Wednesday, 2 January 2013

కొత్త సంవత్సరం భావనకు శాస్త్రీయ ఆధారం ఉందా?

మీకు, ప్రజాశక్తి పాఠకులకు నూతన సంవ త్సర శుభాకాంక్షలు. ఇలా నూతన సంవత్సర శుభా కాంక్షలకు కారణమైన కొత్త సంవత్సరం భావనకు శాస్త్రీయ ఆధారం ఉందా?
- కె. రాజమౌళి, రీసెర్చి స్కాలర్‌, నిట్‌, వరంగల్‌
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రజాశక్తి సిబ్బందికి, పాఠక మిత్రులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇపుడిక ప్రశ్నలోని 'నూతనాని'కి వద్దాం.
శాస్త్రీయంగా (భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, భౌగోళికశాస్త్రం మొదలైన శాస్త్రాల ప్రకారం) చెప్పాలంటే 'నూతన సంవత్సరం' అనే భావనకు ఆధారం, ఆస్కారం, నిర్వచనం లేవు. ఎందుకంటే క్యాలండర్‌లోని దినాలు మానవ సమాజం చేసుకున్న అనుకూల ఘటనలు. కానీ సాధారణ దినానికి (normal day) ఎంతో కొంత శాస్త్రీయ ఆధారం ఉంది. ఒకానొక భౌగోళిక ప్రాంతంలో ఉన్న బిందువు (location) దగ్గర వెలుతురు, చీకటి ఒకే విధంగా ఉండకుండా పదే పదే చక్రీయంగా (cyclically), హఠాత్మకం (periodically or harmonically) గా మారుతుంటాయి. భూమికున్న ఆత్మభ్రమణ (spin) యంత్రాంగంవల్ల సూర్యుడి వైపున్న భూతల ప్రాంతం మారుతూ ఉంటుంది. భూమి మన గడియారంలోని కాలమానాల ప్రకారం 24 గంటలు ఆవర్తన కాలం (period) ఉండేలా తనచుట్టూ తాను తిరుగుతోంది. అందువల్ల భారతదేశంలోని వరంగల్లు ప్రాంతంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుఝాము, మళ్లీ ఉదయం... ఇలా సూర్యునికాంతి తీవ్రతలు వరంగల్‌ ప్రాంతానికి, సూర్యుడికి మధ్య గీచిన ఊహా సరళరేఖ సుదూర నీలాకాశంలో ఏయే తారల్ని నక్షత్ర సమూహాల్ని తాకుతున్నదో అన్న ఖగోళ సాపేక్షతను బట్టి చక్రీయంగా తటస్థిస్తున్నాయి. అయితే అదే వరంగల్‌లో సూర్యుడు తూర్పున పొడుస్తుంటే వరంగల్‌కు పశ్చిమదిశలో ఉన్న నిజామాబాదులో సూర్యుడు ఇంకా పొడిచి ఉండడు. వరంగల్‌కు తూర్పున ఉన్న విజయ వాడలో ఆపాటికే సూర్యుడు పొడిచేసి ఉంటాడు. భారతదేశం లో భువనేశ్వర్‌లో సూర్యోదయం అయి సూర్యుడికాంతిలో చలి కాచుకుంటున్నా (గడియారం ప్రకారం ఉదయం 7 గంటలకు) ముంబయి, భావనగర్‌, రాజ్‌కోట్‌ వంటి నగరాలు ఇంకా చీక ట్లోనే ఉంటాయి. అంటే ఖగోళశాస్త్రం ప్రకారం భువనేశ్వర్‌, విశాఖపట్నం, నిజామాబాద్‌, అమలాపురం ప్రాంతాల్లో సూర్యో దయమైనా మనదేశంలోనే మరికొన్ని చోట్ల సూర్యుడింకా కని పించడు. కాబట్టి ఆ ప్రాంతాల్లో పగలు కాదు. అదేవిధంగా ముంబయి, గోవా, రాజ్‌కోట్‌లలో సూర్యాస్తమయం అవుతూ అక్కడ కొండల చాటుకో, సముద్రం నీటి తలంలోకో సూర్య బింబం ఇంకిపోతుండగా ఆపాటికే విశాఖపట్నం, భువనేశ్వర్‌ లలో సూర్యాస్తమయం జరిగి గంటసేపయి ఉంటుంది. అక్కడ అప్పటికే చీకట్లు వచ్చి ఉంటాయి. ఇలా ఒకే దేశంలోనే వరం గల్‌కు తూర్పుపడమర, ఉత్తరదక్షిణ ప్రాంతాలలో కూడా సూర్యోదయం, సూర్యాస్తమయాలు వరంగల్‌లో లాగానే (సెకన్లలో కూడా భాగాలు చేసి చూసినట్లయితే) ఉం డవు. ఇందుకు కారణం భూమికున్న గోళీయాకృతి (spherical shape). కానీ సౌలభ్యం కోసం ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే కాలమానం ఉండాలి కాబట్టి భారత కాలమానం (Indian Standard Time, IST) అంటూ అందరం మన గడియారాల్ని ఏక కాలికం (synchronisation) చేసుకున్నాం. మనకు ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో దాదాపు అర్ధరాత్రి చీకటి ఉంటుంది. మనతో పోల్చుకుంటే, మన క్యాలెండర్‌ ప్రకారం మనకు ఇపుడు జనవరి 1 ఉదయం కాగా అక్కడ ఇంకా డిసెంబరు 31 సాయంత్రంగా ఉంటుంది. అంటే ఇక్కడ డిసెంబరు 31 అర్ధరాత్రి దాటి మనమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉబ లాటంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుం టుండగా పాకిస్తాన్‌ వాళ్లు మరో గంట, బ్రిటిష్‌వారు మరో ఐదున్నర గంటలు, ఆఫ్రికా వాసులు మరో ఏడెనిమిది గంటలు, అమెరికావాళ్లు దాదాపు మరో 12 గంటలు ఆగితేగానీ నూతన సంవత్సర శుభా కాంక్షలు చెప్పుకోలేరు. అక్కడ అమెరికాలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటుండగా మనం చెప్పేసుకొని అలసిపోయి జనవరి 1 మధ్యాహ్నం గడుపుతుంటాము.
కాబట్టి ఖగోళశాస్త్రం ప్రకారం భూమ్మీద ఎప్పుడైనా ఎక్కడైనా (any time any whereకి మరో రూపంలో) ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రాలు ఉంటాయి. మనం వరంగల్‌లో భావించే రోజువారీ, ఘటనలు మరోచోట మరో సమయంలో తటస్థిస్తుంటాయి. అంటే రోజులు, సమయాలు అన్నీ భౌగోళికంగా సాపేక్షం.
అలాగని ఋతువులు (seasons) కచ్ఛితం (absolute) అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచంలో అందరిదీ ఒకే విధమైన ఋతు భావన ఉండడంలేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న భ్రమణాక్షం (spinning axis), భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న పరిభ్రమణం కక్ష్యాతలా (orbital plane దీనినే elliptic plane అంటారు) నికి సుమారు 23 డిగ్రీల కోణంలో వంగి ఉన్నందువల్లే ఋతు వులు సంక్రమిస్తున్నాయని వినే ఉంటారు. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం తగ్గడం వల్ల వేసవి అనీ, దూరం పెరిగినపుడు చలికాలం అనీ భావించినట్లయితే అది పూర్తిగా అశాస్త్రీయం. ఎందుకంటే వేసవి కాలంలోనే భూమి శీతాకాలంలో కన్నా సూర్యుడికి దూరంగా ఉంటుంది. అది వేరే విషయం. మే, జూన్‌ నెలల ప్రాంతంలో మనం భారతదేశం లోని దక్కన్‌ ప్రాంతాల్లో విపరీతమైన వేసవి వేడితో ఉండగా ఆస్ట్రేలియా వంటి దేశాలకు, అంటార్కిటికా ధృవప్రాంతానికి అపుడు విపరీతమైన చలి. డిసెంబరు, జనవరి వంటి నెలల్లో మనం చలిలో వణుకుతుండగా అదే ఆస్ట్రేలియాలో వేసవి ఉంటుంది. పోనీ ఇదే తంతు శాశ్వతమా అంటే కాదు. దాదాపు ప్రతి 20 వేల సంవత్సరాలకోమారు భూమి భ్రమణాక్షం శంఖాకార వర్తుల గమనం (precession) చేస్తుంది. తిరుగుతున్న బొంగరం తనచుట్టూ తాను తిరుగుతూనే (spinning) తన శిరోభాగం కూడా దిశను మార్చుకుంటూ తిరగడాన్ని (wobbling) గమనించండి. ఈ దిశాభ్రంశ wobbling చలనం భూమి అనే బొంగరానికి కూడా వర్తిస్తుంది. తద్వార ప్రతి 20 వేల సంవత్సరాలకో మారు ఋతువుల ఆవర్తనం (periodicity) ఒక ప్రాంతంలో మారుతూ ఉంటుంది. అంటే వరంగల్‌లో నేటి దశలో మన క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో మండటెండల వేసవి కాగా, నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు చలికాలం. కానీ మరో పదివేల సంవత్సరాల తర్వాత ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వరంగల్‌లో విపరీతమైన చలి ఉంటుంది. అదే నవంబరు, డిశంబరు, జనవరి నెలల ప్రాంతంలో మండుటెండలు కాస్తూ ఉక్కపోత పోసే వేసవి తటస్థిస్తుంది. ఆ దిశలో క్రమేపీ ఉన్నాం కాబట్టి ఇప్పటికే ఋతువుల భావనలో కొంచెం తేడాల్ని గమనిస్తూన్నాం. ఒకే ప్రాంతంలో చూసుకున్నా డిసెంబరు 1వ తేదీ నాడు భౌగోళికంగా ఓ ప్రాంతంలో గడియారం ఎలా మారుతుందో డిసెంబరు 31 నాడు కూడా అదేవిధంగా మారుతుంది. ఉగాది అంటూ తెలుగువారు తెలుగు సంవత్సరాదిని జనవరి 1 అంటూ గ్రెగరియన్‌ క్యాలెండర్‌తో నేటి సమస్త ప్రపంచ ప్రజానీకం నూతన సంవత్సరాన్ని (New Year Day) జరుపుకున్నా, రోజులన్నీ ఒకటే. ఇంత హడావిడికి కారణం కావాలసినంత మార్పు శాస్త్రీయంగా అక్కడ ఏమీ జరగలేదు.
అయినా నెలలు, వారాలు, సంవత్సరాలు, శలవులు, పండగలు వంటివన్నీ మానవ సమాజంలో సంస్కృతికి, నాగరి కతలకు సంబంధించిన అంశాలు. మనిషి లేనిదే సైన్సు లేదు. మనిషి నిర్మించుకొన్న సమాజ సంక్షేమానికే సైన్సు జవాబుదారీ అవుతుంది. కాబట్టి వారి వారి ఇష్టాలు, ఆచారాలు, విశ్వాసా లు, అనుభూతులు, క్యాలెండర్లు, మనోవాంఛల్ని బట్టి ఆయా దినాల్ని సంబంధించుకొన్నా, సంస్మరించుకున్నా సంశయించా ల్సిన అవసరం లేదు. ఎటొచ్చీ ఆ సంబరాలు వెర్రితలలు వేయకుండా, ఆ దినాలు సమాజ ప్రగతికి దుర్దినాలు కాకుండా, ఆ సంబరాలు ఛాందస పరదాల మాటున కాకుండా ఉంటే చాలు. అంతవరకైతేనే మేలు.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy: Prajasekthi Daily

No comments:

Post a Comment