Monday 25 November 2013

సూర్యశక్తితో ఐటి


                            వజ్రం ఎప్పటికీ నిలిచి ఇంటుంది- అంటూ ప్రకటన ఆమధ్య తెగ వచ్చేది. గుర్తుండే ఉంటుంది. అదేమాదిరి ఇపుడు సౌర విద్యుత్. సౌర విద్యుత్ -అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సౌర విద్యుత్ ఉత్పత్తి శాతం కేవలం 10 నించి 11 శాతమేనంటే ఆశ్చర్యం లేదు. మన దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తు సామర్థ్యం మొత్తం 1,010 మెగావాట్లు. ఇందులో గుజరాత్ వాటా సగానికిపైనే.. అంటే 695 మెగావాట్లు. చెట్టూ పుట్టలపైనా, కాలువలపైనా, చివరకు ఇళ్లపైనా ఎక్కడ చూసినా సోలార్ ఫలకాలే కనిపిస్తాయి. ఈ సోదంతా ఎందుకంటారా? సింపుల్. మన కంప్యూటర్లకు యుపిఎస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏటా వాటి బ్యాటరీలు మార్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే, మనలో చాలామంది ఇప్పటికే ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకుని కరెంటు కోతల సమయంలో దాన్నుంచి కరెంటు వాడుకుంటున్నాం. అంతదాకా బావుంది. దానిలో బ్యాటరీ ఉంటుందని తెలుసు కదా. మళ్లీ దానికి కరెంటు ఉంటేనే కదా అది ఛార్జి అయ్యేది.. అంటే, ఇన్వర్టర్ వాడటం అంత చవకేం కాదు కదా.
                           అసలూ, భౌగోళికంగా ఉన్న పరిస్థితుల వల్ల మనకు సూర్యకిరణాలు బాగా సోకుతూ ఉంటుంది. పైగా మీ ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా సరే సూర్యరశ్మి ఫ్రీగా దొరుకుతుంది. ఆ సూర్యరశ్మి నుంచి విద్యుత్ తయారీ ఇపుడు ఆచరణ సాధ్యమైంది. సోలార్ ఫలకాలను మీ ఇంటిమీద ఏర్పాటు చేసుకుని తక్కువ ఖర్చుతోనే మీ ఇన్వర్టర్లను ఛార్జి చేసుకోవచ్చు. ఈ ఇన్వర్టర్ల సామర్థ్యం బాగా ఉంటే మీ కంప్యూటర్‌కు ఇక ప్రత్యేక యుపిఎస్ కూడా అక్కర్లేదు.
                             ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్యాక్, సోలార్ లైట్లకు, సోలార్ వాటర్ హీటర్లకు సబ్సిడీ ఇస్తోంది. సోలార్ లైట్లకు 900 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ పోగా ఇవి 754 రూపాయల నుండి 1356 రూపాయల వరకు లభిస్తున్నాయి. ఒక్కో ఇంటికి అవసరమైన సౌర విద్యుత్తు ప్లాంట్‌ను (సోలార్ పవర్ ప్యాక్) ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం మనం కట్టే విద్యుత్ బిల్లు భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇళ్లపై ఖాళీ స్థలాల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం కూడా సులభమే. సౌర విద్యుత్ ఉత్పాదక వ్యవస్థలు 1 లక్ష రూపాయల నుంచి లభిస్తున్నాయి. ఈ వ్యవస్థలు 1, 2, 3 కెడబ్ల్యుసి సామర్థ్యాలలో వస్తున్నాయి. వీటిలో 2, 3, 4, 5, 7 గంటల దాకా విద్యుత్ అందించే మాడల్సు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సౌర ఫలకాలకు 25 ఏళ్ల వారంటీని, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్‌కు 2 ఏళ్ల వారంటీని, బాటరీకి 3 ఏళ్ల వారంటీని ఇస్తున్నాయి ఆయా సంస్థలు. అన్నట్టు బ్యాంకులూ ఇలాంటి పథకాలకు లోన్లిస్తున్నాయి(ట). 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకోవాలంటే 3 లక్షలు ఖర్చవుతుంది. కానీ దీంతో మనం 4 ట్యూబ్‌లైట్లూ, 1 పర్సనల్ కంప్యూటర్, 1 చిన్న రిఫ్రిజిరేటర్ లేదా ఏసి, 1 ఎల్‌సిడి టీవీ, 4 ఫాన్లూ దాదాపు 10 గంటల సేపు వాడుకోవచ్చు. 4 లక్షల లోపు పెట్టుబడికి మనం 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో మనం 5 ట్యూబ్‌లైట్లూ, 1 పర్సనల్ కంప్యూటర్, 1 రిఫ్రిజిరేటర్ లేదా ఏసి, 1 ఎల్‌సిడి టీవీ, 5 ఫాన్లూ వాడుకోవచ్చు. ఐటి ఫలాలు మారుమూల గ్రామాలను చేరడానికి ఇలాంటి సౌకర్యాలను సమర్థవంతంగా వాడుకోవచ్చు. అక్కడ అభివృద్ధికి దోహదం చేయనూవచ్చు. చదువుకున్న నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంలలో ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని వారి వారి గ్రామాల అభివృద్ధికి తోడ్పడటానికి ఇదొక చక్కని అవకాశం. ఎందుకంటే, ఇలాంటి సౌకర్యాలను ఆచరణ సాధ్యం చేయగలిగేది యూత్ మాత్రమే అని వేరే చెప్పాలా...
Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment