Tuesday 29 October 2013

మేలు చేసే డ్రైఫ్రూట్స్‌














                   పళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పళ్లు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. పండ్లను కొన్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. కొన్ని పళ్లు అన్ని కాలాలలోనూ లభ్యమయితే, మరికొన్ని పళ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అరటిపళ్లు, యాపిల్‌, బత్తాయి, సపోటా, అనాస లాంటివి ఎప్పుడూ ఫ్రూట్‌ మార్కెట్‌లో లభిస్తాయి. సీతాఫలాలు, ద్రాక్ష, మామిడిపండ్లు, నేరేడు పండ్లు, రేగు పండ్లు లాంటి కొన్ని పళ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. ఆయా కాలాలలో లభించే పళ్లను తప్పకుండా తినాలి. తాజాపళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వాటిని తాజాగా ఉన్నప్పుడే తినేసెయ్యాలి. కొన్ని సీజన్లలో లభించే పళ్లను ఎండబెట్టి నిల్వచేస్తారు. వాటిని డ్రైఫ్రూట్స్‌ అంటారు. సీజన్‌లో లభించే కొన్ని పళ్ల నుంచి రసాలను తీసి వాటితో స్కాషె˜న్‌ను తయారుచేసి, ఏడాదంతా భద్రపరుస్తారు. అవి నిల్వ ఉండటానికి రసాయనికాలు కలుపుతారు. నిలువ ఫ్రూట్‌ జ్యూసెస్‌ను త్రాగేకంటే, తాజాపళ్ల రసాలే శరీరానికి పోషక విలువలు లభించేలా చేస్తాయి. బాదం, ఖర్జూరం, పిస్తా, అక్రోబ్‌, జీడిపప్పు, వేరుశెనగపప్పు లాంటి వాటిని డ్రైఫ్రూట్స్‌గా అన్ని కాలాలలోనూ ఉండేటట్లుగా నిలవ చేస్తారు.జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు లాంటి డ్రైఫ్రూట్స్‌ ఖరీదు అధికంగా ఉంటుందని అవసరమైనప్పుడు మాత్రమే కొని ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలయిన డ్రైఫ్రూట్స్‌లోనూ ఐరన్‌, కాల్షియం, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఎండు ఖర్జూరాన్ని వేడినీళ్లల్లో నానేసి, ఆ నీళ్లల్లో ఎండుద్రాక్షను కూడావేసి, కొంతసేపయిన తర్వాత వాటిని పిసికి ఆ నీటిని వడబోసి త్రాగితే దప్పిక అవదు. వేసవిలో వడదెబ్బ తగలదు. పిల్లలకు ఉపయోగించేటట్లయితే ఆ నీటిలో మెత్తటి పటికబెల్లం పొడిని కలపాలి. సీజన్‌లో అంటే జూలై నుంచి సెప్టెంబరు వరకూ సమృద్ధిగా లభించే తాజా ఖర్జూరపు పళ్లు మలబద్దకాన్ని నివారించడమే కాకుండా అవి శరీరానికి ఎక్కువ కేలరీల శక్తిని ఇస్తాయి. ఖర్జూరపు పళ్లు డ్రైఫ్రూట్స్‌గా మారినప్పుడు, వాటిలో కొవ్వు పదార్థం అధికంగా లభిస్తుంది. కేలరీల శక్తి కూడా తగ్గదు. వీటిని అతిగా తింటే స్థూలకాయం ఏర్పడుతుంది.జామపండులో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. 'సి' విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. దంతాలు, పళ్ల గట్టితనానికి జామకాయ చాలా మంచిది. మలబద్దకంతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి మెత్తని అరటిపండును తింటే సుఖ విరేచనమవుతుంది. సీజన్‌లో లభించే నేరేడు పండ్లను తినడం ఎంతో మంచిది. దీనిలో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. కమల, బత్తాయి, సపోటా లాంటి పండ్లు శరీరానికి అదనపు శక్తిని చేకూరుస్తాయి. అనాస, సీతాఫలం, కొబ్బరినీళ్లలోనూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణముంది. ఖరీదైన యాపిల్‌ పండు కంటే చౌకగలా లభించే జామపండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. పండిన జామను తినడం వల్ల జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది.డ్రైఫ్రూట్‌ అయిన బాదం పప్పును రోజుకు మూడు, నాలుగు తింటే మంచి కొలెస్ట్రాల్‌ శరీరానికి చేరుతుంది. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. తాజా పళ్లకంటే డ్రైఫ్రూట్స్‌ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆయా సీజన్‌లలో లభించే పళ్లను, ఎప్పుడూ లభించే పళ్లను ప్రతిరోజూ తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, శక్తినీ పొందటమే కాక, ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. చర్మం మృధువుగా, తేమగానూ, కాంతిగానూ ఉంటుంది.మామిడికాయలు, మామిడి పళ్లు విరివిగా లభించే వేసవికాలంలో, పచ్చిమామిడి కాయల తొక్కతీసి, ముక్కలుగా తరిగి, ఆ ముక్కల మీద, ఉప్పును, పసుపును చల్లి ఎండలో పెట్టి ఒరుగులుగా తయారుచేసి, వాటిని సంవత్సరమంతా నిల్వ ఉంచుకుంటారు. మామిడికాయలు లభించని కాలంలో, ఆ ముక్కలను కావలసినప్పుడు వాడుకుంటారు. ఎండిన మామిడి ముక్కలను దంచి, పిండిని చేసి భద్రపరుస్తారు. ఈ పొడిని ఆమేచూర్‌ అంటారు. మామిడిపండ్ల రసంతో తాండ్రను తయారుచేస్తారు. మామిడి రసంతో జామ్‌ను, రకరకాల పానీయాలను చేసి, నిల్వ ఉంచుతారు. తాజాగా లభించేటప్పుడు మామిడి పండ్లను వాడుతూ, అవి లభ్యం కానీ సీజన్‌లో తాము తయారు చేసిన నిల్వ పదార్థాలను ఉపయోగిస్తారు. చాలామంది అన్ని కాలాల్లోనూ కొబ్బరికాయలు లభిస్తున్నా, కొబ్బరిని కూడా నిల్వ ఉండేటట్లుగా ఎండుకొబ్బరిగా తయారుచేస్తారు. ఎండలోపెట్టి ఎండుకొబ్బరి నుంచి నూనెను తయారుచేస్తారు. మళయాళీలు కొబ్బరి నూనెను వంటలు, పిండి వంటల తయారీకి వాడుతారు. ఎండుకొబ్బరిని వంటలకు కూడా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను వనస్పతిలోనూ, కొన్ని రకాల సబ్బులలోనూ వాడుతారు. అయితే కొబ్బరికాయను పళ్లజాతిలోకి చేర్చారు. ఎండు కొబ్బరిని డ్రైఫ్రూట్‌గానూ పరిగణించారు. పిండివంటల్లోనూ, తీపి పదార్థాల తయారీలోనూ, వక్కపొడి తయారీలోనూ ఎండుకొబ్బరిని వాడుతారు. -యన్కే

Courtesy With: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment