Wednesday, 22 February 2012

పిరమిడ్స్‌ ఎలా నిర్మించారు? అందుకు ఉపయోగించిన రసాయన పదార్థం ఏమిటి?

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 10 Mar 2010, IST  

భారీ యంత్రాలు, టెక్నాలజీ లేని కాలంలో ఈజిప్టు పిరమిడ్స్‌ను ఎలా నిర్మించారు ? పిరిమిడ్స్‌ నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంట్‌ లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం ?
- ప్రత్యూష, విజయవాడ, కృష్ణాజిల్లా.
ఈజిప్టు దేశంలో ఉన్న పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు దర్పణం పట్టిన అత్యంత ప్రాముఖ్యతగల నిర్మాణాలు. అయితే ఇవి కళలకుగానీ కళాపోషణకు గానీ సంబంధించిన కట్టడాలు కావు. దాదాపు 138 విడివిడి పిరమిడ్లను సుమారు 850 సంవత్సరాలపాటు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో నిర్మించారు. క్రీ.పూ. 2630 (క్రీ.పూ.27వ శతాబ్దం)లో మొదటి పిరమిడ్‌ను నిర్మాణం చేశారు. క్రీ.పూ. 2611 సంవత్సరం వరకు దీని నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు సుమారు 20 వేల మంది శ్రామికులు చెమటోడ్చి పనిచేయడం వల్ల ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆఖరి పిరమిడ్‌ను క్రీ.పూ.1814 సంవత్సరంలో పూర్తి చేశారని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.
కైరో నగరానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో ప్రారంభించి దాదాపు 200 కి.మీ. వరకు విస్తరించిన హవారా ప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138 పిరమిడ్లుగా గుర్తిస్తున్నారు. ఇపుడు వివిధ అవసానదశల్లో 30 వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలో ఉన్నవి కేవలం 8 మాత్రమే! ఇందులో క్రీ.పూ. 2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్‌ పిరమిడ్‌ సుమారు 150 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడాలను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవ నిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్‌ పిరమిడ్‌ అత్యంత ఎత్తయిన కట్టడం.

పిరమిడ్లు నిజానికి ఆనాటి కాలాల్లో అశాస్త్రీయ ఛాందసభావాలతో విరాజిల్లుతున్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు (pharaos) అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్‌ అనే అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్‌ పిరమిడ్‌ను క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్‌ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్‌ మాట్‌ సమాధిగా హవారాలో క్రీ.పూ.1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తి చేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం (base) త్రికోణాకృతి (trigonal)తో గానీ, చతురస్రాకారం (tetragonal)లో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతి భుజం నుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (apex) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపు గోడ (side wall) సమద్విబాహు త్రిభుజాకృతి (isosceles triangle) లో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్న కొద్దీ అడ్డుకోత(transverse cross-section) వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువును కింద భాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ ఘన ఆకృతు (3-dimensional solid objects) లలో పిరమిడ్లు ప్రముఖమైనవి.
ఈజిప్టు పిరమిడ్‌ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువుగా సన్నని (పిరమిడ్‌ సైజుతో పోల్చుకొంటే) గుహలాంటిది ఉంటుంది. పిరమిడ్‌ పార్శ్వగోడల నుంచి ఒకటి రెండుచోట్ల ఈ గుహలోకి నాళికల్లాంటి దారులు(tunnels) ఉంటాయి. సాధారణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటాయి.

ఇదే చోటికి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్‌ పక్కగోడలకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి బయట, లోపల సమాన వాయుపీడనం (air pressure) ఉండేలా చేస్తాయి. గరిమనాభి (centre of gravity) నుంచి కిందివైపునకు నిలువుగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లినట్లయితే ఆ వస్తువు పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపునకు విడిగా వెళితేనే వస్తువు పడిపోతుందనీ మనం పాఠశాల స్థాయిలో నేర్చుకున్నాము. ఈ సూత్రం ఆధారంగా ఒక వస్తువు మీద మరో వస్తువును ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒకదానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడిపోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలనిగానీ, పుస్తకానికీ పుస్తకానికీ మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదు కదా! పటంలో చూపిన నిర్మాణాన్ని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌, జెడ్‌ అనే బండలతో నిర్మించితే అది పడిపోదు. ఈ బండల మధ్య సిమెంటు లేకున్నా అది స్థిరంగా ఉంటుంది. బి, సి, డి బండల మధ్య ఉన్న సందులో ఏవైనా బొమ్మల్ని, శవపేటికల్ని ఉంచగలము. కొన్ని వేలమంది కార్మికులు కొన్ని దశాబ్దాల పాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభమే! ఈ సందర్భంగా శ్రీశ్రీ రచించిన దేశచరిత్రలోని
తాజమహల్‌ నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోరు
అది మోసిన బోయీలెవ్వరు?...
తక్షశిలా, పాటలీపుత్రం,
హరప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంద్యల
మానవకథ వికాసమెట్టిది?'
ఈ చరణాలను ఇప్పుడు స్మరించుకోవడం సముచితం.

No comments:

Post a Comment