Friday, 8 November 2013


శీతాకాలపు సిరి      వాన ముసురు తగ్గి, చలి కమ్మే శీతాకాలం వచ్చీ రాగానే నోరూరించే సీతాఫలాలు మనల్ని పలకరిస్తాయి. ఇంటి పెరటిలో మొదలుకొని, ఊరి చివర, అడవి మధ్య, ఎక్కడ పడితే అక్కడ విరగకాసే సీతాఫలాలు మనల్ని ఊరిస్తాయి. చక్కని సువాసనతో, అద్భుతమైన రుచితో సీతాఫలాలు పిల్లల్నే కాకుండా పెద్దల్ని సైతం ఆకర్షిస్తుంటాయి. సీతాఫలాల చెట్లు ఏ ఊళ్ళో పెరిగినా, ఏ తండాల్లో కనిపించినా ఏ అడవిలో దాగినా అడవిబిడ్డలు వాటిని సుతారంగా కోసుకొస్తారు. నగర ప్రజలకు అడవిబిడ్డల తీపి బహుమతి సీతాఫలం. వీటి శ్రమలో మహిళల పాత్రే ఎక్కువ. రోడ్డు పక్కనే జీవనాన్ని సాగిస్తూ సీతాఫలాలు విక్రయిస్తున్న మహిళలు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇంతగా ఇష్టపడే ఈ పండు గురించి విశేషాలనూ, ఉపయోగాలనూ తెలుసుకుందాం.
తాఫలాలు చలికాలంలోనే విరివిగా దొరుకుతాయి. ఈ ఫలాల్ని తాజాగా తినడమే మంచిది. వీటితో తయారుచేసే రసాలు, షేక్‌లు అంత మంచిది కాదు. అవి తయారుచేసే లోపు బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుందంటున్నారు నిపుణులు. నేరుగా తినడం వల్ల చాలా ఉపయోగాలూ ఉన్నాయి. గుజ్జు నోటిలో పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది. తద్వారా జీర్ణప్రక్రియ సులువుగా అవుతుంది. వీటిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే.
పేరు వెనుక..
సీతాఫలాన్ని అమృతఫలం అని, ఆంగ్లంలో కస్టర్డ్‌ యాపిల్‌ అని పిలుస్తారు. సీతాఫలాన్ని తినడానికి సీతమ్మకున్నంత సహనం కావాలనీ అందుకే దానికి సీతాఫలం అని పేరు వచ్చిందని కొందరి భావన. పురాణాల్లో రామాయణంలో వనవాసం ప్రధానమైనది. వనంలో విరివిగా దొరికే ఫలం సీతాఫలం. అదీ కాకుండా శీతాకాలంలో దొరికే ఫలం కనుక సీతాఫలం అనే పేరు స్థిరపడి పోయిందని చరిత్రకారులు చెబుతారు. మనం తినే సీతాఫలం కాకుండా వివిధ రంగుల్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో అటవీ ప్రాంతాలన్నింటా ఈ చెట్ల విస్తీర్ణం అపారం. ఇవి నాటిని నాలుగో ఏడాది నుంచే కాయలు కాయటం మొదలై 15 ఏళ్లు ఫలాల్ని అందిస్తూనే ఉంటాయి.
ఎంచుకోవడం ఎలా?
పక్వానికి వచ్చిన సీతాఫలాన్ని కోసి మూడురోజలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే చాలు. అది పూర్తిగా పండుతుంది. పండుపైన కమిలినా, నల్లగా మారినా, వాసన మారినా వాటిని ఉపయోగించకూడద. కాయ పెద్దగా ఉంటే దానిలో గుజ్జు తియ్యగా ఉంటుంది. పండు బరువు 250 నుంచి 300 గ్రాముల మధ్య తూగితే మంచిది. అన్నీ పండినవే కొనకుండా ఒక మాదిరిగా మగ్గినవి కొనాలి. ఫలం కొద్దిగా మెత్తబడగానే తినొచ్చు. సీతాఫలం తినడం కూడా ఒక కళే. చాలా మంది దానిపైన కళ్లు (ఒక్కో భాగాన్ని) తీసి తింటారు. చాలా కష్టపడతారు. అలాకాకుండా కాయను రెండు బాగాలుగా విడదీసి, స్పూన్‌తో తీసుకుని, తినడం సులువు.
రకరకాల వంటకాలుగా..
సీతాఫలం గుజ్జుతో మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, పాయసం తయారుచేస్తారు. వివిధ ఆహారపదార్థాలకు, ఐస్‌క్రీములకు సువాసన కోసం కూడా సీతాఫలం గుజ్జను కలుపుతారు.
ఔషధ గుణాలు
సీతాఫలంలోనే కాదు చెట్టులోనే ఔషధ విలువలు విరివిగా ఉన్నాయి. ఆకులు, వేర్లు, పచ్చికాయలు, గింజలు.. ఒకటేమిటి అన్నీ ఔషధ రూపాలే. ఈ చెట్టు బెరడు ఎటువంటి స్రావాలనైనా అరికడుతుంది. ఆకులకు, గింజలకు, పచ్చికాయలకు క్రిమిసంహారక గుణం ఉంది. ఆకులు బద్దె పురుగుల మీద పనిచేస్తాయి. వేరు విరేచనాల్ని అరికడుతుంది. పచ్చికాయలు చీము, రక్త వంటి స్రావాల్ని ఆగిపోయేలా చేస్తుంది. గింజలు తలలో పేలని నివారిస్తే, పండు తక్షణ శక్తినిచ్చే టానిక్‌లా ఉపయోగపడుతుంది. గిరిజనులు తేనెతుట్టెను చెట్టు నుంచి దింపేటప్పుడు తేనెటీగలు కుట్టకుండా ఈ ఆకుల రసాన్ని శరీరానికి పూసుకుంటారు.
ప్రయోజనాలు ఎన్నెన్నో..
- సీతాఫలాలు విరివిగా దొరికినప్పుడు దాని గుజ్జు తీసి, సరిపోను నీళ్లు, పంచదార చేర్చి బాగా మరగనివ్వాలి. పానీయం దగ్గరగా అయ్యాక పొడి సీసాలో భద్రపరుచుకోవాలి. వేసవిలో దాహం తీరడానికి ఈ పానీయం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి మూడువంతుల నీళ్లు కలిపి తీసుకోవాలి.
- ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు క్యాల్షియం, పోషకాల అవసరం ఎక్కువ. వీరికి సీతాఫలం పుష్టికరమైన ఆహారం. సీతాఫలం గుజ్జును బెల్లంతోగానీ, తేనెతోగానీ కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పండు గుజ్జుతో మలబద్ధకం, అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.
- బక్కగా ఉన్న వారు ఎంత తిన్నా, ఏమి తిన్నా లావు కారు. అలాంటి వారు సీతాఫలాల గుజ్జును తేనెతో కలిపి తీసకుంటే కొద్దిరోజుల్లోనే ఒళ్లు చేస్తారు. దీనిలో క్యాలరీల స్థాయి హెచ్చుగా ఉంటుంది. కాబట్టి లావు కావాలనుకునే వారికి అమృతఫలమే. హైపర్‌ థైరాయిడ్‌తో బాధపడే వారికి కూడా ఈ ఫలం మంచి సుగుణం చూపిస్తంది.
- చిన్నపిల్లలో సెగ్గెడ్డల, ఇతర చీము గడ్డలు తరచూ వస్తూ ఇబ్బంది పెడతాయి. ఇలాంటి వారికి సీతాఫలం గుజ్జుకు ఉప్పు చేర్చి గడ్డపై పట్టు వేయాలి. దీంతో గడ్డ మెత్తబడి, చీము త్వరగా బయటకు వచ్చేస్తుంది. చీముగడ్డలు, ఇతర ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఇతర గడ్డల మీద సీతాఫలం ఆకుల్ని మెత్తగా నూరి లేపనం వేస్తే వాటిల్లో చేరిన సూక్ష్మజీవులు గుడ్డుతో సహా నశించి, గాయం త్వరగా మానుపడుతుంది.
- జిగట విరేచనాలకు మంచి ఔషధం సీతాఫలం గుజ్జు. ఇన్‌ఫెక్షన్‌తోగానీ, జిగట విరేచనాలుగానీ అవుతున్నప్పుడు ఓ పెద్ద చెంచా సీతాఫలం గుజ్జును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- చుండ్రు, ఫంగస్‌ వంటి వాటితో కొంతమంది దీర్ఘకాలం బాధపడుతుంటార. ఇలాంటివారు సీతాఫలం గింజల్ని పొడిచేసి, శీకాయపొడితోగానీ, త్రిఫల చూర్ణం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) తోగానీ కలిపి వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీని గింజల పొడి కళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి సుమీ!
- కొద్దరు అకస్మాత్తుగా బిపీ డౌన్‌ అయిగానీ, బాగా నీరసించిగానీ స్పృహ కోల్పోతారు. అలాంటివారికి సీతాఫలం ఆకుల్ని బాగా నలిపి వాసన చూపించాలి. ఆ ఆకుల ఘాటైన వాసనకు స్పృహలోకి వస్తారు. ఇలా చేయడం వల్ల హిస్టీరియా రోగులకూ ఎంతో ఉపశమనం లభిస్తుంది.
- కొందరిలో నరాలపై కురుపులు వస్తాయి. వీటినే నారకురుపులు అనీ అంటారు. వీటికి సీతాఫలం ఆకుల్ని, లేత మర్రి ఊడల్ని కలిపి మెత్తగా నూరాలి. ఈ పేస్టును ఆ కురుపులపై లేపనంగా రాయాలి. దీంతో ఆ కురుపులోని పురుగు వెలుపలికి వచ్చేస్తుంది. గాయం త్వరగా నయమవుతుంది.
- జ్వరం వచ్చినప్పుడు సీతాఫలం వేరును మెత్తగా నూరి, పావు చెంచా పొడిని నీటిలో వేసి కషాయంలా తయారుచేసి, గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఆకులు కూడా జ్వరాన్ని తగ్గిస్తాయి. మూడు,నాలుగు ఆకుల్ని నలిపి నీళ్లల్లో వేసి కషాయం కాయాలి. దీనిలో కొద్దిగా ఉప్పు చేర్చి తీసుకుంటే జ్వర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- తలలో పేలు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే సీతాఫలం ఆకుల్ని మెత్తగా రుబ్బి, తలకు పట్టించి, రాత్రంతా ఉంచాలి. తెల్లారే తలస్నానం చేయాలి. ఆకుల్ని, గింజల్ని ఎండబెట్టి వేర్వేరుగా పొడిచేయాలి. ఈ పొడులకు పెసరపిండి కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పేలు ఈరుతో సహా పోయి తల శుభ్రమవుతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
- కీళ్లనొప్పులు, ఆర్థ్రరైటిస్‌ నొప్పుల ఉపశమనానికి సీతాఫలం ఆకుల్ని నీళ్లల్లో మరిగించి, ఆ నీటితో నొప్పులున్న చోట్ల కాపడం పెట్టుకోవాలి.
- దంతాల నొప్పి, చిగుళ్ల వాపు తగ్గాలంటే సీతాఫలం వేరు చిన్న చిన్న ముక్కలుగా చేసి నోట్లో పెట్టుకుని నమలాలి.

Courtesy with: PRAJA SEKTHI

No comments:

Post a Comment