Wednesday, 12 February 2014


ఈ క్యాలెండర్‌ తేడాగా ఉందే!

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           అక్టోబరు 1582 క్యాలెందర్‌
   ఈ క్యాలండర్‌ చూశారా? 1582 సంవత్సరం నాటి ఈ క్యాలండర్‌లో అక్టోబర్‌ నెలలో ఉండాల్సిన రోజుల కంటే పదిరోజులు తక్కువ ఉన్నాయి. అలా ఎందుకున్నాయో చూద్దాం. అంతకు ముందు జూలియస్‌ క్యాలండర్‌ (రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ పేరున) వాడుకలో ఉండేది. జూలియస్‌ క్యాలండర్‌ను సరిదిద్దారు ఇది ఒక సౌరమాన క్యాలండర్‌. సౌరమానానికి చెందిన క్యాలండర్‌ సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్యలో భూమి తాలూకు స్థానాల్ని సూచిస్తుంది. తన కక్ష్యలో భూమి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వివిధ ఋతువులు వస్తాయి. క్యాలండర్‌ సరిగా లేకపోతే ఋతువుల రాకకు, క్యాలండర్‌కు పొంతన కుదరదు. క్యాలండర్‌ నెల శీతాకాలాన్ని సూచిస్తే వాస్తవంగా వాతావరణం ఉంటుంది. దాంతో క్యాలండర్‌ ఉపయోగం ఉండదు. జూలియస్‌ క్యాలండర్‌ ప్రకారం ఏడాదికి 365 రోజుల ఐదు గంటల 48 నిమిషాల 46 సెకన్లు (సుమారు 365.2422 రోజులు). అయితే భూమి అప్పటికే తన తదుపరి పరిక్రమలో (365.25-365.2422) కొన్ని రోజులు ముందంజలో ఉంటుంది. మొదట్లో ఈ తేడా అంతగా తెలియదు. కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ తేడా పెరుగుతూ పోతుంది. పదహారో శతాబ్దంలో ఆ తేడాను గుర్తించినప్పుడు భూమి పరిక్రమకి క్యాలండర్‌ 10 రోజులు వెనకబడింది. ఆ తప్పును సరి చేయటానికి 1582లో అక్టోబర్‌ నెల నుంచి 10 రోజులు తీసేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ క్యాలండర్‌ తయారైంది. వేరే చర్యలు కూడా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. శతాబ్దపు ఏడాదిని 4తో కాకుండా 400తో భాగించి లీప్‌ ఇయర్‌ను గుర్తించాలని నిర్ణయించటం జరిగింది. ఆ విధంగా 2000 సంవత్సరం లీప్‌ ఇయర్‌ అయింది కానీ 1900 సంవత్సరం లీప్‌ ఇయర్‌ కాలేదు. 2100 సంవత్సరం కూడా లీప్‌ ఇయర్‌ అవదు. ఇదివరకు 400 ఏళ్ళ కాలంలో 100 లీప్‌ ఇయర్లు ఉండేవి. సవరించబడిన క్యాలండర్‌లో అవి 97కి తగ్గాయి. దానివల్ల సగటు ఏడాది నిడివి 365.25 రోజుల నుండి 365.2425 రోజులకు తగ్గింది. సవరించిన క్యాలండర్‌ను పోప్‌ గ్రెగరి శ××× జ్ఞాపకార్థం గ్రెగేరియన్‌ క్యాలండర్‌ అని పిలిచారు. దాన్నే మనం ఈ రోజు వాడుతున్నాం. ఈ క్యాలండర్‌లో ఏడాది సగటు నిడివి అసలైన నిడివి కంటే ఒక ఏడాదిలో 0.0003 రోజులు ఎక్కువ. ఆ కారణంగా ప్రతి 10,000 ఏళ్ళకు క్యాలండర్‌ని సరిచేస్తూ ఉండాలి.
జూలియస్‌ క్యాలండర్‌ను సరిచేసి, గ్రెగేరియన్‌ క్యాలండర్‌ను తయారుచేయడంలో కీలకమైన తోడ్పాటు అందించిన వ్యక్తి అలోసియస్‌ లిలియస్‌ (1510-1576) అనే ఒక ఇటాలియన్‌ డాక్టర్‌. చంద్రుడిపై ఉన్న ఒక గుంతకు ఆయన పేరు పెట్టారు.
   ప్రపంచ చరిత్రలో 1917 అక్టోబరు ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. ఆ నెలలోనే రష్యాలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని బోల్షెవిక్కులు కూలదోశారు. ఆ తిరుగుబాటు అక్టోబరు 25న పెట్రోగాడ్‌లో జరిగింది. క్యాలండర్‌లో సవరణ కారణంగా ఆ తారీఖును నవంబరు 7కి మార్చారు. అందుకే ఆ సంఘటనను అక్టోబరు విప్లవం. నవంబరు విప్లవం అని రెండు రకాలుగానూ పిలుస్తారు.
రష్యాలో 1918లో 13 రోజులు తీసేసి గ్రెగేరియన్‌ క్యాలండర్‌ను అమలుపర్చారు. శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడి 1582లో జరిగిన ఈ సవరణ రష్యాలో ఇంత ఆలస్యంగా అమలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రష్యా పూర్వ పాలకులు చాలా మితవాదులు. అందుకే వారు సాంప్రదాయక కాలగణన పద్ధతిని మార్చటానికి ఇష్టపడలేదు. సోషలిస్టు పాలకులు కొత్త క్యాలండర్ని శాస్త్రీయ దృక్పథంతో స్వీకరించారు. దీనికి విరుద్ధంగా ఇంగ్లండ్‌లో ప్రొటెస్టెంట్లు తమను సంస్కరణవాదులని చెప్పుకున్నా రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పోప్‌ వద్ద నుండి వచ్చిన ఉత్తర్వు కారణంగా క్యాలండర్లో మార్పుకి ఒప్పుకోలేదు. సెప్టెంబర్‌ 2, 1752 తర్వాత, 14 సెప్టెంబరు 1752 వస్తుంది. ఇతర దేశాల్లో కూడా ఈ క్యాలండర్‌ మార్పు అక్కడి పాలకుల దృక్పథం మీదే ఆధారపడి ఉంది. ఫ్రాన్సు కొత్త క్యాలండర్ని 10 రోజులు వదిలేసి డిసెంబరు, 1582లోనే స్వీకరించింది. కానీ గ్రీస్‌ 13 రోజులు తీసేసి 1923లో స్వీకరించింది.
మనం కూడా మినహాయింపు కాదు. 1957లో డాక్టర్‌ మేఘనాథ్‌ సాహా నాయకత్వంలో క్యాలండర్‌ సంస్కరణ కమిటీ భారత జాతీయ క్యాలండర్‌ పేరుతో ఒక క్యాలండర్ని ప్రతిపాదించింది. అందులో మొదటి నెల మార్చి 22 నుంచి మొదలవుతుంది. లీప్‌ ఇయర్లలో ఆ నెలలో ఒకరోజు అదనంగా ఉండి, మార్చి 21న మొదలవుతుంది. తర్వాత వచ్చే ఐదునెలలు (వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం) 31 రోజులతో ఉంటాయి. ఆ తర్వాత ఆరునెలలు (ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం) 30 రోజులతో ఉంటాయి.
   ఇలాంటి బెంగాలీ క్యాలండర్‌నే 1965లో అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో అమలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోనూ అదే కొనసాగుతోంది. మనదేశంలో అధికారికమైన క్యాలండర్‌ను చాలా సందర్భాలలో ప్రభుత్వ విధానాలు పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మతపరమైన పండుగలకు సంబంధించి అశాస్త్రీయమైన క్యాలండర్‌ను అనుసరించే ఛాందసవాదులను తృప్తిపరచాలన్నదే ఇందుకు కారణం. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే మనం ముందడుగు వేయాలి.
- డా. మాధవ్‌ చటోపాధ్యాయ 

Courtesy With:PRAJA  SEKTHI DAILY

No comments:

Post a Comment