Saturday 14 December 2013

విభిన్న భావాల విజ్ఞాన సర్వస్వం..పుస్తకం
Posted on: Fri 13 Dec 22:28:33.162806 2013
     పుస్తకం... కోటి ఆలోచనలు రేకెత్తిస్తుంది. కొంగ్రొత్త మార్గాలు చూపిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుతుంది. వినోదాన్ని పంచుతుంది.
పుస్తకం ... విషాదాన్ని పుట్టిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. చైతన్యాన్ని రగిలిస్తుంది. విప్లవాన్ని సృష్టిస్తుంది.
పుస్తకం... ఆకర్షిస్తుంది. ఆకట్టుకుంటుంది. శోధిస్తుంది. సాధిస్తుంది.
పుస్తకం... ఆకాశానికెత్తేస్తుంది. అగాధంలోకి తొక్కేస్తుంది. నేస్తమై నిలుస్తుంది. ఆత్మ స్థయిర్యమై గెలిపిస్తుంది.
    నిరాశ మిమ్మల్ని ఆవహించినప్పుడు ఆశల హరివిల్లరు వికసిస్తుంది. 'నేను ఒంటరి'నని మీరు బాధపడుతున్నప్పుడు 'దిగులెందుక'ని ఒదారుస్తుంది. అవును అదో విజ్ఞాన సర్వస్వం. విభిన్న భావాల గని. భావ స్వేచ్ఛకు వేదిక. బహుళ ప్రయోజనాల దీపిక... అదే అందరినీ అలరింపజేసే పుస్తకం. మరలాంటి పుస్తకాన్ని, అంతగొప్ప వైజ్ఞానిక సర్వస్వాన్ని ఇష్టపడని వారెవరుంటారు?! ఆ జ్ఞానామృతాన్ని గ్రోలని వారెవరుంటారు?! అందుకే అన్నారు పెద్దలు. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... ఒక మంచి పుస్తకం కొనుక్కో' అని. ప్రభావితం చేయడంలో, ప్రభావితమవడంలో ప్రధాన సూత్రధారిగా విలసిల్లుతోంది పుస్తకం. ఆకాశమంత ఎదగడానికీ, అవాంతరాల్లో చిక్కుకోవడానికీ ప్రధాన పాత్రధారిగా భాసిల్లుతోంది పుస్తకం.
 ''పరవళ్లు తొక్కే ప్రకృతి అందాలు కళ్లముందు కనువిందు చేస్తున్నాయి. పూసే పూలూ, వీచేగాలీ, ఎగసే కెరటాలూ కళ్లముందు కదలాడుతున్నాయి. జలపాతాల ఝంకార నాదాలూ, మలయ మారుతాల శబ్ద విన్యాసాలూ కనువిందుగా, వినసొంపుగా అలరిస్తున్నాయి. మధురాను భూతిలో మైమరిపిస్తున్నాయి. మధుర భావనలతో మానస వీణాతంత్రులు మీటుతున్నాయి''.... ఇదో వర్ణనాత్మక కొటేషన్‌. ఇందులోని దృశ్యాలేవీ మీరు చూడట్లేదు. కానీ స్వయంగా చూస్తున్న అనుభూతి కలుగుతోంది కదూ!? అక్షరాలకూ, అక్షరాలు పొదిగిన పదాలకూ, పదబందాలు పెనవేసుకున్న వాక్యాలకూ ఇవన్నీ కలగలసి రూపుదిద్దుకున్న పుస్తకాలకూ ఉండే గొప్పత(ధ)నమది. అందుకే పుస్తకం చాలా శక్తిమంతమైనది. అది ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది. ఎలాంటి హృదయాన్నయినా స్పందింపజేస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది.
 సమస్యల సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యాన్నిచ్చే నేస్తమవుతుంది పుస్తకం. ఆత్మ స్థయిర్యాన్నిచ్చే అమ్మ అవువుతుంది పుస్తకం. శిలలాంటి వ్యక్తిత్వాన్ని శిల్పంగా చెక్కి మలుపు తిప్పుతుంది పుస్తకం. ఆటంకాలు ఎదురై వేధిస్తున్నప్పుడు, ఆపదలు అరుదెంచి జీవితంతో తలపడుతున్నప్పుడు ఏకవ్యక్తి సైన్యమై ఎలా ఎదుర్కోవాలో బోధిస్తుంది పుస్తకం. అంతేకాదు కలలై, కథలై, కావ్యాలై, కవితలై కదలిక తెస్తుంది పుస్తకం. వెన్నెలలోని హాయినీ, అమ్మలాలనలోనీ వాత్సల్యాన్నీ, కోయిలపాటలోని తీయందనాన్నీ రుచి చూపుతుంది పుస్తకం. ఆకుపచ్చని గుబుర్లలో అరవిరిసిన గులాబీ అందాలనూ, త్యాగాల మాగాణుల్లో విరబూసిన విప్లవ మందారాలనూ తనలో ఇముడ్చుకుంటుంది పుస్తకం. ఎంకి పాటల తెలుగు దనాన్నీ, చలం రాతల వలపు 'మైదా'నాన్నీ మరిపిస్తుంది పుస్తకం. విశ్వనాథ పలుకై, విరుల తేనె చినుకై, మనసును హత్తుకుంటుంది పుస్తకం. కృష్ణశాస్త్రి భావ కవితల కొలనులో అలల సవ్వడులై అలరిస్తుంది పుస్తకం. సినారె రచనల్లోని 'చీకటి రాత్రు'ల్లో 'చెక్కిలి పైని అగరు చుక్కల' వర్ణనల్లో వెలుగు పూలు పూయిస్తుంది పుస్తకం. శ్రీశ్రీ కవితల్లో ప్రభవించే చైతన్యమై, చెరబండరాజు రచనల్లోని తెగువై ప్రజ్వరిల్లుతుంది పుస్తకం.
  తరతరాల బానిసత్వాన్ని తరిమికొట్టిన చరిత్రను కళ్లకు కడుతుంది పుస్తకం. దోపిడీ పీడనల భావనలను దనుమాడిన ప్రజాపోరాట గాధలను వివరిస్తుంది పుస్తకం. 'బాంచన్‌ దొరా నీ కాల్మొక్త' అన్న వాళ్లను సైతం బందూకులు పట్టించిన బలమైన శక్తిగలది పుస్తకం. కలాల కవాతుల ప్రేరణలో దాని పాత్ర తక్కువేమి కాదు. గళాల గర్జనల వెల్లువలో దాని స్థానం చిన్నదేమీ కాదు. గదర్‌ వీరుల గళమై... జనం గుండె చప్పుడై... జజ్జనకరె జనారే యను జనం పాటల వెల్లువయి వెలుగొందుతుంది పుస్తకం. ఆనందమైనా, ఆవేశమైనా పుస్తకంలో ఒదిగిపోతుంది. ఆక్రోశమైనా, అవహేళన అయినా పుస్తకంలో పొదిగిపోతుంది. విమర్శ ఐనా, కువిమర్శ ఐనా పుస్తకంలో చోటు దక్కించుకుంటుంది. ఎందుకంటే. అదో సమాచార స్రవంతి. అదో వైజ్ఞానిక భాండాగారం. మంచీ-చెడూ, దిశా-దశా, కలగలసిన భావాల సర్వస్వం. గాలీ, నీరూ, ఆహారం ఎంతవసరమో సామాజిక అవగాహన కోసం పుస్తకం అంతే అవసరం. పుస్తకాలు చదవని వారెవ్వరూ రచయితలు కాలేరు. పుస్తకాలు చదవని వారెవ్వరూ కవులు కాలేరు. పుస్తకాలు చదవని వారెవ్వరూ జర్నలిస్టులుగా రాణించలేరు. అభ్యుదయ భావాల పరిమళ భరితంలో, సమూల మార్పుల సమాజ పరిణామాల్లో అసలు రహస్యం పుస్తకమే అనడంలో అతిశయోక్తి లేదు. అవాస్తవం అంతకన్నా కాదు. మంచి మార్గంలో నడ్పించడంలో పుస్తకాల పాత్ర ఎంతో ఉంటుంది.. సామాజిక స్పృహ కలిగిండంలో పుస్తకాల ప్రభావం ఎంతో తోడ్పడుతుంది. పుస్తకాల్లోనూ ఎన్నో రకాలుంటాయి. అనవసరపు భ్రమల్లో ముంచెత్తే రచనలూ వుంటాయి. వాస్తవాలను చాటిచెప్పే పుస్తకాలూ ఉంటాయి. విభిన్న భావనలు గల పుస్తకాల్లో ఏదోఒక దానిని చదివి, అదే సరైందని నిర్ణయించుకుంటే పొరపాటే. గుడ్డిగా చదవడమే కాదు. సమాజానికి మేలు చేసే పుస్తకాలను ఎంచుకోవాలి. అభ్యుదయ భావాలు వికసింపజేసే రచనలు ఏరుకోవాలి. చైతన్యం రగిలించే పుస్తకాలను కొనుక్కోవాలి. విప్లవ స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదివి తీరాలి. బలహీనతలనూ, భ్రమలనూ దూరం చేసే ఏ పుస్తకమైనా ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పుస్తకాలు జీవితాలకూ, పరిస్థితులకూ, సమాజానికీ ఎలా వర్తిస్తాయో, ఏ ఉద్దేశంతో అందులోని రచనలు రూపుదిద్దుకున్నాయో ఒక్కసారి ఆలోచించగలిగితే చాలు! ఏది వాస్తవం? అన్న ఒక్క ప్రశ్న మీలో ఉదయిస్తే చాలు!! అప్పుడు ఏది నిజమో, ఏది అబద్దమో, ఏది వాస్తవమో, ఏది భ్రమో మీరు తేల్చుకో గలుగుతారు. మంచి పుస్తకాలను ఎంచుకోగలుగుతారు.
  పుస్తకాల్లో వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ, చారిత్రక గ్రంథాలూ, సామాజిక- సాంస్కృతిక గ్రంథాలూ, సాంఘిక గ్రంథాలూ, భాషా గ్రంథాలూ ఎలా ఎన్నో ఉంటాయి. సైన్సూ, విజ్ఞానం, సాంకేతికం, సంగీతం, సాహిత్యం, కళలూ, కావ్యాలూ, నైసర్గిక పరిస్థితులూ, నవసమాజ నిర్మాణపు భావాలుగల పుస్తకాలూ, నవతరాన్ని అలరించే పుస్తకాలూ ఉంటాయి. ఇవేగాక ఇంకెన్నో రకాల సాహిత్యం నేడు మార్కెట్లో లభిస్తోంది. ప్రపంచమే ఒక కుగ్రామం అవుతున్న ఈరోజుల్లో ఎన్ని ఆధునిక ఒరవడులు తెరపైకి వచ్చినా, పుస్తకాలకున్న ప్రాధాన్యత ఏమాత్రమూ తగ్గలేదు. తగ్గుతుందని కూడా చెప్పలేం. మేధావుల్ని సృష్టించేవీ, విజ్ఞానాన్నీ పంచేవీ, వికాసాన్ని కలిగించేవీ పుస్తకాలే. చైతన్యాన్ని రగిలించేవీ, సమాజాన్ని మార్చేవీ పుస్తకాలే. మార్పుల్లో, తీర్పుల్లో, నడవడికల్లో, నైతికతల్లో, విజయాల్లో, పరాజయాల్లో, వికాసాల్లో, విప్లవాల్లో, ఆవేదనల్లో, ఆలోచనల్లో, ఆశయాల్లో, లక్ష్యాల్లో అన్నింటిలో అంతర్భాగమై నడిపిస్తున్నదీ పుస్తకాలే. విభిన్న భావనల విజ్ఞాన సర్వస్వాలుగా భాసిల్లుతున్నదీ పుస్తకాలే. అందుకే మంచి పుస్తకాలను చదవాలి. చదివించాలి. అందులోని అంతరార్థాన్ని గ్రహించాలి. విజ్ఞానాన్ని ఆస్వాదించాలి. వికాసం పొందాలి.

Courtesy with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment