Tuesday 4 March 2014

శనిగ్రహానికి కొత్త వలయాన్ని కనుగొన్నారా?




                             సౌరమండలంలో రెండవ అతి పెద్ద గ్రహమైన శనిగ్రహం చుట్టూ గిరగిరా తిరుగుతున్న లక్షలాది గ్రహ శకలాలు, ధూళి కణాలు కలసి మనకు అందమైన వలయాలుగా కన్పిస్తున్నాయి. అయితే మనకు ఇంత వరకూ కన్పించని మరొక పెద్ద వలయం కూడా శనిగ్రహం చుట్టూ ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు గత ఏడాది కనుగొన్నారు. స్పిట్జర్‌ అనే అంతరిక్ష టెలిస్కోప్‌ పంపిన ఫోటోల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు.
శనిగ్రహం చుట్టూ దర్శన మిచ్చిన కొత్త వలయం అడ్డంగా 1.5 కోట్ల మైళ్ళ నుంచి 2.2 కోట్ల మైళ్ళ వ్యాసంతో ఉండటం విశేషం. ఈ ప్రదేశంలో అడ్డంగా ఒక 100 కోట్ల భూగోళాలను ఒక దాని పక్కన ఒకదాన్ని పేర్చవచ్చట. ఈ వలయంలోని కోట్లాది చిన్న చిన్న శిలల ముక్కలు ఉపగ్రహాల లాగా శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఈ అన్ని ముక్కలను కలిపితే ఒక అరమైలు వ్యాసంతో ఉండే శిల మాత్రమే రూపొందుతుందని అంచనా వేశారు. ఏదేమైనా ఈ శిలల ముక్కలు చాలా చిన్నగా ఉండటం వల్ల, పైగా అవి కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికి వాటి మధ్య ఖాళీ ప్రదేశం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం వలయం ఒక పారదర్శకమైన గొట్టం లాగా కన్పిస్తుంది. అది కూడా అంతరిక్ష టెలిస్కోపులతోనే కన్పిస్తుంది గాని, భూమి మీది టెలిస్కోపులతో కన్పించదు.
కొత్త వలయంలోని అన్ని శకలాలు శనిగ్రహపు ఉప గ్రహాల్లో ఒకటైన ఫోబ్‌ నుంచే ఉత్పన్నమయ్యాయని భావిస్తున్నారు. ఈ వలయంలో ఉన్న ఫోబ్‌ అనే ఉపగ్రహం వలయంలోని శకలాలు తిరిగే దిశలోనే పరిభ్రమిస్తుంటే, అయాపిటస్‌ అన బడే మరో ఉపగ్రహం మాత్రం సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ ఉపగ్రహానికి సంబంధించిన ఒక చిత్రమైన అంశం ఏమిటంటే దీనిలో సగభాగం బూడిద రంగులో ఉంటే, మిగతా సగభాగం ఎర్ర రంగులో ఉంటుంది. ఇలా రెండు రంగుల్లో ఉండే గ్రహం గాని, ఉపగ్రహం గాని సౌరమండలంలో ఇంకేదీ కనిపించలేదు.
Courtesy with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment