Friday, 24 April 2015

అంతరిక్షంలో ఇస్రో అద్భుతం....


చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్‌ కోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు.
న్నత స్థాయి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకుంటూ అంతరిక్ష శక్తుల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ‘ఇండియన్‌ రీజియనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం’ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) అనే వ్యవస్థను భారత్‌ సొంతంగా ఏర్పాటు చేసుకుంటోంది. అందుకు మొత్తం 29 ప్రయోగాల్లో తొలి ఒక్కటి తప్ప వైఫల్యమే ఎరుగని ఇస్రో రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ మార్చిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్ష్యకు చేర్చి వినువీధిలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా యూకేకు చెందిన డీఎంసీ ఇమేజింగ్‌ ఇంటర్నేషనల్‌ (డీఎంసీఐఐ)కు చెందిన మూడు ఉపగ్రహాలను ఎప్పుడు ప్రయోగించేది శుక్రవారం ఇస్రో ప్రకటించనుంది.
జీపీఎస్‌ (అమెరికా), గ్లోనాస్‌ (రష్యా), గెలీలియో (యూరప్‌), బైద (చైనా) మాదిరిగానే భారత్‌ కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనే ఉప్రగ్రహ ఆధారిత గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ సేవల్ని సొంతంగా సమకూర్చుకుంటోంది. ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఇది నాలుగోది. త్వరలో ప్రయోగించే మరో మూడు ఉపగ్రహాలతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో ఖ్యాతి ఇనుమడించింది. స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు మళ్లించే లక్ష్యంతో భారత్‌లో 1972లో అంతరిక్ష విభాగం ఏర్పాటైంది. 1983లో భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్ఠ (ఇన్‌శాట్‌)ను నెలకొల్పారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, టెలి-మెడిసిన్‌, టెలి-ఎడ్యుకేషన్‌, వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ కోసం ఇస్రో ఇప్పటిదాకా 30 సమాచార ఉపగ్రహాలను రోదసికి పంపింది. తర్వాత 1988లో భారత రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎస్‌) ఆవిర్భవించింది. ఖనిజ వనరులు, జల వనరులు, మత్స్యసంపద, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అంశాలపై సమాచార సేకరణ గ్రామీణాభివృద్ధి - పట్టణ ప్రణాళికల రూపకల్పన, వ్యవసాయోత్పత్తుల అంచనాల తయారీ, ప్రకృతి విపత్తులపై అధ్యయనం కోసం ఇస్రో దాదాపు పాతి రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను పంపింది. వీటిలో 2 రోసోర్స్‌ శాట్స్‌, 4-కార్టో శాట్స్‌, 2 రైశాట్స్‌, ఓషనశాట్‌, మేఘాట్రోపిక్స్‌, సరళతో కలిపి ప్రస్తుతం 11 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి. ఇవే కాకుండా భారత్‌ 40 దాకా విదేశీ ఉపగ్రహాల్ని సైతం కక్ష్యకు చేర్చి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది.
2011-15 మధ్యకాలంలో 15 విదేశీఉపగ్రహ ప్రయోగాల ద్వారా 40 మిలియన్ల యూరోలు (రూ.270 కోట్లు) సంపాదించింది. ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో అనూహ్య మలుపులు, ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠతో అంతరిక్షంలో సాగే ఇతివృత్తంగా ‘గ్రావిటీ’ అనే హాలివుడ్‌ సినిమా ఖర్చు కంటే చౌకగా ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ (మామ్‌) ప్రయోగాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. భూమికి గరిష్ఠంగా 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహానికి కేవలం రూ. 450 కోట్లు ఖర్చుతో మామ్‌ లేదా మంగళయాన్‌ ప్రయోగించి భారత్‌ చరిత్ర సృష్టించింది. మామ్‌ ప్రాజెక్టుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మన త్రివర్ణపతాకాన్ని అంతరిక్షంలో సమున్నతంగా నిలిపింది. దాంతో అరుణ గ్రహాన్ని అందుకున్న దేశాలు/సంస్థల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచి యావత్ప్రంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఇవాళ ఇన్నేసి స్పూర్తిదాయక విజయాలు సాధిస్తున్నా మొదట్లో ఇస్రో పయనం కష్టాలు, సవాళ్ల ముళ్లబాటలోనే సాగింది. తొలినాళ్ళలో 1980లలో సోవియట్‌ ‘వోస్తాక్‌’ లాంచర్లపై ఆధారపడిన ఇస్రో, అనంతరం సొంతంగా శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ), ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఏఎస్‌ఎల్‌వీ), పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) వంటి రాకెట్లను దశలవారీగా రూపొందించింది. కానీ భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే భూ స్థిర కక్ష్యను అందుకోవాల్సిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల విషయంలో మాత్రం పరాధీనత తప్పలేదు. భారత్‌ ఈ ప్రయోగాల కోసం యూరోపియన్‌ ‘ఏరియన్‌’ రాకెట్లపై ఆధారపడవలసి వస్తోంది. పీఎస్‌ఎల్‌వీ కంటే మెరుగైన జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)ని ఇస్రో తయారు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు క్రయోజెనిక్‌ ఇంజన్లతో కూడిన రాకెట్లను తయారు చేయవలసి ఉంటుంది. క్రయోజెనిక్‌ పరిజ్ఞానం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనాల సొత్తు. 1991లో ఇస్రో, సోవియట్‌ అంతరిక్ష సంస్థ గ్లవ్‌కాస్మోస్‌ మధ్య ఆ పరిజ్ఞానం మార్పిడిపై ఒప్పందం కుదిరినా, అమెరికా మోకాలడ్డింది. రష్యాపై ఒత్తిడి పెరగడంతో క్రయోజెనిక్‌ పరిజ్ఞానం మనకు అందకుండా పోయింది. కేవలం క్రయోజెనిక్‌ రాకెట్లను మాత్రమే రష్యా మనకు అందించింది. 20 ఏళ్ళ పాటు నిర్విరామ కృషితో సొంత క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అమర్చి జీఎస్‌ఎల్‌వీ-డీ 5 రాకెట్‌ నిరుడు జీశాట్‌-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం గల దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో మానవసహిత రోదసీయాత్రల కోసం ‘జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3’ రాకెట్లను ఇస్రో రూపొందించింది. చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. దీనికోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు. ఇద్దరేసి వ్యోమగాముల్ని రోదసికి తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు వీలుగా రష్యన్‌ సోయజ్‌ కేప్యూల్‌ను రీ డిజైన్‌ చేసి సొంత క్రూ మాడ్యూల్‌ను తీర్చిదిద్దనున్నారు. భావి వ్యోగాముల కోసం బెంగళూరులో శిక్షణా సంస్థ ఏర్పాటు, శ్రీహరికోటలో మూడోల్యాంచ్‌ప్యాడ్‌ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. గ‘ఘన’తలాన మువ్వన్నెల పతాక రెపరెపలాడాలి.
జమ్ముల శ్రీకాంత్‌
ఫ్రీలాన్సర్‌
Courtesy with:  Andhra Jyothi 

No comments:

Post a Comment