Tuesday 25 February 2014


అంతర్యానం అంటే ఏమిటి?

                            మన సౌరమండలంలో భూమి, దానిలాగే ఇతర గ్రహాలు తమ తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్న సంగతి తెలుసు కదా. అవి ఇలా తిరిగే క్రమంలో కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక గ్రహానికి - సూర్యుడికి మధ్యలో మరో గ్రహం వస్తుంటుంది. దీనినే అంతర్యానం అని అంటారు.
ఉదాహరణకు మన భూమికి సూర్యుడికి మధ్య బుధుడు (మెర్క్యురీ), 
శుక్రుడు (వీనస్‌) అనే రెండు గ్రహాలు ఉన్నాయి కదా. వీటిలో బుధగ్రహం కొన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి - సూర్యుడికి మధ్యలో వస్తుంది. అలాంటి సమయంలో సూర్యగోళంపైన ఒకవైపు నుంచి మరోవైపుకి ఒక చిన్న నల్లటి మచ్చ సాగిపోతున్నట్లుగా కన్పిస్తుంది. సూర్యగ్రహణానికిలాగే దీనిని కూడా మనం చూడవచ్చుగాని, నేరుగా మాత్రం చూడకూడదు. బుధుడి అంతర్యానం ఈ రోజు సంభవించిందని అనుకుంటే సరిగ్గా 13 సంవత్సరాల తరువాత రెండోసారి, ఆ తరువాత 7 సంవత్సరాలకి మూడోసారి, 10 సంవత్సరాలకి నాలుగోసారి, చివరగా 3 సంవత్సరాలకి ఐదోసారి సంభవిస్తుంది. అంటే బుధుడి అంతర్యానం 13-7-10-3 సంవత్సరాలకి ఒకసారి పునరావృతమవుతూ వస్తుంది. బుధుడి అంతర్యానం సాధారణంగా మే 2-8 తేదీల మధ్యన, లేదా నవంబర్‌ 5-15 మధ్యన చోటు చేసుకుంటుంది.
ఇటీవలి సంవత్సరాలలో 1999లోను, ఆ తరువాత 2006లోను బుధుడి అంతర్యానం జరిగింది. అంటే మళ్ళీ 2016లో గాని అది సంభవించదన్న మాట! అన్నట్లు బుధుడి అంతర్యానాన్ని మనం చూడగలిగినప్పటికీ బుధుడి పైనుంచి మాత్రం ఏ గ్రహపు అంతర్యానం కన్పించదు. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!

No comments:

Post a Comment