Monday, 6 January 2014

క్రయోజనిక్‌ అంటే?
Posted on: Mon 06 Jan 03:23:58.307936 2014

                       క్రయోజనిక్‌ ఇంజన్‌తో కూడిన జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగం విజయం భారత్‌ను ఆరు అగ్రదేశాల సరసన నిలిపి ప్రతీ భారతీ యుడినీ సంతోషసాగరంలో ముంచెత్తింది. ఈ ఇంజన్‌కోసం భారత శాస్త్రవేత్తలు చేసిన కృషి అనన్యసామాన్యమైనది. 20 సంవత్సరాల పాటు అదేపనిగా అహోరాత్రాలు శ్రమించారు. ఎప్పటికప్పుడు గమ్యానికి చేరుకున్నట్టు అనిపించడం, అంతలోనే ఎదరయ్యే అవరోధంతో తలపట్టుకోవడం ... ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. గత ఏడాది ఆగస్టులో ప్రయోగానికి అంతా సిద్దమైనా, చివరి క్షణంలో లోపాలు ప్రత్యక్షమైనాయి. కీలకమైన క్రయోజనిక్‌ విభాగంలో లీకేజి కనపడటంతో అప్పట్లో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఇంత జరిగినా శాస్త్రవేత్తలు అలసిపోలేదు. ఏ దశలోనూ కుంగిపోలేదు. వైఫల్యాల నుండి నేర్చుకుంటూ నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్ష వీధుల్లో భారత జెండాను ఎగరవేశారు. ఇప్పటికే ఈ సాంకేతికను అందిపుచ్చుకున్న అమెరికా, చైనా, రష్యా జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌ ల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపారు.
తక్కువ ఉష్ణోగ్రత... తక్కువ ఇంధనం... ఇదే క్రయోజనిక్‌ పనితనం
అంతరిక్ష ప్రయోగాల్లో శాస్త్రవేత్తలను నిరంతరం వేధించే సమస్య విపరీతమైన ఉష్టం. సాధారణ టూ వీలర్‌ను ఎక్కువ సేపు నడిపితే ఇంజన్‌ వేడిక్కి మొరాయించడం మనకు అనుభవమే. అదే నిప్పులు చిమ్ముకుంటూ నింగికిఎగిరే అంతరిక్ష వాహనాల్లో వెలువడే ఉష్ణాన్ని ఒక్క సారి ఊహించండి. భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించిన తరువాత దీని తీవ్రత మరింత పెరుగుతుంది. సాధారణ ప్రజానీకం ఊహించలేని ఉష్టం వెలువడుతుంది. దీని నుండి రాకెట్‌ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్‌. ఉష్ణొగ్రత పెరిగే కొద్ది ఇంధన వినియోగం కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఈ రెండు పరిస్థితులను అధిగమించేదే క్రయోజనిక్‌ పరిజ్ఞానం. అత్యంత తీవ్రంగా వెలువడు తున్న ఉష్ణోగ్రతను నియంత్రించి అత్యంత శీతలంగా ఉంచడమే క్రయోజనిక్‌ ప్రత్యేకత. మరో మాటలో చెప్పాలంటే బయట మండే ఎండ ఉన్నప్పటికీ ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితిని అంతరిక్షం వాహనంలో సృష్టిం చడం. ఇది మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. కన్ను మూసి తెరిచేలోగా కొన్ని వేల కిలో మీటర్ల దూరాన్ని అగ్నిజ్వాలలు చిమ్ము కుంటూ వెళ్తున్న వాహనంలో, అదీ అంతరిక్షంలో దీనిని సాధించాలి! ఉపగ్రహాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు, అతి తక్కువ ఇంధనాన్ని వినియోగించాలి. మరింత వేగాన్ని అందుకోవాలి. ఈ మూడు లక్ష్యాలను తాజా ప్రయోగంలో శాస్త్రవేత్తలు సాధించారు. ఈ లక్ష్యసాధనలో ఎదుర్కొన్న కష్టాలను అంతిమ విజయపు ఆనందంలో మరచిపోయారు.
సోషలిస్టు రష్యా సహకారంతో ...!
క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని భారతదేశం సాధించడంలో ఒకప్పటి సోషలిస్టు రష్యా సహకారం కూడా ఎంతగానో ఉంది. అంతరిక్ష ప్రయోగాలు ప్రారంభించిన తొలిదశలోనే భారతదేశం ఆ పరిజ్ఞానం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటికే ఆ తరహా పరిజ్ఞానాన్ని అందుకున్న దేశాలను అభ్యర్ధించింది. అప్పటికే ఆ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న అమెరికా, జపాన్‌, జర్మనీ, ష్రాన్స్‌ల నుండి తిరస్కారం ఎదురైంది. పరిజ్ఞానాన్నికాదు కదా... తాము రూపొందించిన క్రయోజనిక్‌ యంత్రాలను ఇవ్వడానికి కూడా ఆ దేశాలు నిరా కరించాయి. ఈ దశలో సోషలిస్టు రష్యా భారత్‌కు సహకారాన్ని అందించింది. ఇప్పటి దాకా భారతదేశం చేసిన 5 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు ఆ దేశమే క్రయోజనిక్‌ ఇంజన్‌లను సమకూర్చింది. 1990 వ దశాబ్ధంలో ఆ పరిజ్ఞానాన్ని స్వయంగా రూపొందించడంపై భారత శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భారత్‌ ఈ దిశలో ప్రయోగాలు చేస్తున్న సమయంలోనే చైనా ఆ పరిజ్ఞానాన్ని అందుకుంది.

Courtesy wirh : PRAJA SEKTHI DIALY 

No comments:

Post a Comment