిరై భూమి చుట్టూ వ్యాపిస్తుంది. అది గ్రీన్‌హౌస్ ప్రభావం కలిగిస్తుంది. అంటే భూమి మరో శుక్రగ్రహంలాగా సిద్ధమవుతుంది. తేడా ఒకటే! ఇక్కడ ఇంకా కొంత తేమ మిగులుతుంది. ఈ మార్పు కొంచెం నెమ్మదిగా జరిగే వీలు కూడా ఉంది. వేడి, తేమ మరీ ఎక్కువయితే, భూమి మీద వాతావరణంలో ఏవో కొన్ని రకాల సూక్ష్మజీవులు మాత్రం మిగులుతాయి. మిగతా జీవమంతా తుడిచిపెట్టుకుపోతుంది. అయితే, వాతావరణంలో మార్పులు నెమ్మదిగా జరుగుతాయి గనుక జీవం కూడా నెమ్మదిగానే సమసిపోతుంది. భూమి కూడా మిగతా లోతట్టు గ్రహాల మాదిరి మారుతుంది.
భూమిమీద నీరు ఉన్నందుకే మనకు తెలిసిన రకం జీవం కూడా ఉంది. కానీ, రాను రాను ఈ నీరంతా ఆవిరై ఎత్తులకు చేరుతుంది. అక్కడ అతి నీలలోహిత కిరణాల కారణంగా అది ఆక్సిజన్, హైడ్రోజెన్‌లుగా విడిపోతుంది. కొంచెం బరువయినది గనుక ఆక్సిజెన్ స్తారావరణంలోనే మిగిలి ఉంటుంది. విశ్వంలో మరెక్కడయినా బుద్ధిజీవులుండి, వారికి ఆక్సిజన్ మీద ఆధారపడే జీవం గురించి తెలిసి ఉంటే, ఈ ఆక్సిజన్ కారణంగా ఈ భూమిపై ఇంకా జీవం మిగిలి ఉందనే భ్రమ కలుగుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ కారణంగా, భూమి మీద ఇంకా జీవం మిగిలి ఉందనే భ్రమ కలుగుతుంది. హైడ్రోజన్ మాత్రం చాలా తేలికయిన వాయువు. అది అంతరిక్షంలోకి చేరి విస్తరిస్తుంది. మొత్తానికి భూమి మీద నీరు మాత్రం మిగలదు.
రెండు మూడు బిలియన్ సంవత్సరాల తర్వాత సముద్రాలు అసలు ఉండవు. అగ్ని పర్వతాలనుంచి కార్బన్‌డై ఆక్సైడ్ బాగా వచ్చి భూమి చుట్టూ చేరితే, శుక్ర గ్రహానికి, భూమికి తేడా కనపడదు. అప్పుడిక్కడ వాతావరణం ఉంటుంది. అందులో ఉండే గాలి... వేడి సీఓటూ మాత్రమే. అగ్ని పర్వతాల నుంచి ఈ వాయువు వాతావరణంలోకి రావడంలో మార్పులు వచ్చే వీలు మరొకటి ఉంది. భూమి లోపలి పొరల్లో ప్లేట్లు ఉన్నాయి. అవి కదులుతున్నాయి. ఆ కదలిక కారణంగానే భూమి పొరల్లో మార్పులు వస్తున్నాయి. ఫలితంగా భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు జరుగుతున్నాయి. ఈ ప్లేట్లు కదలడానికి అనుకూలంగా భూమి పొరల్లో ఉండేనీరు సాయపడుతుంది. అది యంత్రాలలో భాగాలు కదలడానికి గ్రీజు సాయం చేసిన లాంటి పరిస్థితి. కానీ వాతావరణం వేడెక్కి నీళ్ళన్నీ ఆవిరవుతాయంటున్నారు. కనుక భూమి లోపల ప్లేట్లు కదలడం కష్టమవుతుంది. లోపలి వాయువులు అగ్నిపర్వతాలలో నుంచి రావడం కుదరదు!
శనిగ్రహం చుట్టూ తిరుగుతూ టైటన్ అని ఒక ఉపగ్రహం ఉంది. అది ఎడారి దిబ్బలతో నిండి ఉంటుంది. అక్కడ మీతేన్ వర్షం కురుస్తుంది. సీఓటూ పెరగకుంటే మన భూమి కూడా టైటన్‌లాంటి పరిస్థితిలోకి చేరుతుంది. భూమి ధృవప్రాంతాలలో మాత్రం కొంత నీరు మిగలే వీలు కూడా ఉంది. అంటే, అది ప్రస్తుతం చంద్రగోళం ఉన్న తీరు! మొత్తం గోళం పొడి ఎడారి ధృవాల దగ్గరమాత్రం కొంత నీరు! అంటే మబ్బులు ఉండవు. కానీ, ఎప్పుడో ఒకసారి వర్షం మాత్రం కురుస్తుంది!
మొత్తానికి, భూమి మీద నీరు మిగలని రోజులు రానున్నాయి! కానీ ఇప్పుడే కాదు!

No comments:

Post a Comment