Tuesday 7 January 2014



                   భూ వాతావరణంలోకి ఒక పరిమితిని మించి వదలబడే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ వాయువు భూమి యొక్క     ఉష్ణోగ్రత పెరిగేందుకు కారణమవుతోంది. కార్బన్‌-డై-ఆక్సైడ్‌ మూలంగా ఇలా భూమి తాలూకూ ఉష్ణోగ్రత పెరగడాన్నే 'గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌' అని అంటారు.సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిలో (ఉష్ణం, కాంతి) అత్యధికభాగం భూ వాతావరణంలోకి చొచ్చుకొని వచ్చి భూమిని తాకితే, కొంతభాగం మాత్రం వాతావరణం పైపొరల నుంచే తిరిగి రోదసీలోకి పంపేయబడుతుంది. అదేవిధంగా, భూవాతావరణంలోకి వచ్చిన సౌరశక్తిలో కూడా కొంతభాగం తిరిగి రోదసిలోకి పంపేయబడితే, మిగతాది మాత్రం వాతావరణంలోనే ఉండి రాత్రి పూట మరీ దారుణంగా చల్లబడిపోకుండా భూమిని కాపాడుతుంది. వాతావరణంలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ పరిమాణం పెరిగినప్పుడు వాతావరణం నుంచి తిరిగి రోదసిలోకి పంపబడే సౌరశక్తి తగిన స్థాయిలో పోకుండా వాతావరణంలోనే ఉండిపోతుంది. దీని ఫలితంగా భూ వాతావరణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వేడిగా తయారవుతుంది. సరిగ్గా ఇలా జరగడాన్నే గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అని అంటున్నాము.
గడచిన కొన్ని దశాబ్ధాలుగా మన ప్రపంచంలో కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు, ఓడలు, ట్రక్కులు, మోటారు బైకులు వంటి వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వివిధ రకాల ఫ్యాక్టరీలు, పరిశ్రమలు అపారంగా పెరిగిపోయాయి. వాహనాలకు, ఫాక్టరీలకు, థర్మల్‌ పవర్‌ ఉత్పాదనకు ఇంధనంగా ప్రతిరోజూ కొన్ని వేల టన్నుల బొగ్గు, పెట్రోలియం వాడబడుతోంది. వీటన్నిటి ఫలితంగా గాలిలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ పరిమాణం ఏటికేటికీ పెరిగిపోతూ వస్తోంది. దీని మూలంగా భూమి తాలూకూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఎండలు, వానలు, చలుల తీరుతెన్నులు గతి తప్పి, అది అనేక ప్రాంతాల జీవనంపై విపరీత ప్రభావాన్ని చూపిస్తోంది. ఆర్కిటిక్‌, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు పెద్దఎత్తున కరిగి, సముద్ర మట్టాలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ఉన్న అనేక నగరాలతో సహా, వేలాది గ్రామాలు సముద్రంలో భాగంగా మారిపోతాయి. మనుషులతో సహా వివిధ ప్రాణుల మనుగడ దుర్భరంగా మారుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, గాలిలోకి వదలబడే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ సాధ్యమైనంత తగ్గేలా చేసేందుకు మనందరమూ పాటు పడవలసి ఉంటుంది.
Courtesy with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment