Wednesday 12 February 2014



కాంతి వేగాన్ని తొలిసారిగా ఎలా కనుగొన్నారు?


                     కాంతి అనేది కొన్ని శతాబ్ధాల పాటు మనుషులకు ఓ గొప్ప ముఖ్య రహస్యంగా వుండిపోయింది. దాని వేగం అపరిమితంగా వుంటుందని, దానిని ఎవరూ కొలవలేరని చాలా మంది భావిస్తూ వచ్చారు. కాని, క్రీ.శ. 1878లో మిచల్‌సన్‌ అనే ఒక భౌతిక శాస్త్ర బోధకుడు చేసిన ఓ చక్కటి ప్రయోగంతో ఈ అభిప్రాయానికి అడ్డు కట్ట పడింది. రెండు దర్పణాలను, మరో చిన్న పరికరాన్ని ఉపయోగిస్తూ ఆ శాస్త్రజ్ఞుడు చాలా తెలివిగా కాంతి వేగాన్ని కనుగొనేందుకు ప్రయత్నించాడు.
ఈ ప్రయోగంలో భాగంగా మిచెల్‌సన్‌ ఒక దాని కొకటి ఎదురుగా వుండేలా, ఒక దానిపై పడిన కాంతి పరావర్తనం చెంది రెండో దానిపై పడేలా, ఒక దానికొకటి 1986.23 అడుగుల దూరంలో వుండేలా రెండు దర్పణాలను (అద్దాలను) అమర్చాడు. అనంతరం ఓ చిన్న పరికరం సాయంతో వాటిలోని ఒక అద్దం సెకనుకు 256 సార్లు తన చుట్టూ తాను తిరిగేలా చేశాడు. తరువాత ఓ కటకం సాయంతో, స్థిరంగా వుండే అద్దంపై ఓ కాంతి పుంజం పడేలా చేశాడు. ఈ కాంతి దానిపై పడి పరావర్తనం చెంది, గిరగిరా తిరిగే అద్దాన్ని చేరుకుంది. దీనిపై పడిన కాంతిని గమనించేందుకై మిచెల్‌సన్‌ ఓ ప్రత్యేకమైన తెరను ఏర్పాటు చేశాడు. రెండో అద్దం గిరగిరా తిరుగుతున్నందువల్ల, దానిపై పడిన కాంతి కొంచెం పక్కకు జరిగి, తెరపై పడింది. నిలకడగా వున్న అద్దం నుంచి వచ్చిన కాంతి... పడాల్సిన ప్రదేశానికి 133 మి.విూ.ల దూరంలో పడటాన్ని మిచెల్‌సన్‌ గుర్తించాడు. ఈ మొత్తం సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కాంతి వేగం సెకనుకు 1,86,380 మైళ్ళని అతను నిర్ధారించాడు. ఆ తరువాత కొంత కాలానికి, ఆధునిక పరికరాలతో చేసిన ప్రయోగాల ద్వారా కాంతి వేగం సెకనుకు 1,86,282.397 మైళ్ళుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు.
Courtesy with:  PRAJASEKTHI DAILY

No comments:

Post a Comment