Wednesday, 9 May 2012

మెరుపులు ... పిడుగులు...


వాతావరణంలో ఏర్పడిన అసమతుల్యత వల్ల ఈ వేసవిలో అకాలవర్షాలు పడుతున్నాయి. దీంతో మన రాష్ట్రంలో ఇటీవల కొన్ని జిల్లాల్లో పిడుగులు పడి జన, ఆస్థి నష్టాలు సంభవించాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం బ్రెజిల్‌లోని రియో నగరం నుండి ఫ్రాన్స్‌కు బయలుదేరిన విమానం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. దీనికి కారణం మెరుపులే అన్న అనుమానాలున్నాయి. ఈ ప్రమాదంలో 228 మంది గల్లంతయ్యారు. అసలు ఈ మెరుపులు, పిడుగులు, ఉరుములు ఎలా సంభవిస్తాయి..? మేఘాల గురించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలిపేందుకు మీ ముందుకొచ్చింది.... ఈ వారం 'విజ్ఞానవీచిక'.
పిడుగులు పడటం వల్ల ప్రతి ఏడాది ఏదోమేర నష్టం కలుగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. చిన్నప్పుడు వీటికి భయపడనివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో?! ఆ సమయంలో అమ్మమ్మలు, తాతయ్యలు లేదా ఎవరో ఒకరు పెద్దవాళ్లు అక్కునచేర్చుకుని, భయాన్ని పోగొట్టడానికి ఓ కథ చెప్తుండేవారు. అదేం టంటే.. 'అర్జునుడు వేగంగా రథంమీద వెళుతున్నప్పుడు రథచక్రాలు రాళ్ళకు తాకినప్పు డల్లా కళ్ళు మిరమిట్లు కొలుపుతూ వచ్చే వెలుతురే (కాంతి) ఈ 'మెరుపు'లని, ఇలా వెళుతున్నప్పుడు వచ్చే ధ్వనే 'ఉరుము'లని. అందువల్ల ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు 'అర్జునా..! అర్జునా..' అని అనుకుంటే ఉరుములు, మెరుపుల వల్ల మనకేమీకాదనీ, భయపడాల్సిన అవసరం లేదనీ వాళ్లు చెప్పేవారు. విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో భయాల్ని పొగొట్టడానికి ఇలాంటి కథలు ఉపయోగపడ్డాయి. కానీ, విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎన్నో ప్రకృతి రహస్యాలను శాస్త్రీయంగా మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. ప్రమాదాల నుండి రక్షించుకోగలుగుతున్నాడు. ఇలా అర్థంచేసుకోగలిగిన ప్రకృతి రహస్యాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు ముఖ్యమైనవి. అందువల్ల నేడు ఉరుములు, మెరుపులు అర్జనుడి రథం వల్ల వస్తున్నాయని నమ్మడం అశాస్త్రీయం.. మూఢవిశ్వాసం.
మెరుపులు కలిగే తీరు..
ఆకాశంలో మబ్బులు వేగంగా కదులుతున్నప్పుడు విద్యుత్‌ విడుదలై 'మెరుపులు' కనిపిస్తాయి. మామూలుగా ఇవి ఉరుములతో కలిసి వస్తాయి. వాతావరణంలో కలిగే మార్పులే మెరుపులకు కారణమని శాస్త్రజ్ఞులు ప్రతిపా దించారు. వేగంగా వీచేగాలులు, నీటిఆవిరి, వీటి మధ్య రాపిడి మరియు వాయు పీడనం మేఘాలలో విద్యుత్‌ మార్పులను కలిగిస్తాయి. ఇవి మెరుపులకు దారితీస్తాయి.
మబ్బులలో ఉన్న చిన్న చిన్న మంచుకణాలు మెరుపుల్ని కలగజేయటంలో కీలకపాత్ర వహిస్తాయి. వీటి ఒత్తిడి వలన మబ్బులలో అంతర్గతంగా పాజిటివ్‌, నెగిటివ్‌ ఛార్జీలు వేరుపడతాయట! పాజిటివ్‌ ఛార్జీలు మబ్బుపైకి, నెగిటివ్‌ ఛార్జీలు మబ్బు కింది భాగానికి చేరతాయి. ఇలా విద్యుత్‌ ఛార్జీలు వేరుపడటం వల్ల మబ్బుల్లో 'విద్యుత్‌ పీడనం' (ఎలక్ట్రిక్‌ పొటెన్షియల్‌) ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ పీడనం ఒక స్థాయికి మించినప్పుడు, మబ్బుల్లో అదనంగా ఉన్న విద్యుచ్ఛక్తి మెరుపురూపంలో విడుదలవుతుందని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు.
భూగోళంలో 'కాంగో' దేశంలో మెరుపులు అత్యధికంగా వస్తున్నాయని గమనిం చారు. మామూలుగా మనంచూసే మెరుపులు మబ్బుల కిందిభాగం నుండి వచ్చే నెగి టివ్‌ విద్యుత్‌ ప్రసారంవల్ల వస్తున్నాయి. ఈ విద్యుచ్ఛక్తి సుమారుగా 30వేల ఆంపియర్స్‌కు సమానమని అంచనా. ఇది 1,20,000 ఆంపియర్స్‌ వరకూ పోవచ్చట!
విద్యుత్‌ పీడనం మూడు మిలియన్‌ ఓల్ట్‌లకు మించినప్పుడు మెరుపు వస్తుంది. కేవలం ఒకే ఒక మెరుపు వచ్చినప్పుడు వచ్చే విద్యుత్‌ పీడనం శక్తి వెయ్యి బిలియన్‌ వాట్ల వరకూ ఉంటుందట. ఇది చాలా శక్తివంతమైంది. కానీ, సెకండ్‌లో దాదాపు 33 వేల వంతుకు (30 మైక్రో సెకండ్లు) మాత్రమే ఉంటుందట. అయితే 'మెరుపు' ఒకేసారి కాక కనీసం నాలుగైదు సార్లు వస్తుందట. ఇలా ఎన్నో మెరుపులు రావచ్చు.
మెరుపు వచ్చినప్పుడు చుట్టూతా ఉన్న గాలి ఒకేసారి 20 వేల డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకూ వేడి విడుదలవుతుంది. ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా దాదాపు వేల రెట్లు అధికం. ఇంత వేడి ఒకేసారి రావటం వల్ల చుట్టూ ఉన్న గాలి ఒకేసారి సూపర్‌ సోనిక్‌ వేగంతో (శబ్ధానికి మించిన వేగంతో) వ్యాకోచిస్తుంది. ఈ సమయంలో వచ్చే శబ్ధాన్నే 'ఉరుము' రూపంలో వింటున్నాం. అంటే, మొదట మెరుపు కనపడి, ఆ తరువాతే శబ్ధం భూమ్మీదకు వినపడుతుంది. ఉరుమే ఎక్కువగా భయం కలిగిస్తుంది కాబట్టి జంటగా వచ్చే మెరుపు, ఉరుములను, 'ఉరుము, మెరుపు'లుగా తెలుగులో వ్యవహరిస్తున్నారు.
పిడుగులు..
ప్రకృతిలో మూడురకాల మెరుపుల్ని చూడగలం. ఒకటి మబ్బు లోపల మాత్రమే వచ్చే మెరుపులు. మబ్బుల మధ్య వచ్చే మెరుపులు రెండోరకం. ఇక మబ్బు-భూమి మధ్య వచ్చే మెరుపులు మూడోరకం. మబ్బు-భూమి మధ్య వచ్చే మెరుపు ప్రమాదమైంది. దీనిని మనం 'పిడుగు'గా పిలుస్తున్నాం. పిడుగుల వల్ల ఆస్థి, ప్రాణ నష్టం కలగవచ్చు. అందువల్ల, పిడుగులకు మనం భయపడతాం. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ, గాలి వేగంగా వీచేప్పుడు మెరుపు మెరిసిన వెంటనే పిడుగులు వచ్చే అవకాశం ఎక్కువని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. పిడుగుల ద్వారా విడుదలయ్యే విద్యుచ్ఛక్తి విడుదలైన కొన్ని సెకన్లకే పరిమితమవుతుంది. ఈ సమయంలో అత్యధిక వేడి విడుదలవుతుంది. ఇలా విడుదలయ్యే విద్యుత్‌, వేడి కూడా ఆస్థి, ప్రాణ నష్టాలను కలగజేస్తాయి.
అయితే, పిడుగు, మెరుపు దుష్ప్రభావం భూమి మీద ఒకేసారి కలుగుతాయి. కానీ, పిడుగు శబ్ధాన్ని మెరుపు తర్వాత కొంత సమయానికి వింటాం. అందువల్ల మెరిసినప్పుడు ఏమీ నష్టం కలగకపోతే, ఆ తరువాత వినిపించే శబ్ధం (పిడుగు శబ్ధం) ద్వారా ఏమీ నష్టం కలిగించదు. అందువల్ల మెరుపు దుష్ప్రభావాల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, పిడుగు శబ్ధం నుండి భయపడాల్సిన అవసరం లేదు.
మబ్బు-భూమి మధ్య విద్యుత్‌ పీడనం ఎక్కువవుతుంది. ఫలితంగా మబ్బుల నుండి అయాన్ల మార్గం ఉద్భవిస్తుంది. మబ్బుల నుండి వచ్చే మెరుపును రాగి లోహపు కడ్డీ విద్యుత్‌ తరంగాల ద్వారా ఆకర్షిస్తుంది. మొదటి విద్యుత్‌ విడుదల ద్వారా వెంట వెంటనే ఎన్నో విద్యుత్‌ తరంగాలు విడుదలై భూమికి చేరతాయి. వీటిని కూడా రాగి లోహపు కడ్డీ విద్యుత్‌ తరంగాల ద్వారా ఆకర్షిస్తుంది. భవనాలకు రక్షణ కలిగిస్తుంది.
రక్షణ ఎలా పొందవచ్చు..?
పిడుగు సమయంలో మెరుపు నుండి విడుదలయ్యే వేడి, విద్యుత్‌ ఆస్థి, ప్రాణ నష్టం కలిగిస్తాయి. బయటి ప్రదేశాల్లో ఈ పిడుగు ఎక్కడపడితే అక్కడ పడదు. సామా న్యంగా ఎత్తయిన చెట్లపై లేదా కొండల మీద, విశాల ప్రదేశాల్లో పడుతుంది. అందువల్ల ఉరుములు, మెరుపులప్పుడు మనం పెద్దచెట్ల కిందకు, కొండల దగ్గరకు, ఎత్తయిన ప్రదేశాల వద్ద ఉండకుండా జాగ్రత్తపడాలి. వర్షం వస్తున్నా పెద్దచెట్ల కింద రక్షణ తీసుకోకూడదన్నమాట. మనం అలవాటున గబుక్కున పెద్ద చెట్ల కిందకు వెళ్లిపోతాం. పిడుగుపాటుకు గురై చనిపోయినవారు ఎక్కువగా ఇలా చెట్లకింద నిలబడినవారే. ఈ సమయంలో పశువులను కూడా చెట్ల కింద ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ, రేడియోలను ఆపివేయాలి.
చిన్నగా ఎత్తు ఎక్కువలేని ఇళ్ళను పిడుగుల నుండి రక్షణ కల్పించటానికి చుట్టూ ఖాళీస్థలంలో ఎత్తుగా పెరిగే చెట్లను నాటాలి. అప్పుడు ఎత్తుగా పెరిగిన చెట్లమీద పిడుగు పడుతుందిగానీ ఇంటిమీద పడదు.
ఫ్యాక్టరీలకు, ఎత్తయిన భవనాలకు, టవర్లకు (టెలివిజన్‌ టవర్లకు), విలువైన చారిత్రక కట్టడాలకు మెరుపుల నుండి రక్షించడానికి ప్రత్యేక పరికరాలను బిగిస్తు న్నారు. వీటిని 'లైట్నింగ్‌ అరెస్టర్స్‌ (లేక) ప్రొటిక్టర్స్‌'గా పిలుస్తారు. వీటికోసం ఎత్తయిన ప్రాంతంలో టెలివిజన్‌ లేదా రేడియో యాంటీనాల్లాగా ఒక రాడ్‌ను బిగిస్తారు.
ఇలా పైన బిగించిన రాడ్‌ల నుండి విద్యుత్‌ ఆకర్షణ శక్తి అయాన్ల రూపంలో ఆకాశంలోకి విడుదలవుతుంది. మెరుపు ద్వారా వచ్చే విద్యుదయస్కాంత కిరణాలను ఆకర్షించి, సురక్షితంగా భూమిలోకి ప్రసరింపజేస్తాయి. ఈ విధంగా మెరుపులు వచ్చే సమయంలో విడుదలయ్యే విద్యుదయస్కాంత కిరణాలు ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా ఆపగలుగుతాయి.
'ఉరుము' ఆలస్యంగా ఎందుకు వినిపిస్తుంది..?
'మెరుపు' కాంతి వేగంతో ప్రసారమవుతుంది. ఇది సెకండుకు సుమారు 60 వేల మీటర్ల వేగంతో (గంటకు 2.20 లక్షల వేల కిలోమీటర్ల వేగంతో) ప్రసారమవుతుంది. అందువల్ల భూమిమీద మెరుపును వెంటనే చూడగలుగుతున్నాం. కానీ, ధ్వని కేవలం సెకన్‌కి 330 మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. అంటే కాంతికన్నా ఒక మిలియన్‌ రెట్లు తక్కువవేగంతో ధ్వని భూమిపైకి ప్రసారమవుతుంది. అందువల్ల, మెరుపు కనిపించిన కొద్దిసేపటికి మెరుపు వల్ల వచ్చిన 'ఉరుము'ను వినగలుగుతున్నాం.
ఎత్తు తక్కువ మేఘాలు (లో క్లవుడ్స్‌):
ఇవి వర్షిస్తాయి. సామాన్యంగా భూమి నుండి ఇవి 6,500 అడుగుల్లోపు ఉంటాయి. ఈ మేఘాలు స్ట్రేటస్‌, స్ట్రేటోక్యుమ్యులస్‌, క్యుమ్యులస్‌. వీటి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. వీటిని తేలిగ్గా గుర్తించవచ్చు.
స్ట్రేటస్‌ మేఘాలు: తుపాను సమయంలో మేఘాల కింద వేగంగా, గాలివాటంగా పోతుంటాయి. వీటి అడుగుభాగాన దట్టమైన నీటి బిందువులతో, ముదురు బూడిదరంగు కలిగి, నేలమీద నీడనిస్తాయి. ఈ మేఘాలను 'ఉష్ణమేఘాల'ని కూడా పిలుస్తున్నాం. ఇవి మామూలుగా వర్షించకపోతే 'మేఘమధనం' ద్వారా అదనంగా వర్షాన్ని కురిపించవచ్చు. మధ్యస్థ ఎత్తులో (6,500-2000 అడుగులలో) ఏర్పడే మేఘాలను 'ఆల్టో మేఘాలు' అంటారు. 'ఆల్టోస్ట్రేటస్‌ మేఘాలు' ఒక మోస్తరు సన్నని వర్షాన్ని కురిపిస్తాయి. 'ఆల్టో స్ట్రేటస్‌' భూమికి దాదాపు సమాంతరంగా ఉంటాయి. ఇవి సరిగ్గా వర్షించకపోతే 'మేఘమధనం' ద్వారా వీటిని వర్షింపజేయవచ్చు.
భూమిపై 20 వేల అడుగుల పైన ఎత్తుగా ఉండే మేఘాలను 'ఎత్తయిన మేఘాలు (హై క్లవుడ్స్‌)' అంటారు. వీటిలో 'సిర్రస్‌, సిర్రో స్ట్రేటస్‌, సిర్రో క్యుమ్యులస్‌' మేఘాలు ముఖ్యమైనవి. ఇవి అంతగా వర్షించడానికి ఉపయోగపడవు. కానీ ఇవి రాబోయే తుపాను వాతావరణాన్ని సూచిస్తాయి.
ఎలా వర్షిస్తాయి..?
భూమిపై నుంచి ఆకాశానికి వెళుతూ ఉంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి వంద మీటర్లకూ సుమారుగా ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ తగ్గుతుంది. భూమిపై గాలిలో ఎప్పుడూ నీటిఆవిరి ఉంటుంది. ఈ గాలి-ఆవిరి పైకి వెళ్ళి మేఘంగా మారుతుంది. వేడిగా ఉన్న గాలిలో తేమ అధికంగా నిలవగలదు. ఇదే గాలి పైకి పోయినప్పుడు చల్లబడుతుంది. గాలి చల్లబడ్డప్పుడు తక్కువ తేమను ఇముడ్చుకోగలుగుతుంది. చల్లబడిన మేఘంలో అధికంగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో గాలి నుండి సూక్ష్మ నీటిబిందువుల రూపంలో బయటపడుతుంది. ఇలా వచ్చిన బిందువులే మేఘాల్లో ఉంటాయి. పర్వతాలు అడ్డుగా రావడంవల్లగానీ లేక ఏ ఇతరకారణాల వల్లనైనా మేఘాలు పైకి పోవాల్సి వస్తుంది. ఈ మేఘాలు పైకిపోతున్న కొద్దీ చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. ఈ సమయంలో అధికంగా ఉన్న సూక్ష్మ నీటి బిందువులు వేర్వేరుగా ఉండక, ఒకదానికొకటి కలిసి పెద్ద నీటి బిందువులుగా మారిపోతాయి. ఈ నీటి బిందువులు భూమ్యాకర్షణకు లోనై వర్షంగా కురుస్తాయి. ఒకోసారి ఇలా పడేటప్పుడు వాతావరణంలో గాలి వేడిగా ఉన్నప్పుడు పెద్ద నీటి బిందువులు తిరిగి సూక్ష్మ నీటి బిందువులుగా మారిపోతాయి. ఇలా మారని నీరు పెద్ద బిందువుల రూపంలో వర్షంగా భూమ్మీద పడతాయి.
యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా?
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికోసం హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి, తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తుందని యజ్ఞం చేసేవారు చెబుతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లో యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి 'మేఘమధనా'న్ని చూపెడుతున్నారు. 'మేఘమధనం' ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెప్తున్నారు. 'ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా?' అని ఆలోచించాలి.

అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్య సమస్య ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి, వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గతంలోలా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు 'హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా?' అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై, మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment