మహిమల బండారాల్ని బయటపెట్టిన కోవూర్
విజ్ఞాన వీచిక
Wed, 2 Jan 2013, IST
డాక్టర్
ఎ.టి. కోవూర్ గొప్ప సైన్సు వాది. సైన్స్ సూత్రాలే తప్ప, మహిమలనేవి ఏవీ
లేవని తన జీవితకాలమంతా ప్రచారం చేశారు. అంతేకాదు. అలాటి మహిమలు ఎవరైనా
నిరూపిస్తే వారికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని 1960లలోనే ప్రకటించాడు.
ఉదాహరణకు తాను దాచిపెట్టిన కరెన్సీ నోటు నంబరును ఎవరైనా చెప్పమని సవాలు
చేశాడు. ఇలా చెప్పినవారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాననీ ప్రకటించారు.
చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సి.డి.ఎడుసూరియా అనే వ్యక్తి ముందుకు
వచ్చాడు. తాను దైవపూజలు చేస్తాననీ, అందువలన తనకు మహిమలు చేసే శక్తి
వచ్చిందనీ, అందువల్ల తాను కోవూర్ సవాలును స్వీకరిస్తానని ప్రకటించాడు.
అపుడు కోవూరు స్పందించి తాను ఒక రూపాయి నోటును ''దావాసా'' అనే పత్రిక
ఎడిటర్‌గారి ఆఫీసు సొరుగులో ఉంచానని, ఎడుసూరియన్‌ను ఆ నోటు నంబరును
చెప్పమన్నాడు. ఎడు సూరియా అనేకరోజులు పూజలు చేసి చివరికి ఒకరోజును
మంచిరోజుగా ప్రకటించి, ఆ రోజున నోటు నంబరు ఇదీ అని ఒక నంబరు ప్రకటించాడు.
కానీ ఎడిటర్‌గారి సొరుగులోని నోటు నంబరుతో ఆ నంబరును పోల్చి చూస్తే అది
పూర్తిగా తప్పని తేలిపోయింది!అలాగే మరోసారి సెవెల్లీ డిసిల్వా అనే వ్యక్తి తనకు టెలీపతీ శక్తులున్నాయనీ, వాటిద్వారా ఎవరైనా దూరంగా వేరే గదిలో ఉండి తనను ప్రశ్నిస్తే వారికి సరియైన సమాధానాలు చెప్పగలననీ ఈ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధమేనా? అని డా|| కోవూర్‌ను 'టైమ్స్ ఆఫ్ సిలోన్'' అనే పత్రికలో ఒక లేఖ ద్వారా సవాల్ చేశాడు. కోవూర్ ఆ సవాలును స్వీకరించాడు. ఆయన మహిమలను పరీక్షించడానికి 1967 ఆగస్టు 15వ తేదీ నిర్ణయమైంది. ఆనాడు ఆ పత్రిక సంపాదకులు, సహ సంపాదకుల సమక్షంలో కోవూర్ అడిగిన 7 ప్రశ్నలకు డిసిల్వా ఇచ్చిన సమాధానాలను పరిశీలించడం జరిగింది. ప్చ్! ఏడు సమాధానాలూ తప్పేనని తేలిపోయింది. టెలిపతీ బండారం ఇంతేనని లోకానికి ఆ పత్రిక ద్వారా అర్థమైంది.
- కె.ఎల్.కాంతారావు,
జన విజ్ఞాన వేదిక.
Courtesy: Prajasekthi Daily
No comments:
Post a Comment