Wednesday 22 February 2012

బాబాలు.. నిజానిజాలు

బాబాలు.. నిజానిజాలు

బాబాల వల్ల సామాన్యులు ఏదో పేరుతో మోసగించబడుతున్నారనే వార్తలు నిత్యం వస్తున్నాయి. ఒకవైపు చంద్రునిపై నివాసాల్ని ఏర్పర్చుకుని, పరిశోధనలను నిర్వహించేదిశలో విజ్ఞానశాస్త్రం దినదినాభివృద్ధి చెందుతోంది. మరోవైపు ఈ బాబాల మోసాలు సమాజంలో పెచ్చుమీరిపోయి ప్రజలు మోసపోతున్న వార్తలు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గిస్తున్నాయి. ఏ పేరుతో వ్యవహరించినప్పటికీ, బాబాలలో కొన్ని సాధారణ లక్షణాలు ఒకేలా ఉన్నాయి. వీరందరికీ మానవాతీతశక్తులు, మహిమలున్నట్లు, వీరు మంత్రాలు, తంత్రాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిని ఆశ్రయించి, కటాక్షం పొందితే సామాన్యుల కష్టాలు తొలగిపోతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. తదనుగుణంగా ఏదో సందర్భంలో వీరు తమకున్నాయని చెప్పుకొనే 'మానవాతీత శక్తులను, మంత్ర-తంత్రాలను' ఏదో రూపంలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏదో ఒక మతవిశ్వాసాల ఆధారంగానే వీరు ఈ పనిచేస్తున్నారు. వీరికీ మతానికీ, మతవిశ్వాసాలకూ ఉన్న సంబంధమేమిటి? వీరు ఇంతమందిని ఎలా భ్రమింప చేయగలుగుతున్నారు? తద్వారా వేల కోట్ల స్థాయిలో ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు? అని ఈనాటి 'విజ్ఞానవీచిక' 'జనవిజ్ఞాన వేదిక' సహకారంతో పరిశీలిస్తుంది.
అసలు మన రాజ్యాంగం ఆధునిక భావాలతో రూపొందింది. మన దేశం సార్వభౌమాధికారాలు గల సోషలిస్టు (సమసమాజం), లౌకిక, ప్రజాస్వామ్య విలువలు గల రిపబ్లిక్‌గా ఉపోద్ఘాతంలోనే చెప్పబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ-క్లాజ్‌ హెచ్‌ ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ విలువల్నీ, నూతన విషయాలను కనుక్కొనే స్ఫూర్తి, సంస్కరణనశీలతను అభివృద్ధిపరచడం ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యతగా నిర్దేశించబడింది. అయితే, ఎవరైనా, ఏ మత విశ్వాసాన్నైనా కలిగి ఉండటానికి, తదనుగుణంగా ప్రచారం చేసుకోవడానికి మన రాజ్యాంగం అవకాశం కలిగించింది. రాజ్యాంగానికి బద్ధులై, అది నిర్దేశించిన విలువలను పెంపొందించే రూపంలో పాలకులు అన్ని నిర్ణయాలూ తీసుకోబడాలి. ఈ నిర్ణయాల్లో నిర్ణయాలు తీసుకునేవారి వ్యక్తిగత అభిప్రాయాలను, విలువలను ప్రతిబింబించడానికిి రాజ్యాంగంలో ఏ ప్రత్యేక అవకాశం లేదు. కానీ, దురదృష్టంగా తమ అధికార బాధ్యతలను అటుంచి, కనీస పౌరుల బాధ్యతలను మరిచి, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధిపర్చాల్సిన ప్రథమపౌరుడు (దేశాధ్యక్షుడు), ప్రధాని, రాష్ట్ర ముఖ్యమం త్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి మంత్రులు బాబాలనెందరినో దర్శిస్తూ, సాష్టాంగ పడుతూ, పూజిస్తూ తమ స్థాయిని దిగజార్చు కొంటున్నారు. అంతేగాకుండా, బాబాలకు లేని గౌరవాన్ని కలిగిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని, బాబాలు అధికార మద్దతుతో సామాన్యులను ఇంకా పెద్దఎత్తున మోసం చేస్తున్నారు. వాళ్లు చేసే దుశ్చర్యలను రాజ్యం (ప్రభుత్వం) నియంత్రించడంలో విఫలమవు తుంది. ఫలితంగా, వీరి కార్యక్రమాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఇవి ఎంతగా విస్తరిస్తున్నాయంటే మతాన్ని, మతవిశ్వాసాలను వినియోగించుకొని, ఎలాంటి చట్ట వ్యతిరేక, మోసాలనైనా ఏ శిక్షకు గురికాకుండా చేయవచ్చనే అభిప్రాయం బలంగా, వేగంగా వ్యాపిస్తుంది. వీరెవ్వరూ ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేయాలని ఆచరణలో భావించడం లేదు.
మతమూ..వీరు..
ఆధ్యాత్మికం ఆత్మకు సంబంధించింది. ఆత్మ జీవునికీ లేదా భగవంతునికీ సంబంధించింది. బాబాలకు సంబంధించినంత వరకూ తమ ఆత్మతో సంబంధం కలిగి ఉంటారుగానీ, ఇతరుల ఆత్మలతో సంబంధం ఉండదు. బాబాలు దైవత్వాన్ని తమకు ఆపాదించుకుంటున్నారే కానీ, వారు ఆచరించే విలువలకూ, దైవ విలువలకూ ఎలాంటి సంబంధం లేదు. తాత్వికంగా చూస్తే, 'భగవంతుని భావన' ఒక అపారమైన ఉన్నతశక్తి స్వరూపంగా అభివర్ణిస్తారు. నిర్వికారుడు. ఈ భావనల ఆధారంగానే విశ్వాసాలు, మతం, మతవిశ్వాసాలు రూపొందాయి.
ఏ అభిప్రాయాన్నైనా ప్రశ్నించకుండా కేవలం నమ్మకం ఆధారంగా అంగీకరించడాన్నే మూఢ విశ్వాసంగా భావిస్తున్నాం. మతవిశ్వాసాలు గలవారు తమ విశ్వాసాలను ప్రశ్నించ డాన్ని అంగీకరించరు. గరిష్టంగా, అనుమాన నివృత్తికోసం వివరణలను కోరవచ్చు. ప్రశ్నించినవారిని వీరు వ్యతిరేకిస్తారు. తాత్వికంగా పరిశీలిస్తే, విజ్ఞానశాస్త్ర విశ్వాసాలు, మత విశ్వాసాలు రెండూ ప్రకృతి, పరిసరాలను అర్థంచేసుకునే ప్రక్రియలో ఉద్భవించాయని చెప్పవచ్చు. మన చుట్టూ పరిసరాల్లో ఉండే జీవంలేని పదార్థాలు దేనితో తయారయ్యాయి? వేడి, వెలుతురు, ధ్వని, ఉరుము, మెరుపులలో ఇమిడి ఉన్న భౌతిక ప్రక్రియలు ఏమిటి? భూ ఉపరితలానికి సంబంధం లేకుండా ప్రతిరోజూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి? ఎందుకు కదులుతున్నాయి? పగలు-రాత్రి మొదలైనవి ఎందుకు, ఎలా క్రమం తప్పకుండా వస్తున్నాయి? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రక్రియలోనే మత, విజ్ఞానశాస్త్ర విశ్వాసాలు ఏర్పడ్డాయి.

మూఢవిశ్వాసాలు మతం ద్వారా ఏర్పడతాయి. సైన్స్‌ ద్వారా కూడా విశ్వాసాలు ఏర్పడతాయి. కానీ, ఈ రెంటికీ ఎంతో తేడా ఉంది. సైన్స్‌ ఆధారిత విశ్వాసాలు (నమ్మకాలు) ప్రయోగం, అనుభవం ఆధారంగా ఏర్పడ్డవి. వీటిని ఎప్పుడైనా, ఎవరైనా తిరిగి ప్రయోగం ద్వారా నిర్ధారించుకోవచ్చు. కానీ, మత విశ్వాసాలకు ఈ అవకాశం లేదు. మత విశ్వాసాల ద్వారా అందే సమాధానం / సమాచారం అతేంద్రియశక్తుల నుండి మానవుల స్వీకరించి, వారు తిరిగి ఇతరులకు అందిస్తున్నామని చెబుతారు. అందువల్ల వీరందించే సమాధానం ఇచ్చేవారి మీద ఆధారపడి ఉంటుంది. మత విశ్వాసంలో ఉన్న ఈ ప్రక్రియను బాబాలు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకొంటున్నారు. కొంతమంది (కల్కి విజయకుమార్‌ లాంటివారు) ఒకడుగు ముందుకు వెళ్లి తామే భగవత్‌ స్వరూపులమని చెప్పుకుంటూ ప్రజల్ని మోసగిస్తున్నారు.
ఏ మతం కూడా అవాస్తవాలతో ఇతరులను మోసం చేయాలని చెప్పడం లేదు. వాస్తవాలనే చెప్పాలని నిర్దేశిస్తున్నాయి. దాదాపు అన్ని మతాలూ నిరాడంబర జీవితాన్నే ప్రోత్సహిస్తున్నాయి. ఇతర జీవుల పట్ల, ముఖ్యంగా తోటి మానువులతో, కరుణతో వ్యవహరించాలని నిర్దేశిస్తున్నాయి. కష్టాలు ఉన్నవారికి సహాయపడాలని బోధిస్తున్నాయి. మానవసేవే, మాధవసేవ అని నానుడి. కానీ, నిత్యజీవితంలో బాబాలు పాటించే విలువలు వీటన్నింటికీ విరుద్ధం. వీరు స్వయంగా మతవిశ్వాసాలను పాటించడం లేదు. వీరి కార్యక్రమాలన్నీ మత ప్రభోదాలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. కానీ, వీరు ప్రజల్లో ఉన్న మతవిశ్వాసాలను, భ్రమలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.

కేవలం హస్తలాఘవం (దృష్టిమరల్చి చేతివాటంగా చేసే మ్యాజిక్స్‌), కొన్ని పదార్థాల మధ్య జరిగే రసాయనిక చర్యలు, సహాయకులు అందించే మద్దతు ద్వారా తమకు ఏవో అద్భుత, మానవాతీత శక్తులున్నట్లు, తాము దైవాంశ సంభూతులమన్నట్లు ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. మతవిశ్వాసాల ఆధారంగా (అత్యధిక ప్రజలు ఏదో ఒక మతాన్ని నమ్ముతున్నవారే). అమాయక ప్రజల్ని, భయం, నిస్సహాయత, పేరాశకు లోనైనవారిని ఈ బాబాలు తేలికగా మోసం చేస్తున్నారు. వీరు ఏదో రూపంలో నష్టపోతున్నారు. స్వార్థపర, అవినీతి, వ్యాపార, వాణిజ్య, రాజకీయ శక్తులు కూడా వీరితో కుమ్మక్కైవుతూ తమ తమ ప్రయోజనాలను పెంపొందించు కుంటున్నారు. తమ సమస్యలకు బాబాలు పరిష్కారం చూపగలరని సామాన్యులు నమ్ముతూ తమ సర్వస్వాన్నీ అర్పిస్తున్నారు. వారు ఏం చెపితే అది చేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉద్యోగం, పదోన్నతి, అనారోగ్య సమస్య ఏదైనా తాము నమ్మే బాబాలు, స్వామీజీలు లేదా అమ్మల చేతుల్లో ఉందనీ, వారు కరుణిస్తే తమ సమస్య నివృత్తి అవుతుందని భ్రమిస్తున్నారు. కొలుస్తున్నారు. అప్పులు చేసైనా భారీగా కానుకలూ సమర్పించుకుంటున్నారు. బాబాలు విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డారు. విజ్ఞానశాస్త్రం అందించే సర్వసుఖాలనూ, సంసారులు పొందే అన్ని సుఖాలను వీరు అనుభవిస్తున్నారు. వీరందరూ ఏదో పేరుతో పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీరందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కార్యక్రమాలతో సంబంధం కలిగి ఉన్నవారే! పరిపాలనలో కూడా జోక్యం కలిగి ఉన్నారు. వీరందరూ ఐహిక లోకంలో సుఖాలను పొందుతూ ప్రజలకు మాత్రం పరలోకం, ఆధ్యాత్మిక చింతన గురించి బోధనలు చేస్తున్నారు.
ఇది మనకూ అవసరమే..
మంత్ర, తంత్రాలను, దుష్ట కార్యక్రమాలను, ఇతర అకృత్యాలను నిరోధించి, సామాన్యులను రక్షించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని 2005లో రూపొందించింది. మహారాష్ట్ర మంత్ర,తంత్ర, దుష్ట, నిరసించదగ్గ కార్యాల నిర్మూలన చట్టం (మహారాష్ట్ర, ఎరాడికేషన్‌ ఆఫ్‌ బ్లాక్‌ మాజిక్‌ అండ్‌ ఈవిల్‌ అండ్‌ అభోరీ ప్రాక్టీసెస్‌ - 2005 యాక్ట్‌) పేరుతో రూపొందింది.
దెయ్యాల్ని లేదా ఇతర దుష్టశక్తులను పారద్రోలే పేరుతో ఎవరినైనా తాడు లేదా గొలుసుతో కట్టివేయడం, కర్రతో లేదా ఇతరత్రా కొట్టడం, చెప్పులు నానిన నీటిని తాగించడం, ముంత పొగ పెట్టడం, వేలాడదీయడం, వెంట్రుకలను గుంజడం, కాల్చడం, మలమూత్రాలను తాగించడంలాంటి అన్ని అకృత్యాలు ఈ చట్టం కింద నేరాలుగా పరిగణించబడతాయి. అద్భుతాల పేరుతో ఎవర్నైనా మోసం చేయడం, తద్వారా డబ్బు సంపాదించడం నేరాలుగా పరిగణించబడ్డాయి. వీటిని గురించి ప్రచారం చేయడం, ఇతరులకు ఏదో రూపంలో తెలియజేయడం కూడా నేరంగా ఇందులో పేర్కొనబడింది. అతేంద్రియ, అద్భుతశక్తులను సంతృప్తిపరిచే పేరుతో జీవితాలకి ప్రమాదాన్ని కొనితెస్తూ, గాయపరుస్తూ లేదా ఇతరత్రా హింసించడాన్ని నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. గుప్త నిధులు కనుగొనేపేర, భూగర్భజలాల్ని కనుగొనేపేర లేదా ఇతర ప్రయోజనాలు వనగూరుస్తామని చేసే మంత్రతంత్రాలకు, ఈ సందర్భంగా ఇచ్చే అన్నిరకాల బలుల్ని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఏదో ఒక శక్తి ఆవహించిందని మోసం చేస్తూ ఇతరులను భయపెట్టడం కూడా ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. అన్నిరకాల మంత్ర, తంత్రాలను, దయ్యాలను ఉపయోగిస్తూ ఇతరులను భయపెట్టడానికి, దుష్టశక్తుల్ని వదిలిస్తామని భక్తుల్ని హింసించడం నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. జబ్బుల్ని నయం చేస్తామని చేసే మాయోపాయాలను (ఉదా: కంటిచూపుతో రోగం నయం చేయడం, స్మర్శతో నయం చేయడం, తొక్కితే, తన్నితే నయం చేయడం.. మొదలైనవి) కూడా నేరాలుగా ఈ చట్టం పరిగణి స్తుంది. సంతానాన్ని కలిగిస్తామని అత్యాచారాలకు పాల్పడడం నేరంగా పరిగణిస్తుంది. వికలాంగుల దగ్గర అద్భుతశక్తులున్నా యని వారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయడం, లేదా ఇతర విధంగా భ్రమింపచేయడం ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఈ కార్యక్రమాలకి మద్దతు తెలుపుతూ, ప్రచారం చేసేవారిని కూడా నేరస్తులుగానే ఈ చట్టం పరిగణిస్తుంది. వీరు శిక్షార్హులు.

ఈ చట్టం కింద శిక్షించడానికి ఎవరూ ఫిర్యాదు చేయాల్సిన అవసరంలేదు. నిర్దేశించిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీసు అధికారి ఈ చట్టం నిఘా ఆఫీసర్‌గా పనిచేస్తారు. జరుగుతున్న మోసాలను నివారించడానికి ఈ చట్టం నిర్దేశించిన విధంగా ఈయనే అన్ని చర్యలూ తీసుకుంటారు.
ఈ చట్టం కింద నేరం మోపబడిన వారికి బెయిల్‌ ఉండదు. ఈ చట్టం కింద నేరం చేసిన వారికి కనీసం ఆరునెలల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది. దీంతోపాటు రూ.ఐదు వేల నుండి 50 వేల వరకూ జరిమానా కూడా విధిస్తారు.
ఇటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా చేస్తే దొంగబాబాలను, బాణామతి, చేతబడి, మంత్ర, తంత్రాలు (తాంత్రికులు) ద్వారా మోసగించే వారి నుండి ప్రజలకు రక్షణ కలిపించవచ్చు. దొంగబాబాలు, చేతబడి చేసేవారిని, వీరిని అడ్డంపెట్టుకుని మోసం చేసేవారి కార్యక్రమాల్ని అరికట్టవచ్చు. మత విశ్వాసాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు.

పరిష్కారం...

ప్రస్తుత సమాజంలో ప్రజలకు కనీస అవసరాలు కూడా తీరడంలేదు. అత్యధికులు ఏదో ఒక అసంతృప్తితో, అశాంతితో, అభద్రతా భావాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. కొందరు స్వార్థపరశక్తులు అగ్నికి ఆజ్యంలా వీటిని మరింత పెంచి, పోషిస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. దీంతో ప్రజలు ఎటూ పాలుపోక ఇటువంటి దొంగబాబాలను నమ్ముతూ తేలికగా తమ కష్టాలను గట్టెక్కవచ్చేమోనని నమ్ముతున్నారు. వీటి నుండి ప్రజల్ని బయటపడేయాలంటే ప్రయోగాల ఆధారంగా విజ్ఞానశాస్త్రం రూపొందించిన విశ్వాసాల ఆధారంగా నిత్యజీవితాన్ని కొనసాగించాలి. దీంతోపాటు రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా అందరిలో శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకిక భావాల్ని పెంపొందించుతూ అభివృద్ధి మార్గంలో పయనించడమే అన్ని సమస్యలకూ పరిష్కారం. మూఢవిశ్వాసాల ఆధారంగా ఉన్న బాబాలను, మాంత్రికులను, తాంత్రికులను, చేతబడులు చేసేవారిని, ఇతర దుష్ప్రభోదాలు చేసేవారిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించి, నియంత్రించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో వలే వీటిని నియంత్రించడానికి మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఈ చట్టం కోసం కృషి చేసే బాధ్యత పార్టీలకతీతంగా అన్ని ప్రజాతంత్రవాదులందరి మీద ఉంది.

కొత్తదేవుళ్లా...?

బాబాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్రను పరిశీలిస్తే మొదట వీరు అతి సామాన్యులు. మాయోపాయాలు చేపట్టిన తర్వాత మాత్రమే వీరు బాబాలుగా రూపొంది కొనసాగుతున్నారు. పెద్ద మొత్తాలలో ఆస్థులను కూడబెట్టారు. వీరి కార్యక్రమాలను నిశితంగా పరిశీలించగలిగితే ఇప్పటి చట్టాన్ని, రాజ్యాంగాన్ని వీరు నిత్యం ఉల్లంఘిస్తున్నారు. అందరూ ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నవారే. కాని, వీరు ఏశిక్షకు గురికావడం లేదు. ఉదాహరణకు:
సత్యసాయి బాబా:
పుట్టపర్తిలో సత్యసాయిబాబా అంటే బాగా పేరున్న బాబా. మత విశ్వాసాలను, భగవంతునిపై భక్తిని పెంపొందించే రూపంలో బోధనలు చేయడమేకాక, విభూదిని, బంగారు ఆభరణాలనూ, నోట్లో నుండి లింగం తీయడంలాంటి మ్యాజిక్కులను చేస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. ఈ మ్యాజిక్కుల బండారమంతా బట్టబయలైంది. వేలకోట్ల ఆస్థిపాస్థులున్నాయి. ఈయనకు ఉన్నత రాజకీయ నేతలతో దగ్గర సంబంధాలున్నాయి. విదేశస్థులతో కూడా సంబంధాలున్నాయి. ఆర్థిక లావాదేవీలు పెద్దఎత్తున నెరుపుతున్నారని వార్తలనేకం వచ్చాయి. ఈయన ఆశ్రమంలో హత్యలు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ, నేరస్థులను శిక్షించినట్లు ఎటువంటి వార్తలు రాకపోవడం గమనార్హం.
నీళ్ల స్వామి:
నీళ్ల స్వామిగా పిలవబడ్డ ఒక స్వామి పూర్వాశ్రమంలో ఇత్తడి బిందెలకు మాట్లు (అతుకులు) వేసుకుని, పొట్టపోసుకున్న వ్యక్తి. ఈయన వేలు ముంచిన నీరు తాగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ప్రచారం చేయబడింది. ఈ ప్రచారానికి లోనైనవారు తమ సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటే పరిష్కారమవుతాయని భావించారు. ఇంకేముంది! విద్యావంతులతో సహా ఆయన కటాక్షం కోసం క్యూలు కట్టారు. చివరకు ఆయన ఆశ్రమంలో పారిశుధ్యం లోపించి, భక్తులు విరోచనాల బారిన పడి, రోగగ్రస్థులయ్యారు. నలుగురు చనిపోయారు కూడా. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి, చర్య తీసుకున్నారు.
సిగిరెట్‌ బూడిద స్వామి:
ఈయన తాగిన సిగిరెట్‌ బూడిదను ప్రసాదంగా ఇచ్చే బాబా. విజయనగరం జిల్లా వాసి.
కట్టెబాబా:
ఈయన అనంతపురం జిల్లాలో కట్టెతో కాళ్లమీద కొడితే వ్యాధులు నయమవుతాయని ప్రచారం చేశారు.
కంటిచూపు స్వామి:
కంటిచూపుతో క్యాన్సర్‌, ఎయిడ్స్‌తో సహా అన్ని వ్యాధులను నయం చేస్తాడనే బాబా విజయవాడలో వెలిశాడు. 2003, ఫిబ్రవరిలో ఈయనను జనవిజ్ఞాన వేదిక సవాల్‌ చేసింది. సిరీస్‌ కంపెనీ అధినేత జి.ఎస్‌.రాజులాంటి వారు ఈయనకు మద్దతు ఇచ్చారు. అంతిమంగా ఫిబ్రవరి 18న ఈయన బండారం నిరూపితమై, జైలుపాలయ్యారు.
కల్కి విజయకుమార్‌:
విజయకుమార్‌.. కల్కి అవతారంగా తనకు తాను ప్రచారం చేసుకుంటున్నాడు. పూర్తి వివరాలు గత 11.3.2010 సంచికలో ఇవ్వబడ్డాయి.
- సచ్చితానంద స్వామి:
పెద్దఎత్తున అమ్మాయిలతో వ్యాపారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల ఆయన రాసలీలతో కూడిన వీడియోచిత్రాలు టీవీలో ప్రసారితమయ్యాయి.
- ధీరేంద్ర బ్రహ్మచారి:
ఇతను ఆయుధాల వ్యాపారి. ఎన్నో నిషిద్ధ కార్యాక్రమాలతో సంబంధాలున్నట్లు ఈయన ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఈయనకు సొంత విమానాలున్నాయి. ఆఖరకు ఎయిర్‌ క్రాష్‌లో చనిపోయాడు.
కె.ఎల్‌.కాంతారావు జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment