Wednesday 2 May 2012

సైన్సు.. ఆలోచనలు


  • నిర్వహణ: గోపాలం కెబి
  • 30/04/2012
ఆలోచనలున్నాయని తెలుసు. వాటిని మన పద్ధతిలో నడిపించవచ్చునని మాత్రం తెలియదు. సైన్సు ఉందని తెలుసు. దాన్ని గురించి ఆలోచించడం మాత్రం తెలియదు. అసలు ఆలోచనలన్నీ సైన్సు పద్ధతిలో నడవవచ్చునని మనకు అసలే తెలియదు. నిత్యం బతుకుదారిలో ప్రతి పనికీ కారణాలు, పద్ధతులు మనకు తెలియకుండానే వెదుకుతాం. ఆ తీరు వేరు, సైన్సు తీరు వేరు అనుకుంటాం. అందుకు కారణం మనం సైన్సు ఉందనీ, దానికి ఒక పద్ధతి ఉందని పట్టించుకోకుండానే బతకడం. సైంటిస్టుల బుర్రనిండా వారికి కావలసిన విషయాలకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతుంటాయి. వాళ్లకు ప్రపంచమంతా సైన్సుగానే కనబడుతుంది. కానీ, ఆ ఆలోచనలు నడిచే దారికీ, మామూలు ఆలోచనల దారికీ తేడా లేదని ఎంతమందికి అర్థమయింది?
ప్రపంచంలో జరుగుతున్న చాలా సంగతులు మనకు వెంటనే అర్థం కావు. కొన్ని మరీ ఆశ్చర్యం కలిగించే రకంగా కూడా ఉంటాయి. అంతా మ్యాజిక్‌లాగ ఉంటుంది. మెజీషియన్స్ కొన్ని ట్రిక్కులు ఎలా చేశారో చెపుతారుకూడా. చెప్పనివాటి వెనుకనున్న రహస్యం అర్థం చేసుకోవాలని మనం ఎప్పుడయినా ప్రయత్నించవచ్చు. ప్రయత్నించిన వారందరూ సైన్సుపద్ధతి ఆలోచనలు కలిగినవారే. ఇంటి తలుపు తెరిస్తే కిటికీ దఢాలున మూసుకుటుంది. అంత వేగంగానూ తిరిగి తెరుచుకుంటుంది. కిటికీ రెక్కకు అడ్డుపెట్టలేదని అర్థమవుతుందిగానీ అది తెరుచుకోవడం, మూసుకోవడం ఎందుకు జరిగాయన్న ప్రశ్న తోచకపోవచ్చు. తోచినా పోనీలే?! అనిపించవచ్చు. కొంతమందికి మాత్రం తలుపును నాలుగుసార్లు తెరిచి, మూసి, కిటికీని పరిశీలించే ఆలోచన పుడుతుంది. చివరకు గదిలో గాలి ఒత్తిడి సంగతి కూడా తోచవచ్చు. ఆలోచిస్తే, చాలా సంగతుల వెనకనున్న రహస్యం బట్టబయలవుతుంది! ఈ సంగతులు ముందు.. అంత గొప్పవిగా తోచకపోవచ్చు. కానీ, ఈ ప్రపంచంలో జరిగే మామూలు విషయాల వెనుక కూడా ఆసక్తికరమైన సైన్సు ఉంటుంది. వాటిని గురించి తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి అర్థం కానివీ, కష్టమయినవీ మాత్రం కావు. సైంటిస్టులుకూడా తమ పరిశోధన పేరున ఈ పద్ధతులనే వాడుతుంటారు. అది మనిషి ప్రవర్తన గానీ, ప్రకృతిలోని అంశాలుగానీ, అర్థం కాదనిపించే ఆస్ట్రానమీ సంగతులు గానీ, అన్నింటిలోనూ ఒకటే పద్ధతి ఉంటుంది. నమ్మండి!
మనకు తెలిసీ తెలియక, మనమంతా సైన్సు పద్ధతిలో ఆలోచిస్తుంటాం. పనులు కూడా చేస్తుంటాం. మనం అట్లా చేస్తున్నామన్న ఆలోచన మాత్రం రాదు. అంతే తేడా!
గమనించిన అంశం గురించి ప్రశ్నిస్తాం
ఈ రోజు గుడ్డలు ఎందుకు త్వరగా ఆరలేదు? ఇవాళ చెమట ఎందుకు ఎక్కువగా పడుతున్నది? మొదలు నిత్యం తెలియకుండానే ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. చీమలకు వాటి చోటు ఎట్లా తెలుస్తుంది? దోమలకు మనం ఎట్లా దొరుకుతాం? ఇంకొంచెం ముందుకు వెళితే... అవి సైన్సు ప్రశ్నలవుతాయి. నాకు కోపం ఎందుకు వచ్చింది? ఆకలి ఎందుకు కాలేదు? అన్నా సైన్సు ప్రశ్నలే! నమ్మండి!
ప్రశ్న అడిగి ఊరుకుంటే జవాబు చెప్పేవారు ఎదురుగా ఉండకపోవచ్చు. కనుక మనమే ముందుకు సాగడానికి ప్రయత్నించాలి!
పరిశోధన సాగించండి
మీరు ఒక విషయాన్ని గమనించారు. దాన్ని గురించి ఆలోచించి ప్రశ్న అడిగారు. మరి ఆ అంశం గురించి ఇప్పటివరకు తెలిసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ప్రతిదినం వేసినట్లుగానే గుడ్డలుతికి ఆరవేశాం. ఎప్పటికీ వేసే చోటునే ఆరవేశాం కూడా. కానీ, అవి ఎక్కువయ్యి ఒకదానిమీద మరొకటి వేయవలసి వచ్చిందా? గాలి కదలకుండా మరేదయినా అడ్డుగా వచ్చిందా? లేక వాతావరణం తేమగా ఉందా? గుడ్డలు ఆరకపోవడానికి ఒక కారణం ఉండి తీరుతుంది. గుడ్డలు సరిగా పిండడం చేతకాలేదేమో?
అనుమానాలు రావాలి
అనుమానాలతో రకరకాల పరిస్థితుల గురించి మనకు ఆలోచనలు పుడతాయి.
స్వంత ఆలోచనలు కాస్త పక్కకు..
మనకు సాధారణంగా అలవాటుకొద్దీ, సమస్యకున్న ఒకరూపం మాత్రమే కనబడుతుంది. కొన్నిసంగతులను చూడలేకపోతాం. గుడ్డలు నిత్యం ఏ సమయానికి ఆరుతున్నాయని సంవత్సరమంతా గమనించి, వాతావరణంలో తేమ, వేడి గురించి కూడా తెలుసుకుని సంబంధాలను లెక్కవేస్తే, అది శాస్త్ర పరిశోధన అవుతుందని మనకు తోచదు. మరి చలికాలంలో కూడా బట్టలు త్వరగా ఆరతాయా?
మరింత సమాచారం, సాక్ష్యాలు వెదకాలి
వాతావరణంలో తేమ ఎప్పుడు ఎంత ఎక్కువ ఉంటుంది? చీమలకు, దోమలకు వాసనలు బాగా తెలుస్తాయని మనకు తెలుసా? ఇంటి తలుపు మూసి ఉన్నప్పుడు కిటికీ తెరిచి ఉన్నా గాలి అందులోనుంచి లోపలికి రాదు. తలుపు తెరవగానే అది తోసుకువస్తుంది. కిటికీ మూసుకుంటుంది. బలంగా తగిలినందుకు తిరిగి తెరుచుకుంటుంది.
అన్ని సంగతులనూ అర్థం చేసుకుని..
సాక్ష్యం, సమాచారాలను బట్టి మన ఆలోచనలు, నమ్మకాలు మారాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఒకేలా చెమట పట్టదు. తేమ పెరిగినా నాకు చెమట లేదుగనుక, తేమలేదు అనగలమా? ఈ విషయం గురించి ప్రపంచమంతటా ఉండే అనుభవాలుంటాయి. మన చుట్టుపక్కల చూచినా ఎన్నో వివరాలు తెలుస్తాయి.
ఇది కాదు.. అనే పద్ధతి
ఒక విషయానికి వంద కారణాలు కనబడతాయి. ఆలోచించి వాటిని.. ఇది కాదు, ఇది కాదు.. అంటూ సంఖ్య తగ్గిస్తూ పోవాలి. అనుభవం పాఠాలు చెపుతుంది. అందులో నుంచి మార్గాలు కనబడతాయి.
అయితే, సైన్సంతా ఇంతేనా అనేసి వెళ్లిపోకండి! కొన్ని ప్రశ్నలకు బుర్ర చించుకున్నా జవాబు తోచదు. అందుకు అవసరమైన సమాచారం, లెక్కలు బోలెడుంటాయి. ఆలోచన సాగితే, వేరే విషయాలు వంద తెలుస్తాయి కానీ, మొదటి ప్రశ్నకు జవాబు అందదు. నిజంగా ఇలా జరిగిందంటే, మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు శాస్ర్తియ పద్ధతిలో పడిపోయినట్లు లెక్క మరి! ముందుకు సాగితే ఆశ్చర్యాలకు, అద్భుతాలకు కూడా జవాబులు దొరుకుతాయి. శతాబ్దాల నుంచి మీలాగే ప్రశ్నలు అడిగి, ఎందరో సేకరించిన సమాచారం, మీ కొరకు ఎదురుచూస్తున్నది. తెలుసుకుంటే, బతుకు మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది. చుట్టూ చూడండి. పరిశీలించండి. ప్రశ్నలడగండి. సైన్సును స్వంతం చేసుకోండి!

No comments:

Post a Comment