Monday 6 January 2014


ఇస్రో క్రయో'జయం'


Posted on: Mon 06 Jan 03:52:47.080974 2014









5.1.2014, సాయంత్రం
4.42. :'ఇస్రో మరో విజయం సాధించింది. జన్మభూమి రుణం తీర్చుకున్నాం' అని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌                    ప్రకటించారు. 
4.40. :నిర్దేశిత మార్గంలో ఆకాశంలోకి దూసుకుపోయిన జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌, సమాచార ఉపగ్రహం                         జిశాట్‌-14ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
4. 25. :విజయవంతంగా పనిచేస్తున్న క్రయోజనిక్‌ ఇంజన్‌
4. 22. :ఉపగ్రహం విడిపోవడంతో రెండోదశ సక్సెస్‌
4. 21. : రెండో దశ పయనం ఆరంభం
4. 18. :జిఎల్‌ఎల్‌వి-డి5 ప్రయోగం
4. 11. :ప్రయోగ ప్రక్రియ ప్రారంభం
3. 24. :క్రయోజనిక్‌ ఇంజన్‌లో ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి
11.15:ప్రయోగానికి సర్వం సిద్ధం
4.1.2014:ఉదయం :
                                11.18 జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం
 
                   రెండు దశాబ్దాల ఇస్రో కల సాకారమైన వేళ... భారత్‌కు ఇది సాధ్యమా అని ప్రపంచ దేశాలు సందేహిస్తున్న వేళ... అనేక వైఫల్యాలను అధిగమించి ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్‌ ఇంజన్లతో విజయవంతంగా జిఎస్‌ఎల్‌వి-డి5 నింగికెగసిన వేళ... ప్రపంచ దేశాల సరసన విజయగర్వంతో ఇస్రో తలెత్తుకు నిలబడింది. ఒక్కో అడుగు ముందుకేస్తున్న ఇస్రో ఈ ప్రయోగంతో మరో మైలురాయిని దాటినట్లయింది. సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుండి విజయవంతంగా జిఎస్‌ఎల్‌వి-డి5 ద్వారా జిశాట్‌-14 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపింది. ఈ విజయంతో ఇస్రోలో నూతన ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కొత్త ఏడాదిలో చారిత్రాత్మక విజయం సాధించడంతో దేశమంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

- జిఎస్‌ఎల్‌వి-డి5 సక్సెస్‌ 
- 20 ఏళ్ల కల సాకారం
- ఇస్రోలో నూతనోత్సాహాలు
ఆరు దేశాలకే పరిజ్ఞానం
                                    భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలో కొద్ది దేశాలకే పరిమితమైన క్రయోజనిక్‌ ఇంజన్ల తయారీలో భారత్‌ కూడా చేరింది. దాదాపు 20 ఏళ్ల నుండి సుదీర్ఘ కృషి ఫలితంగా ఇస్రో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) ఆదివారం మధ్యాహ్నం ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. సాయంత్రం 4.18 నిమిషాలు. శాస్త్రవేత్తల్లోనూ, వీక్షకుల్లోనూ, ఇస్రో కుటుంబంలోనూ ఒకటే ఉత్కంఠ. గతేడాది ఆగస్టు 19న జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌ ప్రయోగ సమయంలో రెండో దశలో ఇంధనం లీకవడంతో ప్రయోగం నిలిచిపోయిన విషయం తెలిసిందే. నాలుగున్నర నెలలపాటు లోపాలను సరిచేసి పున:ప్రయోగానికి సిద్ధమైన సమయంలో విజయం సాధిస్తామా అనే ఉత్కంఠ. శనివారం ఉదయం 11.18 నిముషాలకు ప్రారంభమైన 29 గంటల కౌంట్‌డౌన్‌ సమయం ముగిసింది. అందరిలోనూ ఉత్కంఠ. షార్‌ మొత్తం నిశబ్దం. మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల్లో ఒకింత ఆందోళన. కౌంట్‌డౌన్‌ సమయం ముగిసింది. 8, 7, 6, 5, 4, 3, 2, 1, +1, +2, +3, +4, +5, +6, +7, +8, అంటుండగానే షార్‌లోని రెండో ప్రయోగ కేంద్రం నుండి జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అందరి హర్షధ్వానాల మధ్య నింగిలోకి దూసుకుపోయింది. అత్యంత కీలకమైన రెండో దశలో భారత్‌ సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్‌ స్టేజీ ఉంది. సరిగ్గా 4.18 నిముషాలకు బయల్దేరిన రాకెట్‌ విజయవంతంగా కక్ష్యవైపు సాగింది. మొదటి దశలో రాకెట్‌ సెకన్‌కు 2.4 కిలోమీటర్లు ప్రయాణించింది. రెండో దశ డిఎస్‌2లో సెకనుకు 2.5 కిలో మీటర్ల వేగం అందుకుంది. మూడో దశలో సెకనుకు 19.78 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంది. దాదాపు 12 నిముషాల పాటు మూడో దశ కొనసాగింది. భూమికి దగ్గరగా 179 కిలోమీటర్లు, భూమికి దూరంగా 35,950 కిలో మీటర్ల మధ్యంతర భూ స్థిర కక్ష్యలో 1,982 కేజీల బరువున్న జిశాట్‌-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ జిశాట్‌-14 పన్నెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అనంతరం కర్నాటకలోని హసన్‌ వద్ద నెలకొల్పబడిన ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తూ ఉపగ్రహంలో ఉన్న ద్రవ ఇంధనాన్ని మండిస్తూ 36 వేల కిలోమీటర్ల వృత్తాకార భూ స్థిర కక్ష్యలో 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉపగ్రహాన్ని స్థిరపరిచారు. భూమి నుండి బయల్దేరిన తరువాత 17 నిముషాలా 7 సెకన్లకు ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా షార్‌లో ఆనందం వెల్లివిరిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజన్ల ద్వారా జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగం విజయవంతమవడంతో అప్పటి వరకూ ఉత్కంఠగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చంద్రయాన్‌ ప్రయోగ సమయంలో, అంగారక ఉపగ్రహ ప్రయోగ సమయంలోనూ ఇంతటి ఉత్కంఠ కన్పించలేదు. ఎన్నో ఏళ్లు కలగా ఉన్న ఈ ప్రయోగం విజయవంతమవడంతో షార్‌ శాస్త్రవేత్తల, ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో కుటుంబ విజయమని అభివర్ణించారు. ప్రయోగాన్ని వీక్షించిన వారిలో విక్రమసారాబాయి స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామకృష్ణన్‌, జిఎస్‌ఎల్‌వి ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ నారాయణరావు, డాక్టర్‌ చంద్రదత్తన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, తదితరులున్నారు.
Courtesy with PRAJA SEKTHI DIALY

No comments:

Post a Comment