Sunday, 8 July 2012

పల్లెసీమల్లో చైతన్యం

          ప్లాస్టిక్ పూలతో తోరణాలు.. రంగురంగుల బెలూన్లతో అలంకరణ.. ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరంతా మహిళల సందడే.. ఇదంతా గృహ ప్రవేశ సందర్భం కాదు, పండగ సమయం అంతకన్నా కాదు.. ఓ టాయిలెట్‌కు ప్రారంభోత్సవ హంగామా ఇది. టాయిలెట్ లేనిదే అత్తవారింట అడుగుపెట్టేది లేదని ఓ నవ వధువు తన పంతం నెగ్గించుకున్న సందర్భం ఇది. ఈమె పట్టుదలకు గ్రామంలోని మహిళలంతా మొదట విస్మయం చెందినా ఆ తర్వాత మనసారా అభినందించారు.

          గ్రామీణ మహిళల సాధికారతకు ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అధికారులు సైతం కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా విష్ణుపూర్‌లో అత్తవారింట్లో టాయిలెట్ లేదని తెలిసి నవ వధువు ప్రియాంక భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయలు స్థలానికి వెళ్లాలంటే అది మహిళలకు అవమానకరమేనని ఆమె భావించింది. పరిశుభ్రత పాటించకపోవడం వల్లే రోగాల బారిన పడుతున్నామని చెబుతూ ఇతర మహిళల్లో ఆమె చైతన్యం తెచ్చింది. ఈమె పోరాటం గురించి ఆ నోటా, ఈనోటా తెలిశాక ‘సులభ్’ సంస్థ టాయిలెట్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసింది. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రియాంక దీక్ష అందరికీ స్ఫూర్తిదాయకమని ‘సులభ్’ ప్రతినిధులు ప్రశంసించారు. కొద్దిరోజుల క్రితం ప్రియాంక ఇంట్లో నిర్మించిన టాయిలెట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రియాంకకు అందజేశారు. టాయిలెట్ కోసం ఇంతగా పోరాటం చేస్తానని తాను కూడా మొదట అనుకోలేదని, అయితే తన పుట్టింట్లో మహిళలంతా పరిస్థితులకు ఎదురీదే స్వభావం కలిగినందున తనలో ఇంత తెగువ వచ్చిందని ప్రియాంక చెబుతోంది. తనకు రెండు లక్షల రూపాయల బహుమతి వచ్చిందంటే నమ్మలేక పోయానని ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ఈమెకు చిన్న వయసులోనే పెద్దలు పెళ్లి చేశారు. ఈ ఏడాది మే నెలలో 19వ ఏట అడుగుపెట్టడంతో అత్తవారింటికి తీసుకుని వెళ్లేందుకు భర్త వచ్చినపుడు టాయిలెట్ గురించి ప్రియాంక ప్రశ్నించింది. పెద్దల వత్తిడితో భర్త వెంట వెళ్ళినా, అత్తవారింట ఆమె నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈలోగా తనను చూసేందుకు వచ్చిన పుట్టింటివారితో టాయిలెట్ సమస్య గురించి ప్రస్తావించింది. బహిర్భూమికి వెళ్లాలంటే చాలా అవమానకరంగా ఉందని, అత్తవారింట టాయిలెట్ నిర్మిస్తే తప్ప అడుగుపెట్టనని శపథం చేసింది.
తన నిర్ణయం తల్లిదండ్రులకు ఆగ్రహం కలిగించినా ఆమె చలించిపోలేదు. సడలని దీక్షతో తన పంతం నెగ్గించుకుంది. టాయిలెట్ నిర్మించడంతో ప్రియాంక తిరిగి తన వద్దకు చేరుకుందని ఆమె భర్త అమర్‌జీత్ ఆనందం వ్యక్తం చేశాడు. తన ఇంట్లో అడుగుపెట్టినపుడు- ‘టాయిలెట్ ఎక్కడ?’ అని భార్య ప్రశ్నించినపుడు సమాధానం చెప్పలేక తానెంతో ఇబ్బంది పడ్డానని ఆయన వివరించాడు. తన భార్య కారణంగా తమ ఊరుకు గుర్తింపు వచ్చిందని, అందరిలో ఆమె బహుమతి అందుకోవడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన చెప్పాడు.
కనీస హక్కుగా..
టాయిలెట్లు లేకపోవడం ఇప్పటికీ పల్లెల్లో మహిళలకు పెనుశాపంగా మారంది. ఆరోగ్యం, పరిశుభ్రత, కనీస హక్కుల విషయాల్లో మహిళల దీనస్థితి ఇంకా కొనసాగుతోంది. ఆధునిక జీవన విధానం తమకూ దక్కాలని ప్రియాంక లాంటి మహిళలు అక్కడక్కడా గళం విప్పి ఘోషిస్తున్నా, ఇంకా వందలాది గ్రామాల్లో మహిళలు అపరిశుభ్ర పరిస్థితులతోనే సహజీవనం సాగిస్తున్నారు. ఉదయానే్న చీకట్లు తొలగకముందు లేదా సాయంత్రం చీకటి పడ్డాక గ్రామాల్లో మహిళలు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని, ఇందుకోసం ఒక్కోసారి గంటల తరబడి నీరిక్షాంచాల్సి వస్తున్నందున వారు వ్యాధుల బారిన పడుతున్నారని ‘సులభ్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అంటున్నారు. టాయిలెట్ల సమస్యపై ఆవేదన చెందడం కాదు, పల్లెల్లో బహిరంగంగా చర్చించాలని ఆయన కోరుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా తాము చేస్తున్న ప్రచారం వల్ల పల్లెల్లో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినందుకే ప్రియాంకతో పాటు మరో ఇద్దరు నవ వధువులకు తాము నగదు పారితోషికాలను అందజేశామని ఆయన వివరించారు. వీరి విజయగాథలు ఇతరులకు మార్గదర్శకం కావాలన్నారు.
ఇక్కడా అవినీతే..
దేశంలో ఇప్పటికీ 60 నుంచి 70 శాతం మహిళలు మరుగుదొడ్ల సమస్యతో బాధ పడడం జాతి సిగ్గు పడాల్సిన విషయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ పదే పదే చెబుతుంటారు. మహిళలు సెల్‌ఫోన్లు కాదు టాయిలెట్లు కావాలని అడగాలని, క్షిపణులను ప్రయోగించడం కన్నా టాయిలెట్లు కట్టడం గర్వకారణమని కూడా ఆయన సెలవిస్తుంటారు.
కాగా- వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నా, నిధులను దుర్వినియోగం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అధికారుల అవినీతి కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో వేలాది టాయిలెట్లను నిర్మించాల్సి ఉండగా నిర్ణీత లక్ష్యాలు నేటికీ పూర్తి కాలేదు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 131 మిలియన్ ఇళ్లలో టాయిలెట్ సౌకర్యం లేదు. 8 మిలియన్ల మంది మాత్రమే సామాజిక మరుగుదొడ్లను వాడుతున్నారు. 123 మిలియన్ల మంది ఆరుబయలు స్థలాలకు పోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘సులభ్’ వంటి సంస్థలు ప్రజలకు ఉదారంగా ఆర్థిక సాయం అందజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.2 మిలియన్ల మందికి టాయిలెట్ల సౌకర్యాన్ని ‘సులభ్’ సంస్థ కల్పించింది.

No comments:

Post a Comment