Saturday 19 May 2012

దరిద్రులు ఎలా పెరుగుతున్నారు?-2


  • అశాస్త్రీయ ఆచారాలు8
'పిల్లలూ! దరిద్రం ఎలా పోతుందో ఒక ప్రఖ్యాత వైద్యుని జీవితం నుండి వివరిస్తాననని గత వారం చెప్పాను కదా!
ఆయన పేరు నార్మన్‌ బెత్యూన్‌. ఆయన కెనాడాలో పెద్ద డాక్టరు. బాగా డబ్బు సంపాదించాడు. ఇక మిగిలిన జీవితాన్ని పేదల సేవలో వినియోగిద్దామనుకొన్నాడు. ఒక పేదల కాలనీని ఎన్నుకున్నాడు. అక్కడ ఆసుపత్రి పెట్టాడు. ఆ కాలనీవాసులకు ఉచిత వైద్యం, వీలైనంత వరకూ ఉచిత మందులు ఇవ్వడం మొదలుపెట్టాడు. రెండేళ్లలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలని ఆయన ఆశయం. మూడునెలలు గడిచాయి. ఆరునెలలు; సంవత్సరం గడిచింది. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉందిగానీ తరగటం లేదు. ఇంకొక సంవత్సరంలో ఆ కాలనీలో రోగి అనేవాడు లేకుండా చేయాలనే డాక్టరుగారి ఆశయం నెరవేరేటట్లులేదు. ఆయన ఆ కాలనీలో రోగాలెందుకు తగ్గటం లేదో, పైపెచ్చు ఎందుకు పెరుగుతున్నారో కారణాలను తెలుసుకోదలచాడు. రోగులను ఇంటర్వ్యూ చేయసాగాడు.
ఒక రోగితో ఆయన ఇంటర్వ్యూ ఇలా సాగింది.
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. నీవు నేను చెప్పిన మందులు వాడుతున్నావా?
రోగి: వాడుతున్నానండీ!
బెత్యూన్‌: నాలుగురోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాను. తీసుకున్నావా?
రోగి: మౌనం..
బెత్యూన్‌: పనిలోకి వెళ్లావా? సెలవుపెట్టి ఇంట్లో ఉండలేకపోయావా?
రోగి: మాకు సెలవులెక్కడివి సారూ! పనిలోకి వెళ్తేనే జీతం; జీతం వస్తేనే ఇంట్లో పిల్లలకు తిండి. అందుకని పనిలోకి వెళ్లాను సారూ!
బెత్యూన్‌: మీ యజమాని సెలవు ఇవ్వరా?
రోగి: ఇవ్వరు సారూ!
మరో రోగితో ఆయన సంభాషణ ఇలా జరిగింది....
బెత్యూన్‌: నీకు రోగం తగ్గలేదు. మందులు క్రమం తప్పకుండా వేసుకుంటున్నావా?
రోగి: వేసుకుంటున్నానండీ.
బెత్యూన్‌: పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నావా?
రోగి: తీసుకుంటున్నానండి.
బెత్యూన్‌: బలమైన ఆహారం అంటే పాలు, గుడ్లు, మాంసం తీసుకుంటున్నావా?
రోగి: మౌనం...
బెత్యూన్‌: ఎందుకు తీసుకోవడం లేదు? నీ రోగానికి బలమైన ఆహారం అవసరం అని చెప్పానుగదా?
రోగి: ఏం చెయ్యమంటారు డాక్టరుగారూ! నేను పనికిపోకపోతే నా భార్య తెచ్చే కూలీడబ్బుల్తో ఇల్లంతా తినాలి. ఇంకా నాకోసం పాలు, గుడ్లు ఎక్కడి నుండి తేగలదు?
డాక్టర్‌ బెత్యూన్‌ ఆలోచించసాగాడు. ఆ కాలనీలోని మనుషులందరూ బాగా కష్టపడి పనిచేస్తారు. కానీ వాళ్ళకు రోగమొస్తే విశ్రాంతిగానీ, మంచి ఆహారంగానీ దొరకదు. కానీ, వాళ్ళు పనిచేసే మిల్లు యజమాని కోట్లు కూడబెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య కాలనీ ప్రజలు ఒళ్లొంచి పనిచేయకపోవడం కాదు. వాళ్ళ శ్రమశక్తి విలువ వాళ్ళకు కాకుండా యజమానికి దక్కడం. యజమాని వారి శ్రమకు తగిన ఫలితాన్ని వారికి ఇవ్వకపోవడం వలననే వారు దరిద్రులౌతున్నారు.
డాక్టరు బెత్యూన్‌కి ప్రజల దరిద్రానికి కారణం అర్థమైంది. వాళ్ళ దరిద్రం పోవాలంటే వాళ్ళ శ్రమకు తగిన ఫలితం వాళ్ళు పొందాలి. అలా పొందాలంటే శ్రామిక రాజ్యమే రావాలి. ఆ విషయం అర్థంచేసుకున్న ఆయన ఆ కాలనీవాసులందరినీ అలాంటి రాజ్యం ఏర్పాటు దిశగా సమీకరించి, అలా శ్రామిక రాజ్యాన్ని కోరే ఇతరులతో కలిసి ముందడుగు వేశాడు, వేయించాడు. చైనాలో శ్రామికరాజ్య స్థాపనలో ఉడతాభక్తిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి, అమరుడయ్యాడు.
'పిల్లలూ! ఇప్పుడర్థమైందా? దరిద్రానికి కారణమేంటో? దానికి పరిష్కారమేంటో?'
'అర్థమైంది మాష్టారూ! దరిద్రానికి కారణం పాపులూ, పాపాలూ కానేకాదు. కోట్లాదిమంది కష్టజీవుల శ్రమను కొద్దిమంది దోచుకోవటమే కారణం. ఇక దరిద్రానికి పరిష్కారం కష్టజీవుల రాజ్యస్థాపనయే' దృఢంగా అన్నాడు శ్రీను.
'మంచిది. మీరందరూ దరిద్రుల నిర్మూలనకు సరైన మార్గంలో ప్రయాణిస్తారని ఆశిస్తాను' అన్నాను.
'తప్పకుండా దరిద్రుల నిర్మూలన కోసం, కష్టజీవుల రాజ్యం కోసం ప్రయత్నిస్తాం మాష్టారూ!' అన్నారు పిల్లలంతా.
'సంతోషం' అన్నాను నేను.. నిజంగా చాలా సంతోషంగా.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments:

Post a Comment