Tuesday 27 March 2012

వీటిని కూడా కాపాడాలి

నిర్వహణ: గోపాలం కెబి

‘‘సముద్రంలో తిమింగలాలు, అడవుల్లో పాండాలు అంతరించిపోయాయంటే అది ఘోరమయిన విషయమే. కానీ, వాటితోబాటు ప్రపంచం మాత్రం ముగిసిపోలేదు. కానీ అమోనియాను ఆక్సీకరణం చెందించడానికి చేతనయిన రెండు జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి రెండూ అంతరించిపోతున్నాయంటే, అది మరో రకం పరిస్థితి. ఆ పని మనకు తెలియకుండానే, ప్రస్తుతం జరుగుతూ ఉండవచ్చు!’’
ఈ మాటలను అంటున్నది ఎవరో అయితే పట్టించుకోనవసరం లేదు. వాతావరణాన్ని పునర్నిర్మించడమనే ఒక పద్ధతి వచ్చింది. ఆ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో తలమునకలవుతున్న ఒక సీనియర్ పరిశోధకుడు టామ్ కర్టిస్ చెప్పిన మాటలవి. మనమంతా సూక్ష్మజీవులను గురించి పట్టించుకోకుండా ఉంటున్నామని ఆయన గొంతెత్తి చెపుతున్నాడు. జీవం అనే చెట్టుకు చాలా కొమ్మలున్నాయి. అందులోని మొక్క లు, జంతువులను మాత్రమే పరిరక్షణ వాదులు పట్టించుకున్నారు. సుక్ష్మజీవుల గురించి చాలామందికి తప్పుడు అభిప్రాయాలున్నాయి. అవి మనుషులకు, జంతువులకూ హాని చేసేవి అనుకునేవారే ఎక్కువ. అది నిజం కాదని తెలిసినా నిపుణులు కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవి సంఖ్యలో మిగతా జీవులకన్నా చాలా చాలా ఎక్కువే అయినా కంటికి కనపడవు! కంటికి కనబడే జీవులను మాత్రమే పరిరక్షిస్తామంటే తప్పుగదా! అని అంటున్నారు కొందరు పరిశోధకులు.
సూక్ష్మజీవులు అంతటా వ్యాపించి ఉన్నాయి. అంతులేకుండా ఉన్నాయి. కానీ వాటిలోకూడా కొన్ని రకాలు అంతరించే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అయినా 1993లో ప్రకటించిన జీవన వైవిధ్యం పట్టికలో వాటి గురించి ప్రస్తావన కూడా లేదు. ఈ పట్టికలో ఏక కణజీవుల గురించి పట్టింపు కనబడదు. మొక్కల సంరక్షణ కోసం ప్రపంచ స్థాయిలో తయారయిన పథకంలో ఫీంజీ (బూజు) జాతుల గురించి కొంత ఉంది. అది కొంత మాత్రమేనని అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది.
మొక్కలలో వాటి గట్టిదనానికి ఆధారమయిన లిగ్నోసెల్యులోజ్ అనే పదార్థం ఉంది. చెటు,్ల మొక్కల నిర్మాణంలో ఎక్కువశాతం ఈ పదార్ధమే ఉంటుంది. చచ్చిన మొక్కలలోని ఈ పదార్థాన్ని కొన్ని రకాల ఫంజీలు విరుస్తాయి. అప్పుడు మట్టిలో సారం పేరున పోషకాలు చేరుతాయి. మట్టిలో ఈ సారం ఉంటేనే వ్యవసాయం సాగుతుంది. పంటలు పండుతాయి. అంటే లిగ్నో సెల్యులోజ్‌ను విరవడం ద్వారా ఈ ఫంజీలు మనుషులకు, జంతువులకు ఎంతో ఉపకారం చేస్తున్నాయని అర్థం! వ్యవసాయ భూముల్లోనే కాదు, అడవుల్లో, అన్ని చోట్లా ఈ ఉపకారం జరుగుతున్నది. మరి వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఎంత అన్యాయం?
సూక్ష్మజీవులు కొన్ని ప్రత్యేక స్థలాలలో మాత్రమే ఉండవు. అంతటా వ్యాపిస్తాయి అని ఒక మాట ఉంది. అంటే, అవి ఒకచోట అంతరించినా, మరోచోట ఉండనే ఉంటాయని భావం. కొన్ని రకాలగురించి తప్పిస్తే, ఈ అభిప్రాయం నిజం కాదు. నిజానికి రోగాలకు కారణాలయిన సూక్ష్మజీవులు కూడా మనుషులవల్ల వ్యాపించాయి తప్ప, వాటంతటవి అంతటా లేవు.
జీవుల శరీరాల మీద, లోపలా రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాటివల్ల జీవులకు, జీవులవల్ల వాటికీ ఉపకారం ఉంటుంది. ఈ రకం సూక్ష్మజీవులు వాటికి ఆధారమయిన జీవులు లేనిదే మనజాలవు. ఆ జీవులు కూడా ఉండవలసిన సూక్ష్మజీవులు లేనిదే మనజాలవు. మనుషులలో కూడా బోలెడన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయని, ఉండాలనీ చాలామందికి తెలియకపోవచ్చు. ఈ మధ్యన సోమాలియా దేశంలోని ఒక అడవి గాడిద జాతి గురించి పరిశోధనలు జరిగాయి. దాని పేగుల్లో ఒక బూజు జాతి జీవి బతుకుతూ ఉంటుంది. అడవులు అంతరిస్తున్న కారణంగా ఈ గాడిదలు అంతరిస్తున్నాయని గుర్తించారు. నిజానికి ఆ జాతి గురించి తెలిసింది తక్కువ. గాడిదలు పోతే, వాటి శరీరంలోని సూక్ష్మజీవులు కూడా లేకుండా పోతాయి. ఈ సూక్ష్మజీవులు లేనందుకు గాడిదలు పోయే స్థితి కూడా ఉంది. ఆర్కిడ్ జాతి మొక్కల వేళ్లమీద కొన్నిరకాల సూక్ష్మజీవులుంటాయి. ఈ అరుదయిన, అందమయిన ఆర్కిడ్‌లు, వాటికి సాయం చేసే సూక్ష్మజీవులు ఒక రకం కారణంగా మరొకటి అంతమవుతున్నాయని కూడా గుర్తించారు.
మనుషులు, మిగతా పాలిచ్చే జంతువుల పేగులలో ఉండవలసిన సూక్ష్మజీవులన్నీ సక్రమంగా ఉండకుంటే ఆరోగ్యాలు పాడవుతాయి. అందుకే సూక్ష్మజీవులన్నింటినీ పరిశీలించి గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిఎన్‌ఏ విశే్లషణ ద్వారా వీటిని గురించి సులభంగా పరిశోధించగలుగుతున్నారు. ఒకే రకంగా కనబడినా సరే, పూర్తిగా వేరు రకాలవీ, వేరు పద్ధతిలో సాయపడగలవీ ఎన్నో రకాల సూక్ష్మజీవుల గురించి తెలియవస్తున్నది. అవి జీవుల శరీరంలో ఏయే భాగాలలో ఉండేది కూడా వివరంగా తెలుస్తున్నది.
పర్యావరణాన్ని కాపాడితే, అందులోని జీవులన్నింటినీ కాపాడినట్లేనంటారు కొంద రు. కానీ, మనకు ఆసక్తికరమయిన జంతువులు, వృక్షాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే మనం కాపాడాలనుకుంటాం. ఆ రకంగా ఎడారులు, మంచు ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో ఉండే సూక్ష్మజీవులు నిర్లక్ష్యం పాలయ్యే వీలుంది. అంటార్కిటికాలోని వోస్టోక్‌లో మంచు కింద నాలుగు కిలోమీటర్ల లోతున సరస్సు ఉందని తవ్వకాలు జరుగుతున్నాయి. అంటే, మంచుమీద సహజంగా ఉండే సూక్ష్మజీవుల వాతావరణం మారి అక్కడికి కొత్త జీవులు వచ్చి చేరుకుంటాయి.
సూక్ష్మజీవులు మాత్రమే ఎక్కువగా ఉండే ప్రాంతాలున్నాయి. అక్కడి జీవుల కారణంగా మనకు జరిగే మేలు తెలియదు. కీడు తెలియదు. మట్టిలో ఉంటే జీవ వైవిధ్యం అంతులేనిది. ఆ మట్టి మట్టిగా ఉండాలంటే, సూక్ష్మజీవులుకూడా ఉండాల్సిందే. వన్యప్రాణులను కాపాడాలని పండగలు, ప్రచారాలు చేస్తుంటాం. అంతే ఉత్సాహంతో, ‘కంటికి కనబడని లెక్కలేనన్ని’ సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలి. వాటిని కాపాడాలి. అన్ని సూక్ష్మజీవులూ ‘విషం’ కావని అందరికీ అర్థం కావాలి. అన్నీ రోగాలనిచ్చేవి కావు. అవి లేనిదే మన బతుకులు గడవని సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నా యి. నిజానికి ఉపయోగపడే సూక్ష్మజీవులే ఎక్కువ. ఈ ప్రపంచంలో సూక్ష్మజీవుల స్థానాన్ని, వాటి ఉపయోగాలనూ అందరూ అర్థం చేసుకోవడం అవసరం!

No comments:

Post a Comment