Monday 9 June 2014

రోగిని వెటిలేట‌ర్ మీద ఎప్పు‌డుపెడుతారు?


   రోగిని వెంటి లేటర్‌ మీద ఎందుకు పెడతారు, అలా పెడితే బతికే అవకాశం ఉంటుందా? అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తుంటారు. అయితే అది రోగి ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వెంటిలేటర్‌ మీద పెట్టినంత మాత్రాన కచ్చితంగా బతుకుతారనో, అసలు బతికే అవకాశం లేదనో గుడ్డిగా చెప్పలేం. రోగి కండిషన్‌ సీరియస్‌గా ఉండి, బతికే అవకాశాలు తక్కువున్నప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా వెంటిలేటర్‌ పెడతారు. అది కూడా రోగి కుటుంబ సభ్యులకు తెలిపి, వారి అనుమతితో పెడతారు. దీనివల్ల చివరి వరకూ ప్రయత్నం చేశామన్న సంతృప్తి రోగి తరపు వారికి కలుగుతుంది. అలాగని ప్రతి కేసులోనూ ఇలాగే చేస్తారని అనుకోవద్దు.
రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినప్పుడు
సాధారణంగా రక్తంలో ఆక్సిజన్‌ తక్కువ ఉన్నప్పుడు, బొగ్గు పులుసు వాయువు ఎక్కువ ఉన్నప్పుడు, రోగి ఆయాసపడుతున్నప్పుడు వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది. రోగి అపస్మారక స్థితిలో ఉండి, ఊపిరి తీసుకోలేకపోతున్నప్పుడు, ఊపిరి తీసుకోవడానికి అవసరమయ్యే కండరాలు పనిచేయనప్పుడు వెంటిలేటర్‌ పెడతారు. ఊపిరి తిత్తులకు న్యుమోనియా, సిఒపిడి , ఉబ్బసం తీవ్రంగా సోకినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు అవసరాన్నిబట్టి వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది.
పెట్టే విధానం
వెంటిలేటర్‌పై పెట్టాలంటే, ముందు శ్వాసనాళంలోకి గొట్టం వేస్తారు. దానిని వెంటిలేటర్‌ ట్యూబులతో కలుపుతారు. ఈ ప్రక్రియలో శరీరం సహజ సిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమిస్తుంది. ఇంకా నష్టం జరగకుండా, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా, నిష్ణాతులైన ఐసియు డాక్టర్లు, నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్టులు 24 గంటలూ జాగ్రత్తగా చూసుకుంటారు.
పరిస్థితి మెరుగుపడే వరకు
ఒకసారి వెంటిలేటర్‌ పై పెట్టిన తర్వాత ఆ పరిస్థితి మెరుగయ్యే వరకూ ఎన్ని రోజులైనా ఉంచాల్సి రావచ్చు. కొంతమందిలో వెంటిలేటర్‌ తీయడం కష్టం కావచ్చు. ఉదాహరణకు సిఒపిడి ఉన్నా, చాలా రోజులు వెంటిలేటర్‌ మీద ఉన్నా, ఊబకాయంవల్లా, కండరాల బలహీనత ఉన్నప్పుడు ప్రత్యేక పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఐదురోజులకన్నా ఎక్కువ రోజులు వెంటిలేటర్‌ అవసరం అయితే ట్రాక్యులోస్టమీ అని చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు, వెంటిలేటర్‌ని తొందరగా తీసేయవచ్చు. మళ్లీ అవసరమైతే ప్రమాదం లేకుండా వెంటనే కనెక్ట్‌ చేయవచ్చు.
ప్రస్తుతం సాంకేతిక, వైద్య పరిజ్ఞానం పెరిగింది. వైద్య సేవలకు కావలసిన యంత్రాలు పాశ్చాత్య దేశాలతో సమానంగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. కాకపోతే మనకున్న సమస్యంతా ఒక్కటే. అదేమిటంటే సామాన్యులు అంత ఖర్చు భరించలేకపోవడం, ఇన్సూరెన్స్‌ లేకపోవడం. వెంటిలేటర్‌పై పెట్టినప్పుడుగానీ, ఏ ఆరోగ్య సంబంధిత విషయంలోనైనా గానీ సందేహం కలిగినప్పుడు చికిత్స చేస్తున్న డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవడం మంచిది.

Curtsey with: PRAJA SEKTHY
 

No comments:

Post a Comment