Tuesday, 5 November 2013    - పిఎస్‌ఎల్‌వి సి-25 సక్సెస్‌
   - సుదీర్ఘ ప్రయాణం తర్వాత మార్స్‌ ఆర్బిట్‌లోకి
    - ఇది తొలి గ్రహాంతర ప్రయోగం
     - నింగినంటిన సంబరాలు
     భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంగారకుడి వైపు తొలి అడుగేసి మరో మైలురాయిని దాటింది. తొలి గ్రహాంతరం ప్రయోగానికి నాంది పలికింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో తన సత్తాచాటి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ అద్భుతానికి నెల్లూరు జిల్లా సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ వేదికైంది. ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌సి-25 ద్వారా అంగారక గ్రహ అన్వేషణకు బయలుదేరిన తొలి ప్రయోగం విజయవంతమైంది. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పిఎస్‌ఎల్‌వి తమ నమ్మకాన్ని వమ్ము చేయలేదంటూ శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఈ ప్రయోగం 25వ కావడంతో షార్‌లో రజతోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాల 26 సెకన్లకు మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ నుండి ప్రయోగం జరిగింది.
     ప్రజాశక్తి - షార్‌ సెంటర్‌ ప్రతినిధి
 - సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌.. 
- మంగళవారం మధ్యాహ్నం 2.38.26 నిమిషాలు.. 
- అందరిలోనూ ఒకే ఉత్కంఠత.. 
- తొలి గ్రహాంతర ప్రయోగానికి సిద్ధమవుతున్న వేళ..
       పిఎస్‌ఎల్‌వి తన సుదీర్ఘ ప్రయాణాన్ని గమ్యం చేరుతుందో లేదోననే ఆందోళన. నిశ్శబ్ద వాతావరణంలో కౌంట్‌డౌన్‌ ముగిసింది.. -8 నుండి 0...8 అవగానే పచ్చని చెట్ల నుండి నిప్పులు గక్కుతూ పిఎస్‌ఎల్‌వి సి-25 నింగికెగిసింది. నాలుగు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 43.32 నిమిషాల ప్రయాణ అనంతరం మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌ అంగారకుడి మార్గంలో పడింది. సాధారణంగా పిఎస్‌ఎల్‌వి ద్వారా పంపించే ఉపగ్రహాలు ఇప్పటి వరకూ 18 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరేవి. తొలిసారిగా 43 నిమిషాల 32 సెకన్లు ప్రయాణం చేసి రాకెట్‌ నుండి ఉపగ్రహం వేరుపడి నిర్దేశిత లక్ష్యాన్ని చేరింది. సాధారణంగా పిఎస్‌ఎల్‌విలో 4 ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫ్‌ ఆన్‌ మోటార్లు వాడతారు. సి-25లో 6 ఎక్స్‌ఎల్‌ మోటార్లను ఉపయోగించారు. భూమి దగ్గరగా 250 కిమీ, దూరంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలో 23,500 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాన్ని చేర్చాల్సి ఉంది. భూమి దగ్గరకు 246.9, దూరంగా 23,560 కిలో మీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో అంగారకుడి మార్గంలో ప్రవేశపెట్టారు. ఇప్పటి నుండి 15 రోజులపాటు బెంగళూరులోని హసన్‌లో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ నుండి ఒక్కో దశను దాటుకుంటూ భూమికి దగ్గరగా 300కిలో మీటర్లు, దూరంగా రెండు లక్షల కిలోమీటర్ల పరిధిలో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించేలా శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. 300 రోజుల తర్వాత 35 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అంగారకుడికి దగ్గరగా చేరుకుంటుంది. ఈ దశలో ఉపగ్రహంలో అమర్చిన ఐదు పరికరాలు పనిచేయడం వల్ల అంగారకుడిపై అన్వేషణ ప్రారంభమవుతుంది. అక్కడి చిత్రాలను తీసేందుకు రంగురంగుల కెమెరా, అంగారకుడి నుండి వచ్చే ఆవిర్లను విశ్లేషించేందుకు, నీరు, ఇతర చిన్న జీవులను పరిశీలించేందుకు పరికరాలను అమర్చారు.
ఐదేళ్లకోసారి భూమికి దగ్గరగా అంగారకుడు వస్తుంది. ఈ ఏడాది కూడా అలా వస్తుండడంతో ఇస్రో 18 నెలలపాటు కష్టపడి ఈ ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇస్రో చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘ ప్రయాణ ఉపగ్రహం. ఇప్పటి వరకూ 20 వేల కిలో మీటర్ల పరిధిలోనే భారత భూ భాగంలో ఉన్న ఇస్రో రాడార్లు రాకెట్‌ గమనాన్ని పరిశీలించేవి. ఆ పరిధి దాటాక పరిశీలించే రాడార్‌ వ్యవస్థ ఇస్రోకు లేకపోవడంతో నలంద, యమున ఓడలను అద్దెకు తీసుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో మార్స్‌ ఉపగ్రహ పయనాన్ని పర్యవేక్షించారు. 3 నుండి 4 దశలు అత్యంత కీలకం కావడంతో అద్దెకు తీసుకున్న రాడార్లూ పనిచేస్తాయో లేదోనని శాస్త్రవేత్తలు ఆందోళనపడ్డారు. కానీ, రాడార్లు అత్యంత అద్భుతంగా పనిచేశాయి. పిఎస్‌ఎల్‌ సి25 నాలుగు దశలు దాటుకుని మార్స్‌ మార్గంలో వెళ్లేందుకు దోహదపడ్డాయి. ఈ ప్రయోగంతో దేశ ప్రజలకు నేరుగా ఉపయోగం లేనప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తామెవరికీ తీసిపోమని, తమకూ సత్తా ఉందని చాటుకునేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇందుకు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉపగ్రహం బరువు 1337కిలోలు. అందులో 857 కిలోల ఇంధనం ఉంది. అది మండించడం ద్వారా 300 రోజుల ప్రయాణిస్తుంది.
ఐదు కీలక దశలు
ఈ ప్రయోగంలో ఐదు కీలక దశలను దాటాల్సి ఉంది. అందులో భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం మొదటి దశ. నేటి నుండి 15 రోజలపాటు బెంగళూరులోని హసన్‌లోని ఎంసిఎఫ్‌ సెంటర్‌ నుంచి ఉపగ్రహం కక్ష్య పెంచుకుంటూ వెళ్లేలా ఆపరేట్‌ చేస్తారు. నవంబరు 30 రాత్రి, డిసెంబరు ఒకటిన ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి అంగారక గ్రహానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 24న ఆ గ్రహానికి మరింత దగ్గరగా వెళ్లేలా చూస్తారు. భూమి చుట్టూ 9 లక్షల కిలో మీటర్లు తిరుగుతుంది.
ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో కుటుంబ విజయమని ప్రకటించారు. మిషన్‌డైరెక్టర్‌ కున్నికృష్ణన్‌, విక్రం సారాభారు స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎం.వై.ఎస్‌. ప్రసాద్‌, మాజీ డైరెక్టర్‌ ఎం.చంద్రదత్తన్‌ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. పిఎం కార్యాలయ మంత్రిత్వ శాఖ నుండి నారాయణస్వామి, ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.శివకుమార్‌, ఎఎస్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ శేషగిరి రావు ప్రయోగాన్ని వీక్షించారు.

Courtesy With: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment