Wednesday 23 May 2012

మన జీర్ణాశయం కూడా మాంసమే కదా! మరి అది జీర్ణమైపోదా?


ఇతర మాంసాహార జంతువుల్లాగే మనలో మాంసాహారులు మాంసాన్ని తింటారు. అది మన జీర్ణాశయంలో జీర్ణమవుతుంది. మరి మన జీర్ణాశయం కూడా మాంస పదార్థమే కదా! అదెందుకు జీర్ణం కాదు? - టి.అజరుకుమార్‌, 10వ తరగతి, మెదక్‌
మన జీర్ణవ్యవస్థ (Digestive System) అనే రహదారిలో నోరు, ఆహారవాహిక (oesophagus), జీర్ణా శయం (stomach) , ఉత్తరాంత్రం (duodenum), చిన్న ప్రేవులు (small intestine), పెద్దప్రేవులు (large intestine),మలద్వారం (anus) ప్రధానమైన మైలురాళ్లు. మనం బతకాలంటే శక్తికావాలి. యంత్రాలను విద్యుచ్ఛక్తి, ఇంధనాలు నడిపించినట్లే మనల్ని, ఇతర జీవజాతులన్నింటిని జీవంతో ఉండేలా నడిపించేది మనం తిన్న ఆహారం ద్వారా ఉత్పన్నమయిన జీవరసాయనాలలోని రసాయనికశక్తే (chemical energy). కేవలం సుమారు నాలుగు కేజీల బరువుతో శిశువుగా జన్మించిన మనల్ని వయస్సు పెరిగే కొద్దీ మన దేహాన్ని కండరాలతోను, ఎముకలతోను, ఇతర వివిధరకాల దేహ నిర్మాణాలతోను మన బరువును 50 కి.గ్రా. పైగా పెంచేది కేవలం మనం తిన్న ఆహార పదార్థాలలోని పాదార్థికాలే. మన శరీరంలో వివిధ పనులు నెరవేర్చడానికి హార్మోనులు, ఎంజైములు కావాలి. ఇంటి కట్టడంలో స్తంభాలు (pillers), శ్లాబులు ఎలాగో మన శరీరంలో అస్తిపంజరం (skeletal system) అలాంటిది. అయితే ఇంటిని చూడగానే మనకు శ్లాబులు, స్తంభాలు కనిపించవు. వాటిని ఆచ్ఛాదన చేస్తూ గోడలు, కిటికీలు, అందాలు సొబగిన ఎలివేషన్లు, ఆకర్షణీయమైన పైకప్పులు, నేలలు (flooring) తదితర నిర్మాణాలే. ఇవే మన శరీరంలో ప్రధాన కండర నిర్మాణాలు. కండరాలు, ఎంజైములు, చాలా హార్మోనులు ప్రోటీను నిర్మితాలు. ఈ ప్రోటీన్లు మనకు మనం తిన్న ఆహారంలో మాంసకృత్తుల ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తులు మాంసాహారులైనా, శాకాహారులైన (vegetarians) తమ ఆహారంలో మాంసకృత్తులు (proteins) ఉండాల్సిందే! మాంసాహారులకు అది మాంసం, చేపలు, గ్రుడ్లు, పప్పుదినుసుల ద్వారా లభ్యంకాగా శాకాహారులకు పప్పుదినుసులు, గ్రుడ్లు (నేటి ఫారం గుడ్లలో జీవం ఉండదు కాబట్టి అవి కూడా శాకాహారమేనన్న దృక్పథంలో సేవించేవారి విషయంలో) సమకూర్తాయి. మనం నోటి ద్వారా ముద్దలుగా లేక చిన్న చిన్న శకలాలు (pices) గా ఆహారం భుజించే క్రమంలో ఆహారపు ముద్దల్లోని పిండిపదార్థాలు మన లాలాజలం (saliva) లో ఉండే టయలిన్‌ అనే ఎంజైము సమక్షంలో పాక్షికంగా జీర్ణమవుతాయి. అదే సమయంలో లాలాజలంలోని మ్యూకస్‌ వంటి జిగురు పదార్థం వల్ల ఆహారపు ముద్దలు సులభంగా ఆహారవాహిక ద్వారా మన జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయం మన వంటింట్లో మిక్సీ లేదా రోలు-రోకలిలాంటిదన్న మాట. పదార్థాల్ని కలగాపులగంగా పిండి చేసి జీర్ణవ్యవస్థలో తర్వాతి భాగమైన ఉత్తరాంత్రానికి పంపడమే కాకుండా మాంసకృత్తుల్ని జీర్ణం చేస్తుంది. మాంసకృత్తులంటే అమైనో ఆమ్లాలనబడే పూసల దండ. అమైనో ఆమ్లమంటే ఓ చివర అమీన్‌ (-NH2) అనబడే క్షారధర్మ (basic character) భాగం, మరో చివర ఆమ్లధర్మ (acidic character) మున్న కార్బాక్సి(-COOH) అణువన్నమాట. ఉదా: గ్లైసీన్‌ అనే అమైనో ఆమ్లాన్నే తీసుకొందాం. దాని నిర్మాణం H2N-CH2-COOHగా ఉంటుంది. ఇలాంటి పూసలు రెండు కలిస్తే NH2 లోని H భాగం, -COOH లోని -OH భాగం కలిసి నీటి అణువుగా బయటికి వెళ్లి H2N-CH2-CO-NH-CH2-COOH లాంటి ద్విఅమైనో ఆమ్లపు ముక్కగా ఏర్పడింది. అంటే రెండు ఇనుపముక్కల్ని వెల్డింగ్‌ చేసినట్లుగా వేలాదిగా CO-NH అనే అమైడు బంధాలతో అమైనో ఆమ్లాలే విడివిడి పూసల్లాగా ప్రోటీను అనబడే దండ ఏర్పడుతుంది. జీర్ణప్రక్రియలో తిరిగి H2O అనే నీటి అణువును -OH,-H లాగా చీల్చి-CO-NH- లో CO- uó²>±“¿ì -OHను, -NH- భాగానికి H అతికించాలి. ఈ ప్రక్రియనే ప్రోటీన్ల జీర్ణక్రియ అంటాము. లేదా రసాయనికంగా ప్రోటీన్ల జల విశ్లేషణం (Protein Hydrolysis) అంటారు. కానీ సాధారణ రసాయనిక ప్రయోగశాలల్లో ఈ అమైడు బంధాల జల విశ్లేషణ జరగాలంటే మితిమీరిన ఉష్ణోగ్రత కావాలి. అమ్ల పరిస్థితులు కావాలి. మన శరీరంలో అలాంటి ఉష్ణోగ్రత ఉండదు. కాబట్టి ఎంజైములనబడే ఉత్ప్రేరకాల (catalysts) సమక్షంలో దేహ ఉష్ణోగ్రత వద్దే ఈ చర్య జరుగుతుంది. ఈ పని మన పొట్టలో జరుగుతుంది. పొట్ట గోడల్లో ఉదజహరికామ్లాన్ని (Hydrochloric acid-HCl) స్రవించే గ్రంథులెన్నో ఉంటాయి. అదే గోడల్లో మరోచోట పెప్సిన్‌ అనే ఎంజైము కూడా ఊరుతుంది. మన జీర్ణవ్యవస్థలోను, ఇతర జంతువుల జీర్ణవ్యవస్థలోను పొట్ట (దీన్నే తెలుగు అకాడమీ వారు జఠరకోశం అంటారు) నిర్మాణం చాలా పకడ్బందీగా ఉండడంవల్ల పొట్ట గోడల్లోని గ్రంథుల్లో ఉద్భవించిన HCL ఆమ్లము, పెప్సిన్‌ ఎంజైముల మిశ్రమం (జఠరరసం లేదా gastric juice) పొట్టలోని సంచి (sac) భాగంలోకి వస్తుంది తప్ప పొట్టగోడల వైపునకు కలిసి మిశ్ర మంగా వెళ్లదు. పైగా పొట్టగోడలి లోపలివైపున రసాయని కంగా జడత్వం కలిగిన పలుచటి పింగాణీ (ceramic పొరలాగా కవచ నిర్మాణం ఉంటుంది. అందువల్ల జీర్ణప్రక్రియలో పొట్ట జీర్ణం కాదు. జీర్ణప్రక్రియలో ప్రోటీన్ల దండ నుంచి పూసలు, పూసలుగా విడిపడ్డ అమైనో ఆమ్లాలు, ఉత్తరాంత్రం దాటుకొని, చిన్నప్రేవుల గోడల్లో ఉన్న విల్లై (villi) అనే చూషకాల (suckers) ద్వారా జల్లెడ పట్టినట్లుగా రక్తంలో కలుస్తాయి. జీర్ణంకాని చెత్తాచెదారం పెద్దపేవుల దగ్గర గట్టిపడి మలం (faeces) రూపంలో విసర్జించబడుతుంది. రక్తంలో చేరిన అమైనో ఆమ్లాల పూసల్ని మన శరీరధర్మశాస్త్రం (Physiology) వివిధ నిర్మాణాలకు ఉపకరించుకొంటుంది. పొట్ట గోడలకున్న పింగాణీ నిర్మాణం వల్ల పొట్టలో ఉన్న జఠర రసం పొట్టను జీర్ణం చేయలేదు. అడపా దడపా ఈ పింగాణీ పొరలో నెర్రెలు (gaps) ఏర్పడితే అపుడు ఆమ్లపు ప్రభావానికి మన పొట్టలో పుండ్లు (ulcers) వస్తాయి. వైద్యులను సంప్రదించి, చికిత్స చేసుకోవాలి.

No comments:

Post a Comment