Tuesday 31 December 2013

ఇటు రుచి! అటు ఆరోగ్యం!



    పండగలకే కాదు మనం అప్పుడప్పుడు వండే పిండి వంటల్లో బెల్లం వాడకుండా ఉండలేం. ముఖ్యంగా మనం తయారుచేసుకునే పొంగలి, పూర్ణాలు, అరిసెలు, పాయసం, పల్లీపట్టీ వంటి తీపి పదార్థాల్లో బెల్లాన్ని ఉపయోగిస్తాం. తీపిపదార్థాల్లోనే కాకుండా బెల్లాన్ని విడిగా తిన్నా ఆరోగ్యమే. అనేక అనారోగ్య సమస్యల నివారిణిగా బెల్లం విశిష్ట ఫలితాల్ని ఇస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో తెలియ జేశారు. బెల్లంలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉన్న బెల్లం మన దేశంలోనే కాక, అనేక ఆసియా దేశాల్లోనూ ప్రాచుర్యంలో ఉంది.
  బంగారు రంగులోనూ, ముదురు గోధుమ రంగులోనూ, నలుపు రంగులోనూ ఉండే బెల్లం 1631లో మెట్టమొదటిసారిగా తయారు చేయబడింది. బెల్లం సహజ పద్ధతిలో చెరకు నుంచి, కర్జూర పండ్ల నుంచి తయారు చేస్తారనే అందరికీ తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే కొబ్బరి నుంచీ బెల్లాన్ని తయారుచేస్తారనే విషయం. ఇది ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌, దక్షిణ భారతదేశం, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ల్లో ఇది ప్రాచుర్యంలో ఉంది.
మనదేశంలో మహారాష్ట్ర బెల్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయడమే కాదు వాడటంలోనూ ముందంజలోనే ఉంది. మహారాష్ట్ర ప్రజలు చేసుకునే కూరలలోను, పప్పుల్లోను, తీపి పదార్థాలలోను ఇలా ప్రతి ఒక్క వంటకంలోనూ బెల్లాన్ని విరివిగా వినియోగిస్తారు. మహారాష్ట్రలో అందరికీ తెలిసిన స్వీట్‌ పురన్‌ పోలీని బెల్లంతోనే తయారుచేస్తారు. గుజరాత్‌లో తయారుచేసే ప్రత్యేకమైన లడ్డూల్లోనూ గోధుమపిండితో పాటు బెల్లాన్ని ఉపయోగిస్తారు. అంతేగాక గుజరాత్‌ ప్రాచుర్యంలో ఉన్న తలన్‌ లడ్డు, తాల్‌ సంకల్‌, గోల్‌దానా వంటి తీపిపదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. రాజస్థాన్‌ సాంప్రదాయక వంటకమైన గుర్‌ కె చావల్‌లోనూ బెల్లాన్ని ఉపయోగిస్తారు.
   మన రాష్ట్రంలో ప్రతి పండుగ సమయంలో పిండి వంటకాల్లో బెల్లాన్ని వినియోగిస్తారు. ముఖ్యంగా నోరూరించే పదార్థాలన్నీ బెల్లం తయారీవే. వేయించిన పల్లీ (వేరుశనగ)లతో, చిన్న బెల్లం ముక్క తినే అలవాటు నేటికీ ఉంది. ఇలా తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. పని నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క, గ్లాసు మంచి నీళ్ళు తాగడం మహారాష్ట్ర, కర్ణాటకల్లోని గ్రామీణుల్లో కనిపిస్తుంది. ఇది శారీరక నీరసాన్ని తగ్గిస్తుందని వారి నమ్మకం. అంతేకాక అందరం తాగే టీలో చెంచా పంచదారకు బదులు చెంచా బెల్లం పౌడర్‌ను వేసుకుని తాగితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
   బెల్లం పోషకాల గని కదా! రక్తపోటును తగ్గించడానికి, మూత్రపిండాలలో వచ్చే రాళ్ళ సమస్యను తగ్గించడానికి కావాలసిన పొటాషియం నిల్వలు బెల్లంలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక ఒత్తిడిని తగ్గించి, మంచిగా నిద్ర పట్టడానికి బెల్లంలోని పొటాషియం ఎంతో ఉపయోగకరం. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి ఉపయోగపడే కాల్షియం పుష్కలంగా ఉన్న పదార్థం ఇది. రక్తహీనతతో బాధపడేవారు చక్కెరకు బదులు బెల్లాన్ని తీసుకుంటే రక్తవృద్ధికి తోడ్పడు తుంది. ఎందుకంటే కొత్త రక్తం తయారవడానికి కావలసిన ఇనుము(ఐరన్‌) బెల్లంలో అత్యధికంగా ఉండటమే కారణం.
   మంచి పని తలపెట్టే ముందు, ఏదైనా మంచి వార్తను విన్నప్పుడు, నోరు తీపి చేయండి అంటుంటారు. అలా అన్నప్పుడు అందరికీ బెల్లం ముక్కనే ఇస్తాం. ఉపవాసం ఉండేవారూ దాన్ని విరమించే ముందు బెల్లం ముక్కను కొద్దిగా తింటారు.

Courtesy  with: PRAJA SEKTHY DAILY

No comments:

Post a Comment