Tuesday, 7 April 2015

జీవం అంటే ఏమిటి?
Posted on: Tue 07 Apr 20:06:43.924176 2015
     గతవారం డార్వినిజంపై దాడి గురించి చెప్పుకున్నాం. ఈ వారం జీవం అంటే ఏమిటో తెలుసుకుందాం.
Third International Conference on Science and Scientists -2015  నినాదమైన “The Scientist is able for explain Science but is Science able to explain Scientist?” ''శాస్త్రవేత్త శాస్త్రాన్ని వివరించగలుగుతున్నారు కానీ, శాస్త్రం శాస్త్రజ్ఞుణ్ణి వివరించగలుగుతుందా?'' అన్న ప్రశ్నకు మరికొంత సమాధానాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
                  ఇక్కడ నిర్వాహకుల వెనుక ఉన్న ఛాందసవాద భావజాలం, దోపిడీవర్గాలకు వత్తాసునిచ్చే విధంగా తికమకలోకి సైన్సును నెట్టే కుహనా తాత్వికత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సైన్సును సైంటిస్టు నుండి వేరుచేసి, రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వస్తువులు (వఅ్‌ఱ్‌ఱవర) గా చూపుతున్నారు. సైన్సు ఎపుడూ సైంటిస్టుని వదిలి ఉండదు. భౌతికవాద సూత్రాల ప్రకారం, చారిత్రక భౌతికవాదం ప్రకారం ప్రతి మనిషి సైంటిస్టే. తరతమ భేదాల్లో ప్రకృతి వాస్తవికతా ఆవిష్కరణల్లో పాలుపంచుకోవడం ఉంటుందిగానీ ప్రజలందరూ శాస్త్రవేత్తలే.
                  ప్రజల్ని విడిచి శాస్త్రం ఉండదు. శాస్త్రం అంటే ఓ సూర్యుడో, చందమామో, ఫసిఫిక్‌ మహాసముద్రమో కాదు. సైన్సు అంటే మానవజాతి సమస్తం తమ బతుకుదెరువు కోసం, ప్రకృతిపై పట్టు సాధించడం కోసం, ప్రకృతి రహస్యాల్ని ఛేదించి, ఆ రహస్యాల ఆధారంగా సాంకేతికతను సాధించడమే. అందుకే మానవజాతికే సైన్సు ఉందిగానీ పురుగుల గుంపునకు, తేనెటీగల తుట్టెలకు, పూల తోటలకు, గొర్రెల మందకు సైన్సు ఉండదు. నిర్దిష్టమైన సంఖ్యల్ని, నియమాల్ని ఇతర జంతువులు, జీవజాతులు తమ తదుపరి తరాలకు గ్రంథ రూపేణా, చెరిగిపోని సంకేతాల రూపేణా దాఖలు చేయవు. వాటికి ఆ వరవడి, సంప్రదాయాలు లేవు.
సైంటిస్టు సైన్సును కేవలం వివరించడు. సైంటిస్టు సైన్సును ఆవిష్కరిస్తాడు. సేకరించుకొంటాడు. ఆ సైన్సులో తాను అంతర్లీనమవుతాడు. తన శరీర అవయవ నిర్మాణం గురించి, ఆలోచనలకు కారణమైన నాడీతంత్రుల గురించి, మెదడు నిర్మాణం గురించి ఆరా తీస్తాడు. సైన్సు, సైంటిస్టు ఒకే నాణేనికి ఇరు పార్శ్వాల కింద అర్థంచేసుకోవాలి. ఆ సదస్సు నిర్వాహకులకు ఒక్కటే ఇష్టం. సైన్సు ఛాందసభావాల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి, దాన్ని తక్కువ చేసి చూపాలి. మానవుడు అనే వస్తువులోని జీవానికి సైన్సు కారణం చెప్పదనడం వారి వాదన. మనిషి, తదితర జీవులు సృష్టించబడ్డాయని తీర్మానించడం వారి పరమావధి. జీవం అంటే మరణం లేకపోవడమన్న కనీస సత్యాన్ని వారు విస్మరిస్తారు. మరణానికి కారణమైనవేమిటో సైన్సు వివరిస్తోంది.
నీటిలో పడి ఊపిరి ఆగిపోతే మనిషి మరణిస్తాడు. ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం వల్ల కణాలకు సరిపడినంత శక్తి కావాలంటే గ్లూకోజు అణువులు ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందాలన్న వాస్తవం మృగ్యం కావడం వల్లనే నీటిలో మునిగిన వ్యక్తి చనిపోతాడు. తాచుపాము కాటుకు మనిషి ఎందుకు మరణిస్తాడు? ఆ విషంలోని ప్రోటీన్లు రక్తం ద్వారా మెదడుకు చేరి దాని చర్యలను చిన్నాభిన్నం చేయడం ద్వారా గుండె కదలికలకు జరగాల్సిన సంకేతాలు ఆగిపోవడం వల్ల చనిపోతాడు. ఉరి వేసుకొంటే మనిషి ఎందుకు చనిపోతాడు? ముసలి ప్రాయంలో ఎందుకు మరణిస్తాడు? రోడ్డు ప్రమాదాల్లో ఎందుకు మరణిస్తాడు? క్యాన్సరు వస్తే ఎందుకు మరణిస్తాడు; గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది వచ్చినపుడు ఎందుకు దాదాపు మరణానికి చేరువవుతాడు? ఎయిడ్స్‌ వ్యాధి వల్ల ఎందుకు మరణం తథ్యం? భోపాల్‌ గ్యాసు ప్రమాదం వల్ల వేలాదిమంది ప్రాణాలు ఎందుకు పోయాయి? ముషీరాబాదు ప్రాంతంలో ఆ మధ్య కలుషిత నీరు తాగితే చాలామంది పేదవారు ఎందుకు మరణించారు? యుద్ధంలో తుపాకీ తూటాలకు లోనైనవారు మరణించిందెందుకు? రైలు బోగీలకు, బస్సులకు నిప్పంటుకొంటే ఎందుకు ప్రయాణీకులు మరణిస్తారు? చాలాకాలంగా ఎండిపోయిన బావుల్లోకి దిగిన ఆరోగ్యవంతుడు ఎందుకు చనిపోతాడు?... ఇలా ఎన్నో మరణాలకు కారణాల్ని సైన్సు పూర్తివివరాలతో తెలుపుతోంది. శరీరంలో ప్రతి కణం, కణజాలం కీలకావయవాలు, సున్నితభాగాలు సరియైన పాదార్థిక నిర్మాణంతోను, దరిమిలా సక్రమమైన పాదార్థిక చర్యలతోనూ ఉండడమే జీవం.
ఉదాహరణకు ఓ లేటెస్టు మొబైల్‌ ఫోనును తీసుకోండి.. అందులో ఉన్న ఏ వస్తువుకూ జీవం లేదు. జీవంలాగా తనంత తాను కదలదు. ప్రక్కనే ఎన్ని పదార్థాలను పెట్టినా తనలాంటి మరో సెల్‌ఫోన్‌ను సృష్టించలేదు. కానీ ఆ సెల్‌ఫోన్‌లో కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు జరుగుతాయి. ఫొటోలు తీస్తుంది, బయటి నుంచి వచ్చే మాటల్ని వినిపిస్తుంది. మన మాటల్ని బయటికి పంపుతుంది. చేయి తగిలితే టచ్‌స్క్రీన్‌ మీద బొమ్మలు మారతాయి. సినిమాలు, పాటలు, వీడియోలు ఆడిస్తుంది. స్క్రీను మీదే బొమ్మలు వస్తున్నాయి కదాని సెల్‌ఫోను స్క్రీనును ఊడబెరికి ప్రక్కనబెడితే అందులోంచి బొమ్మలు రావు. సెల్‌ఫోను నడవాలంటే లోపలున్న బ్యాటరీ ముఖ్యం కాబట్టి, బ్యాటరీని టేబుల్‌పై ఉంచితే అదే బ్యాటరీ సెల్‌ఫోను చేసే పనుల్ని చేయదు. సెల్‌ఫోనులోని అన్ని వస్తువుల సమగ్ర, సంక్లిష్ట అమరికలోనే సెల్‌ఫోను నిర్మాణం, దాని పనితీరు నిబిడీకృతమై ఉన్నాయి. పనిచేయని సెల్‌ఫోనులో బ్యాటరీ బాగున్నా, స్క్రీన్‌ బాగున్నా, మరేదో బాగలేకపోవడం వల్లనే పనిచేయడం లేదు. అలాగే మనిషి లేదా ఓ జీవకణం సెల్‌ఫోను కన్నా సంక్లిష్టమైన నిర్మాణపూరితం. సెల్‌ఫోను చరిత్ర కొన్ని దశాబ్దాలది మాత్రమే. కానీ జీవకణం చరిత్ర వందల కోట్ల సంవత్సరాలది. శాస్త్రవేత్త అనే మనిషి శాస్త్రాన్ని సృష్టించే ధీశాలి కావచ్చు. అయితే అదే శాస్త్రం శాస్త్రవేత్తలో ఉన్న తెలివితేటలకు సృజనాత్మకతకు, నడవడికకు, జ్ఞానానికి, పరిజ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, ఆకలిదప్పులకు, ఆలోచనాసరళికి పాదార్థిక భూమికను ఆపాదిస్తోంది. ఓ మనిషికున్న భావస్ఫోరకత సైన్సు పరిధిలోకి రాదని ఆ సదస్సు నిర్వాహకుల భావన. మనిషి ఆలోచన మెదడులోనే ఉంటుంది. మెదడు అనే పదార్థంలో ఉంటుంది. అయితే ఆ పదార్థం ఓ గుండుగుత్తగా బెల్లం ముద్దలా, బంగారపు బిస్కెట్‌లాగా లేదు. అందులో ఎంతో పాదార్థిక విశిష్టత ఉంది. గుణాత్మకత, పరిమాణాత్మకత ఉన్నాయి. ప్రతి మెదడు కణంలో ఉన్న డిఎన్‌ఎ లేదా ఆర్‌ఎన్‌ఎలలో ఉన్న కోడాన్ల సంఖ్య, అమరిక ఆయా మెదడు కణాల లక్షణాల్ని వ్యక్తీకరిస్తాయి. ఆరోగ్యంగా అన్నీ బాగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో నవ్వుతూ సరదాగా ఉన్న మనిషిని ఆసుపత్రి ఆపరేషను థియేటర్‌లో నైట్రస్‌ ఆక్సైడు అనే వాయువును కాసేపు పీల్పింపజేస్తే మత్తులోకి వెళ్తాడు. ఎన్ని జోకులు వేసినా అపుడు నవ్వలేడు. ఎదురుగా పిల్లల్ని దండిస్తున్నా ఏడవలేడు. పంచభక్ష్య పరమాన్నాల్ని ముందుపెట్టినా అబగా చూడలేడు. ఆయనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని ఎంత బాగా వినిపించినా ఆనందించలేడు. కేవలం ఓ నిర్జీవ నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు అణువుల ప్రభావంతో ఆయనలోని కళాపోషణ, భావుకత, అరిషడ్వర్గాలు, ఆకలిదప్పులు, ఆర్ద్రత, వాత్స్యలం, దయాకారుణ్యాలు, కోపతాపాలు, శృంగార కామాలు, నియమ నిష్టలు, కృత నిశ్చయాలు, భయ విహ్వలతలు, నవరస భావాలేమీ ఉండవు. చేష్టలుడిగి, కేవలం పరిమిత స్వతంత్ర నాడీవ్యవస్థ పరిధిలోకి నెట్టబడి బతకుతుంటాడు. కాబట్టి మనిషికున్న సకల బాహ్య, అంతరంగిక, చైతన్యపూరిత ప్రకటనల వెనుక జీవిస్తుండడం (మరణం లేకుండా ఉండడం) వెనుక పాదార్థిక భూమిక ుంది.. ఎవరు ఎందుకు ఎపుడు నవ్వుతారో, పిచ్చివారు అంటే ఎవరో, నడవడిక బాగా ఉన్నవారు ఎవరో, దొంగలెవరో, దొంగబుద్ధులెవరివో, తెలివి ఎవరిదో, తెలివి తక్కువతనం ఎందుకో, ఆకలి ఎపుడో, ఆకలి లేనిదెపుడో, ఇలాంటి ప్రతి భావ స్పురణ వెనుక పాదార్థిక నేపథ్యం ఉంది. సామాజిక పరిసరాలు కూడా మనిషి ఆలోచనలను నియంత్రిస్తాయి. సామాజిక పరిస్థితులంటేనే ఏమి తింటున్నాడు, ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అన్న ఎన్నో భౌతిక వాస్తవాలే!
(పైవారం డార్విన్‌ 'నిజం' గురించి సంక్షిప్తంగా)
ప్రొ|| ఎ. రామచంద్రయ్య

సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment